ఒకే ఫోటోలో 6 కోట్ల నక్షత్రాలు.. కొత్త గ్రహాల అన్వేషణలో అరుదైన మైలురాయి

    • రచయిత, సోఫీ అబ్దుల్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

మన పాలపుంత (గెలాక్సీ) కేంద్రానికి సంబంధించిన ఒక ఫోటోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) విడుదల చేసింది. సాధారణ కాంతిలో మన గెలాక్సీ కేంద్రాన్ని ఇంత పెద్దగా, స్పష్టంగా చూపించడం ఇదే మొదటిసారి.

యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఈ ఫోటోలో 6 కోట్లకు పైగా నక్షత్రాలతో పాటు నెబ్యులాలు, నక్షత్రాల సమూహాలు రికార్డయ్యాయి.

వాస్తవానికి, ఈ ఫోటో వారి ముందస్తు ప్రణాళికల్లో లేదు. కంటికి కనిపించని చీకటి విశ్వంపై పరిశోధనలు చేయడానికి సిద్ధం చేసిన యూక్లిడ్ టెలిస్కోప్‌ను.. పరిశోధకుల అభ్యర్థన మేరకు ఒక్క రోజు మన గెలాక్సీ కేంద్ర ప్రాంతం(గెలాక్టిక్ బల్జ్) వైపు మళ్లించారు.

"సాధారణంగా విశ్వం లోతుల్లోని ఖగోళ ప్రాంతాలను యూక్లిడ్ పరిశీలిస్తుంది. కానీ, ఈసారి మేం దానికి పూర్తిగా భిన్నంగా చేశాం. మన గెలాక్సీ కేంద్రంలో నక్షత్రాలు దట్టంగా ఉండే ప్రాంతం వైపు టెలిస్కోప్‌ను మళ్లించాం" అని యూక్లిడ్ ఆపరేషన్స్ సర్వే సైంటిస్ట్ జేవియర్ డుపాక్ బీబీసీతో చెప్పారు.

యూక్లిడ్ టెలిస్కోప్ అసాధారణ సామర్థ్యం, సెన్సిటివిటీ వల్ల నక్షత్రాలతో నిండిన ఆ ప్రాంతంలోని అత్యంత మసకబారిన నక్షత్రాలను కూడా విడివిడిగా, స్పష్టంగా రికార్డ్ చేయడం సాధ్యమైంది.

పౌర్ణమి నాటి చంద్రుడి కంటే పెద్దవైన తొమ్మిది ప్రాంతాలను కలిపి ఒక భారీ మొజాయిక్ (కూర్పు) ఫోటోగా దీనిని రూపొందించారు. ఇది శాస్త్రవేత్తలకు పెద్ద మొత్తంలో డేటాను అందించింది.

"ఈ కోట్ల నక్షత్రాల మధ్య కొన్ని ఎక్సోప్లానెట్లను కనుగొనే అవకాశం ఉంది" అని డుపాక్ చెప్పారు.

మన సౌర కుటుంబం వెలుపల ఉండే గ్రహాలను 'ఎక్సోప్లానెట్స్' అంటారు. నాసా ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 6,000కు పైగా ఎక్సోప్లానెట్లను కనుగొన్నారు.

శాస్త్రవేత్తలు ఈ కొత్త ఫోటో సాయంతో ఆ గ్రహాల ద్రవ్యరాశిని లెక్కించవచ్చు. అక్కడ జీవం ఉండే అవకాశం ఉందా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి కూడా ఇది కీలక ఆధారాలను అందిస్తుంది.

అంతేకాకుండా, 'మైక్రోలెన్సింగ్' అనే సాంకేతిక విధానం ద్వారా కొత్త గ్రహాలను కనిపెట్టడానికి కూడా ఈ ఫోటో ఖగోళ శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది.

భూతద్దం లాంటిది

అత్యంత సరళమైన మాటల్లో చెప్పాలంటే.. ఒక నక్షత్రం మరో నక్షత్రానికి సరిగ్గా ఎదురుగా వచ్చినప్పుడు ఈ 'మైక్రోలెన్సింగ్' ప్రక్రియ జరుగుతుంది.

