శిలల్లోనూ ఆడ, మగ తేడాలుంటాయా?

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

మనుషుల్లోనే కాదు శిలల్లో కూడా ఆడ, మగ తేడా ఉంటాయంటున్నారు శిల్పకళా నిపుణులు.

ముఖ్యంగా ఆలయాల్లో ప్రతిష్టించే విగ్రహాల కోసం ప్రత్యేకంగా రాయిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు.

అయితే అసలు రాళ్లలో ఈ ఆడ, మగ తేడా ఎలా గుర్తిస్తారు? విగ్రహాలు చెక్కడానికి ముందు ఒక శిలలో ఏమేం చూస్తారనేది తెలుసుకునేందుకు బీబీసీ తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాలకు వెళ్లింది.అక్కడి ప్రొఫెసర్లు, నిపుణులతో మాట్లాడింది.

శిలల్లో కూడా మగ, ఆడ, నపుంసక శిల అనే మూడు రకాలు కూడా ఉంటాయని వారు తెలిపారు.

ఆ శిలలను ఎలా గుర్తిస్తారో, శిల్పాల కోసం శిలల సేకరణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే దాని గురించి వారు బీబీసీకి వివరించారు.

శిలల్లో రంగులు

ఆలయాల్లో విగ్రహారాధనకు ప్రధానంగా నాలుగు వర్ణాల శిలలు ఎంపిక చేసుకుంటామని ఎస్వీ శిల్ప కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి చెప్పారు.

‘‘ఎరుపు, తెలుపు, కృష్ణశిల అంటే నల్లగా ఉండేది. పీత వర్ణము అంటే పసుపు రంగులో ఉంటుంది. ఈ శిల పూర్తిగా ఒకే రంగులో ఉండాల్సి ఉంటుంది. ఉదాహరణకు కృష్ణశిల అంటే నల్లరాయి తీసుకుంటే అది పూర్తిగా నలుపులోనే ఉండాలి. అది కాటుక వర్ణంలో లేదా దున్నపోతు కన్ను ఎంత నల్లగా ఎలా ఉంటుందో అంత నల్లగా ఉండాలని శాస్త్రాల్లో చెప్పారు. ఆ శిలపై మచ్చలు, ఇతర గీతల్లాంటివి ఏవీ ఉండకూడదు" అని వెంకటరెడ్డి చెప్పారు.

దక్షిణాదిన నల్లటి శిలను మాత్రమే విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారని ఆయన వివరించారు.

"కృష్ణశిల అంటే నల్లగా ఉండే రాయి. చారలు, మచ్చలు లాంటివి ఏవీ లేని నల్లటి ఈ శిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో దొరకడం లేదు. ఇది కాంచీపురం, తిరుచ్చి దగ్గర కావలూరు క్వారీల్లో లభ్యమవుతుంది. టీటీడీ అక్కడి నుంచి తీసుకువచ్చి శిల్పాలు తయారు చేస్తోంది" అని ఆయన అన్నారు.

స్త్రీ, పురుష, నపుంసక శిల

దేవీ దేవతల విగ్రహాలు తయారు చేయడానికి ఉపయోగించే కృష్ణ శిలను మూడు రకాలుగా విభజించారు. అవి పురుష, స్త్రీ, నపుంసక శిలలు. వాటిని ఏదైనా లోహంతో కొడితే వచ్చే శబ్దం, వాటి ఆకారాన్ని బట్టి ఈ విభజన చేశారు.

''పురుష శిలను ఏదైనా లోహంతో కొట్టినపుడు అది కంచు గంట మోగినట్లు దీర్ఘ శబ్దం వస్తుంది. స్త్రీ శిలను కొట్టినప్పుడు ఇత్తడిగంట మోగినట్టుగా కొంచెం తక్కువ సౌండ్ వస్తుంది. నపుంసక శిలను కొట్టినపుడు డప్పు శబ్దం వస్తుంది. మగ, ఆడ శిలలను మాత్రమే దేవతల ప్రతిమల తయారీకి ఉపయోగిస్తారు" అని ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి చెప్పారు.

పురుష శిల ఆకారంలో కూడా 8 పలకలు, 10 పలకలు, లేదా 12 పలకలుగా ఉంటాయి.

ఆడ, మగ దేవుళ్ల ప్రతిమలు పురుష శిలలతో తయారు చేయవచ్చు. స్త్రీ శిలలతో అయితే స్త్రీ దేవతల విగ్రహాలు మాత్రమే తయారు చేయాలి.

