ప్రైడ్ మంత్: సెయింట్ సెబాస్టియన్ ‘గే ఐకాన్‌’గా ఎలా మారారు?

    • రచయిత, నిక్ లెవిన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

క్రిస్టియన్ మతవిశాస్వాలు పాటిస్తున్నందుకు హత్యకు గురైన రోమన్ సైనికుడు సెబాస్టియన్, శతాబ్దాలు గడిచిన తర్వాత స్వలింగ సంపర్కులయిన పురుషులకు హీరోగా మారారు.

రచయిత ఆస్కార్ వైల్డ్ నుంచి ఆర్టిస్ట్ కీత్ హారింగ్ వరకు... అనేకమంది సెబాస్టియన్‌ను హీరోగా చూశారు. ఎందుకంటే గే ఐకాన్ అనే పదం భావోద్వేగపూరితమైనది, బరువైనది.

జుడీ గార్లాండ్, చెర్, మడోన్నా వంటి మహిళా ప్రముఖుల గురించి చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

1999లో డస్టీ స్ప్రింగ్‌ఫీల్డ్ మరణించినప్పుడు, ఆమె స్నేహితుడు, పెట్ షాప్ బాయ్స్ సంగీత బృందం సింగర్ నెయిల్ టెన్నట్‌కు ఓ ప్రశ్న ఎదురయింది.

'మీ స్నేహితురాలు గే ఐకాన్‌గా ఎలా మారారని'. అప్పుడు టెన్నట్ 2024లో మోజో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను గుర్తుచేసుకున్నారు. ఆమెను గే ఐకాన్ అని పిలవడం అంటే ఆమెను బాధించడమే అన్నారు. ఈ లేబుల్ వల్ల ఆమె గే ప్రజలకు మాత్రమే పరిమితమైన భావన కలుగుతుందన్నారు.

మత విశ్వాసాల వల్ల హత్యకు గురయిన వ్యక్తి స్వలింగ సంపర్కులకు ఎలా ప్రతీకగా మారారు?

స్ప్రింగ్‌ఫీల్డ్ గురించి టెన్నట్ చెప్పింది సరైన పాయింటే. అయితే ఒకరిని గే ఐకాన్‌గా గుర్తించడమన్నది కూడా కొన్నిసార్లు గౌరవప్రదమైనదిగా ఉంటుంది, సంప్రదాయ వ్యతిరేకమైనదిగా ఉంటుంది. క్రీస్తు శకం 288లో మతపరమైన నమ్మకాల వల్ల హత్యకు గురైన సెయింట్ సెబాస్టియన్‌ విషయం కూడా ఇలాగే అనిపిస్తుంది. సెయింట్ సెబాస్టియన్ హత్య జరిగిన సమయంలో చక్రవర్తి డయోక్లిషియన్ క్రిస్టియన్లపై తీవ్ర హింసను కొనసాగిస్తున్నారు.

కేథలిక్, ఈస్ట్రన్ ఆర్థడాక్స్ చర్చిలు రెండింటిలోనూ సెబాస్టియన్‌ను పవిత్రుడైన సెయింట్‌గా పూజిస్తారు. డయోక్లిషియన్‌ అన్యమత విశ్వాసాలను పాపపూరితమైనవిగా విమర్శించినందుకు సెబాస్టియన్‌ను కర్రలతో కొట్టి చంపారని రెండు చర్చిలూ ఎంతో కాలంగా ప్రచారం చేస్తున్నాయి.

చక్రవర్తి అనుచరులు సెబాస్టియన్‌పై అంతకుముందు మరో దాడి చేశారు. సెబాస్టియన్‌ను చెట్టుకుకట్టి, బాణాలతో దాడి జరిపారు. ఈ ఘటనే ఈ అజ్ఞాత అమరవీరుణ్ని ప్రముఖ కళాకారులకు తరతరాలుగా స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా నిలిపింది. లండన్‌లోని నేషనల్ గ్యాలరీలో సెయింట్‌ సెబాస్టియన్ చిత్రాలు 14 ఉన్నాయి. శతాబ్దాలుగా ఆయన గే సమాజానికి ఆకర్షణ, కోరికలను ప్రతిబింబించే శాశ్వత ప్రతీకగా నిలుస్తున్నారు.

