యూనిఫాంలో ఉన్న ఆర్మీ కెప్టెన్ సైనిక హెలికాప్టర్ ముందు కాబోయే భార్యకు ప్రపోజ్ చేయడంపై సోషల్ మీడియాలో ఏం చర్చ జరుగుతోంది?

ఫొటో సోర్స్, X
ఇండియన్ ఆర్మీకి చెందిన ఏవియేషన్ కెప్టెన్ భరత్ భరద్వాజ్ గ్రాడ్యుయేషన్ సెరిమనీలో తనకు కాబోయే భార్య ఆరుషికి ప్రపోజ్ చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జూన్ 2న మహరాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ నుంచి భరద్వాజ్ తన విమానయాన శిక్షణ పూర్తి చేశారు.
ఈ సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్, ఏవియేషన్ షో జరిగాయి. ఇదే సమయంలో భరత్ భరద్వాజ్ తన ఫియాన్సీకి ప్రపోజ్ చేశారు. ఇదంతా ఆర్మీ హెలికాప్టర్ పక్కనే జరిగింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న భరద్వాజ్ కుటుంబ సభ్యులు, అతని సహచరులు చప్పట్లు కొట్టి ఆ క్షణాన్ని ఆస్వాదించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది భరద్వాజ్ చర్యను ప్రశంసిస్తే, మరి కొందరు విమర్శించారు.


ఫొటో సోర్స్, ANI
భరత్ భరద్వాజ్ ఏం చెప్పారు?
కాబోయే భార్య ఆరుషికి ప్రపోజ్ చేసిన తర్వాత భరత్ భరద్వాజ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. "ఏడాది పాటు కఠోర శిక్షణ తర్వాత ఇది మా అందరికీ మర్చిపోలేని రోజు. మేమందరం ఇవాళ పైలట్లుగా, శిక్షకులుగా మారాము. ఇది మా కష్టానికి ఫలితం దక్కిన రోజు" అని ఆయన అన్నారు.
"ఆమె నా కాబోయే భార్య. ఐదేళ్లుగా తెలుసు. మేమిద్దరం ఒకరికొకరు తెలుసు. "నన్ను పెళ్లి చేసుకుంటావా" అని అడగటానికి ఇంత కంటే మంచి రోజు ఏదీ నాకు తోచలేదు" అని భరద్వాజ్ ఏఎన్ఐకి చెప్పారు.
"ఇది మా కుటుంబానికి కూడా చాలా మంచి రోజు. నాకు, నా కుటుంబ సభ్యులకు ఇది ముఖ్యమైన రోజు కాబట్టి, నా ప్రియురాలికి కూడా ఈ రోజు అలాంటిది ఎందుకు కాకూడదని అనుకున్నా. నా ఆలోచన వెనుక ఉద్దేశం అదే" అని భరద్వాజ్ వివరించారు.

ఫొటో సోర్స్, ANI
సోషల్ మీడియాలో చర్చ ఎందుకు?
అయితే కెప్టెన్ భరద్వాజ్ ఆలోచన అందరికీ నచ్చలేదు. ఆయన ప్రపోజ్ చేసిన పద్ధతిని సురభి గర్వాల్ అనే ఒక యూజర్ ప్రశ్నించారు.
"ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ భరత్ భరద్వాజ్ సైనిక క్రమశిక్షణ, నియమాలను ఉల్లంఘించారు. పరేడ్ వంటి అధికారిక సైనిక కార్యక్రమంలో యూనిఫాం ధరించి మిలటరీ హెలికాప్టర్ ముందు తన కాబోయే భార్యకు ఆయన ప్రపోజ్ చేశారు" అని ఆమె 'ఎక్స్' లో రాశారు.
"కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన కాబోయే జీవిత భాగస్వామికి ప్రపోజ్ చేయడం గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది" అని వినయ్ అనే యూజర్ రాశారు.
"అతను కొన్ని నియమాలు ఉల్లంఘించి ఉండవచ్చు, యువకుడు కాబట్టి కాస్త ఎమోషనల్‌గా ప్రవర్తించి ఉండవచ్చు. "మీ సైన్యం గురించి తెలుసుకోండి" పేరుతో ఆర్మీ నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు సైనిక పరికరాలు, ఆయుధాలు, వాహనాల వద్ద ఫోటోలు తీసుకునే అవకాశం కల్పిస్తారు. ఇది వారికి స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన క్షణాన్ని వాదోపవాదాలు, వివాదాలకు అతీతంగా జరుపుకోవాలి" అని వినయ్ తన సందేశంలో తెలిపారు.
"ఆర్మీ అధికారి కెప్టెన్ భరత్ భరద్వాజ్ సైనిక నియమాలు, క్రమశిక్షణ ఉల్లంఘించారు. ఎందుకంటే పాసింగ్ అవుట్ పరేడ్ వంటి ఒక అధికారిక కార్యక్రమంలో, యూనిఫాంలో, సైనిక పరికరాల ముందు అతను తన కాబోయే భార్యకు ప్రపోజ్ చేశాడు" అని కేఎస్ యాదవ్ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో రాశారు.

ఫొటో సోర్స్, x.com/Upadhyay
‘‘జాతీయ భద్రతకు ప్రమాదం లేదు’’
"దీనిని తప్పుగా భావించకుండా, ప్రజలు సానుకూల దృక్పథంతో కూడా చూడాలి. యూనిఫాంలో దేశానికి సేవ చేస్తున్న సైనికుడు, అతనితో పాటు అతని జీవిత భాగస్వామి, ఇది ఒక అందమైన స్ఫూర్తిదాయక చిత్రం" అని జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదిఎక్స్‌లో పోస్ట్ చేసిన సందేశంలో తెలిపారు.
"హెలికాప్టర్ దగ్గర యూనిఫాంలో ప్రేమను వ్యక్తం చేస్తున్న కెప్టెన్ భరత్ భరద్వాజ్ చూస్తే ముచ్చటేస్తోంది. ఇది ఉద్యోగ బాధ్యతలు, ప్రేమ మధ్య ఉన్న చక్కని అనుబంధం. భారత సైన్యంలో చేరడం గర్వించదగ్గ అంశం. ఈ యూనిఫాం ధరించడం యువతకు స్ఫూర్తినిస్తుంది" " అని పునీత్ అనే యాజర్ తన సందేశంలో తెలిపారు.
భరత్ భరద్వాజ్‌కు మద్దతుగా లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే తన ఎక్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
"ఒక ఆర్మీ కెప్టెన్ తన కాబోయే భార్యకు ప్రపోజ్ చేశాడు. అక్కడ జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదు. అది టీ సమయం. పరేడ్ కాదు. పరేడ్ ముగిసింది. ఫోటోలు తీసుకోవడానికి అందరికీ అనుమతి ఇచ్చారు. అందులో తప్పేమీ లేదు" అని పాండే తన సందేశంలో వెల్లడించారు.
"అతను హద్దు దాటి ఉండవచ్చు. దాని పర్యవసానాలేంటో అతనికి తెలుసు. కానీ ఒక మంచి సైనికుడిలా అతను దానిని అంగీకరిస్తాడు. అతను ఆ సాహసం చేయకపోతే, ఆ ధైర్యమైన అడుగు వేయకపోతే, ఆ హద్దు దాటకపోతే, మరి ఇంకెవరు చేస్తారు? ఎప్పుడు చేస్తారు?కెప్టెన్ భరద్వాజ్, ఆరుషికి శుభాకాంక్షలు. వారు వివాహం చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను" అని ఆయన తన సందేశంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































