You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండియాపై ఐర్లాండ్ గెలుపు: వైభవ్‌కు చోటు లేకపోవడంపై ఎవరేం చెప్పారు?
బెల్‌ఫాస్ట్‌లో జరిగిన జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇది తొలి విజయం.
టాస్ గెలిచిన భారత్ ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు దింపడంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఆ జట్టు 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తరఫున అభిషేక్ శర్మ 49, శివమ్ దూబే 25 పరుగులు చేశారు.
ఐర్లాండ్ తరఫున కెప్టెన్ టకర్ 50 పరుగులు చేయగా, గారెత్ డెలానీ 49 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్లు అద్భుతాలు సృష్టించారు. మాథ్యూ హంఫ్రీస్, మాట్ హోలార్డ్ చెరో మూడు వికెట్లు తీయగా, జై ముంద్రా రెండు వికెట్లు పడగొట్టి ఇండియా దూకుడుకు కళ్లెం వేశారు.
ఇక ఈ మ్యాచ్‌లో అరంగ్రేటం చేస్తాడనుకున్న వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావడంపై భారత జట్టు కెప్టెన్ ‘‘సమయం వచ్చినప్పుడు’’ ఆడిస్తామని చెప్పారు.
భారత్ కెప్టెన్ ఏం చెప్పారు?
"వైభవ్ సూర్యవంశీ గొప్ప ఆటగాడే. కానీ మా జట్టులో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు బాగా రాణించారు, అందుకే మేము వారిపై నమ్మకం ఉంచుతున్నాం. సమయం వచ్చినప్పుడు అందరికీ అవకాశం లభిస్తుంది" అని భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పారు. సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని మ్యాచ్ ప్రారంభం కాకముందే భారత జట్టు బ్యాటింగ్ కోచ్ శితాన్షు కోటక్ కూడా సంకేతాలిచ్చాడు.
మరోవైపు మ్యాచ్‌కు ముందు బీబీసీతో జరిగిన సంభాషణలో ఐర్లాండ్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిని ప్రశంసించారు.
‘నమ్మలేకపోతున్నా’
సూర్యవంశీని ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ఎంపిక చేయకపోవడంపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత మైఖేల్ వాన్ ఆశ్చర్యం వ్యక్తంచేశాడు.
" వైభవ్ సూర్యవంశీని తుది 11మందిలోకి తీసుకోలేదంటే నమ్మలేకపోతున్నాను. అతను ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో ఒకడు" అని వాన్ 'ఎక్స్'లో పోస్ట్ చేశాడు.
సూర్యవంశీని ఆడించకూడదని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించారు.
"ఫామ్‌లో ఉన్న తమ ఓపెనర్లతో, అలాగే టీ20 ప్రపంచ కప్ గెలిపించిన ఆటగాళ్లతో ఉన్న జట్టులో మార్పులు చేయకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం సరైనది. బయటి విషయాలు అలాగే ఉండిపోవాలి. నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రశాంతంగా, ప్రతిభ ఆధారంగా తీసుకోవాలి" అని మంజ్రేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ 'ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్' గురించి కూడా కొంత చర్చ జరిగింది. అతని వయస్సు చిన్నది కావడంతో భద్రతా నిబంధనల కారణంగా జట్టులోని మిగతా వారి నుంచి వేరుగా ఒక ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్‌లో వైభవ్ దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది.
వైభవ్ బ్యాటింగ్ కోచ్ ఏం చెప్పారు?
ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
"కేవలం ఒకరికి అవకాశం ఇవ్వడం కోసం జట్టు కోసం పరుగులు సాధిస్తున్న ఆటగాడిని పక్కన పెట్టడం సరైనది కాదని భావిస్తున్నా" అన్నారు.
"ఒకరికి అవకాశం ఇవ్వడానికీ, మరో ఆటగాడికి అన్యాయం చేయడానికీ మధ్య చాలా సన్నని గీత ఉంటుంది" అని సితాంశు కోటక్ అన్నారు.
''సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు. కానీ జట్టును కెప్టెన్, హెడ్ కోచ్ ఎంపిక చేస్తారు. ఒకవేళ సూర్యవంశీ ఆడకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే అతను భారత జట్టులో భాగం. భవిష్యత్తులో అతనికి తప్పకుండా అవకాశాలు వస్తాయనినమ్మకం ఉంది'' అని బ్యాటింగ్ కోచ్ అన్నాడు.
వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా ఒత్తిడికి లోనుకాడని సితాంశు కోటక్ అభిప్రాయపడ్డాడు.
వైభవ్ గురించి ఐరిష్ ఆటగాళ్లు ఏమన్నారు?