14వ శతాబ్దం నుంచి 17వశతాబ్దం మధ్య సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో సెయింట్ సెబాస్టియన్ గే ఐకాన్‌గా మారారని భావిస్తారు. గైడో రెనీ, ఎల్ గ్రెకో, సాండ్రో బొట్టిసెల్లి వంటి ప్రముఖ కళాకారులు బాణాలు గుచ్చుకుని ఉన్న సెబాస్టియన్ శరీరాన్ని స్వలింగ ఆకర్షణ అంతర్లీనంగా బలంగా ఉన్న అభిప్రాయం కలిగేలా చిత్రీకరించారు.

ఈ బాణాలను కళాచరిత్రకారులు సాధారణంగా లైంగిక కలయిక, క్వీర్‌నెస్‌కు ప్రతీకలుగా చూశారని యూకేలోని ఎక్సెటెర్ యూనివర్శిటీలో ఆర్ట్ హిస్టరీ, విజువల్ కల్చర్ విభాగంలో సీనియర్ లెక్చరర్ అయిన డేనియల్ ఫౌంటెయిన్ చెప్పారు.

‘లైంగిక భావాన్ని తెలియజేసే మార్గంలా’

క్లేర్ బార్లో పీపుల్స్ హిస్టరీ మ్యూజియం డైరెక్టర్. టేట్ బ్రిటన్ 2017 ఎగ్జిబిషన్ క్వీర్ బ్రిటిష్ ఆర్ట్ 1861-1967 నిర్వహించారు. చాలా చిత్రాల్లో సెబాస్టియన్‌పై కనిపించే బాణాలకు బలమైన మానసిక లైంగిక సంకేతాత్మక ప్రాముఖ్యత ఉందని, ఆర్టిస్టు ఉద్దేశం అదైనా కాకపోయినా, అవి అలాగే కనిపిస్తాయని క్లేర్ బార్లో తెలిపారు.

సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో స్వలింగ సంపర్కంపై ప్రజల ఆలోచనాధోరణి సానుకూలంగా ఉండేది కాదు. అలాంటి సమయంలో సెబాస్టియన్ సన్నని, ఆకర్షణీయమైన శరీరాన్ని చిత్రించిన కళాశైలి అప్పట్లో ప్రాచుర్యం పొందింది. ఆ చిత్రాల అర్ధం స్పష్టంగా తెలిసేది కాదు. విభిన్నరీతుల్లో అర్ధం చేసుకునేలా ఉండేది. మైఖేలాంజెలో 16వ సెంచరీ మాస్టర్‌పీస్ డేవిడ్ లాంటిది. డేవిడ్ విగ్రహం పురుష సౌందర్యానికి ఆదర్శ రూపాన్ని పాలరాతి శిలారూపంలో శాశ్వతంగా మలిచినట్టే, ఈ అందమైన, శిక్షకు గురైన సెయింట్ సెబాస్టియన్ చిత్రాలు గే పురుషులు తమ ఆకర్షణ లేదా ప్రేమ భావాలను సమాజానికి ఆమోదయోగ్యమైనరీతిలో వ్యక్తపరచడానికి ఓ మార్గంగా పనిచేశాయి.

ఇది నిజంగా చిత్రకారుడి ఉద్దేశమేనా లేక ప్రాతినిధ్యం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కమ్యూనిటీ ఆ అర్ధాన్ని చిత్రాల్లో చూసిందా అనేది తెలుసుకోవడం చాలా కష్టమని క్లేర్ బార్లో చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ జరిగి ఉండొచ్చని బార్లో అన్నారు.

19వశతాబ్దంలో, బాగా చదువుకున్న మగవారు సెయింట్ సెబాస్టియన్ గురించి మాట్లాడడం తమ క్వీర్ కోరికలను తెలియజేయడానికి, వ్యక్తీకరించడానికి ఓ మార్గంగా ఉండేదని హోలీ జేమ్స్ జాన్స్‌టన్ అన్నారు.

