‘డేటింగ్ యాప్‌లో నాకు నలుగురు మగవాళ్లు పరిచయం అయ్యారు.. అందరూ మోసగాళ్లే’ అని ఈ 60 ఏళ్ల మహిళ ఎందుకు చెప్తున్నారు? ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి

ఫొటో సోర్స్, Julie Osgood
- రచయిత, జానీ హంఫ్రైస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
సుమారు 40 ఏళ్లుగా భాగస్వామిగా ఉన్న వ్యక్తిని కోవిడ్ వల్ల కోల్పోయారు జూలీ ఓస్‌గూడ్.
కొన్నేళ్ల తర్వాత ఆధునిక డేటింగ్ ప్రపంచాన్ని ఒకసారి ప్రయత్నించి చూడాలని ఆమె నిర్ణయించుకున్నారు.
డేటింగ్ ప్రపంచంలో ఈ 60 ఏళ్ల మహిళకు ఎదురైన అనుభవం తాను ‘ఒంటరిగా ఉండిపోవాలని’ నిర్ణయించుకునేలా చేసింది.
ఎందుకంటే ఆ ప్రపంచంలో ఆమెకు పరిచయమైన నలుగురు పురుషులు మోసగాళ్లని ఆమె గుర్తించారు.
జూలీ తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి 2020 నవంబర్‌లో తన భాగస్వామి టోనీ డోనోహ్యూ చనిపోయేవరకు ఆయనతోనే కలిసి ఉన్నారు. ఆయన మరణం తరువాత కొన్నాళ్లకు డేటింగ్ యాప్‌లో సైన్ ఇన్ కావడాన్ని ఆమె "నిజంగానే పెద్ద ముందడుగు" అని అభివర్ణించారు.

డబ్బులు ఇవ్వడానికి ముందు మోసగాళ్ల అసలు ఉద్దేశాలేంటో తెలుసుకున్న తర్వాత "నేను మళ్లీ డేటింగ్ వైబ్‌సైట్ల జోలికి వెళ్లను. నిజాయితీ ఉన్న వ్యక్తుల్ని ఎక్కడ కలవాలో అర్థం కావడం లేదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Julie Osgood
ఒకే రకమైన వ్యూహం
తనలా మరొకరు మోసపోకుండా ఉండేందుకు, మోసగాళ్ల విషయంలో చర్యలు తీసుకునేలా డేటింగ్ సైట్లపై ఒత్తిడి తేవడానికి తాను మాట్లాడాలని భావిస్తున్నట్లు జూలీ చెప్పారు.
నిరుడు బీబీసీకి అందిన గణాంకాల ప్రకారం రొమాన్స్ ఫ్రాడ్ కేసుల గురించి యాక్షన్ ఫ్రాడ్‌కు రిపోర్టైన కేసుల్లో బాధితులు నష్టపోయిన సొమ్ము 2024లో 9.2 కోట్ల పౌండ్లుగా ఉంది. అది అంతకు ముందు సంవత్సరం 8.2 కోట్ల పౌండ్లు.
డేటింగ్ యాప్‌లో చేరిన తర్వాత అదే యాప్‌లో మూడు సార్లు పరిచయమైన వ్యక్తులు ఆమెను మోసం చేసేందుకు ఒకే పద్దతిని అనుసరించినట్లు ఆమె చెప్పారు.
డేటింగ్ యాప్‌లో తనకు పరిచయమైన మగాళ్ల చిత్రాలను జూలీ బీబీసీకి అందించారు. ఆ ఫోటోలలో బ్యాక్‌గ్రౌండ్‌లో అక్షరాలు గందరగోళంగా ఉన్నాయి. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించినట్లు స్పష్టమైన సంకేతాలు కనిపించాయి.
"వాళ్లందరూ చెప్పే కథ ఒకేలా ఉంటుంది" అని ఆమె చెప్పారు.
"వాళ్లలో ఒకరు విడాకులు తీసుకున్నారు. మిగతా ఇద్దరి భార్యలు చనిపోయి ఉండవచ్చు. వాళ్లకు యుక్త వయసులో ఉన్న కూతుళ్లు ఉన్నట్లు అనిపించింది. ఆ పిల్లలు వాళ్ల అమ్మలతోనే ఉండి ఉంటారు" అని జూలీ పేర్కొన్నారు.
