పెద్ది: ఈ సినిమాలో జాన్వీకపూర్ పాత్రపై వివాదం ఏమిటి? దర్శకుడు ఏం చెప్పారు?

జాన్వీకపూర్

ఫొటో సోర్స్, Mythri Movie Makers/FB

    • రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

తెలుగు సినిమాలలో చాలావాటిని నిశితంగా పరిశీలిస్తే హీరోయిన్ పాత్రలకు కేవలం ప్రేక్షకులలో శృంగార కోరికలను రేకెత్తించడం తప్ప మరో లోతైన ఉద్దేశం లేదనే అభిప్రాయం తరచూ వినిపిస్తుంటుంది.

తాజాగా రామ్‌చరణ్, జాన్వీకపూర్ హీరో,హీరోయిన్లుగా నటించిన 'పెద్ది' సినిమాలో జాన్వీకపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర ఈ అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా చూపిందని సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తాయి.

సినిమాలో జాన్వీ కపూర్‌ నటనను, హావభావాలను చూపడానికంటే ముందే ఆమె శరీరాకృతిని క్లోజప్ యాంగిల్స్‌లో చూపడంపై విమర్శలు వస్తున్నాయి.

‘‘ట్రైలర్‌లో జాన్విని చూసిన‌పుడు రంగ‌స్థ‌లంలో స‌మంత‌లా గ‌ట్టి క్యారెక్ట‌ర్ ప‌డింద‌ని ఆశిస్తాం. తీరా చూస్తే ఫ‌స్టాఫ్‌లో కాసేపు క‌నిపించి, మ‌ళ్ళీ సెకండాఫ్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంది. హీరోయిన్ లేక‌పోయినా ఈ సినిమాకేం న‌ష్టం లేదు. అభిమానుల‌కి న‌చ్చ‌దేమో అని మొహ‌మాట‌ ప‌డిన‌ట్టున్నారు'' అనిబీబీసీ కోసం రాసిన రివ్యూలో సినీ విమర్శకులు మహర్షి పేర్కొన్నారు.

ఆ సినిమాలో జాన్వీ కపూర్‌ను అందాలు చూపించడానికి తప్ప ఎందుకు అవసరం లేని పాత్రలా మలిచారని చూసినారికెవరికైనా అనిపిస్తుంది. హీరోయిన్ ఎంట్రీలోనే హీరోయిన్ చున్నీ తీసేస్తూ వస్తుంది. చివర్లో రెండు మూడు దృశ్యాల్లో మాత్రం చీరకట్టుకుని కనిపిస్తుంది. ‘వారానికి వెయ్యి’ పాటలో హీరోతో ఆడిపాడుతున్న శ్రుతీ హాసన్ పై అసూయతో ఆమెతో పోటీగా డాన్స్ చేయడానికి పనిగట్టుకుని చున్నీ విసిరేసి మరీ స్టేజి మీదకు వస్తుంది. అక్కడక్కడా బీప్ డైలాగులు, మధ్య వేలు చూపించడాలు ఉంటాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కళ్లు,పెదాలను పొగుడుతుంటే నడుము చూపడమేంటి?

జాన్వీ కపూర్‌ పాత్రను మలిచిన తీరును చూశాక సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు.

‘‘ఒక సీన్‌లో రామ్‌చరణ్ జాన్వీకపూర్‌ను పొగుడుతుంటాడు. అతను ఆమె కళ్లను వర్ణిస్తుంటే వక్షభాగాన్ని చూపుతారు. అతను ఆమె పెదవుల గురించి చెబుతుంటే నడుమును చూపుతారు... ఈ సీన్‌ను కట్ చేసిన ఎడిటర్'కు నిజంగానే కళ్లు, పెదాలు ఏవో తెలియవా? అని ఓ యూజర్ ప్రశ్నించారు.

జాన్వీకపూర్ కూడా తన పాత్ర విషయంలో అసంతృప్తికి గురైనట్టు వార్తలు వచ్చాయి. ‘పెద్ది’ సినిమాపై ఇన్‌స్టా పేజీలో 'భారతీయ సినిమా చరిత్రలో ఓ కథనాయికకు దారుణ అవమానం' అనే శీర్షికతో వచ్చిన రివ్యూను జాన్వీకపూర్ లైక్ చేశారని ఈనాడు పత్రిక రాసింది. జాన్వీ చేసిన పనిపై అనుకూలంగా, సమర్థనగా సోషల్ మీడియాలో వాదోపవాదాలు రావడంతో తరువాత ఆ పోస్టును జాన్వీ అన్‌లైక్ చేశారని ఆ కథనం పేర్కొంది.

శ్రుతీహాసన్, రామ్ చరణ్, జాన్వీ కపూర్

ఫొటో సోర్స్, Mythri Movie Makers/FB

''నడుము, వక్షభాగానికి సంబంధించిన షాట్స్ వద్దు'' అని నేను చెప్పడం దర్శకుడికి అసంతృప్తి కలిగించింది. అలాంటి యాంగిల్స్ తీసుకోకూడదని రామ్ సార్ కూడా దర్శకుడికి చెప్పారు. దాంతో ఆయన అప్‌సెట్ అయ్యారు'' అని జాన్వీకపూర్ చెప్పినట్టుగా ఆ చాట్‌లో ఉంది.

అయితే ఈ సంభాషణను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించడం లేదు.