కాలక్రమేణా ఇప్పుడు మనం ఉన్నత కళాసాహిత్య వర్గాల్లో భావిస్తున్నట్టుగా క్వీర్‌కు చిహ్నంగా మారే స్థాయికి సెబాస్టియన్ గుర్తింపు చేరింది.

రచయిత్రి, ప్రదర్శనకారిణి, విద్యావేత్త అయిన హోలీ జేమ్స్ జాన్స్‌టన్ లండన్‌లోని ది వాలెస్ కలెక్షన్‌లో ఒక లివింగ్ స్కల్ప్చర్ ప్రదర్శన ద్వారా 2025లో సెబాస్టియన్‌కు నివాళులర్పించారు. 19వ శతాబ్దం చివర్లో సెయింట్ సెబాస్టియన్ ఆరాధన తీవ్రస్థాయికి చేరిందని తెలిపారు.

ఆస్కార్ వైల్డ్, ఆంగ్ల వ్యాసకర్త వాల్టేర్ పేటర్, ఫ్రెంచ్ రచయిత మార్క్-ఆండ్రే రఫలోవిచ్ వంటి ప్రముఖ మేధావులు తమకు సెబాస్టియన్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని బహిరంగంగా చెప్పారు. అలా చెప్పడం ద్వారా తమ లైంగిక గుర్తింపును పరోక్షంగా సూచించేవారు.

స్వలింగ సంపర్కంపై నిషేధం ఉన్న కాలంలోనే రఫలోవిచ్ దాని గురించి విస్తృతంగా రచనలు చేశారు. అయితే దీనికి సంబంధించిన తన కోరికలను, మతపరమైన నమ్మకాలను సమన్వయం చేసుకోవడంలో చివరకు ఆయన ఇబ్బంది పడ్డారు. 1896లో కేథలిక్ ఆర్డర్‌లో చేరినప్పుడు ఆయన బ్రదర్ సెబాస్టియన్ అనే పేరు పెట్టుకున్నారు. తనకు ఇష్టమైన సెయింట్‌కు అలా నివాళులర్పించారు.

ఆ సమయంలో సెబాస్టియన్ క్వీర్ సంకేత భాషలో భాగమయ్యారని జాన్స్‌టన్ చెప్పారు. ఇతర క్వీర్ వ్యక్తులు వెంటనే గుర్తించగలిగేలా తమ క్వీర్ భావాలను పంచుకోవడానికి, వ్యక్తం చేయడానికి ఉన్నత విద్యావంతులకు ఇదొక మార్గంలా ఉండేదని తెలిపారు.

‘బయటకు చెప్పలేని భావనకు ప్రతీకలా’

ఆ సమయంలో ఆయన క్వీర్ సమాజానికి ఆకర్షణీయమైన ప్రతీకగా ఉండడానికి శరీర సౌందర్యం ఒక్కటే కారణం కాదు.

సాంస్కృతిక విమర్శకురాలు సుసాన్ సాంటేజ్ 1962లో రాసిన తన ద ఆర్టిస్ట్ యాజ్ ఎగ్జెంప్లరీ సఫరర్ అనే వ్యాసంలో సెబాస్టియన్‌ను ''ఆదర్శప్రాయమైన బాధితుడు'' అనే భావనకు ఒక సంప్రదాయిక ఉదాహరణగా పేర్కొన్నారు. ఎందుకంటే హింసకు గురైన ఆయన శరీరాన్ని అనేకమంది కళాకారులు గ్లామరైజ్ చేశారు. ఆయన శరీరాన్ని అందంగా, ఆకర్షణీయంగా చిత్రించారు.

''సెబాస్టియన్‌ను ఎప్పుడూ ఒకే విధమైన భంగిమలో చిత్రిస్తారు. దీన్ని కాంట్రాప్‌సపోస్టో అంటారు. శరీరం బరువు ఒక కాలిపై ఉంటుంది. శరీరం అందంగా ఒంగినట్టు కనిపిస్తుంది. చిత్రాల్లో సెబాస్టియన్ ఆకాశంవైపు చూస్తుంటారు. ప్రార్థిస్తున్నట్టుగా లేదా కోరికను వ్యక్తం చేస్తున్నట్టుగా ఇది ఉంటుంది'' అని క్వీన్ మేరీ యూనివర్శిటీలో చరిత్ర ప్రొఫెసర్ డొమినిక్ జాన్సన్ అభివర్ణించారు.

