స్వీడన్: 120మందికి లైంగిక సర్వీసులు అందించాలని భార్యను బలవంతం చేసిన భర్త, కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే...

    • రచయిత, అలెక్స్ ఫిలిప్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

( ఈ కథనంలోని వివరాలు పాఠకులను కలవరపెట్టొచ్చు. )

భార్యను 120మందికిపైగా పురుషులకు లైంగిక సేవలు అందించేలా బలవంతం చేసినందుకు స్వీడన్‌కు చెందిన ఓ వ్యక్తికి 4 సంవత్సరాల, 5 నెలల జైలుశిక్ష పడింది. ఆయన వయసు 61ఏళ్లు.

బెదిరించడం, హింసించడం, సెక్యురిటీ కెమెరాలతో తన భార్యను ఆయన తన నియంత్రణలో ఉంచుకున్నట్టు కోర్టు నిర్ధరించింది.

అత్యాచారయత్నం, తీవ్రమైన వ్యభిచార దందా నిర్వహణ, దాడి, బెదిరింపులు వంటి నేరాల్లో ఆయన దోషిగా తేలారు. తూర్పు స్వీడన్‌లోని హర్నోసాండ్ కోర్టులో కేసు విచారణ జరిగింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నవారిలో 28 మంది మగవారిని కూడా కోర్టు దోషులగా తేల్చింది.

ఈ కేసుపై అంతర్జాతీయంగా దృష్టి నెలకొంది. కొందరు దీనిని ఫ్రాన్స్‌లోని పెలికో కేసుతో పోల్చారు. డొమినిక్ పెలికో తన భార్య జీసెల్‌కు మత్తుమందు ఇచ్చి పరాయి పురుషులు ఆమెపై అత్యాచారం చేసేలా ప్రోత్సహించారు. ఇది దాదాపు తొమ్మిదేళ్లపాటు సాగింది.

‘బెదిరింపులతో లొంగదీసుకుని’

స్వీడిష్ ప్రావిన్స్ ఆంగర్‌మన్‌లాండ్‌కు చెందిన ఈ నిందితుడు తనపై ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, సమ్మతితోనే లైంగిక కార్యకలాపాలకు ఏర్పాట్లు చేశానని వాదించారు.

కానీ భార్యను నిర్దాక్షిణ్యంగా ఆయన మోసం చేశారన్న ప్రాసిక్యూటర్ల వాదనను కోర్టు సమర్థించింది. వారి పేర్లు బయటకు వెల్లడించలేదు.

డబ్బుకోసం పరాయి పురుషులతో సెక్స్‌లో పాల్గొనాలని 2022 నుంచి ఆయన తన భార్యను ఒత్తిడి చేసినట్లు గుర్తించారు. ఆ పురుషులు దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి క్రామ్‌ఫోర్స్‌లోని ఆ దంపతుల ఫామ్ హౌస్‌కు వచ్చేవారు. 2025 అక్టోబరులో ఆయనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే ఇది ఆగింది.

నిందితుడు తన భార్యకు డ్రగ్స్ ఇచ్చేవారు. వారి ఇల్లు తూర్పు స్వీడన్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ఉండడం, ఆమెకు బయట పరిచయాలు తక్కువగా ఉండడం నిందితుడికి కలిసొచ్చింది. ఇంట్లోని నిఘా కెమెరాలు, కొన్నిసార్లు లైంగిక కార్యకలాపాలను అందులో చిత్రించడం వంటివాటితో ఆమెను నియంత్రణలో ఉంచుకునేవాడు.

మాట వినకపోతే చంపేస్తానని, పెట్రోల్ పోసి కాలుస్తానని, వేళ్లు నరికేస్తానని కూడా ఆయన బెదిరించేవాడని బాధితురాలు చెప్పినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టులో వెల్లడించారు.

ఇంట్లో కెమెరాలు ఎక్కడున్నాయో ఆ మహిళకు తెలుసని, పోలీసులకు ఫోన్ చేసే ముందు తప్పించుకోవడానికి వీలుగా, కెమెరా లేనిచోట ఉన్నారని స్వీడిష్ ప్రసార సంస్థ ఎస్‌వీటీ తెలిపింది.

వీడియోలో చిత్రీకరణ

నిందితుడు భార్యతో శృంగారంలో పాల్గొంటూ వాటిని వీడియో తీయడానికి ప్రయత్నించేవారని, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టి, వాటి ద్వారా ఇతర మగవాళ్లను పిలిపించేవారనీ, ఇరుగుపొరుగువారు, కస్టమర్లతో ఆమె సెక్స్‌లో పాల్గొనేలా చేయడానికి ప్రయత్నించారని, అలా ఆమెను ప్రభావితం చేశారని కోర్టు నిర్ధరించింది.

తీవ్రంగా ఒత్తిడి చేయడం, అవమానకరంగా, తక్కువ చేసి మాట్లాడడం ద్వారా చాలాసార్లు ఇది జరిగిందని కోర్టు తెలిపింది.

భార్య లైంగిక సేవలను విక్రయించాలన్న ఆలోచన చేసింది మొదట ఆయనేనని, ఆ వ్యాపార నిర్వహణ ఎక్కువభాగం తానే చూసుకునేవారని కూడా కోర్టు తేల్చింది.

అయితే, అత్యాచారానికి సంబంధించిన ఎనిమిది ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. ఆమె ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొన్నారని ఈ కేసుల్లో నిరూపితం కాలేదని తెలిపింది. లైంగికచర్యలు ఎలా జరిగాయో ఓ కేసులో తేల్చలేకపోయింది.

సెక్సువల్ ఇంటర్‌కోర్సుతో సమానమైన తీవ్రత కలిగిన లైంగిక దాడులపై కూడా స్వీడిష్ చట్టం కింద అత్యాచార కేసులు నమోదుచేయవచ్చు.

అత్యాచారం ఆరోపణలపై ఓ వ్యక్తిని కూడా కోర్టు దోషిగా నిర్ధరించింది. కానీ ఇతర ఆరోపణలను కొట్టివేసింది.

జైలుశిక్షతో పాటు బాధిత మహిళకు నష్టపరిహారం కింద 2 లక్షల క్రోనాలు ( సుమారు 19.68 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

నిందితుడు ఆఫర్ చేసిన లైంగిక సేవలను తీసుకున్న 120మంది మగవారిని స్వీడిష్ అధికారులు గుర్తించినప్పటికీ, ఈ కేసులో 29మందిపైనే కేసులు నమోదయ్యాయి.

వారిలో ఎక్కువమంది తమపై ఆరోపణలను తోసిపుచ్చారు. తాము ఆ మహిళతో లైంగిక సంబంధాలు పెట్టుకోలేదని, ఎలాంటి చెల్లింపులూ చేయలేదని చెప్పారు.

56 లైంగిక సేవలు పొందినందుకు కోర్టు 28మందిని దోషులుగా తేల్చింది. వారిలో ఇద్దరికి జైలు శిక్షలు విధించింది. మిగిలినవారికి షరతులతో కూడిన శిక్షలు, ప్రొబేషన్ విధించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)