You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
MBA చదవడంకన్నా చేతివృత్తులు నేర్చుకోవడం బెటరా? ప్రధాన ఆర్థిక సలహాదారు వ్యాఖ్యలపై చర్చ ఏంటంటే..
- రచయిత, శుభ్ రాణా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగేశ్వరన్ మాట్లాడుతూ.. ''ప్రపంచీకరణ యుగం కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ వంటి డిగ్రీలకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఆ యుగం ముగిసిపోతోంది'' అన్నారు.
‘‘భవిష్యత్ అంతా ట్రేడ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌దే. ప్లంబర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, కార్పెంటర్ వంటి వృత్తులకు మానవ నైపుణ్యాలు అవసరం. వీటిని కృత్రిమ మేధ (ఏఐ) అంత సులభంగా భర్తీ చేయలేదు’’ అని చెప్పారు.
సాంకేతికతతో సులభంగా భర్తీ చేయలేని నైపుణ్యాలను యువత నేర్చుకోవాలని ఆయన అన్నారు. ట్రేడ్ స్కిల్స్ అంటే ప్లంబింగ్ లేదా ఎలక్ట్రికల్ వర్క్ వంటి ఒక నిర్దుష్ట పనిని లేదా వృత్తిని నిర్వహించడానికి అవసరమైన ప్రాక్టికల్, సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండటం.
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కాలేజీ, విశ్వవిద్యాలయాల చదువులు వంటి సంప్రదాయ ఉన్నత విద్యా మార్గాలు ఎంత వరకు సముచితమైనవి, ఉపయోగకరమైనవనే చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దీన్ని అర్థం చేసుకోవడానికి మేం కొంతమందితో మాట్లాడాం.
నాగేశ్వరన్ ఏం చెప్పారు?
భారత ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ. అనంత నాగేశ్వరన్ ఏఎన్ఐ వార్తా సంస్థ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు.
‘‘మన విద్యావిధానంలో ముందు బీఏ చేసి, ఆపైన ఏంఏ చేశాక, ఎంఫిల్ పీహెచ్డీ పూర్తిచేసి, అప్పుడు యూపీఎస్‌సీ గురించి ఆలోచించేలా ఉంది. ఈ విధానం ఉపాధికి ఎటువంటి పూచీ ఇవ్వదు. ఈ విషయంలో మీరో 22 ఏళ్ల కుర్రాడికి ఎలాంటి సలహా ఇస్తారు?’’ అని ఈ ఇంటర్వ్యూలో నాగేశ్వరన్‌ను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నాగేశ్వరన్ సమాధానమిస్తూ ‘‘స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, కొరియా లేదా చైనా వంటి విజయవంతంగా అబివృద్ధి చెందిన దేశాలనే తీసుకోండి. ఈ దేశాలు ట్రేడ్ స్కిల్స్‌కు ఎక్కువగా గౌరవమిస్తాయి. వాటితో పోలిస్తే మన దేశంలో ఈ వృత్తులకు గౌరవం తక్కువ. నేనేతై నా పిల్లలకు, స్నేహితుల పిల్లలకు ఈ నైపుణ్యాలే పెంచుకోమని చెబుతా '' అన్నారు.
''మీరు ఒకవేళ వెల్డర్‌గా, ప్లంబర్‌గా, ఎలక్ట్రిషియన్‌గా, కార్పెంటర్‌గా లేదా మరేదైన వృత్తిలో ఉన్నా.. భారత్‌లో అంత ప్రాముఖ్యం ఇవ్వరు. మనం దాన్ని డిప్లొమా అంటాం. కానీ, అది కూడా ఒక డిగ్రీ లాంటిదే. ఈ వృత్తులను మనం అంత ఎక్కువగా అంగీకరించడం లేదు. వాటికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. వాటిని ప్యాషన్‌గా పరిగణించడం లేదు. ఇది మారాలి'' అని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పారు.
''సాంకేతికత ఎంతగా అధునాతనమైనా, మీ ఉద్యోగాలను తీసుకోలేని రంగాలు ఇవేనని నేను నమ్ముతాను. అందుకే, ఈ ట్రేడ్ స్కిల్స్‌లో మీరు నైపుణ్యం సాధించాలి. అవును, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ డిగ్రీలకు ఈ ప్రపంచీకరణ కొంత ప్రాధాన్యతను ఇచ్చిన మాట నిజమే. కానీ, ఆ కాలం ముగిసిపోతోంది. ప్రస్తుత కాలం ట్రేడ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌దే. ఈ వృత్తులకు మానవ నైపుణ్యాలు కచ్చితంగా అవసరం. అందుకే వీటిని ఏఐ అంత తేలికగా భర్తీ చేయలేదు అన్నారు.
అదే ఇంటర్వ్యూలో.. చెఫ్‌గా తన ఉద్యోగంతో విసుగు చెందిన తన స్నేహితుడి కుమారుడి ఉదాహరణ చెప్పారు. . ''నువ్వు నిజానికి ఒక బంగారు గనిపై కూర్చుని ఉన్నావని నేను ఆయనతో చెబుతాను. ఎందుకంటే నీ ఉద్యోగాన్ని ఏఐ లాక్కోదు. మీ స్నేహితుల్లాంటి చాలా మందిని ఏఐ భర్తీ చేయగలదని చెప్పాను'' అని తెలిపారు.
