‘ఒకపక్క మహిళలను ఘోరంగా అణచివేస్తుంటే, నా దుస్తులపై చర్చ అవసరమా?’ అంటున్న అఫ్గానీ యాంకర్‌పై సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు?

    • రచయిత, బీబీసీ మానిటరింగ్
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

అఫ్గాన్‌ మాజీ జర్నలిస్టు, న్యూస్ ప్రెజెంటర్ గొలాలీ కరీమీ వస్త్రధారణ, లైఫ్‌స్టైల్‌పై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది.

కరీమీ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో మోడల్‌గా పని చేస్తున్నారు. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 2,80,000 మంది ఫాలోవర్లు, టిక్‌టాక్‌లో 230,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

కరీమీ గతంలో అఫ్గానిస్తాన్‌లోని షమ్‌షాద్ టీవి, లెమార్ టీవిలో పని చేశారు. ఆ తర్వాత పారిస్‌లోని బేగమ్ టీవిలో పని చేశారు.

జూన్ 2న డాయిష్ వెల్లే డరీ చానెల్ ఒక వీడియో రిపోర్ట్‌ను విడుదల చేసింది. అందులో కాందహార్ నుంచి పారిస్ వరకు కరీమీ పయనం ఎలా సాగిందన్న విషయం ఉంటుంది.

కరీమీ ధరించే దుస్తులు, ఆమె జీవనశైలి ఇస్లాం మతానికి, అఫ్గానిస్తాన్‌ సాంస్కృతిక సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో కొందరు అఫ్గానీలు విమర్శించినట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది.

అయితే తన నిర్ణయాలను సమర్థించుకుంటూ, ‘‘నాకు ఆకర్షణీయంగా సంతోషంగా అనిపించే దుస్తులనే వేసుకోవాలనుకుంటా’’ అని అన్నారు కరీమీ.

"నేనిప్పుడు సినిమాల్లో నటిస్తున్నా, మోడలింగ్ చేస్తున్నా, అందుకే ఇక్కడ దుస్తులు అఫ్గానిస్తాన్‌లో వేసుకున్న బట్టలకంటే చాలా భిన్నంగా ఉంటాయి. నేను వేసుకునే బట్టల వల్ల నేనేదో అసభ్యకరమైన సినిమాల్లో నటిస్తానని అనుకుంటారు. అలాంటి వ్యాఖ్యలు నన్ను చాలా ఇబ్బంది పెడతాయి" అని అన్నారు.

పారిస్‌లో కూడా కొందరు అఫ్గానీలు తనపై దాడికి ప్రయత్నించారని కరీమీ అన్నారు. భద్రతా కారణాల వల్ల ఆమె నాలుగుసార్లు ఇళ్లు కూడా మారాల్సి వచ్చిందని అన్నారు.

గతంలో తాను తాలిబాన్ అధికార ప్రతినిధి, జబీహుల్లా ముజాహిద్‌ను ఇంటర్వ్యూ చేసానని, అనంతరం ఆయన ఫోన్ చేసి ఒక ముస్లిం మహిళగా, పష్తూన్ మహిళగా నువ్వు నీ వేషధారణలో జాగ్రత్తగా ఉండాలని తనకు చెప్పేవారని, వాయిస్ మెసేజ్‌లు పెట్టేవారని ఆమె ఆ ఇంటర్వూలో అన్నారు.

బదులివ్వకుండా బ్లాక్ చేశానని, ఆయన సమయం వృథా చేయాలనుకోలేదని అన్నారు కరీమీ.

"ప్రజలకు కనీసం తమ బట్టలు, తమ తిండిని నిర్ణయించుకునే హక్కు కూడా లేదు. దానికి తోడు భయానక వాతావరణాన్ని సృష్టించారు. ప్రాథమిక హక్కులు మట్టిపాలవుతున్నా నోరు మెదపకపోవడమే అసలు సమస్య" అని తాలిబాన్‌ను విమర్శిస్తూ, జూన్ 7న అఫ్గాన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు కరీమీ.

అయితే కరీమీని సోషల్ మీడియాలో చాలామంది విమర్శించినప్పటికీ, కొంతమంది ఆమెకు మద్దతునిచ్చారు.

వతన్‌దోస్త్' అనే యూజర్ "ఇది స్వేచ్ఛ కాదు. ఇది అనైతికతను వ్యాప్తి చేయడం, సంప్రదాయ విలువలను దెబ్బతీయడం" అని వ్యాఖ్యానించారు.

"స్వేచ్ఛ పేరుతో కరీమి అఫ్గానిస్తాన్ జాతీయ, చారిత్రక సంప్రదాయ విలువలకు వెన్నుపోటు పొడిచారు’’ అని గోర్బోజ్ అనే సోషల్ మీడియా యూజర్ అన్నారు.

"కిజిల్‌బాష్ కమ్యూనిటీకి చెందిన కరీమీ, సిగ్గుకు నైతికతకున్న హద్దులన్నీ దాటేశార"ని ఆయన అన్నారు.

'అసలైన సమస్యలను పట్టించుకోండి'

మరోవైపు, తాలిబాన్‌లో చాలామంది పష్తూన్ కమ్యూనిటీకి చెందినవారేననీ, కరీమీ కూడా పష్తూన్ మహిళ కాబట్టి తాలిబాన్ ఆమెను ఒక ముప్పుగా చూస్తుందని వ్యాఖ్యాత హబీబ్ ఖాన్ అన్నారు.

కరీమీకి మద్దత్తిస్తూ, "పాశ్చాత్య దేశాల్లో బట్టలపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టరు. అఫ్గానిస్తాన్‌లో అత్యాచారాలు, నేరాలు, కిడ్నాపింగ్‌ల రిపోర్టులు ఉన్నాయి. అక్కడి ప్రజలు రోజూ అణచివేతకు గురవుతున్నారు. అసలు దృష్టి ఈ సమస్యలపై ఉండాలి" అని సోషల్ మీడియా యూజర్ మొహమూదీ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)