బ్రిటన్ ప్రధాని పదవికి, లేబర్ పార్టీ నాయకత్వానికి కీర్ స్టార్మర్ రాజీనామా

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

బ్రిటన్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ ప్రధాని పదవికి, లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతలకు రాజీనామా చేశారు.

2029 ఆగస్టు లోపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో దేశానికి నాయకత్వం వహించడానికి తాను సరైన వ్యక్తిని కాదని పార్టీ భావిస్తున్నందున పార్టీ నాయకుడిగా, ప్రధానమంత్రిగా పదవి నుండి వైదొలుగుతున్నట్లు కీర్ స్టార్మర్ చెప్పారు.

"అధికారంలో ఉన్నప్పుడు నేను తీసుకునే ప్రతి నిర్ణయం నేను ప్రేమించే దేశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడమే" అని ఆయన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ఒక ప్రకటనలో చెప్పారు.

"రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మనకు నాయకత్వం వహించడానికి మీరు అత్యంత సరైన వ్యక్తేనా? అని పార్టీ అడుగుతోంది. అందుకు సమాధానం ఏంటో కూడా నేను విన్నాను" అని ఆయన ఆ ప్రకటనలో చెప్పారు.

ప్రధానమంత్రి కావడం తన జీవితంలోనే "అత్యంత గర్వించదగిన క్షణం" అని స్టార్మర్ అభివర్ణించారు.

"కొత్త నాయకుడికి సహకరిస్తా"

"రాజకీయంగా ఆర్థికంగా, నైతికంగా దివాలా తీసిన లేబర్ పార్టీ తనకు వారసత్వంగా వచ్చిందని, పార్టీ పనైపోయిందని తనకు పదే పదే చెప్పారని ఆయన 10, డౌనింగ్ స్ట్రీట్ వెలుపల చేసిన ప్రకటనలో చెప్పారు.

వారసుడి కోసం పోటీ జరిగితే, సెప్టెంబరులో పార్లమెంట్ తిరిగి సమావేశమయ్యేలోపు కొత్త లేబర్ నాయకుడు బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన అన్నారు.

క్రమబద్ధమైన అధికార బదిలీ జరిగేలా చూసేందుకు తాను చేయగలిగినదంతా చేస్తానని, తన వారసుడికి పూర్తి మద్దతు ఇస్తానని ప్రధాని తెలిపారు.

తదుపరి నాయకత్వానికి నామినేషన్ల ప్రక్రియ జూలై 9న ప్రారంభమై, వేసవి సెలవుల నాటికి పూర్తయ్యేలా టైమ్ టేబుల్ రూపొందించాలని ఆయన లేబర్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీని కోరారు.

సెప్టెంబరులో పార్లమెంటు తిరిగి సమావేశమయ్యేలోపు కొత్త నాయకుడు బాధ్యతలు స్వీకరిస్తారు.

అప్పటి వరకు తాను ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతానని ఆయన అన్నారు.

కుటుంబం గురించి మాట్లాడుతూ భావోద్వేగం

"దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాన్ని" వదిలిపెట్టిన తర్వాత "అత్యంత ముఖ్యమైన ఉద్యోగం"పై ఎక్కువ సమయం వెచ్చిస్తానని స్టార్మర్ చెప్పారు.

"మంచి చెడు సమయాల్లో నాకు అండగా నిలిచిన నా అద్భుతమైన భార్య విక్‌కు, నేను ఉత్తమ భర్తగా ఉంటాను" అని చెబుతూ స్టార్మర్ భావోద్వేగానికి లోనయ్యారు.

"నా ప్రతిరూపమైన నా పిల్లలకు నేను ఉత్తమ తండ్రిగా ఉండటం" అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

నంబర్ 10 లోపలికి తిరిగి వెళ్లే ముందు భార్యను కౌగిలించుకున్నారు.