సమాజం ఆయన్ను వెలివేసి, శిక్షించడానికి ముందు తాను క్రిస్టియన్ అన్న విషయాన్ని బయటపెట్టకుండా ఉండడానికి సెబాస్టియన్ ప్రయత్నించారు. క్వీర్ కళాకారులు అనేకమంది ఇందులో తమను తాము చూసుకున్నారని డేనియల్ ఫౌంటెయిన్ తెలిపారు.

సెయింట్ సెబాస్టియన్‌పై ప్రయోగించిన బాణాలు సంకేతాల్లా చాలా పెయింటింగ్స్‌లో కనిపిస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో ఆయన మొహంపై కనిపించే భావం ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా సంతోషం అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. ఇది లైంగిక పరవశాన్ని పోలిన భావవ్యక్తీకరణగా పెయింటింగ్స్‌లో కనిపిస్తుంది.

''ఎల్ గ్రీకో గీసిన ఓ పెయింటింగ్‌లో సెయింట్ సెబాస్టియన్ నడుముకు కట్టుకున్న వస్త్రం దాదాపు జారిపోతున్నట్టుగా అనిపిస్తుంది'' అని జాన్‌స్టన్ చెప్పారు. ఈ కారణంగా సెబాస్టియన్‌ను నేటి బీడీఎస్ఎమ్(బాండేజ్, డిసిప్లిన్, డామినెన్స్, సబ్‌మిషన్)ఆచారాలకు చారిత్రక ప్రతీకగా చూడవచ్చని డేనియల్ ఫౌంటెయిన్ అంటారు. ఇది ఎల్‌జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీకి ప్రత్యేకించింది కాకపోయినప్పటికీ క్వీర్ సమాజంలోని కొన్ని ఉపసంస్కృతుల్లో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

‘సెబాస్టియన్ అనుభవించిన వేదనలో తమను తాము చూసుకునేంతగా’

సెబాస్టియన్ అనుభవించిన మానసిక వేదన కూడా అనేకమంది తమను ఆయనతో పోల్చుకునేలా చేసింది. స్వలింగ సంపర్క జీవితంపై నిరాశావాదం లేదా విషాదభరితమైన అభిప్రాయం ఉన్నవారికి, ముఖ్యంగా సమాజం అంతగా అంగీకరించని సమయాల్లో సెబాస్టియన్ కథ మరింత ఆకర్షణీయంగా అనిపించిఉండొచ్చని జాన్సన్ అంటున్నారు.

''తాను క్రైస్తవుణ్ని అన్న విషయాన్ని దాచుకోవడానికి ఆయన ప్రయత్నించారు. తర్వాత సమాజం ఆయన్ను వెలివేసింది. మత విశ్వాసాలకు శిక్ష విధించింది. చాలామంది క్వీర్ కళకారులు ఈ ప్రత్యేకకథలో తమను తాము చూసుకున్నారు'' అని ఫౌంటెయిన్ చెప్పారు.

అలాంటి వారిలో ఆస్కార్ వైల్డ్ ఒకరు. పురుషులతో సంబంధాలు కలిగి ఉన్నారనే నేరంపై ఆయనకు జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత ఆయన తన చివరి సంవత్సరాలు పారిస్‌లో ప్రవాస జీవితం గడిపారు. ఆ సమయంలో సెబాస్టియన్‌కు నివాళిగా సెబాస్టియన్ మెల్మూత్ అనే కలం పేరు పెట్టుకున్నారు.

రెండో ప్రపంచ యుద్ధానంతరకాలంలో జపాన్‌కు చెందిన వివాదాస్పద రచయిత యుకియో మిషిమా ఓ విషయం వెల్లడించారు. సెబాస్టియన్ ప్రముఖ పెయింటింగ్ చూసిన తర్వాతే తన లైంగిక భావాలపై తనకు స్పష్టత వచ్చిందని తెలిపారు. తర్వాత యుకియో మిషిమా బాణాలు గుచ్చిఉన్న సెబాస్టియన్ భంగిమలో పలు ఫోటోలకు ఫోజిచ్చారు.