పెద్ది సినిమా

ఫొటో సోర్స్, Mythri Movie Makers/FB

‘సారీ, ఆ భాగాలను మారుస్తాం’ : దర్శకుడు బుచ్చిబాబు

పెద్ది సినిమాలో జాన్వీకపూర్ పాత్రపై వచ్చిన విమర్శలపై సినిమా దర్శకుడు స్పందించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

''ఓ దర్శకుడిగా సినిమా ప్రేక్షకులను అలరించాలి, ఉత్తేజపరచాలి, వారిని మమేకం చేయాలి. అది ఎవరినీ ఎప్పుడూ అగౌరవపరచకూడదు, అసౌకర్యానికి గురిచేయకూడదు. 'పెద్ది' చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. తెరముందైనా, వెనకైనా నాకు మహిళలపై అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రను లైంగిక వస్తువుగా చూపించాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ సినిమాలోని ఏ భాగమైనా ఆ విధంగా అనిపించి ఉంటే, మేము వారి భావాలను గౌరవిస్తూ, ఆందోళనలను అర్థం చేసుకుంటూ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఈమేరకు అభ్యంతరకరంగా అనిపించిన సన్నివేశాలను మార్చాలని నిర్ణయించుకున్నాం'' అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

తాప్సీ పన్ను, డింపుల్ హయతి

ఫొటో సోర్స్, Dimple Hayathi/Taapsee Pannu/FB

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎందుకిలా?

సినిమాలో మహిళా పాత్రలకు ప్రాధాన్యం లేకపోవడం, వారిని ఓ లైంగిక వస్తువుగా చూపడానికి కారణమేంటి? టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఇదే వరుస ఎందుకు కొనసాగుతోంది?

సినిమా ప్రధానంగా పురుషుల చేతిలో ఉన్న పరిశ్రమ. సినిమా సమాజంపై చాలా బలమైన ప్రభావాన్నీ చూపుతుంది. సినిమాలు నిర్మించేవారు, దర్శకత్వం వహించేవారు, కథలు రాసేవారు సింహభాగం పురుషులే కావడంతో పురుష దృష్టికోణం నుంచే కథలు, కథనాయికలు రూపొందారు. 1975లో 'విజువల్ ప్లెజర్ అండ్ నెరేటివ్ సినిమా' అనే వ్యాసంలో లారామల్వే నిర్వచించిన 'మేల్‌గేజ్' (పురుష దృష్టికోణం) దాదాపు అన్నిరకాల సినిమాల్లో మహిళల పాత్రలపై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిందని రాశారు.

సినిమాల్లో ఇప్పటికీ లింగ వివక్ష, మహిళలను లైంగిక వస్తువులుగా చూపించే అనేక ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. సినిమాలలో మహిళల పాత్రకు సంబంధించి బెక్డెల్ – వాలెస్ టెస్ట్ ఓ ప్రమాణాన్ని నిర్థరించింది. ఈమేరకు ఒక సినిమా లేదా కథలో వారి పేర్లతో గుర్తుంచుకునేలా కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. వారిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. వారిద్దరి మధ్య జరిగే సంభాషణ పురుషుడి గురించి కాకుండా మరేదైనా అంశం గురించి అయి ఉండాలి. ఈ సంభాషణ ఒక్కసారి జరిగినా ఆ చిత్రం ఈ కొలమానాన్ని అందుకున్నట్టే పరిగణిస్తారు.

బీబీసీ 2018లో ప్రచురించిన ఓ కథనం తెరపై మహిళలను చూపే దృక్పథంలో హాలీవుడ్ ఎలా విఫలమైందో పేర్కొంది. ఉత్తమ చిత్రంగా అస్కార్ అవార్డులు పొందిన 89 చిత్రాల్లో సగానికంటే తక్కువ సినిమాలు మాత్రమే బెక్డెల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. కానీ 1930లలో వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఈ టెస్ట్‌ను అధిగమించిన సినిమాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

''ప్రజలు గతంలో చూసిన తరహాలోనే కొత్త కథలు చెబుతున్నారు. కానీ వాటిని ప్రశ్నించడం లేదు'' అని బెక్డెల్ కొలమానాన్ని అందుకున్న చిత్రాలను ప్రత్యేకంగా గుర్తించే రేటింగ్ వ్యవస్థను స్వీడన్‌లో ప్రవేశపెట్టిన ఎలెన్ టెయ్లె చెప్పారు.

దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీలోని అన్నెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ జర్నలిజానికి చెందిన మీడియా, డైవర్సిటీ అండ్ సోషల్ చేంజ్ ఇనిషియేటివ్ ''ది ఫ్యూచర్ ఈజ్ ఫిమేల్?'' పేరుతో 2017లో చేసిన ఓ అధ్యయనంలో అప్పటికి హాలివుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో యువ మహిళా పాత్రలలో 40శాతానికి పైగా పాత్రలు ఆకర్షణీయమైన దుస్తుల్లో కనిపించగా, 35 శాతం పాత్రల్లో అర్థనగ్నత్వాన్ని చూపించారు.

ఇక తెలుగు సినిమాలలో మహిళలను చూపే విధానంపై విమర్శలు ఉన్నాయి. గతంలో దర్శకుడు రాఘువేంద్రరావుకు హీరోయిన్ల నడుముపై వ్యామోహం ఎక్కువంటూ హీరోయిన్ తాప్సీ విమర్శించారు. ఆ మాటలు వివిదాస్పదం కావడంతో ఆమె తన మాటలు వెనక్కి తీసుకున్నారు.

''అయితే ఒక నటి తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తనకు ఆఫర్ చేసిన పాత్రను పోషించిన తరువాత సహజంగానే ఆమెనే విమర్శిస్తుంటారు. కానీ విమర్శించాల్సింది నటీమణులను కాదు, అలాంటి పాత్రలే అమ్ముడవుతాయని భావించే వ్యవస్థను, అలాంటి కథలనే రూపొందించే రచయితలను, దర్శకులను, నిర్మాతలను ప్రశ్నించాలి'' అని హీరోయిన్ డింపుల్ హయతి అంటారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)