ఆ సమయంలో మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం ఒక భూతద్దంలా పనిచేస్తుంది. ఇది తన గురుత్వాకర్షణ శక్తితో వెనుక ఉన్న నక్షత్రపు కాంతి మార్గాన్ని మార్చి.. ఆ వెలుగును మరింత ప్రకాశవంతంగా చూపిస్తుంది.

ఒకవేళ మనకు దగ్గరగా ఉన్న ఆ నక్షత్రం చుట్టూ ఏదైనా గ్రహం తిరుగుతుంటే.. దాని గురుత్వాకర్షణ శక్తి వల్ల కూడా ఆ వెలుగులో మార్పు వస్తుంది. కాంతి ప్రకాశంలో వచ్చే ఈ అతిచిన్న మార్పు ఆధారంగానే అక్కడ ఒక గ్రహం (ఎక్సోప్లానెట్) ఉందనే విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తిస్తారు.

"అదృష్టం బాగుంటే, ఈ విధానం ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలను గుర్తించవచ్చు" అని డుపాక్ చెప్పారు.

"గడచిన ఇరవై ఏళ్లలో ఈ విధానాన్ని ఉపయోగించి దాదాపు 300 గ్రహాలను కనుగొన్నారు" అని గెలాక్టిక్ బల్జ్ సర్వేను ప్రారంభించిన ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ డి ఆస్ట్రోఫిజిక్ డి పారిస్, ఆస్ట్రేలియాలోని టాస్మానియా యూనివర్సిటీకి చెందిన జీన్-ఫిలిప్ బ్యూలీయు తెలిపారు.

అయితే, కేవలం ఈ యూక్లిడ్ ఫోటో ఆధారంగానే కొత్త గ్రహాలను కనుగొనడం సాధ్యం కాదు. మైక్రోలెన్సింగ్ ప్రక్రియను కనిపెట్టడానికి ఒక టెలిస్కోప్ కనీసం 20 రోజులకు పైగా ఆ నక్షత్రాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. యూక్లిడ్ కేవలం ఒక్క రోజు మాత్రమే దీనిపై దృష్టి పెట్టడం వల్ల అది సాధ్యపడలేదు.

కానీ, భవిష్యత్తులో రాబోయే టెలిస్కోపులు.. యూక్లిడ్ కవర్ చేసిన ప్రాంతంలో రెండు నక్షత్రాలు ఒకదానిపై ఒకటి వస్తున్నట్లు గుర్తిస్తే, అక్కడ కొత్త గ్రహాలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధరించడానికి ఈ డేటా సహాయపడుతుంది.

మైక్రోలెన్సింగ్ విధానం ద్వారా నక్షత్రాల చుట్టూ తిరిగే చల్లటి గ్రహాలతో పాటు, తమ నక్షత్రాల నుంచి విడిపోయి అంతరిక్షంలో స్వతంత్రంగా తిరిగే వెయ్యికి పైగా కొత్త గ్రహాలను కనుగొనడానికి ఈ ఫోటో ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్లు వలేరియా పెట్టోరినో బీబీసీతో చెప్పారు.

ఉదాహరణకు, నాసాకు చెందిన 'నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్'ను ఆగస్టు చివరిలో ప్రయోగించనున్నారు. ఈ టెలిస్కోప్ గ్రహాల వేట కోసం పరిశీలించబోయే మొత్తం ప్రాంతాన్ని యూక్లిడ్ ఇప్పటికే తన ఫోటోలో రికార్డ్ చేసింది.

"భవిష్యత్తులో ఎవరైనా ఇదే ప్రాంతంలో మైక్రోలెన్సింగ్ ప్రక్రియను గుర్తిస్తే (ఉదాహరణకు రోమన్ టెలిస్కోప్ ద్వారా), వారు గతానికి సంబంధించిన ఆధారం కోసం ఈ యూక్లిడ్ డేటాను వాడుకోవచ్చు. ఆ నక్షత్రాలు ఒకదానికొకటి ఎదురుగా రాకముందు ఎలా ఉన్నాయో చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది" అని యూక్లిడ్ డేటా విడుదలకు నాయకత్వం వహించిన ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ డి ఆస్ట్రోఫిజిక్ డి పారిస్‌కు చెందిన నటాలియా రెక్ట్సిని వివరించారు.

