పిల్లల చేతిలో ఫోన్: ఇది బేబీ సిట్టరా? భవిష్యత్తుకు ముప్పా?

డిజిటల్ స్క్రీన్, పిల్లలు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ హిమానీ
    • హోదా, రేడియేషనల్ ఆంకాలజిస్ట్, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ సాధారణమైపోయింది. ఈ టెక్నాలజీ వల్ల మన జీవితం సులభతరం అయినప్పటికీ, స్క్రీన్ టైమ్ పైన నియంత్రణ లేకపోవడం వల్ల అది నెమ్మదిగా మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.

సాధారణ ఉద్యోగులు, ఐటీ రంగంలో పని చేసేవారు, వ్యాపారస్తులు, చిన్న పిల్లలు, గృహిణులు.. వీళ్లూ వాళ్లూ అని తేడా లేకుండా.. అన్ని వర్గాలవారూ స్మార్ట్ ఫోన్ అధికంగా వాడటం వలన కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.

ఎంతలా ఫోన్‌కు అడిక్ట్ అవుతున్నారంటే.. ఉదయం నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్ తీసుకుని వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా, న్యూస్ అప్‌డేట్స్ చూసిగానీ చాలామంది తమ రోజును ప్రారంభించడం లేదు.

ఆఫీసులో కంప్యూటర్ ముందు గంటల తరబడి పని చేసి ఇంటికి వచ్చాక కూడా ఫోన్ చూస్తూ గడుపుతున్నారు. రాత్రి పడుకునే ముందు కూడా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో రీల్స్ స్క్రోల్ చేస్తూ బెడ్ పైనే ఫోన్ పెట్టుకుని నిద్రపోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి ఒక్కరూ రోజుకు దాదాపు 7 గంటల పాటు కంప్యూటర్, మొబైల్ లేదా టీవీ స్క్రీన్‌లపై ఇంటర్నెట్ వినియోగిస్తూ గడుపుతున్నట్లు ఒక అంచనా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డిజిటల్ స్క్రీన్, పిల్లలు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

'డిజిటల్ బేబీ సిట్టర్'

ఒకప్పుడు పిల్లలు పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆరుబయట స్నేహితులతో ఆడుతూ, పరుగులు తీస్తూ సందడి చేసేవారు. కానీ, ప్రస్తుతం అంతా మారిపోయింది. ఇప్పటి పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే మొబైల్స్ లేదా టాబ్స్ పట్టుకుని కూర్చుని వీడియోలు, రీల్స్, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ స్క్రీన్ ముందు గంటల తరబడి గడుపుతున్నారు.

పిల్లలు తమ పనులకు ఇబ్బంది కలిగించకూడదనో లేక అల్లరి చేయకుండా ఉండాలనో కోరుకునే తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మొబైల్‌ను "డిజిటల్ బేబీ సిట్టర్"గా ఉపయోగిస్తున్నారు.

పని అవసరం కోసం స్క్రీన్ వినియోగం తప్పనిసరి అయినప్పటికీ వినోదం, సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్ అంటూ అనవసరపు అదనపు స్క్రీన్ వినియోగం ఇటు పిల్లలు, అటు పెద్దలు.. అందరి ఆరోగ్యానికీ ముప్పుగా మారుతోంది.

డిజిటల్ స్క్రీన్, పిల్లలు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

కళ్లపై పెరుగుతున్న ఒత్తిడి

ఎక్కువసేపు కంప్యూటర్ లేదా మొబైల్‌ను చూడడం వల్ల "డిజిటల్ ఐ స్ట్రెయిన్" అనే సమస్య ఏర్పడుతుంది. దీనినే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు.

కళ్లు మండటం లేదా ఎండిపోవడం, చూపు మసకబారడం, తరచుగా తలనొప్పి, కంటి నొప్పి, కాంతిని చూడలేకపోవడం వంటివి దీని ప్రధాన లక్షణాలు.

స్క్రీన్‌పై దృష్టి కేంద్రీకరించినప్పుడు మనం సాధారణం కంటే తక్కువసార్లు కనురెప్పలు వాల్చడం (లేదా ఆర్పడం) వలన కళ్లలో తేమ తగ్గి అసౌకర్యం కలుగుతుంది.

ఈ సమస్యను తగ్గించడానికి "20-20-20 నియమం" పాటించడం మంచిది. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి.

చిన్న పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వలన మయోపియా (దూర దృష్టి లోపం) అనే సమస్య ఎక్కువవుతుంది.

డిజిటల్ స్క్రీన్, పిల్లలు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నిద్రను దెబ్బతీస్తున్న నీలి కాంతి

మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్ స్క్రీన్‌ల నుంచి వెలువడే నీలి కాంతి (Blue Light) నిద్రపై ప్రభావం చూపుతుంది.

రాత్రి వేళ స్క్రీన్ వినియోగం పెరిగితే మెదడులో మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల నిద్ర ఆలస్యంగా పట్టడం, మధ్యలో మెలకువ రావడం, ఉదయం అలసటగా ఉండటం, పగటిపూట ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిద్రలేమి కారణంగా స్త్రీ, పురుషులలో సంతాన లేమి సమస్యలు వస్తాయని చాలా పరిశోధనలు పేర్కొన్నాయి.

