You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
India A vs Sri lanka A: శ్రీలంకపై గెలిచి ట్రై సిరీస్ కైవసం చేసుకున్న భారత్, వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
శ్రీలంక గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ను భారత 'ఏ' జట్టు కైవసం చేసుకుంది. దంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 'ఏ' జట్టుపై 66 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి, ట్రోఫీ గెలిచింది.
ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే అర్థశతకం సాధించి, లిస్ట్ 'ఏ' క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఫైనల్లో వైభవ్ 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి భారత భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు.
వైభవ్ దూకుడు..
టాస్ గెలిచిన శ్రీలంక 'ఏ' జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత 'ఏ' జట్టు తరఫున ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ప్రారంభం నుంచే వైభవ్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఎదుర్కొన్న మొదటి రెండు బంతులను బౌండరీలుగా మలిచాడు.
శ్రీలంక బౌలర్ మొహమ్మద్ షిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వైభవ్ ఏకంగా 2 బౌండరీలు, 3 సిక్సర్లతో 26 పరుగులు రాబట్టారు. ఆ మరుసటి ఓవర్లోనూ అదే ఆటను కొనసాగిస్తూ వరుసగా ఒక బౌండరీ, 2 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో కేవలం 11 బంతుల్లోనే వైభవ్ తన అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
దీంతో, లిస్ట్ 'ఏ' క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్థశతకం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. 2005లో శ్రీలంకకు చెందిన కౌసల్య వీరరత్నే 12 బంతుల్లో సాధించిన అర్థశతకమే ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉండేది.
శతకానికి కేవలం 6 పరుగుల దూరంలో (94 పరుగులు; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) వైభవ్ అవుటయ్యే సమయానికి, ప్రియాంశ్ ఆర్య (39)తో కలిసి తొలి వికెట్‌కు కేవలం 8.5 ఓవర్లలోనే 132 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
ఆ తర్వాత, వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ 67 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 40 పరుగులు, కుమార్ కుశాగ్ర 36 పరుగులు చేశారు.
ఇక, చివర్లో అనుకుల్ రాయ్ దూకుడుగా ఆడి 15 బంతుల్లోనే 39 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.
శ్రీలంక బౌలర్లలో వనుజ సహాన్, రవిందు ఫెర్నాండో, గుగదాస్ మదులన్ తలో 2 వికెట్లు తీశారు.
తడబడిన శ్రీలంక టాప్ ఆర్డర్
భారత జట్టు నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అవిష్క ఫెర్నాండో, నిరోషన్ డిక్వెల్లా, నువనిదు ఫెర్నాండో వంటి కీలక బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరారు.
ఆ దశలో సదీర సమరవిక్రమ (52), వనుజ సహాన్ (62)లు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
సహాన్‌కు తోడు విజయకాంత్ వియస్కాంత్ (39) కూడా వేగంగా ఆడినప్పటికీ, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో శ్రీలంక విజయానికి దూరంగానే నిలిచింది.
చివరకు 47.1 ఓవర్లలో శ్రీలంక 'ఏ' జట్టు 311 పరుగులకు ఆలౌటై, ఓటమి పాలైంది.
వైభవ్ ఆధిపత్యం చెలాయించే ఫార్మాట్: సంజయ్
వైభవ్ ఆటపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఎక్స్ పోస్టులో "50 ఓవర్ల క్రికెట్‌ను వైభవ్ తాను ఆధిపత్యం చెలాయించగల ఫార్మాట్‌గా భావిస్తున్నాడని ఇప్పుడే గ్రహించాను. ఎందుకంటే, ఇందులో 10 ఓవర్ల పాటు 'సర్కిల్' వెలుపల ఆరుగురు ఫీల్డర్లకు బదులుగా ఇద్దరు మాత్రమే ఉంటారు" అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)