India vs Australia: విమెన్స్ T20 వరల్డ్ కప్ నుంచి భారత్ అవుట్.. ఆసీస్ చేతిలో 6 వికెట్లతో ఓటమి

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లతో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగింది.

భారత్ విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో.. సెమీస్ చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది భారత్.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధసెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది.

ఓపెనర్లు స్మృతి మంధాన, షెషాలీ వర్మ నిలకడగా ఆడటంతో భారత్ పవర్ ప్లే (6 ఓవర్లు)లో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.

భారత్ 66 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ బౌలింగ్‌లో షెఫాలీ వర్మ ఔటైంది. షెఫాలీ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసింది.

స్మృతి రనౌట్

వన్‌డౌన్‌లో జెమీమా క్రీజులోకి వచ్చింది.

కానీ, కాసేపటికే స్మృతి మంధాన రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

హామిల్టన్ వేసిన బంతిని జెమీమా బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా రివర్స్ స్వీప్ ఆడి, బంతి ఎటు వెళ్తుందోనని క్రీజులోనే నిలబడి చూస్తూ ఉండిపోయింది. కానీ, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న స్మృతి మంధాన రన్ వస్తుందనే అంచనాతో అప్పటికే సగం పిచ్ దాటి ముందుకు వచ్చేసింది.

జెమీమా వెనక్కి తిరిగి చూసి అసలు విషయం గ్రహించే లోపే.. ఆస్ట్రేలియా ఫీల్డర్ జార్జియా వేర్‌హామ్ బంతిని అందుకుని బెయిల్స్‌ను పడగొట్టడంతో స్మృతి రనౌట్ కావాల్సి వచ్చింది.

'నిజానికి అక్కడ అస్సలు రన్ తీసే అవకాశమే లేదు, కానీ ఇద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్ లోపం వల్ల భారత్ కీలక వికెట్ కోల్పోయింది' అని క్రిక్ ఇన్ఫో పేర్కొంది.

మంధాన అవుట్ అయి వెళ్తూ, నిరాశలో ఉన్న జెమీమా భుజం తట్టింది.

ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 37 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసింది. దీంతో భారత్ 83 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ దూకుడు.. హ్యాట్రిక్ సిక్స్‌లు

స్మృతి అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తనదైన శైలిలో ధాటిగా ఆడింది.

27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకుంది.

తాను క్రీజులోకి వచ్చాక ఒక్క 18వ ఓవర్‌లో తప్ప దాదాపుగా ప్రతీ ఓవర్‌లోనూ కనీసం ఒక బౌండరీ బాదిన హర్మన్ ప్రీత్ కౌర్ చివరి ఓవర్‌లో చెలరేగింది.

సోఫీ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది జట్టు స్కోరును పెంచింది.

19వ ఓవర్‌ పూర్తయ్యాక జెమీమా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ ఒక ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించింది.

జెమీమా 28 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 34 పరుగులు చేసింది. హర్మన్, జెమీమా జోడి స్కోర్ బోర్డుకు 45 బంతుల్లో 64 పరుగులు జోడించింది.

విజయాన్ని దూరం చేసిన పెర్రీ, గార్డ్‌నర్

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి ఓవర్‌లోనే జార్జియా వోల్ (4) వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్‌లో వోల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది.

తర్వాత బేత్ మూనీ, ఫోబీ లిచ్‌ఫీల్డ్ జాగ్రత్తగా ఆడటంతో పవర్‌ప్లేలో ఆసీస్ 49 పరుగులు చేసింది.

ఏడో ఓవర్‌లో శ్రీచరణి బౌలింగ్‌లో స్మృతి మంధాన క్యాచ్‌కు ఫోబీ లిచ్‌ఫీల్డ్ (24) అవుటైంది.

దీప్తి శర్మ బౌలింగ్‌లో రాధా యాదవ్ పట్టిన క్యాచ్‌కు బేత్ మూనీ (22) కూడా అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 10 ఓవర్లలో 3 వికెట్లకు 72 పరుగులు చేసింది.

తర్వాత ఎలిస్ పెర్రీ, యాష్లే గార్డ్‌నర్ ఒత్తిడి లేకుండా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 59 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు విజయాన్ని దూరం చేశారు.

ఎలిస్ పెర్రీ 38 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసింది.

యాష్లే గార్డ్‌నర్ 29 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో అజేయంగా 53 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)