గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు ట్యాంకర్‌పై అమెరికా దాడి, ముగ్గురు భారతీయుల ఆచూకీ గల్లంతు

  నౌక ఇంజిన్ గదిపై దాడికి సంబంధించి సెంట్రల్ కమాండ్ పోస్ట్ చేసిన  ఫుటేజ్

ఫొటో సోర్స్, Centcom

ఫొటో క్యాప్షన్, నౌక ఇంజిన్ గదిపై దాడికి సంబంధించి సెంట్రల్ కమాండ్ పోస్ట్ చేసిన ఫుటేజ్
    • రచయిత, హెన్రీ ఆస్టియర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఒమన్ అఖాతంలో ఓ చమురు నౌకను అమెరికా నిర్వీర్యం చేసింది. ''ఇరాన్ నుంచి చమురు రవాణాకు ప్రయత్నిస్తూ'' అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలతో అమెరికా సైన్యం ఈ చమురు ట్యాంకర్‌ను నిర్వీర్యం చేసింది.

అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో చేసిన పోస్టులోని వివరాల మేరకు, పలావ్ జెండాతో ప్రయాణిస్తున్న 'సెట్టెబెల్లో' నౌక సిబ్బంది అమెరికా దళాల ఆదేశాలను పలుమార్లు పాటించకపోవడంతో, ఓ యుద్ధవిమానం ''ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాలతో'' ఆ నౌక ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.

ఒమన్ తీరంలో జరిగిన ఈ ఘటన అనంతరం ముగ్గురు భారతీయ నౌకా సిబ్బంది ఆచూకీ తెలియడం లేదని, మరో 21 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం నిలిపివేయాలని భారత్ కోరింది.

ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో, ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరిగే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తరువాత, ఆ దేశ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఒమన్ తీరానికి సమీపంలో అమెరికన్ బలగాల వైమానికదాడికి గురై మంటల్లో కాలిపోతున్న చమురు ట్యాంకర్‌లోని 24మంది భారతీయులను రక్షించారు.

ఫొటో సోర్స్, Forward Seamen's Union of India/x.com/FSUIINDIA

ఫొటో క్యాప్షన్, ఎమ్‌టీ మారివెక్స్ ట్యాంకర్‌లోని భారతీయ సిబ్బందిని రక్షించారు.

ఇప్పటిదాకా 8 నౌకల నిర్వీర్యం

ఏప్రిల్ 13న ఈ దిగ్బంధనాన్ని ప్రారంభించినప్పటి నుంచి అమెరికా దళాలు ఎనిమిది నౌకలను నిర్వీర్యం చేసి, మరో 134 నౌకల మార్గాన్ని మళ్లించినట్లు సెంట్‌కామ్ తెలిపింది.

తాజా ఘటన అనంతరం, దిల్లీలోని యూఎస్ మిషన్ డిప్యూటీహెడ్‌ను భారత ప్రభుత్వం వివరణ కోరినట్లు అధికారులు బీబీసీకి తెలిపారు.

అంతకుముందు కూడా భారతీయ సిబ్బందితో కూడిన పలావ్ జెండాతో ప్రయాణిస్తున్న మరో చమురు ట్యాంకర్ 'మారివెక్స్' పై అమెరికా దాడి చేసింది.

అమెరికా దళాల ఆదేశాలను పాటించడంలో ఆ నౌక విఫలమైన తరువాత, ఒమన్ అఖాతంలో దానిపై కూడా కాల్పులు జరిసినట్టు సెంట్‌కామ్ తెలిపింది.

అయితే ఇందులోని 24మంది భారతీయ సిబ్బందిని ఒమన్ సైన్యం రక్షించిందని భారత అధికారులు తెలిపారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

శాంతి ఒప్పందంపై ఇరాన్‌దే జాప్యమంటున్న అమెరికా

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై "తీవ్రంగా ప్రతిస్పందిస్తాం" అని హెచ్చరించారు.

శాంతి ఒప్పందంపై సంతకం చేయడంలో తెహ్రాన్ అతిగా జాప్యం చేస్తోందని, అమెరికన్లను "అమాయకులనుకుంటోంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

సోమవారం అమెరికాకు చెందిన ఓ హెలికాప్టర్ కూల్చివేత అనంతరం ఇరు పక్షాలు పరస్పరం జరిపిన వరుస దాడుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టాయి. ఈ దాడులలో దేశ సుప్రీం లీడర్ మరణించిన తరువాత యుద్దం మొదలైంది.

దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. మార్చిలో లెబనాన్‌ను కూడా ఈ ఇందులోకి లాగడంతో ఈ ప్రాంతమంతా వేగంగా ఘర్షణలు వ్యాపించాయి.

ఏప్రిల్‌లో అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. తొలుత ఈ కాల్పుల విరమణ రెండు వారాల పాటు అమల్లో ఉండాలని భావించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)