"పరిచయం మొదలైన తరవాత ఒకటి, రెండు వారాలు అంతా మామూలుగానే ఉంటుంది. ఆ తర్వాత వాళ్లు బిజినెస్ పనుల మీద వేరే ఊరు వెళతారు. అక్కడ వాళ్లు సూట్‌కేసు పోగొట్టుకుంటారు. ఆ తర్వాత డబ్బులు కావాలని అడుగుతారు" ఇదే కథ జరుగుతుందని జూలీ చెప్పారు.
"వాస్తవానికి డేటింగ్ యాప్‌లో పరిచయం అయినవాళ్లు ఏదైనా అడగాలంటే కొన్ని వారాలు పడుతుంది" అని ఆమె అన్నారు.
ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లలో ఆదిలోనే ఆమెకు నిరాశ ఎదురైంది. దీంతో ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
అయితే నిరుడు డిసెంబర్‌లో ఇల్లు మారిన తర్వాత ఆమె చివరి బిడ్డ కూడా ఇంటిని విడిచి వెళ్లిపోయారు. దీంతో మరోసారి డేటింగ్ యాప్‌లను ప్రయత్నించాలని ఆమె అనుకున్నారు.
"నేను ఒంటరిని కాబోతున్నాను. అయితే ఎప్పటికీ అలా ఉండాలని అనుకోవడ లేదు" అని జూలీ చెప్పారు.
"తోడు కోసం డేటింగ్ వెబ్‌సైట్ ఒక్కటే మార్గమని అనుకున్నాను. అందుకే మరోసారి ప్రయత్నించి చూడాలనుకుని అందులో చేరాను. ఓ వ్యక్తి పరిచయం అయ్యారు. నెల రోజుల తర్వాత అతను ఎలా ప్రవర్తిస్తారో చూడాలని ఆగాను" అని జూలీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ మొదలైంది..
ఈసారి ఆమె 50 ఏళ్లు పైబడిన వారి కోసం ఉద్దేశించిన 'అవర్‌టైమ్' అనే డేటింగ్ యాప్‌లో నమోదు చేసుకున్నారు.
ఆ యాప్‌లో ఆమెకు ఫ్రాంక్ అనే వ్యక్తి పరిచయమయ్యారు.
మంచి శరీరాకృతి, బంగారు రంగు జుట్టుతో ఉన్న ఫ్రాంక్, తాను ఆర్కిటెక్ట్‌నని మూడేళ్ల క్రితం తన స్వదేశమైన ఫ్రాన్స్ నుంచి ఇంగ్లండ్ వచ్చినట్లు జూలీతో చెప్పారు.
తనకు భార్య, టీనేజ్ కూతురు ఉందని, భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. ఆయన తనకు నిజాయితీ పరుడిగా కనిపించారని జూలీ అన్నారు.
అయితే రెండు వారాల వాట్సాప్ చాట్ తర్వాత, అతనిని నేరుగా కలిసేందుకు డ్రింక్ తాగుతామా అని జూలీ అడగాలనుకున్నారు.
"మీరు నిజమైన వ్యక్తో, కాదో తెలుసుకోవడానికి నేరుగా కలవడం ఉత్తమ మార్గం. కలుద్దామా అని నేను అతనిని అడిగాను. అయితే నాలుగు రోజుల తర్వాత అతను హఠాత్తుగా ఫ్రాన్స్ వెళ్లాలని చెప్పారు. దీంతో ఈ కథ మళ్లీ మొదలైందని అనుకున్నాను" అని జూలీ వివరించారు.
ఫ్రాంక్ అసలు ఉద్దేశమేంటో తెలుసుకోవాలనుకున్న జూలీ అతనిలాగే నటించడం ప్రారంభించారు. "అతను నాతో నిజంగా డేటింగ్ చేయాలనుకుంటే మరెవరితో మాట్లాడడు" అని ఆమె చెప్పారు.
అలా నటించడం మొదలు పెట్టిన వెంటనే అతనికి ఏం కావాలో అమెకు అర్థమైంది.
తన తండ్రి ఆస్తి కోసం కోర్టుల్లో పోరాడుతున్నానని, కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చిందని, తన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారని ఆయన కట్టుకథ చెప్పారని జూలీ చెప్పారు.
