అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికుల మృతి.. ఇండియా స్పందనపై విమర్శలెందుకు వస్తున్నాయి?

భారత్, అమెరికా, నావికులు, ఒమన్, గల్ఫ్, దిగ్భంధనం, చమురు ట్యాంకర్లు, దాడులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్‌పై అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధన చర్యల మధ్య ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన భారత్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్లపై అమెరికా సైన్యం వరుసగా దాడులు జరపడం, ఆ దాడుల్లో ప్రాణనష్టం సంభవించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ స్పందనపై మాజీ దౌత్యవేత్తలు, విశ్లేషకులు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

తాజాగా ఒమన్ తీరంలో అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగింది.

ఇరాన్ చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అడ్డుకుని, ఆ దేశాన్ని చర్చల దగ్గరికి తీసుకురావాలనే లక్ష్యంతో అమెరికా దిగ్బంధన చర్యలు చేపట్టింది.

అయితే ఆ చర్యల ప్రభావం ఇప్పుడు భారతీయుల ప్రాణాల వరకూ చేరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ దాడులు ఇరాన్ చేసినవేనని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఆరోపించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, అమెరికా, నావికులు, ఒమన్, గల్ఫ్, దిగ్భంధనం, చమురు ట్యాంకర్లు, దాడులు

ఫొటో సోర్స్, Getty Images

ఘటన అనంతరం అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ అధికారిని భారత ప్రభుత్వం పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ స్పందన పరిస్థితి తీవ్రతకు సరిపోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీనియర్ జర్నలిస్టు కలోల్ భట్టాచార్జీ ఎక్స్‌లో స్పందిస్తూ "భారతీయ పౌరులపై హెల్‌ఫైర్ క్షిపణులు ప్రయోగించిన తొలి ఘటన ఇదే కావొచ్చు. మన క్వాడ్ భాగస్వామి దేశం నిజంగా అద్భుతమే" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

భారత్ సభ్యదేశంగా ఉన్న క్వాడ్ కూటమి సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని ప్రోత్సహిస్తుందని, అయితే ఇప్పుడు అదే కూటమిలోని అమెరికా, సముద్ర రవాణాను అడ్డుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా ఈ కూటమిలో సభ్యదేశాలు.

నౌకలపై దాడులు అమెరికా జరిపినవేనని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ గురువారం అంగీకరించారు. అయితే లక్ష్యంగా మారిన మూడు నౌకల్లో రెండు అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్నాయని, వాటిలో ఒకటి "నిబంధనలను పాటించని నౌక"గా అమెరికా పరిగణించిందని చెప్పారు.

ఈ వ్యాఖ్యలే మరిన్ని ప్రశ్నలకు దారితీశాయి.

భారత్, అమెరికా, నావికులు, ఒమన్, గల్ఫ్, దిగ్భంధనం, చమురు ట్యాంకర్లు, దాడులు

ఫొటో సోర్స్, Getty Images

‘‘అమెరికా పేరు చెప్పడానికి ఇబ్బందేంటి?’’

భారత్ మాజీ విదేశాంగ కార్యదర్శి, రష్యాలో మాజీ రాయబారి కన్వల్ సిబల్ స్పందిస్తూ "ఆంక్షలు, నిబంధనల ఉల్లంఘన వంటి పదజాలాన్ని ఉపయోగించడం ద్వారా అమెరికా చర్యలను పరోక్షంగా ఎందుకు సమర్థిస్తున్నాం? నౌకలు భారత జెండాతో ప్రయాణించకపోయినా భారతీయులు మరణించారు. ఇదే అసలు అంశం. ఇప్పటివరకు అమెరికా సెంట్రల్ కమాండ్ కనీస విచారం కూడా వ్యక్తం చేయలేదు" అని వ్యాఖ్యానించారు.

భారత్, అమెరికా హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రత కోసం కలిసి పని చేస్తున్నాయని, విస్తృత నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నాయని, ఇండో-పసిఫిక్ భావనకు మద్దతు ఇస్తున్నాయని గుర్తుచేసిన ఆయన, అలాంటి పరిస్థితుల్లో భారతీయ నావికుల మరణంపై అమెరికా మౌనంగా ఉండకూడదన్నారు.

ఆంగ్ల దినపత్రిక ది హిందూ అంతర్జాతీయ వ్యవహారాల సంపాదకులు స్టాన్లీ జాన్ కూడా భారత ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.

"వివిధ అంతర్జాతీయ ఘర్షణల విషయంలో భారత్ వ్యూహాత్మక సమతుల్యత పాటించడం అర్థం చేసుకోవచ్చు. కానీ భారతీయులు ప్రయాణిస్తున్న నౌకలపై క్షిపణులు ప్రయోగించి ముగ్గురు భారతీయులను చంపిన దేశం పేరును కూడా చెప్పకపోవడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై భారత్ విడుదల చేసిన తొలి ప్రకటనలో అమెరికా పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకపోవడం కూడా చర్చనీయాంశమైంది.

భారత్, అమెరికా, నావికులు, ఒమన్, గల్ఫ్, దిగ్భంధనం, చమురు ట్యాంకర్లు, దాడులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రముఖ విశ్లేషకులు బ్రహ్మా చెల్లానీ మరింత ఘాటుగా స్పందించారు.