''అందుకే, మీకు ట్రేడ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ ఉండాలని సిఫారసు చేస్తాను. ఎందుకంటే, వాటిని ఏఐ అంత తేలికగా భర్తీ చేయదు'' అన్నారు.
సోషల్ మీడియాలో విమర్శలు
నాగేశ్వరన్ ప్రకటనపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
గిరీష్ మిగ్లానీ అనే ఒక యూజర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇలా రాశారు. ''సీఈఏ అనంత నాగేశ్వరన్ ఒక భావనను క్షుణ్నంగా వివరించారు. కానీ, ఆయనొక ప్రాథమిక తప్పు చేశారు. గతాన్ని బట్టి భవిష్యత్‌ను చూడలేం''అన్నారు.
''భవిష్యత్‌లో కావాల్సిన నైపుణ్యాలపై భారత ప్రధాన ఆర్థిక సలహాదారు తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కానీ, నైపుణ్య విధానానికి మూలంగా ఉన్న ఆలోచననే ఆందోళన కలిగించే అంశంగా మారే ప్రమాదం ఉంది'' అని రాశారు.
తనను తాను గాంధేయవాద రాజకీయ విశ్లేషకుడిగా, వ్యూహకర్తగా అభివర్ణించుకునే దుష్యంత్ నగర్ అనే మరో యూజర్, ''అంతకుముందు యువతకు మోదీజీ డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, హైటెక్ ఉద్యోగాల కలలను చూపించేవారు. ఇంజనీరింగ్, ఏఐ, సాఫ్ట్‌వేర్, ఎంబీఏలే భవిష్యత్ అని చెప్పేవారు. కానీ, ఈరోజు ఏఐ పోటీలో భారత్ వెనుకబడి పోయిందని, తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన ఘోరంగా విఫలమైందని ప్రధాన ఆర్థిక సలహాదారే చెబుతున్నారు. ఇప్పుడు యువత కుకింగ్, ప్లంబింగ్, వెల్డింగ్, ఎలక్ట్రిషియన్ వంటి ట్రేడ్ స్కిల్స్ వైపుకు మరలాలి అని చెబుతున్నారు'' అని సోషల్ మీడియాలో రాశారు.
''సాఫ్ట్‌వేర్, ఎంబీఏల శకం ముగిసింది! ఇది సలహా కాదు, పదేళ్ల విధాన వైఫల్యాన్ని ఒప్పుకోవడమే...'' అని విమర్శించారు.
'ఎంబీఏ డిగ్రీ ఇక ఉద్యోగానికి హామీ ఇవ్వదా?'
ఐఐటీ దిల్లీలో మేనేజ్‌మెంట్ చదువుకున్న అభిషేక్ ప్రద్యోత్ ఎంబీఏపై ఆశాభావంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
''ప్రధాన ఆర్థిక సలహాదారు నుంచి ఈ మాటలు విన్నప్పుడు.. సంప్రదాయ ఎంబీఏ మార్కెట్ ఇక పెరగడానికి అవకాశం లేనంత స్థాయికి చేరుకుంటోంది. కానీ, అంతరించడం లేదన్నది నా స్పందన. కంపెనీలు ఇంకా ఎంబీఏ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. అయితే, ఐటీ వంటి కొన్ని రంగాల్లోని ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగిన మాట వాస్తవమే'' అని చెప్పారు.
కెరీర్ కోసం తాను మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసినట్లు అభిషేక్ తెలిపారు.
''ఏఐ డేటా విశ్లేషణను, వాటిపై లోతైన అవగాహనను అందించగలదు. కానీ, ఏదైనా కీలకమైన మేనేజ్‌మెంట్ నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం మనుషులు కావాల్సిందే. ఇదే ఎంబీఏ గ్రాడ్యుయేట్ల పాత్రను ముఖ్యమైనదిగా చేస్తుంది'' అని చెప్పారు.
అయితే, ''ఒకప్పుడు ఎంబీఏ డిగ్రీని మెరుగైన ఉద్యోగానికి, అత్యధిక వేతనానికి హామీగా చూసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి మారుతోంది'' అని ఆర్థిక నిపుణురాలు మిథాలీ నికోరే అన్నారు.
"1990లు, 2000లలో జరిగిన ప్రపంచీకరణ, కార్పొరేట్ రంగ విస్తరణ మేనేజ్‌మెంట్ నిపుణులకు అపారమైన ప్రయోజనాలను తెచ్చిపెట్టాయి. కానీ, రాబోయే సంవత్సరాల్లో కేవలం డిగ్రీ ఆధారంగా కెరీర్‌ను నిర్మించుకోవడం కష్టతరం కావచ్చు" అన్నారు.
