You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పాపా ఎక్కడున్నావు’? డ్రోన్లు, పోలీసులు జల్లెడ పడుతున్నా తెలియని జాడ
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
కాకినాడ జిల్లా దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో తండ్రి కోసం వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతోంది.
రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ తెలియడంలేదు. ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్లు ఎగురవేసే హనుమాన్ బృందాలు, పోలీసులు, స్థానికులు కలిసి 40 ఎకరాల పామాయిల్ తోట, 500 ఎకరాల కొండ ప్రాంతంలో గాలిస్తున్నారు.
వాతావరణం అనుకూలించకపోయినా సెర్చ్ అపరేషన్ కొనసాగుతోంది.
చిన్నారి కనిపించకుండా పోయిన సమాచారం అందినప్పటి నుంచి పోలీసులు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
పామాయిల్ తోటలు, పొదలు, కాలువలు, చెరువులు, బావులు, ఖాళీ ఇళ్లు...ఇలా చిన్నారి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్న ప్రతి ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు.
సాధారణ మిస్సింగ్ కేసుల కంటే భిన్నంగా ఈ కేసులో పోలీసులు భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నా చిన్నారి జాడ ఎందుకు కనిపించడం లేదు? ఇప్పటి వరకు గాలింపు ఎలా జరిగింది? పోలీసుల ముందున్న తదుపరి మార్గాలేంటి?
అసలేం జరిగింది?
రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జూన్6న అదృశ్యమైంది. కాకినాడ జిల్లా దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో జ్ఞానేశ్వరి తండ్రి సుంకరగణేష్ కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం అక్కడే నివసిస్తోంది.
గణేష్, ఆయన భార్య భవాని, పిల్లలు జ్ఞానేశ్వరి, మరో 6 నెలల బిడ్డతో ఆ 40 ఎకరాల తోటలో నివాసముంటున్నారు. వీరితో పాటు గణేష్ తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. తోట మధ్యలో సుమారు 80 గజాల్లో నిర్మించిన రెండంతస్థుల కాంక్రీట్ బిల్డింగ్‌లో వీరంతా నివాసం ఉంటున్నారు.
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన (జూన్ 6) రోజు ఏం జరిగిందో ఆ పాప తల్లిదండ్రులు భవానీ, గణేష్ బీబీసీకి వివరించారు.
"శనివారం ఉదయం పాప మాతోనే ఉంది. వాళ్ల నాన్న తోటలో ఏదో పనుందని వెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత, పాప కూడా ఆయనతో మామిడి చెట్టు దాటి కొంత దూరం వెళ్లింది. దీంతో ఆయన పాపను వెనక్కి తీసుకువచ్చారు. నేను చిన్నపాపకి(మరో కుమార్తె) స్నానం చేయిస్తుంటే, తోటలో పని ఉంది వెళ్తున్నా పాపని చూసుకోమంటూ జ్ఞానేశ్వరిని గోడ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. నేను జ్ఞానేశ్వరిని పట్టుకున్నాను. దాంతో నాన్న వెళ్లిపోతున్నారని ఏడ్చింది. అదే సమయంలో ఇంట్లోని చిన్నమ్మాయి పెద్దగా ఏడుస్తోంది. ఆ ఏడుపు విని, చిన్నపాపకి పాలు పట్టించడానికి లోపలికి వెళ్లాను. ఎందుకంటే పెద్దమ్మాయి సాధారణంగా ఇక్కడిక్కడే ఆడుకుంటుంది లేదా వాళ్ల నాన్నతో ఉంటుంది" అని జ్ఞానేశ్వరి తల్లి సుంకర భవాని బీబీసీకి చెప్పారు.
కానీ, ఆ రోజు తోటకి వెళ్తున్న తండ్రిని వెంబడిస్తూ తోట మధ్యలోని కాలిబాటలోకి పాప వెళ్లి అదృశ్యమైపోయిందని తల్లిదండ్రులు బీబీసీకి చెప్పారు.
జూన్ 6 నుంచి గాలించినా...
''ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం దాదాపు 11గంటల50 నిమిషాలు. ఆ సమయంలో ఇంటి బయట ముందుకు వెళ్లడం కనిపించింది. తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాం. జిల్లాలోని అన్ని విభాగాల పోలీసులను గాలింపు చర్యల్లో భాగం చేశాం. కొండ దగ్గర నుంచి అణువణువూ గాలించడం మొదలుపెట్టాం. హనుమాన్ టీమ్స్‌గా పిలిచే వన్యప్రాణ సంరక్షణ నిపుణులను కూడా ఇందులో భాగం చేశాం. ఈ అడవిలో దిగువబాట ఒకటే ఉందని ఎస్పీ చెబుతున్నారు'' అని గాలింపు వివరాలను హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు.
‘ఒక్క క్లూ కూడా దొరకడం లేదు’
చిన్నారి కోసం విస్తృతస్థాయిలో గాలింపు నిర్వహిస్తున్నామని హోం మంత్రి తెలిపారు.
