శ్రీలంక క్రికెటర్‌తో వైభవ్ సూర్యవంశీ గొడవ, ఇలాంటి ఘటనలపై చర్యలకు నిబంధనలు ఎలా ఉన్నాయంటే..

ఫొటో సోర్స్, Ashley Allen-ICC/ICC via Getty Images
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచాడు.
సోమవారం జరిగిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక 'ఎ' చేతిలో భారత్ 'ఎ' ఓడిపోయిన తర్వాత, అతను మైదానంలో శ్రీలంక క్రికెటర్‌తో వాగ్వాదానికి దిగాడు.
దంబుల్లాలో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ముగింపులో, వైభవ్ సూర్యవంశీ, శ్రీలంకకు చెందిన విషెన్ హలంబగే మైదానంలో గొడవపడ్డారు.
ఆ సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీలంక 'ఎ' వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకుని ఆ ఇద్దరినీ విడదీశాడు.
ఇప్పుడు అందరి దృష్టి మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జైప్రకాశ్‌పై ఉంది. ఆయన ఈ ఇద్దరు ఆటగాళ్లపై అధికారిక చర్య తీసుకుంటారా లేక కేవలం హెచ్చరించి వదిలేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరం.

‘‘అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు, సహాయక సిబ్బంది, అంపైర్, మ్యాచ్ రిఫరీ లేదా మరే ఇతర వ్యక్తినైనా (ప్రేక్షకులతో సహా) శారీరకంగా తాకడం/అనుచితంగా స్పృశించడం (ఇనప్రొప్రియేట్ ఫిజికల్ కాంటాక్ట్) ఉల్లంఘన కిందికే వస్తుంది’’ అని ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 చెబుతోంది.
"క్రికెట్‌లో ఏ రూపంలోనైనా అనుచితమైన శారీరక స్పర్శ నిషేధం. ఒక ఆటగాడు ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంగా లేదా అజాగ్రత్తగా మరో ఆటగాడిని లేదా అంపైర్‌ను ఢీకొట్టినా, గుద్దుకున్నా, లేదా భుజంతో బలంగా కొట్టినా, దాన్ని ఉల్లంఘనకిందే పరిగణిస్తారు"అని నిబంధనలు చెబుతున్నాయి.
అయితే ఆ తీవ్రతను నిర్ణయించేటప్పుడు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
- ఘటన జరిగిన పూర్తి పరిస్థితులు, అందులో శారీరకంగా తగలడం అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, నిర్లక్ష్యం వల్లా, అజాగ్రత్త వల్ల జరిగిందా లేదా దాన్ని నివారించవచ్చా అనేది.
- ఎంత బలంగా ఎదుటి వ్యక్తిని తోశారు/కొట్టారు అనేది.
- దానివల్ల అవతలి వ్యక్తికి ఏదైనా గాయం అయిందా.
- దెబ్బతగిలిన అవతలి వ్యక్తి ఎవరు.

ఫొటో సోర్స్, Reuters
ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఇండియా 'ఎ' ఓటమి
దంబుల్లాలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 'ఎ' జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసింది.
తర్వాత బరిలో దిగిన శ్రీలంక 'ఎ' జట్టు కూడా 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది.
సూపర్ ఓవర్‌లో శ్రీలంక 'ఎ' 16 పరుగులు చేయగా, భారత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో శ్రీలంక విజయం సాధించింది.
అరంగేట్రం చేసిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కుగతాస్ మథులన్ అద్భుతంగా బౌలింగ్ చేసి, వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గేలకు భారీ షాట్లు ఆడే అవకాశం ఇవ్వకుండా శ్రీలంక 'ఎ' జట్టుకు విజయాన్ని అందించాడు.
అంతకుముందు భారత్-ఎ మొదట తడబడినా తర్వాత పుంజుకుని మ్యాచ్‌లో తన అవకాశాలను నిలబెట్టుకుంది.
143 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, సూర్యాంశ్ షెడ్గే, విప్రాజ్ నిగమ్ ఎనిమిదో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారి భాగస్వామ్యం ఇండియా 'ఎ' జట్టును 265 పరుగులకు చేర్చడంతో పోరు ఉత్కంఠభరితంగా మారింది.
లక్ష్య ఛేదనలో శ్రీలంక-ఎ తరఫున సదీర సమరవిక్రమ 93 పరుగులతో నిలకడైన ఇన్నింగ్స్ ఆడి, జట్టును బలమైన స్థితికి చేర్చాడు.
అయితే అర్షద్ ఖాన్ బౌలింగ్‌తో ఇండియా 'ఎ' జట్టు చివరికి పుంజుకుంది. అతను చివరి ఓవర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చి, శ్రీలంకను ఓటమి అంచుకు తీసుకువచ్చాడు.
తర్వాత మైదానంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఆటగాళ్ల కోపం స్పష్టంగా కనిపించడంతో, వాతావరణం వేడెక్కింది.
చివరికి సూపర్ ఓవర్‌లో గెలిచిన శ్రీలంక 'ఎ' జట్టు రెండు పాయింట్లు సాధించింది. దీంతో ఫైనల్‌లో వారి స్థానం దాదాపు ఖాయమైనట్లే భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Ashley Allen-ICC/ICC via Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై మాజీ క్రికెటర్లు, నిపుణుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
"ఐపీఎల్‌లో ఉండే కెమెరాలు ఈ మ్యాచ్‌లలో ఉండవు. సూపర్ ఓవర్‌లో నో-బాల్ నిర్ణయం వివాదాస్పదమైంది. సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడానికి శ్రీలంక ఆలస్యంగా రావడం ఇండియా 'ఎ' జట్టుకు ఆగ్రహం తెప్పించింది. భారత జట్టు ఆగ్రహం అర్థం చేసుకోదగినదే, అయితే శ్రీలంక చేసింది కేవలం ప్రత్యర్థి జట్టుపై మానసిక ఒత్తిడి తెచ్చే వ్యూహంలో (మైండ్ గేమ్స్) భాగం మాత్రమే" అని భారత మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
"వైభవ్ సచిన్ కంటే చాలా చిన్నవాడు, ఆ గొప్ప ఆటగాడి నుంచి వైభవ్ నేర్చుకోవాలి. మైదానంలో కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మన ఆలోచనా విధానం మారిపోతుంది. ఈ ఘటన నుంచి అతను పాఠం నేర్చుకుంటాడని నమ్ముతున్నా. మనందరం తప్పులు చేస్తాం, అతను కూడా అందుకు మినహాయింపు కాదు. నేర్చుకోవడం, మెరుగుపడటం ముందుకు వెళ్లే మార్గం" అని సీనియర్ క్రీడా జర్నలిస్ట్ బోరియా మజుందార్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు.
"వైభవ్‌కు కేవలం 15 ఏళ్లు. ఈ ప్రయాణంలో అతను చాలా నేర్చుకుంటాడు. మనం ఆ కుర్రాడికి కొంత సమయం ఇవ్వాలి. వైభవ్ వెనక్కి వెళ్తుంటే, శ్రీలంక బౌలర్ అతన్ని రెచ్చగొట్టాడాన్ని విస్మరించకూడదు. ఏదో మాట అనడంతోనే అతను తిరిగి వచ్చాడు" అని సీనియర్ జర్నలిస్ట్ కుషన్ సర్కార్ ఎక్స్‌లో రాశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