20,21 శతాబ్దాల్లో సెబాస్టియన్ ప్రభావం

1969లో జరిగిన స్టోన్‌వాల్ తిరుగుబాటు ఆధునిక ఎల్‌జీబీటీక్యూప్లస్ హక్కుల ఉద్యమానికి కారణమైంది. అప్పటినుంచి సెబాస్టియన్ గే ఐకాన్ హోదా మరింత గుర్తింపు పొందసాగింది.

ప్రముఖ కళాకారుడు, ఫిల్మ్ మేకర్, గే హక్కుల కార్యకర్త అయిన డెరెక్ జర్మన్, 1976లో సెబాస్టియన్ అనే సినిమా తీశారు. పురుషుల నగ్నత్వాన్ని ఎలాంటి సంకోచం లేకుండా చూపించడం, స్వలింగ ప్రేమను సానుకూలంగా చిత్రీకరించడంతో ఈ చిత్రాన్ని విప్లవాత్మకమైనదిగా పరిగణిస్తారు.

సినిమాలో సెబాస్టియన్ పాత్రను లియోనార్డో ట్రెవిగ్లియో పోషించారు. ఆయన్ను కమాండింగ్ ఆఫీసర్ లైంగిక భావంతో చూస్తారు. చివరకు ఆ అధికారే ఆయన్ను చంపుతారు. మరో ఇద్దరు తోటి సైనికులు మాత్రం ప్రేమపూర్వకమైన స్వలింగ సంపర్క సంబంధంలో ఉన్నట్టు సినిమాలో చూపించారు.

అందమైన, ఆలోచనాత్మక, గే పురుషుల గురించి, వారి కోరికలు గురించి సంప్రదాయాలను సవాలు చేసేదిగా ఉన్న సెబాస్టియన్ సినిమాకు చాలా ప్రాధాన్యత ఉందని డొమినిక్ జాన్సన్ తెలిపారు.

''అది చాలా ముఖ్యమైన చిత్రం. చాలా వివాదాస్పదమైన చిత్రం. 1985లో బ్రిటిష్ పబ్లిక్ టెలివిజన్‌లో ప్రసారమవుతున్నప్పుడు దానిపై చాలా చర్చ జరిగింది'' అని డొమినిక్ జాన్సన్ చెప్పారు.

జర్మన్ రూపొందించిన సున్నితమైన, శృంగార భావనలతో ఉన్న చిత్రం సెబాస్టియన్‌ను గే హోదాకు ప్రతీకగా చూడడానికి ఉన్న పరోక్ష అడ్డంకులను తొలగించింది. ఈ అభిప్రాయంతో బార్లో అంగీకరిస్తారు.

సాంస్కృతిక పునరుజ్జీవన కాలానికి చెందిన అనేక చిత్రాల్లో కనిపించే పరోక్ష స్వలింగ ఆకర్షణను జర్మన్ గుర్తించి తన సినిమాలో మరింత స్పష్టంగా చూపించారని బార్లో అంటారు. అలా సెబాస్టియన్ ఆకర్షణ మరో స్థాయికి చేరిందని తెలిపారు.

సెబాస్టియన్ గే ప్రతీకగా కనిపించడం వెనక చాలా లోతైన కారణాలున్నాయి. చారిత్రక నేపథ్యం ఉంది. కాలానికి అనుగుణంగా ఇది కొత్త అర్ధాలను కూడా సంతరించుకుంది.

1980లు, 1990ల ప్రారంభంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ మహమ్మారి తీవ్రంగా వ్యాపించిన సమయంలో కీత్ హారింగ్, డేవిడ్ వొజ్నారోవిచ్ సహా అప్పటి కళాకారులు సెబాస్టియన్ చిత్రాన్ని రిఫరెన్స్‌గా ఉపయోగించేవారు. కీత్ హారింగ్, డేవిడ్ వొజ్నారోవిచ్ ఇద్దరూ ఎయిడ్స్‌తోనే చనిపోయారు.

మధ్యయుగంలో సెబాస్టియన్‌ను ప్లేగు వ్యాధినుంచి ప్రజలను రక్షించగల సెయింట్‌గా భావించేవారు. బాణాల వల్ల అయిన గాయాలను సెయింట్ ఐరీన్ నయం చేసిన విధానం వల్ల ఈ భావన కలిగిఉండొచ్చు.