"ముగ్గురు అమెరికన్ నావికులు ఇలాంటి దాడిలో మరణించి ఉంటే అమెరికాలో రాజకీయ తుపాన్ చెలరేగేది. కానీ ముగ్గురు భారతీయులు మరణించినా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా స్పందన కనిపించడం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదని, భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్లపై ఈ వారంలో అమెరికా సైన్యం జరిపిన మూడో దాడని ఆయన గుర్తుచేశారు.

సోమవారం ఒమన్ గల్ఫ్‌లో మరో ట్యాంకర్‌పై అమెరికా నౌకాదళానికి చెందిన ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్ యుద్ధవిమానం దాడి జరిపిందని, ఆ నౌకలో ఉన్న 24 మంది భారతీయులను ఒమన్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఆ తర్వాత గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న మరో ట్యాంకర్ ఇంజిన్‌పై అమెరికా విమానం రెండు హెల్‌ఫైర్ క్షిపణులు ప్రయోగించడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిపారు.

దౌత్య విశ్లేషకులు జోరావర్ దులత్ సింగ్ అభిప్రాయం ప్రకారం, అమెరికా విధించే ఆంక్షలు, చట్టాలను ప్రపంచమంతా పాటించాల్సిన నియమాలుగా చూపించే ధోరణే నేటి అంతర్జాతీయ వ్యవస్థలో ప్రధాన సమస్య.

"అంతర్జాతీయ చట్టాల కంటే తాము పై స్థాయిలో ఉన్నామనే అమెరికా వైఖరి వరల్డ్ ఆర్డర్‌ను దెబ్బతీస్తోంది. కానీ భారత్ మాత్రం ఇంకా అమెరికా చర్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ కూడా భారత ప్రభుత్వ మౌనంపై ఆందోళన వ్యక్తం చేశారు.

"ముగ్గురు భారతీయులు మరణించారు. అమెరికా ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పలేదు. ఇది కేవలం ఓ సైనిక చర్య మాత్రమే కాదు, భౌగోళిక-రాజకీయ పోరాటంలో భారతీయుల ప్రాణాలు బలైన ఘటన" అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్, అమెరికా, నావికులు, ఒమన్, గల్ఫ్, దిగ్భంధనం, చమురు ట్యాంకర్లు, దాడులు

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయ చట్టం కూడా ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 2(4) ప్రకారం ఆత్మరక్షణ లేదా భద్రతా మండలి అనుమతి మినహా బలప్రయోగం నిషేధమని, అలాగే ఆర్టికల్స్ 87, 90 ప్రకారం అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానం హక్కు ఉంటుందని గుర్తుచేశారు.

"భారతీయులు మరణించినప్పటికీ అమెరికా క్షమాపణ చెప్పలేదు. విచారం వ్యక్తం చేయలేదు. సంతాపం కూడా తెలియజేయలేదు. ఇది ఆందోళనకరమైన సంకేతం" అని ఆయన అన్నారు.

అశోకా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కాంతి బాజ్‌పాయి మరో కోణాన్ని ప్రస్తావించారు.

"భారత్ వైఖరి సరైందా కాదా అన్నది వేరే చర్చ. కానీ అమెరికా ఇప్పుడు భారతదేశాన్ని బలపరచాల్సిన శక్తిగా కాకుండా, తన ఉత్పత్తులు, పెట్టుబడులు, ఆయుధాలకు పెద్ద మార్కెట్‌గా చూస్తోంది. భవిష్యత్తు ఆదర్శవాదం కాదు ప్రయోజనాల రాజకీయాలదే" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, సముద్ర వాణిజ్య భద్రత భారత్‌కు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. "నౌకలపై జరుగుతున్న ఈ దాడులు ఆగాల్సిందే" అని ఆయన అన్నారు.

అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం తన చర్యలను సమర్థించుకుంది. పలావు జెండాతో ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో నౌకకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అవి పట్టించుకోలేదని, అందుకే చర్యలు తీసుకున్నామని తెలిపింది.

గురువారం గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న 'జల్వీర్' అనే ట్యాంకర్‌ను కూడా అమెరికా విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ నౌక ఇరాన్ నుంచి చమురును తరలించే ప్రయత్నం చేస్తోందని అమెరికా ఆరోపించింది.

భారత అధికారుల ప్రకారం, జల్వీర్ నౌకలో ఉన్న 20 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారు.

సెట్టెబెల్లో ఘటనలో తొలుత 21 మంది భారతీయులను రక్షించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించగా, ముగ్గురు నావికులు గల్లంతైనట్లు తెలిపింది. అనంతరం కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, గల్లంతైన ముగ్గురు భారతీయ నావికుల మృతదేహాలు గుర్తించినట్లు ప్రకటించారు.

సురక్షితంగా కాపాడిన సిబ్బందితో పాటు మృతుల భౌతికకాయాలను కూడా భారత్‌కు తీసుకువస్తామని ఆయన తెలిపారు.

ఇదే సమయంలో, సోమవారం 'మెరివెక్స్' అనే మరో ట్యాంకర్‌ను కూడా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్‌పై విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఆ నౌక ఇరాన్ నౌకాశ్రయానికి చేరేందుకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. అయితే ఆ నౌకలోని భారతీయ నావికులందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ మొత్తం వివాదంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది ఒకటే ప్రశ్న. అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటనలో భారతీయులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, భారత్ తన పౌరుల కోసం ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదు? అని.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)