ట్రంప్-నెతన్యాహు: మధ్యప్రాచ్య రూపురేఖలు మార్చాలనుకుని సంక్షోభాన్ని కొనితెచ్చుకున్నారా?: అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెరెమీ బోవెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇరాన్‌పై విజయం సాధిస్తే మధ్యప్రాచ్యం రూపరేఖలు మారిపోతాయని డోనల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు భావించారు. ఆ ప్రాంతం ఇప్పుడు మారుతోంది, కానీ అది వారు ఊహించినట్లుగా కాదు.
ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఓడిపోలేదు. ప్రస్తుతం అక్కడ ఎప్పుడు ముదురుతుందో తెలియని ఒక దీర్ఘకాలిక, తీవ్ర సంక్షోభం కొనసాగుతోంది.
ట్రంప్, నెతన్యాహు అనుకున్నదానికంటే ఇరాన్ పాలకులు చాలా బలంగా నిలబడ్డారు. దీంతో, వారి అంచనా తప్పింది, దానివల్ల తలెత్తుతున్న పరిణామాలపై నియంత్రణ కోల్పోయారు.
ఇటీవలే అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేయడం దీనికి మరో రుజువు. తాము అమెరికన్లను దెబ్బతీయగలమని, ఈ యుద్ధంలో పైచేయి సాధించాలనే పట్టుదల వీడబోమని ఇరాన్ పాలకులు దీని ద్వారా స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై తమ పట్టును గుర్తించడమే విజయం, రక్షణగా ఇరాన్ భావిస్తోంది.

హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు అమెరికా అధ్యక్షుడు, ఆయన సైన్యాధికారులు ఆచితూచి స్పందించే ప్రయత్నం చేస్తున్నారు.
తాము దేనికీ లొంగబోమని గట్టిగా చెబుతూనే, నెమ్మదిగా సాగుతున్న చర్చలను కాపాడుకోవాలని చూస్తున్నారు. అపాచీ సిబ్బంది ప్రాణాలతో బయటపడటంతో సరిపోయింది, ఒకవేళ వారు చనిపోయి ఉంటే అమెరికా స్పందన తీవ్రంగా ఉండేది.
హార్ముజ్ జలసంధిని మళ్లీ తెరిపించి, ఇరాన్ యురేనియం నిల్వలు, అణు కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చలు జరపడానికి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఆశపడుతున్నారు. అయితే, అమెరికాలో ఈ యుద్ధానికి ఎక్కువగా ఆదరణ లేదు. అందువల్ల దీని నుంచి గౌరవప్రదంగా బయటపడి, దాన్నే ఒక విజయంగా చూపించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. కానీ, ఇది చాలా కష్టమైనది.

ఫొటో సోర్స్, Reuters
మార్పు రాబోతుందనుకున్నారు, కానీ..
ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక పాత పాఠాన్ని నేర్చుకుంటున్నారు.
యుద్ధాన్ని మొదలుపెట్టడం సులువేగానీ, స్పష్టమైన విజయంతో ముగించడం కష్టమనే నిజాన్ని చరిత్రలో నాయకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు.
2026 ఫిబ్రవరి చివరి రోజున వారు తమ దేశాలను ఇరాన్‌పై యుద్ధంలోకి నడిపించినప్పుడు, ట్రంప్, నెతన్యాహు వీడియో ప్రకటనలు విడుదల చేశారు. ఒక చరిత్రాత్మక మార్పు రాబోతోందనే వారి నమ్మకం ఆ వ్యాఖ్యల్లో కనిపించింది. 1979లో షా పతనం తర్వాత ఇరాన్‌ను పాలిస్తున్న ప్రభుత్వం ముగింపు దశకు వచ్చిందని ఇరువురు భావించారు.
ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో తెల్లవారుజామున ట్రంప్ మాట్లాడారు.
"గొప్ప, గర్వించదగిన ఇరాన్ ప్రజలారా, మీ స్వేచ్ఛా సమయం ఆసన్నమైందని ఈ రాత్రి నేను చెబుతున్నాను. సురక్షితమైన ఆశ్రయాల్లో ఉండండి. ఇళ్లను వదిలి బయటకు రాకండి. బయట చాలా ప్రమాదకరంగా ఉంది. అన్ని చోట్లా బాంబుల వర్షం కురుస్తుంది. మా పని పూర్తయిన తర్వాత, మీ ప్రభుత్వాన్ని మీరు చేతుల్లోకి తీసుకోండి. అది మీకే సొంతమవుతుంది. బహుశా తరాల తరబడి మీకు దక్కే ఏకైక అవకాశం ఇదే కావచ్చు" అన్నారు.