''1980ల్లో మరో రకమైన మహమ్మారి వ్యాపించిన సమయంలోనూ ఈ పోలిక కనిపిస్తుంది. ఆ కాలంలోని సెబాస్టియన్ చిత్రాల్లో ఆయన క్వీర్ కమ్యూనిటీ సెయింట్‌గా, అనారోగ్యంతో పోరాడుతున్నవారికి ధైర్యాన్నిచ్చేవారిగా, కష్టాలను తట్టుకుని ముందుకుసాగే వ్యక్తిత్వం ఉన్నవారికి ప్రతీకగా కనిపించేవారు'' అని ఫౌంటెయిన్ చెప్పారు.

ఒకే కళాకృతిలో బ్రిట్నీ స్పియర్స్, సెబాస్టియన్

2022లో లండన్ రెసిడెన్స్ గ్యాలరీలో బ్రిట్నీస్పియర్స్ నుంచి ప్రేరణ పొందిన కళాకృతుల ప్రదర్శన జరిగింది. ప్రసిద్ధ కళాకారుడు గ్రే వీలెబిన్‌స్కి తీవ్ర భావోద్వేగం కలిగించే గ్యాలరీని రూపొందించారు.

2009 ప్రపంచ పర్యటనలో కొరడా పట్టుకుని కనిపించిన బ్రిట్నీస్పియర్స్, 2001 ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డుల్లో ప్రాణాలతో ఉన్న కొండచిలువను పట్టుకుని ప్రదర్శన చేసిన బ్రిట్నీస్పియర్స్, బాణాలతో ఉన్న సెబాస్టియన్ శరీరాన్ని సూచించేలా ఈ ఇన్‌స్టాలేషన్ ఉంటుంది.

గ్రే వీలెబిన్‌స్కి డల్లాస్‌కు చెందినవారు. సెబాస్టియన్ అనుభవించిన హింసకు అలాగే ప్రస్తుత రోజుల్లో గే ఐకాన్ అయిన బ్రిట్నీ స్పియర్స్ తనకున్న విపరీతమైన కీర్తిప్రతిష్టల కారణంగా టార్గెట్‌గా మారిన తీరుకు మధ్య ఓ అనుసంధానాన్ని కలిగించేందుకు గ్రే వీలెబిన్‌స్కి ప్రయత్నించారు.

''చాలా కళాకృతుల్లో సెబాస్టియన్ చూపులో ఏదో అవగాహన ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఆయన నిల్చున్న భంగిమలో ఓ సౌందర్యం, గంభీరత్వం కనిపిస్తాయి. బ్రిట్నీస్పియర్స్‌ కళాకృతిలో అదే రకమైన గంభీరత్వాన్ని, సౌందర్యాన్ని, తన భవిష్యత్తు ఏమిటో తనకు తెలుసన్న భావనను కనిపించేలా చేసేందుకు నేను ప్రయత్నించా'' అని వీలెబిన్‌స్కీ బీబీసీతో చెప్పారు.

శతాబ్దాలుగా ఆర్టిస్టులు సెబాస్టియన్‌ను చిత్రీకరించారు. క్వీర్ ఆలోచనాపరులు తమ ప్రతీకగా భావించారు. అందుకే సెబాస్టియన్ గే ఐకాన్ హోదా ఇప్పుడు ఎంత సంక్లిష్టమైనదో, అంతే స్పష్టమైనది. అయితే ఇప్పుడు ఆయన్ను చూసే విధానంలో ఎలాంటి చులకనభావం లేదు. అణిచివేత భావన లేదు. అలాగే చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ వ్యక్తి ధైర్యానికి, సృజనాత్మక స్ఫూర్తికి మూలంగా నిలిచారు.

ఆయన చిత్రంలో తమ భావాలను క్వీర్ ప్రజలు ఎంతకాలం చూసుకుంటారో అంతకాలం ఆయన వారసత్వం మరింతగా విస్తరిస్తూ, కొత్త అర్ధాలను సంతరించుకుంటూ ముందుకెళ్తుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)