భారత్‌తో మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ గురించి ఐర్లాండ్ ఆటగాళ్లు కూడా స్పందించారు.
ఐర్లాండ్ బౌలర్ మాథ్యూ హంఫ్రీస్ బీబీసీ స్పోర్ట్ నార్తర్న్ ఐర్లాండ్ జర్నలిస్ట్ డేవిడ్ మోహన్‌తో మాట్లాడుతూ , టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్ తీసిన బౌలర్‌గా నిలవడం 'అద్భుతంగా' ఉంటుందని అన్నారు.
"సూర్యవంశీ టాప్ ఆర్డర్‌లో అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా తనను తాను నిరూపించుకున్నాడు. అతను ఐపీఎల్‌లో చాలా మంది గొప్ప బౌలర్ల బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టాడు. కాబట్టి, అతని ఆటను అధ్యయనం చేసి, అతనిని కట్టడి చేయడానికి సరైన ప్రణాళికను రూపొందించుకోవడమే మిగిలింది" అన్నాడు.
సచిన్ రికార్డు బద్దలవుతుందా?
శుక్రవారం మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభించలేదు. కానీ ఆదివారం(జూన్ 28) జరిగే మ్యాచ్‌లో అతను అరంగేట్రం చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలుస్తాడు.
1989లో 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌పై వన్డే అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సచిన్ టెండూల్కర్ పేరుతో ప్రస్తుతం ఈ రికార్డు ఉంది.
ఈ ఏడాది ఐపీఎల్‌లో వైభవ్ ఆరెంజ్ క్యాప్ గెలవడంతో అతనికి భారత జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు.
ఐపీఎల్ తర్వాత వైభవ్ సూర్యవంశీని భారత టీ20 జట్టు, ఇండియా 'ఎ' జట్లలోకి తీసుకున్నప్పుడు అతని అరంగేట్రంపై అంచనాలు పెరిగాయి. వైభవ్ అరంగేట్రం ప్రపంచ క్రికెట్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది.
కేవలం 13 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన అతను ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
ఇటీవల శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 'ఎ' తరఫున ఆడుతూ వైభవ్ లిస్ట్ 'ఏ' 50-ఓవర్ల క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. అతను ఈ ఘనతను కేవలం 11 బంతుల్లోనే సాధించాడు.
ఆ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 94 పరుగుల విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు.
వైభవ్ గురించి మాజీ క్రికెటర్లు బీబీసీతో ఏం చెప్పారు?
భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా ఉన్నప్పుడు.. 14 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్‌లో అరంగేట్రం చేయించాడు.
"మీరు ఒక అరుదైన ప్రతిభను చూస్తున్నారు. బౌలర్ వేగాన్ని అంచనా వేసే సామర్థ్యం, క్రికెట్ తెలివితేటలు, నిర్భయం.. వీటన్నింటి సమ్మేళనమే వైభవ్.
వైభవ్ లాంటి ఆటగాడిని తయారు చేయడానికి ఎలాంటి ఫార్ములాలు లేవు. ఓ పిల్లాడిని తీసుకొచ్చి, ఇలా చెయ్యి నువ్వు కూడా అంతటి గొప్ప ఆటగాడివి అవుతావని చెప్పలేం. కొన్ని విషయాలు వారికి పుట్టుకతోనే లభిస్తాయి. అయితే అతడు కష్టపడి ఆడాడు, కాబట్టి ఇది కేవలం అయాచితంగా వచ్చింది కాదు’’ అని ద్రవిడ్ చెప్పాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కోచ్. సూర్యవంశీ లాగే ఆయన కూడా ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్.
"నేను సెల్ఫీ తీసుకోవాలని కోరుకున్న రెండో వ్యక్తి వైభవ్ సూర్యవంశీ. మొదటి వ్యక్తి నేను చిన్నప్పుడు చూసే ఒక ఏఎఫ్ఎల్ ఛాంపియన్"
''ఐపీఎల్‌లో ఇంతకు ముందు నేను ఇలా ఎప్పుడూ చేయలేదు. కానీ మనం కలిసి ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ఎందుకంటే నీ ప్రతిభ, నీ ఆలోచనా విధానం, నువ్వు క్రికెట్ ఆడే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి' అని అన్నాను. అతను బ్యాటింగ్ చేయడం చూడటం ఒక అద్భుతమైన అనుభవం" అని లాంగర్ చెప్పాడు.
''అతని అసాధారణమైన చేతులు" వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా నిలుపుతాయన్నాడు.
భారతజట్టు ప్రస్తుతం ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లలో పర్యటిస్తోంది. ఐర్లాండ్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. రెండో మ్యాచ్ రేపు(జూన్ 28) జరగనుంది.
తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది, అక్కడ ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)