మరుసటి రోజు ఉదయం, సెంట్రల్ టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ గగనతల భవనం (కిరియా) పైకప్పుపై నెతన్యాహు నిలబడి ప్రసంగించారు. ట్రంప్ తరహాలోనే ఆయన కూడా విజయం ఖాయమనేలా మాట్లాడారు.
"నేను 40 ఏళ్లుగా కోరుకుంటున్న పనిని ఈ సంయుక్త సైనిక బలగాలు సాధ్యం చేస్తున్నాయి: అదే ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని కోలుకోలేని దెబ్బ తీయడం. నేను ఏదైతే వాగ్దానం చేశానో.. అది ఇప్పుడు నెరవేర్చబోతున్నాం" అన్నారు నెతన్యాహు.
ఇజ్రాయెల్‌కు అసలైన ముప్పు పాలస్తీనియన్లు లేదా పొరుగు అరబ్ దేశాల నుంచి కాదని, ఇరాన్ నుంచే ఉందని నెతన్యాహు వాదించేవారు. ఇరాన్‌పై దాడి చేయడానికి ఇతర అమెరికా అధ్యక్షుల మద్దతు కూడగట్టాలని ఆయన ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ, ట్రంప్ శైలి మాత్రం భిన్నంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
'గాలి తీసేసిన బెలూన్‌లా'
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి అనంతరం, గత రెండేళ్ల నుంచి నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రజలకు ఒకటే చెబుతూ వచ్చారు: అమెరికా మద్దతు ఉన్న తమ సైన్యం శత్రువులను తుడిచిపెట్టేస్తుందని, మరింత సంపన్నమైన, సురక్షితమైన భవిష్యత్తును అందిస్తుందని చెప్పారు. దౌత్యపరమైన చర్చలు కావు, సైనిక బలమే దీనికి ఏకైక పరిష్కారమని ఆయన భావించారు.
ఇప్పుడు తన సమయం వచ్చిందని నెతన్యాహు ఎంతో గర్వంగా ఫీలయ్యారు. కానీ, సోమవారం బేరూత్‌పై దాడి ప్రణాళికలను రద్దు చేసుకోవాలని ట్రంప్ ఆదేశించిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చిన తీరును ప్రముఖ ఇజ్రాయెల్ పత్రికా విశ్లేషకుడు బెన్ కాస్పిట్ అభివర్ణిస్తూ... గాలి తీసేసిన బెలూన్‌లా నెతన్యాహు కనిపించారని అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిని తీవ్రంగా విమర్శించేవారిలో కాస్పిట్ ఒకరు.
సైనిక బలంతో ఈ ప్రాంతాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలనే నెతన్యాహు వ్యూహం విఫలమైందనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.
ట్రంప్ కూడా వేగవంతమైన విజయాన్ని ఆశించారు. అమెరికా సైన్యం వెనెజ్వెలా అధ్యక్షుడిని, ఆయన భార్యను బంధించి, న్యూయార్క్ జైలుకు పంపి, తమకు అనుకూలమైన వ్యక్తిని కరాకస్‌లో అధికారంలో కూర్చోబెట్టడం చూసి ఆయన ఎంతో సంతోషించారు. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో తమ పూర్వీకులు చేసిన దీర్ఘకాలిక యుద్ధాల కంటే... ఇలా ప్రభుత్వం మార్చడమే సరైన పద్ధతి అని ఆయన భావించారు. ఈ జాబితాలో ఇరాన్ తర్వాతి స్థానంలో ఉంది.
అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక దేశం, ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోనే సూపర్‌పవర్. అయినా ఎక్కడ తప్పు జరిగిందో అని ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు ఆలోచనలో పడి ఉంటారు.
ఆంక్షలు, తప్పుడు నిర్వహణ, అవినీతి వల్ల ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తెహ్రాన్ ప్రభుత్వాన్ని ట్రంప్, నెతన్యాహు గమనించారు. గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బొల్లా వంటి ఇరాన్ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ తీవ్రమైన దెబ్బలు కొట్టింది. ఇరాన్ మరో ముఖ్య మిత్రుడు బషర్ అల్ అసద్‌ను సిరియా అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ఆయన మాస్కోకు పారిపోయారు. జనవరిలో ఇరాన్ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా జరిగిన భారీ ప్రదర్శనలను వేలమంది ఇరాన్ పౌరులను చంపడం ద్వారా అణచివేసింది.
కానీ, వారు ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వ పట్టుదలను, వ్యూహ చతురతను తక్కువగా అంచనా వేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడిని, ఆయన ముఖ్య అనుచరులను చంపితే ఆ ప్రభుత్వం దానికదే కూలిపోతుందని వారు భావించారు.
