సెన్యార్ తుపాను: అరుదైన ఒరంగుటాన్ల జనాభాలో 7 శాతం చనిపోయాయా?

    • రచయిత, గెవిన్ బట్లర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో నాలుగు రోజుల పాటు కురిసిన తీవ్ర వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు ప్రపంచంలోనే అత్యంత అంతరించిపోయే దశలో ఉన్నగ్రేట్ ఏప్స్‌ను మరింత ప్రమాదంలోకి నెట్టాయని ఓ అధ్యయనం తెలిపింది.

నిరుడు నవంబర్‌లో సంభవించిన తీవ్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల అంతరించిపోతున్న జాతిగా గుర్తింపు పొందిన టపనులి ఒరంగుటాన్లలో 58 వరకు చనిపోయాయని, ప్రస్తుతం ఈ జాతికి చెందినవి 800 కంటే తక్కువ మాత్రమే ఉండగా, చనిపోయిన వాటి సంఖ్య మొత్తం జాతిలో దాదాపు 7 శాతానికి సమానమని పరిశోధన తెలిపింది.

అయితే ఇవి జాగ్రత్తగా వేసిన కనీస అంచనాలు మాత్రమే. భారీ వర్షాల వల్ల చెట్ల కొమ్మలకు జరిగిన నష్టం, ఆహార లభ్యత తగ్గడం వంటి అంశాలను ఈ లెక్కల్లో పరిగణనలోకి తీసుకోలేదని బుధవారం ప్రచురితమైన ఈ అధ్యయన రచయితలు తెలిపారు.

నవంబర్ చివరలో వచ్చిన "సెన్యార్" తుపాను సుమత్రాను అతలాకుతలం చేసింది. 2025లో ఆగ్నేయ ఆసియాలో జరిగిన అత్యంత ప్రాణాంతక ప్రకృతి విపత్తుగా గుర్తింపు పొందిన ఈ విపత్తులో వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పాయారు.

ఇలాంటి తీవ్రమైన వర్షాలు గ్రేట్ ఏప్స్‌ను నేరుగా ప్రమాదంలో పడేస్తాయని ఈ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

సెన్యార్ తుపాను వల్ల ద్వీపంలోని వన్యప్రాణులకు ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేయడం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు.

తుపాను అనంతరం టపనులి ఒరంగుటాన్లు కనిపించే సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వన్యప్రాణి నిపుణులు, పరిరక్షణ కార్యకర్తలు గమనించారు.

దీంతో ఈ వానరాలు వరదలకు కొట్టుకుపోవడం, కొండచరియల కింద పడిపోయి ఉండవచ్చనే అనుమానాలు మొదలయ్యాయి.

బ్రూనైలోని బోర్నియో ఫ్యూచర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఈ అధ్యయనం సహ రచయిత అయిన ప్రొఫెసర్ ఎరిక్ మెయిజార్డ్, డిసెంబరులో బీబీసీతో మాట్లాడుతూ, సెన్యార్ తుఫాను కారణంగా దాదాపు 35 ఒరంగుటాన్లు చనిపోయి ఉండవచ్చని చెప్పారు. అలాంటి నష్టం ఈ జాతి జనాభాకు తీవ్రమైన దెబ్బగా మారుతుందని ఆయన అప్పుడే హెచ్చరించారు.

అయితే తాజా అంచనా ప్రకారం 58 ఒరంగుటాన్‌లు చనిపోయినట్లు చెప్పారు. ఇది ఆయన గత అంచనాతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ.

తుపాను సంభవించిన కొన్ని వారాల తరువాత మధ్యటపనులి జిల్లాలోని పులో పక్కట్ గ్రామంలో మట్టి, దుంగల మధ్య పాక్షికంగా కూరుకుపోయిన ఒక ఒరంగుటాన్ కళేబరం మానవతా సహాయ సిబ్బందికి కనిపించింది.

