హైదరాబాద్‌లో డోనల్డ్ ట్రంప్ పేరుతో రహదారి: ఈ మార్గం ఎక్కడుంది, దీనిపై విమర్శలేంటి?

హైదరాబాద్‌లోని ఓ ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పేరు పెట్టనున్నారు.

హైదరాబాద్ లోని నానక్‌రాంగూడలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఉన్న ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పేరును పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రహదారికి 'డోనల్డ్ ట్రంప్ ఎవెన్యూ' గా నామకరణం చేయనుంది.

జూన్ 23న ఈ రహదారికి అధికారికంగా ట్రంప్ పేరు పెడుతున్నట్లు తెలంగాణ మెట్రోపాలిటన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ బీబీసీకి చెప్పారు.

ఒకవైపు యుద్ధాలు, మరోవైపు సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ హైదరాబాద్‌లోని ఓ రహదారికి ట్రంప్ పేరు పెట్టడంపై పలు రాజకీయ పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సీపీఎం నిరసన తెలిపింది.

'అమెరికా, తెలంగాణ సత్సంబంధాలకు గుర్తు'

జూలై4న అమెరికా స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని,ముందుగానే అమెరికా కాన్సులేట్ ఉన్న రహదారికి ట్రంప్ పేరు పెట్టనున్నామని జయేశ్ రంజన్ బీబీసీకి చెప్పారు.

అమెరికా, తెలంగాణ మధ్య ఉన్న సత్సంబంధాలకు గుర్తుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

''పార్లమెంట్, అసెంబ్లీలను భారత్‌కు ప్రతీకలుగా ఎలా చెబుతామో, మన దేశంలో అమెరికాకు ప్రతీక అంటే వారి కాన్సులేటే. అలా అమెరికాకు ప్రతీకైన వారి కాన్సులేట్ హైదరాబాద్‌లో ఉంది ఇక్కడి యూఎస్ కాన్సులేట్ జనరల్ ఉన్న రహదారికి ఇప్పటివరకు ఎలాంటి పేరు లేదు. అందుకే ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా’’ జయేశ్ రంజన్ చెప్పారు.

2023లోనే కొత్త భవనం ప్రారంభం

హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ 2008లో మొదలైంది. బేగంపేటలోని 'పైగా' ప్యాలెస్‌లో ఇది కొనసాగింది. తర్వాత నానక్‌రాంగూడలో 2023లో ప్రస్తుత భవనంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యకలాపాలు మొదలయ్యాయి.

దాదాపు 340 మిలియన్ల డాలర్ల వ్యయంతో 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు.

ఇప్పుడు డోనల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనుకున్న రహదారి సుమారు కిలోమీటరు పొడవు ఉంటుంది. విప్రో సర్కిల్‌కు కొంచెం దూరంలోనే ఉంటుంది. ఈ మార్గంలోనే బహుళజాతి కంపెనీలు, ఐసీఐసీఐ కార్పొరేట్ కార్యాలయం వంటివి ఉన్నాయి. ఈ రహదారి 'హైసెక్యురిటీ జోన్' కేటగిరీలో ఉంది. ఇక్కడ రెండువైపులా ప్రత్యేకంగా పోలీసు అవుట్ పోస్టులతో పహారా ఉంటుంది.

జూన్ 23న భారత్‌లోని యూఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్ డోనల్డ్ ట్రంప్ పేరు ఆవిష్కరిస్తారని జయేశ్ రంజన్ చెప్పారు.

''మొదట కాన్సులేట్ జనరల్‌లో కార్యక్రమం ఉంటుంది. తర్వాత డోనల్డ్ ట్రంప్ పేరున్న బోర్డు తీసుకువచ్చి రహదారి ప్రవేశం మార్గం వద్ద ఏర్పాటు చేస్తాం'' అని చెప్పారాయన.

రహదారికి ట్రంప్ పేరు పెట్టడం అంటే అమెరికాకు, అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు ఇస్తున్న గౌరవంగా చూడాలని జయేశ్ రంజన్ చెప్పారు.

''ట్రంప్ శాశ్వతంగా అధ్యక్షుడిగా ఉండకపోవచ్చు. కానీ, ఆయన ప్రెసిడెంట్‌‌గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయం కావడంతో ఆయన పేరు పెడుతున్నాం. నాలుగేళ్లో, పదేళ్ల తర్వాతనో నిర్ణయం తీసుకుని ఉంటే అప్పటి అధ్యక్షుడి పేరు పెట్టి ఉండేవాళ్లం. భారత్‌లోనూ గొప్పగొప్ప వాళ్ల పేర్ల మీద రహదారులున్నాయి. వారిప్పుడు లేకపోయినా వారి కీర్తిని గుర్తుంచుకుంటున్నాం. ఇది కూడా యూఎస్ పై ఉన్న గౌరవం చూపడానికి తీసుకున్న నిర్ణయంగా చూడాలి'' అని చెప్పారు జయేశ్ రంజన్.