కింగ్ చార్లెస్‌కు వివరణ

ప్రధానమంత్రి ఈ ఉదయం కింగ్ చార్లెస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కింగ్ చార్లెస్ గ్లౌసెస్టర్‌షైర్‌లోని హైగ్రోవ్‌ ఎస్టేట్‌లో ఉన్నారు.

కీర్ స్టార్మర్ రాజీనామా ప్రకటన తర్వాత "నిరంతరం మారుతున్న ప్రధానమంత్రులతో ప్రజలు విసిగిపోయారు" అని లిబరల్ డెమోక్రాట్ నాయకుడు ఎడ్ డేవీ అన్నారు.

"ప్రధానమంత్రులు మారుతూ ఉండటం వల్ల ఏమీ మారడం లేదు. దీనివల్ల బ్రిటిష్ ప్రజలు నిరాశకు గురవుతున్నారు" అని డేవీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

"ఈసారి తప్పకుండా భిన్నంగా ఉండాలి. కేవలం నంబర్ 10లో ఎవరున్నారనేది మార్చడం మాత్రమే కాదు, మన దేశాన్ని బాగుచేయాలంటే మన విచ్ఛిన్నమైన రాజకీయాలను మార్చాలి" అని ఆయన ఆ సందేశంలో పేర్కొన్నారు.

కీర్ స్టార్మర్ నేపథ్యం

2024 జులైలో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్‌, బ్రిటన్‌కు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

స్టార్మర్ 2015 నుంచి హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

స్టార్మర్ వయసు 61 ఏళ్లు. ఆయన రైగేట్ గ్రామర్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లలో చదువుకున్నారు. ఆయన భార్య విక్టోరియా అలెగ్జాండర్‌, నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్‌)లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.

స్టార్మర్ తండ్రి టూల్ మేకర్‌. తల్లి నర్సుగా పని చేసేవారు.

ఈ లేబర్ పార్టీ లీడర్ తనను తాను "శ్రామిక వర్గ నేపథ్యం" నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పుకుంటారు.

ఆయన రైగేట్ గ్రామర్ స్కూల్‌లో చేరిన రెండేళ్ల తర్వాత అది ప్రైవేట్ పాఠశాలగా మారింది. ఆయనకు 16 ఏళ్లు వచ్చే వరకు స్కూల్ ఫీజులను స్థానిక కౌన్సిల్ చెల్లించింది.

ఆ కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తి స్టార్మర్. లీడ్స్‌లో న్యాయశాస్త్రం చదివారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు.

1987లో బారిస్టర్ పూర్తయ్యాక, మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. ఉద్యోగరీత్యా కరీబియన్, ఆఫ్రికాలలో పని చేశారు. అక్కడ మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీల తరపున వాదించారు.

పర్యావరణానికి మెక్‌ డోనల్డ్స్ నష్టం కలిగిస్తోందంటూ కరపత్రాలను పంచిపెట్టిన మెక్‌లైబెల్ కార్యకర్తలపై ఆ సంస్థ కేసు వేసింది. 90ల చివర్లలో ఆయన ఉచితంగా ఆ కార్యకర్తలకు తన సేవలను అందించారు.

2008లో ఇంగ్లండ్, వేల్స్‌లో పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా స్టార్మర్ నియమితులయ్యారు.

2015లో తొలిసారి ఎంపీగా గెలిచి..

ఉత్తర లండన్‌లోని హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గం నుంచి ఆయన 2015లో ఎంపీగా ఎన్నికయ్యారు.

లేబర్ పార్టీ మాజీ నాయకుడు జెరెమీ కార్బిన్ బృందంలో షాడో బ్రెగ్జిట్ సెక్రటరీగా పనిచేశారు. రెండో ఈయూ రెఫరెండం నిర్వహించడంపై ఆలోచించాలని ఆ సమయంలో స్టార్మర్ సూచించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయం తర్వాత, కీర్ స్టార్మర్ 2020 ఏప్రిల్‌లో పార్టీ నాయకుడి పదవికి పోటీ చేసి గెలిచారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంతో స్టార్మర్ ప్రధాని అయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)