జీవం ఉండే అవకాశం

శాస్త్రవేత్తలు ఈ డేటా ద్వారా గ్రహాల ద్రవ్యరాశిని లెక్కించే అవకాశం లభిస్తుంది.

అయితే, కాలం గడిచేకొద్దీ రెండు నక్షత్రాల మధ్య దూరం పెరుగుతుందని పెట్టోరినో వివరించారు.

ఒకవేళ దగ్గరగా ఉన్న నక్షత్రం చుట్టూ ఏదైనా గ్రహం ఉంటే, వెనుక ఉన్న ప్రకాశవంతమైన నక్షత్రంతో పోలుస్తూ ముందున్న నక్షత్రం కదలికలను కొలవడం ద్వారా ఆ గ్రహం ద్రవ్యరాశిని తెలుసుకోవచ్చు. పరిశీలించే సమయం పెరిగేకొద్దీ ఈ లెక్కలు మరింత కచ్చితత్వంతో వస్తాయి.

ఇది గతంలో కనుగొన్న గ్రహాల గురించిన మరిన్ని వివరాలను కూడా వెలుగులోకి తెచ్చే అవకాశముంది.

ఇరవై ఏళ్ల కిందట బ్యూలీయు నేతృత్వంలోని బృందం ఒక కొత్త గ్రహాన్ని కనుగొంది.

"అది మంచు గ్రహం. స్టార్ వార్స్ సినిమాలోని 'హాత్' గ్రహం లాంటిది. ఇన్నేళ్ల తర్వాత, ఆ గ్రహం కచ్చితమైన ద్రవ్యరాశిని కొలిచేందుకు ఎట్టకేలకు యూక్లిడ్ సహాయపడుతుందని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను" అని ఆయన చెప్పారు.

ఒక గ్రహం ద్రవ్యరాశి తెలిస్తే, అక్కడ జీవం ఉండే అవకాశం ఉందా లేదా వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చని డుపాక్ వివరించారు.

"సాధారణంగా మన సౌర కుటుంబంలో చూసినట్లుగా.. చాలా భారీగా ఉండే గ్రహాలు వాయువు లేదా మంచుతో నిండి ఉంటాయి. నక్షత్రానికి దగ్గరగా ఉంటూ, తక్కువ ద్రవ్యరాశి కలిగిన చిన్న గ్రహాలు రాతి గ్రహాలుగా ఉంటాయి. జీవం ఎదగడానికి అనుకూలమైన పరిస్థితుల కోసం చూస్తుంటే, కచ్చితంగా రాతి గ్రహాలే దానికి పనికొస్తాయి" అని ఆయన పేర్కొన్నారు.

అలాంటి అనుకూలమైన గ్రహం ఏదైనా కనిపిస్తే.. "గ్రహాల వాతావరణాన్ని పరిశోధించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఇతర టెలిస్కోపుల ద్వారా మరిన్ని వివరాలు సేకరించవచ్చు. తద్వారా అక్కడ జీవనానికి మద్దతు లభిస్తుందో లేదో తెలుసుకోవచ్చు" అని డుపాక్ చెప్పారు.

ఈ యూక్లిడ్ ఫోటో కేవలం గ్రహాల గురించిన వివరాలకే పరిమితం కాదు.

మన గెలాక్సీలోని బ్రౌన్ డ్వార్ఫ్‌లు (మసక నక్షత్రాలు), బైనరీ స్టార్స్ (జంట నక్షత్రాలు), నక్షత్రాల కదలికలు, అంతరిక్షంలోని దుమ్ము వంటి ఇతర ఖగోళ పరిశోధనలకు కూడా ఈ డేటాను ఉపయోగించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)