ప్రైడ్ మంత్: LGBTQIA+లో ఈ ప్లస్ ఏంటి?

    • రచయిత, అక్షయ శ్రీజ వుసురుమర్తి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఎల్జీబీటీ కమ్యూనిటీ ప్రైడ్ మంత్‌ను ఘనంగా జరుపుకుంటుంది. ప్రతియేటా జూన్ నెలను ‘ప్రైడ్ మంత్’గా జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోన్న దృశ్యం.

అయితే, ఇదేదో జెన్ జీ తరంలో వచ్చిన మార్పేమీ కాదు.

దీనికి మూలాలు 1969 నుంచే ఉన్నాయి. న్యూయార్క్‌లో జరిగిన స్టోన్‌వాల్ ఉద్యమంతో దీనికి సంబంధం ఉంది.

ప్రైడ్‌మంత్‌ను ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు సప్తవర్ణాల వేడుకగా జరుపుకుంటారు. కానీ, దీని ఉద్దేశం సంబరాలు మాత్రమే కాదు, ఎల్జీబీటీక్యూఐఏ+ కి సంబంధించిన అవగాహన పెంచడం, వారి అనుభవాలను అర్థం చేసుకోవడం కూడా.

ఈ సందర్భంగా LGBTQIA+ అంటే ఏమిటి? అందులో ఉన్న + (ప్లస్) కి అర్థమేంటి? ఈ పదాలు ఎలా వచ్చాయి? ఈ కమ్యూనిటీలలో కొత్త గుర్తింపులు పెరుగుతున్నాయా? అనేది తెలుసుకుందాం.

ఎల్జీబీటీక్యూఐఏ+ అంటే ఏమిటి?

ఎల్జీబీటీక్యూఐఏ+ - లెస్బియన్(L), గే(G), బైసెక్సువల్(B), ట్రాన్స్‌ జెండర్(T), క్వీర్ లేదా క్వశ్చనింగ్(Q), ఇంటర్‌సెక్స్(I), ఎసెక్సువల్ (A).

ఇవికాక + అనేది ఈ మిగతా గుర్తింపులను సూచించడానికి ఉపయోగించే సింబల్.

"మమ్మల్నిమేము అర్థం చేసుకొని, అంగీకరించుకోడానికే చాలా సమయం తీసుకున్నాం. సమాజానికి విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ, దానికి ద్వేషం సమాధానం కాదు" అని దిల్లీకి చెందిన హర్షిత్ అన్నారు. ఆయన ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు.

కథకుడు, రచయిత అయిన హర్షిత్, తనను తాను జెండర్ ఫ్లూయిడ్‌గా చెప్పుకుంటారు.

మొత్తంగా LGBTQIA+ అనే పదం ఒక వ్యక్తి వారి లింగాన్ని ఎలా అర్థం చేసుకుంటారో తెలియజేస్తుంది. ఈ విభిన్న గుర్తింపుల వెనుక రెండు కోణాలు ఉన్నాయి.

ఒకటి భౌతిక ఆకర్షణ, రెండోది జననేంద్రియాల నిర్మాణం. ఈ రెండింటి కారణంగా లైంగికపరమైన (లెస్బియన్, గే, బై సెక్సువల్), లింగపరమైన (ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్) గుర్తింపు వస్తోంది.

ఈ పదంలోని ఒక్కొక్క అక్షరానికి అర్థం ఏంటంటే..

లెస్బియన్: ఒక స్త్రీ ఇంకో స్త్రీని ఇష్టపడటం లేదా ప్రేమించడం.

గే: ఒక పురుషుడికి ఇంకొక పురుషుడికి మీద ప్రేమ కలగడం. అయితే 'గే' అనే పదాన్ని ఇప్పుడు అన్ని వర్గాలవారిని అంటే గే, బైసెక్సువల్, లెస్బియన్ ఇలా వీళ్లందరినీ ఇదే పదంతో సూచిస్తున్నారు.

బైసెక్సువల్: ఆడ, మగ ఇద్దరి పట్లా ఆకర్షితులయ్యే స్త్రీ పురుషులు.

ట్రాన్స్‌జెండర్: పుట్టుకతో మహిళ లేదా పురుషుడు అయి ఉండి, పెరుగుతున్న కొద్దీ తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల సహజ లక్షణాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం. ట్రాన్స్‌జెండర్‌లో మళ్లీ ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మెన్ ఉంటారు.

  • ట్రాన్స్ విమెన్: పుట్టినప్పుడు మగాడిగా, తరువాత స్త్రీగా గుర్తించుకునే వారు.
  • ట్రాన్స్ మెన్: పుట్టుకతో స్త్రీగా, తరువాత మగాడిగా గుర్తించుకునే వారు.

క్వీర్ లేదా క్వశ్చనింగ్:

ఆడ, మగ ఈ రెండు గుర్తింపులకు భిన్నంగా ఉండేవారిని క్వీర్ అని పిలుస్తారు.

'క్వశ్చనింగ్' - తమ గుర్తింపు ఇంకా అర్థం చేసుకుంటూ, తాము ఎవరమో తేల్చుకునే దశలో ఉన్న వ్యక్తుల కోసం ఈ పదాన్ని వాడతారు.

ఇంటర్‌సెక్స్:

ఆడ, మగలకు భిన్నమైన లైంగిక అవయవాలు ఉండేవారిని, అలాంటి అవయవాలతో జన్మించిన వారిని ఇంటర్‌సెక్స్‌ వ్యక్తులు అంటారు.

