ముగిసిన అమెరికా-ఇరాన్ తొలిదశ చర్చలు, ఏం చర్చించారు, ఏం ప్రకటించారు?

    • రచయిత, మైయా డేవిస్ , మల్లోరీ మోయెంక్
    • రచయిత, బీబీసీ వెరిఫై
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

అమెరికా,ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకడానికి తుది ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో జరిగిన తొలి విడత చర్చలు ముగిశాయి. ఈ చర్చలు 'ప్రోత్సాహకరమైన పురోగతితో' ముగిశాయని మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్, పాకిస్తాన్ తెలిపాయి.

గత వారం ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం తర్వాత, ఈ చర్చలు ఆదివారం స్విట్జర్లాండ్‌లో ప్రారంభమయ్యాయి.

60 రోజుల్లోగా తుది ఒప్పందానికి చేరుకోవడానికి వీలైన రోడ్‌మ్యాప్‌కు ఉన్నత స్థాయి కమిటీ అంగీకరించిందని సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఖతార్, పాకిస్తాన్ దేశాలు తెలిపాయి.

లెబనాన్‌లో ఘర్షణకు ముగింపు పలికేందుకు ఈ చర్చలు ‘గణనీయమైన పురోగతిని సాధించాయి’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయద్ అబ్బాస్ అరాగ్చీ చెప్పారు.

కిందటివారం ఇరుదేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందంలో 60 రోజుల్లోగా తుది ఒప్పందానికి చేరుకోవాలని, లెబనాన్ సహా అన్ని రంగాలలో ఘర్షణలకు ముగింపు పలకాలని, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే అంశాలు ఉన్నాయి.

అవాంఛనీయ ఘటనలు, అపార్థాలు చోటు చేసుకోకుండా, హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా ఒక ‘ప్రత్యక్ష సంప్రదింపుల వ్యవస్థ’ను ఏర్పాటుచేసినట్టు మధ్యవర్తి దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన తెలిపింది.

అమెరికా, ఇరాన్, లెబనాన్ మధ్య ‘ఘర్షణల నివారణ విభాగం’ ఏర్పాటుకు, లెబనాన్‌లో సైనిక కార్యకలాపాలకు ముగింపు పలికేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఆ ప్రకటన పేర్కొంది.

అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ బలగాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా పలువురు లెబనాన్ పౌరులు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ ఉద్రిక్తతలు అమెరికాను ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్యకొత్తగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించేలా చేశాయి.

అయితే ఘర్షణలు, వైమానిక దాడులు కొనసాగుతుండటంతో హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ శనివారం ప్రకటించింది. అయినప్పటికీ, నౌకల కదలికలకు సంబంధించిన గణాంకాలు ఆ మార్గంలో నౌకల రాకపోకలు కొనసాగుతుయని తెలిపాయి.

అంతకుముందు లూసెర్న్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమైన సమయంలో ట్రంప్ ఒక ప్రకటన చేశారు.

లెబనాన్‌లో సమస్యలు సృష్టిస్తున్న ఇరాన్ మద్దతుగల బలగాలు తక్షణమే తమ కార్యకలాపాలు నిలిపివేయాలని హెచ్చరించారు. లేదంటే ఇరాన్‌పై మళ్లీ భీకరదాడి చేస్తామని హెచ్చరించారు.

'వాళ్ల బెదిరింపులు నిజంగా పనిచేసి ఉంటే, ఈ రోజు ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉండేవారా? వాళ్లెంత మాట్లాడినా.. చర్య తీసుకునేది మేమే' అని ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్ అన్నారు.

ఆదివారం నాటికి ఘర్షణ కొంత తగ్గినట్లు సమాచారం వచ్చింది. కానీ 'ఉత్తర ఇజ్రాయెల్ భద్రత కోసం అవసరమైనంత కాలం ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోనే ఉంటుంది' అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.

హిజ్బొల్లా నాయకుడు నయీమ్ ఖాసిమ్ మాత్రం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం ఉండటాన్ని వ్యతిరేకించారు. హిజ్బొల్లా తనను తాను రక్షించుకుంటుందని చెప్పారు.

స్విట్జర్లాండ్‌లోని బుర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో చర్చలు ప్రారంభమయ్యే ముందు అమెరికా ప్రధాన చర్చల ప్రతినిధి, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, "కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనే" లక్ష్యంతో చర్చలు జరపాలని అధ్యక్షుడు ట్రంప్ సూచించినట్లు తెలిపారు.

ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతున్న శక్తిగా వ్యవహరించడం, దీర్ఘకాలిక అణ్వాయుధ లక్ష్యాలను ఇరాన్ నాయకత్వం విడిచిపెట్టేందుకు సిద్ధమైతే, ఆ దేశంతో తమ సంబంధాలను మౌలికంగా మార్చుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వాన్స్ పేర్కొన్నారు.

అయితే తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.

ఈ చర్చల్లో జేడీ వాన్స్‌తో పాటు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ పాల్గొన్నారు. ఇరాన్ తరఫున ఘాలిబాఫ్‌తో పాటు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఉన్నారు.

అలాగే పాకిస్తాన్ ప్రధాన మంత్రి, ఆ దేశ సైన్యాధిపతి, ఖతర్ ప్రధాన మంత్రి కూడా స్విట్జర్లాండ్‌కు చేరుకున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వస్తోంది. ఖతార్ కూడా మధ్యవర్తిగా ఉంది. అమెరికా-ఇరాన్ చర్చలు కొనసాగడాన్ని ఖతార్ ప్రధాని స్వాగతించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)