ఆ ప్రాంతంలో సహాయక బృందంతో పనిచేసిన డెక్కీ చంద్ర మాట్లాడుతూ, "గత కొన్ని రోజుల్లో అనేక మంది మనుషుల మృతదేహాలను చూశాను. కానీ అడవి జంతువు మృతదేహాన్ని చూడటం ఇదే మొదటిసారి. ఇక్కడికి అవి పండ్లు తినడానికి వచ్చేవి. ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రదేశం వాటి సమాధిగా మారినట్టుగా అనిపిస్తోంది" అని చెప్పారు.

ఆ ఒరాంగుటాన్ మృతదేహం ఫోటోలను చంద్ర చూపించారని పరిశోధకులు ఎరిక్ మేజార్డ్ చెప్పారు.

"నన్ను అత్యంత కలచివేసిన విషయం ఏమిటంటే, దాని ముఖం మీద కండ చీలిపోయి ఉండటం" అని ఆయన చెప్పారు.

"కొన్ని హెక్టార్లలోని అటవీ ప్రాంతంపై భారీ కొండచరియలతో కూలిపోతే, బలమైన ఒరంగుటాన్లు కూడా నిస్సహాయంగా నుజ్జునుజ్జవుతాయి" అని ఆయన వివరించారు.

సెన్యార్ తుపాను ఒక అసాధారణ ఘటన అని, కానీ మానవ చర్యల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులే ఇందులో కీలక పాత్ర పోషించాయని పరిశోధకులు పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉందని కూడా వారు పేర్కొన్నారు. ఇది టపానులి ఒరంగుటాన్‌లతోపాటు, వాటి ఆవాసాలకు కూడా ముప్పుగా మారుతుందని వారు హెచ్చరించారు.

శాస్త్రీయంగా ఓ ప్రత్యేక జాతిగా 2017లో గుర్తింపు పొందిన ఈ ఒరంగుటాన్ల జనాభా ఏటా 1శాతానికి మించి తగ్గుతూ పోతే, ఈ జాతి పూర్తిగా అంతరించిపోతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

సుమత్రాలోని రక్షిత అటవీ ప్రాంతమైన బటాంగ్ టోరు ప్రాంతంలో గనుల తవ్వకాలు, ఆయిల్ పామ్ సాగు, జలవిద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ వంటి ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను ఇండోనేషియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఈ వానరాలు ఎదుర్కొంటున్న పర్యావరణ ముప్పులను మరింత లోతుగా అధ్యయనం చేసే అరుదైన అవకాశం పరిశోధకులకు లభించింది.

సెన్యార్ తుపాను సృష్టించిన విధ్వంసం ఈ జాతి ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉందో స్పష్టంగా చూపిస్తోందని బుధవారం వెలువడిన నివేదిక రచయితలు పేర్కొన్నారు.

"టపనులి ఒరంగుటాన్ ఎదుర్కొంటున్న సంక్షోభం వాతావరణ అస్థిరత, జీవవైవిధ్య నష్టం, పెరుగుతున్న బలహీనతలు ఒకేచోట కలిసిన పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఈ ముప్పు తీవ్రతకు తగిన స్థాయిలో సమన్వయంతో కూడిన చర్యలు అవసరం" అని వారు తమ నివేదికలో పేర్కొన్నారు.

మిగిలిన ఒరంగుటాన్లను రక్షించాలంటే, దీర్ఘకాలిక అంతర్జాతీయ సహకారం అవసరమని వారు తెలిపారు.

"దేశీయ స్థాయిలో బలమైన పరిరక్షణ చర్యలు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకున్న ప్రణాళికలు, అలాగే ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక, సాంకేతిక సహాయం లభిస్తే, ఆధునిక కాలంలో తొలిసారిగా ఒక మానవాకార వానర జాతి అంతరించిపోవడాన్ని నివారించగలం" అని వారు పేర్కొన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)