''స్త్రీ శిల పురుష శిలతో పోల్చి చూస్తే కాస్త చిన్నదిగా ఉంటుంది. అది నాలుగు పలకలుగాగానీ, ఆరు పలకలుగా గానీ ఉంటుందని శిల్ప శాస్త్రంలో చెప్పారు. దాని ధ్వని మాత్రం ఇత్తడి శబ్దం వస్తుంది. అలాంటి శిలతోనే స్త్రీ దేవతామూర్తులు తయారు చేయవచ్చని శాస్త్రాల్లో వివరించారు" అని వెంకటరెడ్డి తెలిపారు.

ఇక నపుంసక శిల దేవీ, దేవతల విగ్రహాలు తయారు చేయడానికి పనికిరాదు. అందుకే వీటిని దేవుళ్ల విగ్రహాల దిగువన ఆధార పీఠాలుగా లేద ఫ్లోరింగ్ కోసం ఉపయోగిస్తారు.

ఆగమ శాస్త్రంలో శిల్ప వివరణ

ఆగమశాస్త్ర సంప్రదాయాలలో కూడా విగ్రహాల తయారీకి ఉపయోగించే శిలలను వాటి స్వభావం, ధ్వని, గుణాల ఆధారంగా పుంశిల, స్త్రీ శిల, నపుంసక శిల అని వర్గీకరించారని టీటీడీ పండితుడు విభీషణ శర్మ చెప్పారు.

అవి ఎలా ఉంటాయో ఆయన బీబీసీకి వివరించారు.

''పుంశిల(పురుష శిల)ను విష్ణు, శివ, సుబ్రహ్మణ్యం, హనుమంతుడు వంటి పురుష దేవతల విగ్రహాలకు ఇవి అనుకూలమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి"

''స్త్రీ శిలను లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి వంటి దేవీ విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు. నపుంసక శిలను పీఠాలు, మండప స్తంభాలు, ప్రాకారాలు, ఉప నిర్మాణాలు వంటి వాటికి ఉపయోగిస్తారు'' అని విభీషణ శర్మ చెప్పారు.

"స్త్రీశిల", "పుంశిల", "నపుంసక శిల" అనే పదాలు శిల శాస్త్రోక్త లక్షణాలను సూచించే సాంకేతిక పదాలు మాత్రమే. వాటిని జీవుల లింగ భేదంలా కాకుండా, శిల స్వభావం, నాదం, శక్తి, వినియోగానికి సంబంధించిన వర్గీకరణగా అర్థం చేసుకోవాలని విభీషణ శర్మ అన్నారు.

శిలల సేకరణలో నిబంధనలు

శిల్పాల సేకరణకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న ఎస్వీ శిల్ప కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి వాటి గురించి వివరించారు.

''దేవాలయాల్లో ముఖ్యంగా గర్భాలయంలో ప్రతిష్టించే దేవతా ప్రతిమల కోసం శిలలను సేకరించేటప్పుడు ప్రాచీన శిల్ప శాస్త్రాల్లో కొన్ని నియమాలు నిబంధనలు సాంకేతిక అంశాలను వివరించి ఉన్నాయి. వాటి ప్రకారం కొండ ప్రాంతాలు, నదీతీరం, చెరువులు, సముద్ర తీర ప్రాంతాలు, దేవాలయ పరిసర ప్రాంతాల్లో అలాంటి శిలలను సేకరించవచ్చు. వాటి తత్వం మెత్తగా ఉండాలి" అని వెంకటరెడ్డి చెప్పారు.

"కొండ లోపల, భూమి లోపల ఉండే శిలను తీసినప్పుడు మెత్తగా ఉంటుంది. క్రమేపి అది గట్టిపడుతూ ఉంటుంది. ఆ శిలను శిల్పంగా చెక్కేటపుడు చాలా సులభంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

''శిల్ప కళాశాలలో శిల్పాలు కూడా తయారు చేసేటప్పుడు దాన్ని మంచినీటితో శుభ్రంగా కడిగి పొరలు, చారలు, మచ్చలు ఏవైనా ఉన్నాయా అని జాగ్రత్తగా పరిశీలిస్తారు. శిల్పం చెక్కే ముందే పరిశీలించినా ఒక్కొక్కసారి మధ్యలో శిలల్లో పొరలు బయటపడతాయి. 60, 50, 70 శాతం శిల తయారైనా, అలాంటి లోపాలు ఉన్న దానిని శిల్పంగా వాడరు. అలాంటి శిల్పాలను బయట ఎక్కడైనా గార్డెన్‌లలో, లేదా అలంకార శిల్పాలుగా, షోకేజుల్లో పెట్టుకుంటారు. వాటిని ప్రతిష్టించడం, పూజలు చేయడం చేయకూడదు'' అని ఆయన అన్నారు.