దాదాపు 50 ఏళ్లుగా పదేపదే ఎదురవుతున్న బెదిరింపులను తట్టుకుంటూ, ఎలాంటి దాడినైనా ఎదుర్కొని మనుగడ సాగించేలా తనను తాను సిద్ధం చేసుకున్న ఒక ప్రభుత్వంపై సైనిక శక్తి పని చేస్తుందని వారు అతిగా అంచనా వేశారు. ఆ ప్రభుత్వం తమ మతపరమైన, సిద్ధాంతపరమైన నమ్మకాల ఆధారంగా జాతీయ భద్రతపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంది.
అమెరికాకు మిత్రదేశాలుగా, యూఏఈ, బహ్రెయిన్ విషయాల్లో ఇజ్రాయెల్‌కు భాగస్వాములుగా ఉన్న గల్ఫ్ చమురు దేశాలు ఇప్పుడు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఇది కేవలం పెట్రోకెమికల్స్, ఎరువుల వంటి ఉప-ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోవడం మాత్రమే కాదు. గల్ఫ్ ప్రాంతాన్ని పెట్టుబడులకు అనుకూలమైన ఒక సుస్థిరమైన వ్యాపార కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో వారు తమ భవిష్యత్తును నిర్మించుకున్నారు. కానీ, ప్రస్తుత యుద్ధం ఆ కలలను కళ్లముందు కనపడే ఎండమావిలా మారుస్తోందని భావి పెట్టుబడిదారులు, పర్యటకులు భావిస్తున్నారు.
ఇరాన్ ఏమనుకుంటోంది?
హార్ముజ్ జలసంధిని మూసివేయడం, పొరుగు అరబ్ దేశాలపై దాడులు చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలిగామని ఇరాన్ పాలకులు భావిస్తున్నారు. తమ మనుగడతో పాటు ఈ చర్యలు అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక రక్షణగా ఉపయోగపడతాయని నమ్ముతున్నారు.
ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మరణించిన పాత తరం ఇరాన్ నాయకుల స్థానంలో వచ్చిన కొత్త నాయకులు కూడా అంతే సిద్ధాంత బలంతో ఉన్నారు. పైగా ఈ మనుగడ పోరాటంలో రిస్క్ తీసుకోవడానికి వారు మరింత సిద్ధంగా ఉన్నారు. కేవలం మాటల వల్ల భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోలేమని వారు భావిస్తున్నారు. ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆచరణలో చూపించాలని వారు అనుకుంటున్నారు.
లెబనాన్ యుద్ధాన్ని గల్ఫ్ యుద్ధంతో ముడిపెట్టడం వారి వ్యూహంలో ఒక ముఖ్య భాగం. 1980ల నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ పెంచి పోషించిన హిజ్బొల్లా సాయుధ దళాన్ని, రాజకీయ ఉద్యమాన్ని నాశనం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తూ, లెబనాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తే ఎలాంటి ఒప్పందానికి అవకాశం ఉండదని ట్రంప్‌కు ఇరాన్ స్పష్టం చేస్తోంది.
ఒప్పందం త్వరలోనే కుదురుతుందనే కారణంతో (గతంలో కూడా ఆయన ఇలాంటి ప్రకటనలు చేశారు) బేరూత్‌పై దాడి చేయవద్దని ఇజ్రాయెల్‌ను వారించడం ద్వారా... లెబనాన్ పరిణామాలకు, గల్ఫ్ పరిణామాలకు సంబంధం ఉందనే విషయాన్ని ట్రంప్ పరోక్షంగా అంగీకరించినట్లయింది.
ఈ రకమైన సంబంధాన్ని తాను అంగీకరించబోనని, ఇది అస్సలు సహించరానిదని నెతన్యాహు సోమవారం చెప్పారు.
తెహ్రాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వం పూర్తిగా బలహీనపడే వరకు యుద్ధాన్ని కొనసాగించాలనే నెతన్యాహు పట్టుదలకంటే, యుద్ధాన్ని ముగించాలనే తన సొంత ప్రయోజనాలు, ఆకాంక్షకే ట్రంప్ ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు నెతన్యాహుకు సమస్యగా మారింది.
బేరూత్‌పై అనుకున్న దాడిని నెతన్యాహు రద్దు చేసుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) దక్షిణ లెబనాన్‌పై తీవ్రమైన దాడులను కొనసాగిస్తూనే ఉంది.
మార్చిలో హార్ముజ్ జలసంధి మూతబడినప్పుడు, జూన్ నాటికి కూడా ఇది తెరచుకోకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు వచ్చాయి.
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడి చేసే వరకు తెరిచి ఉన్న ఈ అత్యంత కీలకమైన జలమార్గం ఇప్పటికీ మూసే ఉంది. అసాధారణమైన దౌత్యపరమైన విజయాలు సాధిస్తే తప్ప, ఇది త్వరలోనే మళ్లీ తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