దీని గురించి జూలీకి పంపిన మెసేజ్‌లలో "ఈ పరిస్థితి నన్ను మానసికంగా, ఆలోచనల పరంగా నాశనం చేస్తోంది" అని ఫ్రాంక్ చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
'మీరు అబద్ధం చెబుతున్నారా'
జూలీ ఇంకా నటిస్తూ తాను 20వేల పౌండ్లు విత్ డ్రా చేశానని, అది ఇచ్చేందుకు పారిస్ వస్తానని చెప్పారు.
ఆమె అతనికి తాను ప్రయాణించే విమానం అంటూ నకిలీ వివరాలు పంపారు. ఎయిర్‌పోర్టులో కలవాలని కోరారు. అయితే అసలు ఆమె విమానం ఎక్కలేదు.
"నేను పారిస్ ఎయిర్‌పోర్టులో దిగితే ఎవరో ఒకరు నా డబ్బు దోచుకుని పోవడానికి సిద్ధంగా ఉండి ఉంటారు" అని ఆమె చెప్పారు.
జూలీ పారిస్ ప్రయాణం గురించి రెండు గంటల పాటు ఏవేవో ప్రశ్నలు అడిగి విసిగిపోయి ఫ్రాంక్ చాట్ చేయడం మానేశారు.
"మీరు ఫ్రాన్స్‌లో ఉన్నట్లు అబద్ధం చెబుతున్నారు" అని ఫ్రాంక్ ఆరోపించారు. ఆమె హోటల్ గది వివరాలు, ఆచూకీ గురించి డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపారు
ఈ కేసు గురించి తాను గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జూలీ వెల్లడించారు.
ఆమె ఫిర్యాదు గురించి తెలుసుకునేందుకు బీబీసీ మాంచెస్టర్ పోలీసుల్ని సంప్రదించింది.
మీ కథను ఎందుకు పంచుకోవాలనుకుంటున్నారని జూలీని అడిగినప్పుడు "నాలుగోసారి ఇలా జరగడంతో నాకు చిరాగ్గా ఉంది. అందుకే అసలు దీన్ని వదిలేద్దామని అనుకుంటున్నాను" అని చెప్పారు.
"వాళ్లు మరొకరితో కూడా ఇలాగే చేస్తారు" అని ఆమె అన్నారు
ఆ తర్వాత జూలీ ఫ్రాంక్ ఖాతా గురించి 'అవర్‌టైమ్'కు ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు మీద అవర్ టైమ్ స్పందిస్తూ ఒక మెయిల్ పంపింది.
"మా సభ్యుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. వినియోగదారులందరికీ సురక్షిత, స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే మా లక్ష్యం" అని అందులో రాసింది. అవర్ టైమ్ పంపిన మెయిల్‌ను జూలీ బీబీసీకి షేర్ చేశారు.
ఫ్రాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను పంపాలని అవర్‌టైమ్ కోరింది. పోలీసుల తమ సాయం అవసరమైతే "దర్యాప్తుకు మేము అన్ని రకాలుగా సహకరిస్తాం" అని తెలిపింది.
మరిన్ని వివరాల కోసం అవర్‌టైమ్‌ను బీబీసీ సంప్రదించింది.
డేటింగ్ యాప్‌లలో ఎదురైన అనుభవాలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయని జూలీ చెప్పారు.
"ఇక చాలు. నేను ఒంటరిగానే ఉంటాను" అని ఆమె చెప్పారు.
"54 ఏళ్లకే వితంతువు అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. నా భాగస్వామి కోవిడ్‌తో చనిపోతాడని కూడా అనుకోలేదు. ఆయన జీవితకాలంలో ఎప్పుడూ కనీసం జలుబు కూడా రాలేదు. అయితే జీవితం అన్నాక ఇలాంటివి జరుగుతుంటాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు జూలీ.
"నాకిప్పుడు 60 ఏళ్లు. అంత ముసలిదాన్ని కూడా కాదు. జీవితాంతం ఒంటరిగా బతకాలనే ఆలోచనే భయపెడుతోంది. మనల్ని అర్థం చేసుకునేవాళ్లు ఎప్పుడు కలుస్తారు? ఏమో అది నాకు తెలియదు" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