పిల్లలలో ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపక శక్తి బలహీనపడటం, చిరాకు పెరగటం, చదువులో రాణించలేకపోవడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం వంటివి జరుగుతాయి.

దీర్ఘకాలంలో ఇది పెద్ద వారిలో గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల శారీరక చలనం కూడా తగ్గిపోతుంది. దీంతో ఊబకాయం, చిన్న వయస్సులోనే రక్తపోటు, మధుమేహానికి దారితీసే పరిస్థితులు, శారీరక దృఢత్వం తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.

డిజిటల్ స్క్రీన్, పిల్లలు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ ఇతరులతో తమ జీవితాలను పోల్చుకోవడం, నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండాలనే ఒత్తిడి, లైక్‌లు, కామెంట్ల కోసం ఎదురుచూడటం వంటి పరిస్థితులు మానసిక ఆందోళనకు దారితీస్తున్నాయి.

అధిక స్క్రీన్ టైమ్ వల్ల ఆందోళన, ఒత్తిడి, నిరాశ, చిరాకు, ఏకాగ్రత లోపం, పనిలో ఉత్పాదకత తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.

చిన్న పిల్లల్లో కోపం, అసహనం, ప్రవర్తనలో హఠాత్తుగా మార్పులు రావడం, దృష్టి కేంద్రీకరణ లోపం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం 'గేమింగ్ డిజార్డర్'ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ఆరోగ్య సమస్యగా గుర్తించింది.

కొంతమంది పిల్లలు భోజనం మానేసి, చదువును నిర్లక్ష్యం చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా, రాత్రిళ్లు నిద్రపోకుండా కేవలం గేమ్స్ కోసం మాత్రమే జీవించే స్థితికి చేరుకుంటున్నారు.

ఇది వ్యసనంగా మారితే నిపుణుల సలహా అవసరం కావచ్చు.

ఫోన్‌ను కిందకు వంచి చూడడం, కంప్యూటర్ ముందు గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల "టెక్ నెక్" అనే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

అంటే మెడ నొప్పి, భుజాల బిగుతు, నడుము నొప్పి, వెన్నెముకపై అదనపు ఒత్తిడి, చేతివేళ్లలో నొప్పి లేదా తిమ్మిర్లు వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం యువ ఉద్యోగుల్లో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు.

డిజిటల్ స్క్రీన్, పిల్లలు, ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

స్క్రీన్ టైమ్‌ను ఎలా నియంత్రించాలి?

  • అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకోవాలి.
  • ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు కూర్చున్న చోట నుంచి లేచి నడవాలి.
  • రాత్రి నిద్రకు గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగాన్ని నిలిపివేయాలి.
  • భోజన సమయంలో, కుటుంబంతో గడిపే సమయంలో "నో ఫోన్ రూల్" పాటించాలి.
  • రోజుకు కనీసం 30–45 నిమిషాలు వ్యాయామం లేదా నడకకు కేటాయించాలి.
  • సెలవు రోజుల్లో కొంత సమయాన్ని "డిజిటల్ డీటాక్స్" (ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ వంటి వాటికి దూరంగా ఉండడం) కోసం కేటాయించి, ప్రకృతి మధ్య గడపడం లేదా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.
  • పిల్లల స్క్రీన్ వినియోగాన్ని నియంత్రించడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. 2 సంవత్సరాల లోపు పిల్లలకు స్క్రీన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలి. 2–5 సంవత్సరాల పిల్లలకు రోజుకు ఒక గంట కంటే ఎక్కువ కాకుండా పరిమితం చేయాలి.
  • ఇంట్లో "స్క్రీన్-ఫ్రీ జోన్" ఏర్పాటు చేయాలి.
  • పిల్లలతో కలిసి పుస్తకాలు చదవడం, వారికి కథలు చెప్పడం లేదా వారు చెబుతుంటే వినడం అలవాటు చేయాలి.
  • క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం వంటి ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ప్రోత్సహించాలి.
  • తల్లిదండ్రులు స్వయంగా మొబైల్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించుకుని ఆదర్శంగా నిలవాలి.

సాంకేతికతను పూర్తిగా దూరం చేయడం సాధ్యం కాదు. డిజిటల్ విద్య, సమాచార సేకరణ, సృజనాత్మక అభ్యాసంలో స్క్రీన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ, అవి అవసరానికి మించి ఉపయోగిస్తే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

పనికి అవసరమైనంత మాత్రమే స్క్రీన్ వినియోగించి, మిగిలిన సమయాన్ని కుటుంబం, ఆరోగ్యం, వ్యాయామం, అభిరుచులకు కేటాయించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

"సాంకేతికత మన చేతిలో ఉండాలి కానీ, మన జీవితం సాంకేతికత చేతిలో ఉండకూడదు".

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు).

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)