''చాలా మంది ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇంటింటికి వెళ్లి సెర్చ్ చేయడం వల్ల గ్రామస్తులు చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్లు సెర్చ్ చేశారు. కొంత మంది మమ్మల్ని, డిపార్ట్ మెంట్‌ని తిట్టుకున్నారు. అయినా కూడా చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ జల్లెడ పడుతున్నాం'' అని ఆమె తెలిపారు.
క్రూరమృగాలు ఏమైనా తీసుకెళ్లాయా, పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
సాధారణంగా మిస్సింగ్ కేసుల్లో కొన్ని గంటల్లోనే ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కానీ ఈ కేసులో రోజులు గడుస్తున్నా అలాంటి ఆధారం దొరకకపోవడం దర్యాప్తు అధికారులకు కూడా సవాల్‌గా మారింది. తుని పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి సెర్చ్ అపరేషన్ ఎప్పుడూ జరగలేదని...అసలు పిల్లల కిడ్నాప్ వంటి సంఘటనలు కూడా నమోదైనట్టు తమకు తెలియదని స్థానికులు చెబుతున్నారు.
‘బొమ్మలు పెట్టడానికి కారణమదే’
పామాయిల్ తోటలో తప్పిపోవడం,పరిసరాలన్నీ అటవీ ప్రాంతం కావడంతో జంతువులు ఏమైనా పాపను లాక్కుపోయాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ప్రాంతంలో జంతు సంచారం ఉందో లేదో తెలుసుకోవడానికి పోలీసులు కొన్ని బొమ్మలు ఏర్పాటు చేశారు. తోటలో కంచెలకు వాటిని తగిలించారు.
అయితే తోటలో ఫెన్సింగ్‌కు వేలాడుతూ కనిపించిన బొమ్మలపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వచ్చాయి.
జంతువులు ఏమైనా వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోడానికే బొమ్మలు అమర్చామని పోలీసులు తమకు తెలిపారని జ్ఞానేశ్వరి తల్లి సుంకర భవాని చెప్పారు
ఇప్పటికే పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సందేహాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై దృష్టి పెట్టారు.
మొబైల్ డేటా, కాల్ రికార్డులు, స్థానిక సమాచారాన్ని కూడా విశ్లేషిస్తున్నారు.
''ఇక్కడ స్థానికులు మాత్రమే ఉంటారు. ఒక 10 కిలోమీటర్లు పరిధి నుంచి మాత్రమే ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. ఇటువైపు ఊరి నుంచి పది మంది, అటువైపు నుంచి పది మంది వస్తుంటారు. బయట ఊరి వాళ్లు ఎవరు రారు'' అని చిన్నారావు అనే స్థానికుడు చెప్పారు.
కుక్క మృతిపై వీడని మిస్టరీ
పాప వెంట వెళ్లి తిరిగి వచ్చిన పెంపుడు కుక్క మృతి చెందడం కూడా ఈ కేసులో మరో మిస్టరీగా మారింది.
'' కుక్క అకస్మాత్తుగా చనిపోవడంతో పాప వస్తుందా రాదా, ఎక్కడుంది, ఎలా ఉంది అన్న భయం పెరిగింది'' అని జ్ఞానేశ్వరి తల్లి ఆవేదన వ్యక్తంచేశారు.
‘‘ఎవరి మీద చిన్న అనుమానం కూడా రావడం లేదు’’అని ఆమె అన్నారు. చుట్టుపక్కల వారు ఎవరూ తనకు తెలియదని ఆ రోజు ఏం జరిగిందో ఊహకు కూడా అందడం లేదని చెప్పారు.
''ఆరు నెలలుగా వాళ్లు పెంచుకుంటున్న పెంపుడు కుక్క వెనక్కి తిరిగివచ్చిన తరువాత విచిత్రంగా ప్రవర్తించింది. తరువాత చనిపోయింది. కుక్క మృతికి కారణాన్ని తెలుసుకోవడానికి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫోరెన్సిక్‌కు కూడా పంపించాం. ఏదైనా పాము కరిచిందా అని అడిగితే డాక్టర్లు అటువంటిదేమీ లేదని ప్రిలిమనరీ రిపోర్టు తర్వాత చెప్పారు'' అని హోం మంత్రి అనిత అని అన్నారు.
సాంకేతిక ఆధారాల విశ్లేషణ
అయితే ఇన్ని ప్రయత్నాలు జరిగినా...జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకకపోవడం కేసును మరింత మిస్టరీగా మారుస్తోంది.
రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో జ్ఞానేశ్వరి క్షేమంపై అందోళన పెరుగుతోంది.
వందలాది మంది సిబ్బంది, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు... ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు., సాంకేతిక దర్యాప్తు...ఇలా అందుబాటులో ఉన్న దాదాపు అన్ని మార్గాలను పోలీసులు ఇప్పటికే వినియోగించారు. అయినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు.
ఇప్పుడు సెర్చ్ పరిధిని మరింత విస్తరించడంతో పాటు సాంకేతిక ఆధారాలపై మరింత లోతైన విశ్లేషణే పోలీసుల ముందున్న ప్రధాన మార్గమని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.