డిసెంబరులోనే అనుకుని.. ఆగిపోయి..

యూఎస్ కాన్సులేట్ జనరల్ ఉన్న రహదారికి ట్రంప్ పేరు పెట్టాలని గత డిసెంబరులో తెలంగాణ ప్రభుత్వం భావించింది.

భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల దిగుమతులపై అమెరికా సుంకాలు పెంచడం, ఆ తర్వాత ఇరాన్‌తో యుద్దం మొదలవ్వడం, మిడిల్ ఈస్ట్‌పై ప్రభావం.. ఇలా వరుస పరిణామాలతో వాయిదా వేసుకుంది.

సుంకాల తగ్గింపు, ఇరాన్ – అమెరికా మధ్య శాంతి ఒప్పందం యుద్దం ఆగడంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి ట్రంప్ పేరు పెట్టాలనే ప్రతిపాదన తీసుకువచ్చింది.

ట్రంప్ పేరు పెట్టాల్సిన అవసరమేంటి?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పలు రాజకీయ పక్షాల నాయకులు మండిపడు తున్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ సీపీఎం జూన్ 22న హైదరాబాద్‌లో ప్రదర్శన జరిపింది.

హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ మార్గానికి ట్రంప్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సీపీఎం సీనియర్ నేత డీజీ నర్సింగరావు చెప్పారు.

యుద్ధాలతో ప్రపంచ దేశాలను ట్రంప్ అస్థిరపరస్తున్నారని విమర్శించారు.

‘‘అసలు ట్రంప్‌కు ఈ దేశంతోకానీ, రాష్ట్రంతోకానీ ఏమాత్రం సంబంధం లేదు. ఇక్కడి ఉద్యమాలతో, ప్రజలతో ఏసంబంధం లేని ట్రంప్ పేరు పెట్టాల్సిన అవసరమేంటని’’ ఆయన ప్రశ్నించారు.

‘‘ఎవరి పేరైనా పెడుతున్నామంటే.. వారు చేసిన సేవలు గుర్తుచేసుకునేలా ఉండాలని డీజీ నర్సింగరావు చెప్పారు. అసలేమాత్రం సంబంధం లేని వ్యక్తి పేరు హైదరాబాద్ రోడ్డుకు పెట్టడం దుర్మార్గం’’ అన్నారు నర్సింగరావు.

టాప్ కంపెనీల్లో అమెరికావే ఎక్కువ

కొన్నాళ్లుగా హైదరాబాద్‌కు తరలివస్తున్న కంపెనీల్లో అమెరికా కంపెనీలు ఎక్కువగా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ''దాదాపు 85శాతం మంది యూఎస్ నుంచి వచ్చిన వారే ఉన్నారు'' అని జయేశ్ రంజన్ చెప్పారు.

''ఐటీ ప్రాంతంలో టాప్-5 కంపెనీలు అమెరికా కంపెనీలే. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా.. ఇలా ప్రసిద్ధ కంపెనీల కార్యాలయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాలలో గడిచిన పదిపన్నెండేళ్లలో అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. కొత్త టెక్నాలజీలను కూడా ఇక్కడే ఆవిష్కరించాయి. వీటన్నింటికీ కృతజ్ఞత తెలియజేయడంతోపాటు మున్ముందు మరిన్ని కంపెనీలు రావడానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పడమే దీని ఉద్దేశం'' అన్నారు జయేశ్ రంజన్.

అయితే వాణిజ్య సంబంధాలు వేరు, దేశ భవిష్యత్తు వేరు అని డీజీ నర్సింగరావు చెప్పారు.

''కంపెనీలకు లాభం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కంపెనీలు పెడుతున్నాయి. అదే లాభం లేదనుకుంటే వెళ్లిపోతాయి. అమెరికా భారత్‌పై సుంకాలు విధిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ పేరు పెట్టడమనే చర్య ఎలా చూసినా దేశానికి ప్రమాదకరమైనది’’ అన్నారు.

''డోనల్డ్ ట్రంప్ భారత సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఎగతాళి చేస్తున్నారు. పది శాతం టారిఫ్‌లతో భారత ఆర్థిక స్థిరత్వాన్ని బెదిరిస్తున్నారు.ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రధాన రహదారికి డోనల్డ్ ట్రంప్ పేరును ఎందుకు పెడుతోందో సమాధానం చెప్పాలి'' అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)