''ఈ శిలలను విసర్జించడం వెనుక మరో కారణం కూడా ఉంది. దేవాలయాల్లో ప్రతిరోజు విగ్రహాలకు అభిషేకం చేస్తుంటారు. కాబట్టి, అభిషేక జలం ఆ పగుళ్ల ద్వారా శిల లోపలికి చేరుకుంటుంది. అలా కొంతకాలం తర్వాత ఆ విగ్రహం పగిలిపోతుంది. అందుకే అలా చారలు, పొరలు, మచ్చలు ఉన్న శిలలను విసర్జించాలి అని చెబుతారు'' అని వెంకటరెడ్డి వివరించారు.

మూల విరాట్టు కోసం

ఆగమ శాస్త్రాలు, శిల్ప శాస్త్రాలు, వాస్తు శాస్త్రాలు దేవాలయాలలో మూలవిరాట్టు నిర్మాణం, ప్రతిష్ఠాపనకు సంబంధించిన స్పష్టమైన నియమాలను పేర్కొన్నాయని విభీషణ శర్మ చెప్పారు.

''మూలవిరాట్టు కోసం కృష్ణశిల అంటే నల్లరాయిని, విష్ణు ఆలయాలకైతే ప్రత్యేకంగా సాలగ్రామ శిలను, కొన్ని సంప్రదాయాలలో ప్రత్యేకంగా శ్వేత శిల అంటే తెల్లరాయిని ఉపయోగిస్తారు'' అని విభీషణ శర్మ చెప్పారు.

శిల్పరత్నం, మానసారం, మయమతం, కామికాగమం లాంటి గ్రంథాలు శిలను ఎంపిక చేసే విధానాన్ని వివరించాయని ఆయన తెలిపారు.

‘‘శిలను కొండ లేదా గనిలో నుంచి తీసే ముందు భూమి పూజ లాంటి కొన్ని పూజలు నిర్వహించాలి. ఆ తర్వాత అనుమతి కోరిన తర్వాత మాత్రమే శిలను చెక్కడం ప్రారంభించాలి" అని ఆయన వివరించారు.

ఒక విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటో కూడా విభీషణ శర్మ బీబీసీతో చెప్పారు.

''శాస్త్రం ప్రకారం విగ్రహం కేవలం ఒక రాయి మాత్రమే. మంత్ర, తంత్ర, హోమ, ఆగమ విధానాల ద్వారా దేవతా చైతన్యాన్ని ఆహ్వానించి ఆ విగ్రహంలో స్థాపించడాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ప్రతిష్ఠ అనంతరం ఆ విగ్రహం దైవస్వరూపంగా మారి పూజకు అర్హత సాధిస్తుంది" అని విభీషణ శర్మ వివరించారు.

ఎస్వీ శిల్ప కళాశాల

తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాల అలిపిరి దగ్గర ఉంది. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన పూర్వపు విధ్యార్థులు శిల్పాలు చెక్కుతున్నారు. నాగరాజు లాంటి వారు ఇక్కడే శిల్పాలు చెక్కడం నేర్చుకుని ఇప్పుడు దానినే వృత్తిగా స్వీకరించారు.

ఒక శిల్పం చెక్కే ముందు తాము ఏమేం పరిశీలిస్తామో ఆయన వివరించారు.

‘‘ముందుగా శిలను కడుగుతాం. మచ్చలు లేని రాయిని సెలెక్ట్ చేసుకుంటాము. అది పురుష శిల అయితే ఎంత ఎత్తు విగ్రహం వస్తుంది, స్త్రీ శిల అయితే ఎలా వస్తుంది, నపుంసక శిల అయితే ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చూస్తాం. దాని ప్రకారం మాకు ఏ విగ్రహం ఆర్డర్ వస్తుందో దాని ప్రకారం మేము తయారు చేస్తాం. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి విగ్రహం చెక్కాలంటే దాని ఫస్ట్ స్టేజి కోసం ఒక డ్రాయింగ్ ఉంటుంది. సెకండ్ స్టేజి ఒక డ్రాయింగ్ ఉంటుంది. థర్డ్ స్టేజి ఇంకొక డ్రాయింగ్ ఉంటుంది. ఆ తర్వాతే విగ్రహం తయారవుతుంది’’ అని నాగరాజు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)