ఆంధ్రప్రదేశ్: ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది.
విజయనగరం జిల్లా మెరకముడిదాంలో అత్యధికంగా 22 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాలోని గరివిడిలో 17 సెం.మీ., చీపురుపల్లిలో 13, తెర్లాంలో 12 సె.మీ. వర్షపాతం కురిసింది.
ఉమ్మడి గుంటూరు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు తిరుపతిలోనూ 3 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది.
ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్లు ఎత్తారు. శనివారం సాయంత్రానికి 2 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్లినట్లు గేట్ల పర్యవేక్షణ ఈఈ చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంకరేవు వద్ద వశిష్ఠగోదావరి అనుబంధ పాయలోని తాత్కాలిక దారి తెగిపోయింది. 4 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ 25 గేట్లు అడుగుమేర ఎత్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి జలాశయం 2 గేట్లు ఎత్తారు.