ఇంటర్‌‌సెక్స్‌ అనేది ఈ కింది అంశాల మీద ఆధారపడి ఉంటుంది:

  • క్రోమోజోమ్స్
  • హార్మోన్లు
  • ప్రత్యుత్పత్తి అవయవాలు
  • జననేంద్రియాల నిర్మాణం

అసెక్సువల్:

వీరు లైంగిక సంబంధాల మీద, భౌతిక ఆకర్షణల మీద ఆసక్తి లేనివారు.

అరోమాంటిక్: ఎవరి మీద రొమాంటిక్ ఆకర్షణ కలగని వారు.

"చాలామంది సెక్స్, జెండర్ మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకోరు. సెక్స్ అంటే ఒక వ్యక్తిని జీవశాస్త్రపరంగా గుర్తించడానికి ఉపయోగించే శారీరక లక్షణాలు. ఉదాహరణకు క్రోమోజోమ్స్, హార్మోన్లు, జననేంద్రియాలు. జెండర్ అనేది వ్యక్తి తనను తాను ఎలా గుర్తించుకుంటాడో దానికి సంబంధించిన సామాజిక, వ్యక్తిగత అనుభవం" అని హర్షిత్ అంటారు.

ప్లస్(+)కు అర్థమేంటి?

స్త్రీ పురుషులలో లైంగిక ఆసక్తులు, శరీర నిర్మాణాలు అన్నింటినీ LGBTQIAతో పూర్తిగా నిర్వచించడం కుదరదు. ప్లస్ (+) అనేది వాటన్నింటినీ చెప్పడానికి ఉపయోగించే చిహ్నం.

యునైటెడ్ నేషన్స్ పేర్కొన్నదాన్ని ప్రకారం , ఈ + కేటగిరీలోకి వచ్చే అంశాలు ఇవి:

నాన్-బైనరీ

నాన్-బైనరీ వ్యక్తులు తమను ఆడ, మగగా గుర్తించుకోరు. వారి గుర్తింపు వేరేదై ఉండొచ్చు.

జెండర్‌ ఫ్లూయిడ్

వీరు ఏ గుర్తింపుకైనా ఎప్పుడైనా మారొచ్చు. ఈ మార్పు రోజులు, నెలలు, సంవత్సరాలలో కూడా జరగోచ్చు.

పాన్‌ సెక్సువల్

జెండర్‌తో సంబంధం లేకుండా వీరు ఎవరినైనా ఇష్టపడొచ్చు.

డెమి సెక్సువల్

మానసిక సంబంధానికి ప్రాధాన్యమిచ్చేవారిని డెమిసెక్సువల్‌గా గుర్తిస్తారు.

అజెండర్

వీరు తాము ఏ లింగానికి సంబంధించని వారిగా భావిస్తారు.

టూ-స్పిరిట్

ఉత్తర అమెరికాలోని స్థానికంగా ఎక్కువగా వాడే పదం. దీని అర్థం ఆడ, మగ లక్షణాలు కలిగి ఉండడం. దీనిని అక్కడివారు ఆధ్యాత్మికపరమైన మాటగా పరిగణిస్తారు.

అలోసెక్సువల్

ఒకరి మీద ఆకర్షణ కలిగే వారిని ఇలా పిలుస్తారు. అయితే దీనిని అసెక్సువల్‌కు వ్యతిరేక పదంగా వాడతారు. వీరిలో అసెక్సువల్‌ వ్యక్తులకు భిన్నమైన లక్షణాలు ఉంటాయి.

ఈ పదాలు ఎలా వచ్చాయ్? కొత్త గుర్తింపులు పెరుగుతాయా?

'LGBTQIA+' ఒక్కరోజులో ఏర్పడింది కాదు. భారత దేశంలో ఈ పదాల వాడకం ప్రపంచంతో పెరిగిన సంబంధాలు, దక్షిణాసియా సమాజాల ప్రభావం, ఆర్థిక సరళీకరణతో సమాజంలో వచ్చిన మార్పుల వల్లేనని పరిశోధకులు అంటున్నారు.

"హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన, ఆరోగ్య కార్యక్రమాలకు అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చిన మద్దతు కారణంగా దక్షిణాసియాలో క్వీర్ గ్రూపులు మొదలయ్యాయి. దీంతో కొందరు తమ గుర్తింపులను ఈ పదాల ద్వారా ప్రకటించుకోవడం మొదలుపెట్టారు" అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ పుష్పేశ్ కుమార్ అన్నారు.

అయితే ఈ గుర్తింపులను తెలిపే పదాలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందా? అని అడిగినప్పుడు, "కొత్త పదాలు రావడం అంటే కొత్త గుర్తింపులు పుట్టుకొస్తున్నాయని అర్థం కాదు" అని ఆయన అన్నారు.

"మనుషుల అనుభవాలు, వాటిని అర్థం చేసుకునే విధానాలు మారుతున్న కొద్దీ, వాటిని వివరించే పదాలు కూడా మారుతూ ఉండొచ్చు" అని కమ్యూనికేషన్ కోచ్, ట్రాన్స్‌ విమెన్ కాళి అన్నారు.

అవగాహన పెరిగింది, అంగీకారమూ పెరిగిందా?

హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అనురేఖ చారి బాఘ్ దీని గురించి మాట్లాడారు.

"క్వీర్ గ్రూప్‌కు అవకాశాలు కల్పించడం ఒకటే కాదు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సురక్షితమైన ప్రదేశాలుగా మారి, వారికి భద్రతా వసతులు, అనుకూల వాతావరణం అందించాలి" అని అనురేఖ చారి అన్నారు.

"మార్పు ఎప్పుడూ పెద్ద స్థాయిలోనే జరగాల్సిన అవసరం లేదు. 'జెండర్ న్యూట్రల్' వాష్‌రూమ్స్ వంటి చిన్న మార్పులతో మొదలుపెట్టొచ్చు" అని కమ్యూనికేషన్ కోచ్ కాళీ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)