'కేవలం డిగ్రీ కాదు, సృజనాత్మక ఆలోచన అవసరం'
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన కేవలం భారత్‌కే పరిమితం కాలేదు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 2024 నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితమవుతాయని అంచనా. అయితే, ఈ ప్రభావం వివిధ రంగాలు, నైపుణ్యాల స్థాయిలలో మారుతూ ఉంటుందని తెలిపింది.
''ఏఐ వాడకం పెరగడం వల్ల అడ్మినిస్ట్రేటివ్, క్లరికల్ వంటి అనేక ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చు. ఇటువంటి పరిస్థితిలో.. సృజనాత్మక ఆలోచన, సమస్యను పరిష్కరించే సామర్థ్యం, సాంకేతికతతో పనిచేసే సామర్థ్యం మరింత ముఖ్యం'' అని మిథాలీ నికోరే అన్నారు.
భారత విద్యా వ్యవస్థ చాలా కాలంగా బట్టీపట్టే పద్ధతికి ప్రాధాన్యతనిచ్చిందని, ఇప్పుడు విద్యార్థులలో స్వతంత్ర ఆలోచన విధానాన్ని, ప్రాక్టికల్ స్కిల్స్‌ను పెంపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
ఏఐ అన్నీ చేయలేదు
మణికాంత్ రాయ్ నోయిడాలోని జైపురియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ అనలిటిక్స్, ఏఐ, డేటా సైన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
''ఏఐ జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసింది. ఎంబీఏలో కూడా దీన్ని చాలా వేగంగా చేర్చుకుంటున్నారు. అయితే, ఏఐ రాకతో ఎంబీఏల ఉపయోగం ముగిసిపోతుందని అనడం ఎంతమాత్రం సరికాదు'' అని రాయ్ అన్నారు.
భవిష్యత్‌లో మేనేజర్లకు సమస్యలను పరిష్కరించే, విమర్శనాత్మకంగా ఆలోచించే, సాంకేతికతతో కలిసి పనిచేసే సామర్థ్యం చాలా కీలకమని చెప్పారు.
''ఎంబీఏ విద్యావిధానం కేవలం ఆటోమేషన్ ఆధారితం కాదు. అది వ్యాపార ప్రణాళిక, ఫైనాన్స్, మార్కెటింగ్, డేటా అనాలసిస్ వంటి రంగాలలో మానవ విచక్షణ, నిర్ణయాధికారంతో ఎలా పనిచేయాలో విద్యార్థులకు నేర్పిస్తుంది'' అని తెలిపారు.
''ఏఐ కొన్ని రంగాలలో ముఖ్యంగా డేటా అనాలసిస్ వంటి పనుల్లో సామర్థ్యాన్ని పెంచుతుంది. కానీ, తుది నిర్ణయం తీసుకోవడంలో మాత్రం ప్రజలు కల్పించుకోవడం కచ్చితంగా అవసరం''
''ఏఐ పని వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంచుతుంది. ఏఐతో చాలా వేగంగా, సమర్థవంతంగా పనిచేయగల వృత్తి నిపుణులకే ఇప్పుడు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి'' అని రాయ్ చెప్పారు.
‘చేతి వృత్తులకు సమాజంలో తక్కువ గౌరవం’
ప్రపంచంలోని జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి అనేక దేశాలలో వెల్డింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, కార్పెంటరీ వంటి వృత్తి నైపుణ్యాలకు సమాజంలో మంచి గౌరవం ఉండగా, భారత్‌లో వాటిని తక్కువగా చూస్తారని సీఈఏ వి. అనంత నాగేశ్వరన్ కూడా పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
ఈ నైపుణ్యాలున్న వారిని 'డిప్లొమా'లుగా పిలుస్తారని, కానీ, వాస్తవానికి అవి కూడా అంతే ముఖ్యమైన వృత్తిపరమైన నైపుణ్యాలని నాగేశ్వరన్ అభిప్రాయం. ట్రేడ్ స్కిల్స్ గురించి సమాజ దృక్పథాన్ని మిథాలీ నికోరే కూడా ప్రశ్నిస్తున్నారు.
ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, లేదా ఇతర సాంకేతిక వృత్తుల వారికి సమాజంలో తగినంత గౌరవం దక్కకపోవడానికి ఒక కారణం కుల, వర్గ సంబంధిత భావనలు కూడా అని మిథాలీ నికోరే అన్నారు.
ట్రేడ్ స్కిల్స్, సృజనాత్మక కార్యకలాపాలు, ఏఐ నైపుణ్యాలను పాఠశాల స్థాయి నుంచే విద్యలో చేర్చాలని నికోరే అన్నారు. అప్పుడు విద్యార్థులు మారుతున్న లేబర్ మార్కెట్‌కు మరింత మెరుగ్గా సిద్ధమవుతారని చెప్పారు.
''భవిష్యత్తులో సాధారణ నైపుణ్యాలు ఉన్నవారి కంటే ఒక నిర్దిష్ట రంగంలో లోతైన నైపుణ్యం ఉన్నవారికి ఎక్కువ డిమాండ్ ఉండవచ్చు. అందువల్ల, యువత కూడా అధునాతన సాంకేతిక విషయాలు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది" అంటారు మిథాలీ నికోరే.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)