రోప్-జంపింగ్: తాడు కట్టకుండానే యువతిని నెట్టేసిన సిబ్బంది..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఒలీవియా ఐర్లాండ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
వినోదంలో విషాద ఘటన బ్రెజిల్‌లో జరిగింది. రోప్ జంపింగ్‌లో భాగంగా తాడును అమర్చకుండానే వంతెనపై నుంచి ఒక యువతిని వదిలేయడంతో ఆమె మరణించింది.
ఈ ఘటనలో సదరు యువతి మృతి చెందగా, పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
సావో పాలో రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వీకెండ్‌లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
శనివారం జరిగిన ఈ ఘటనలో 21 ఏళ్ల మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రెయిటాస్‌ను వాడుకలో లేని ఓ వంతెన అంచుకు తీసుకెళ్లి కొందరు కిందకు నెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
సుమారు 40 మీటర్ల ఎత్తు నుంచి ఆమె కిందపడగా, ఘటనాస్థలికి చేరుకున్న అత్యవసర సహాయక సిబ్బంది ఆమె అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.
అయితే, ఆ ముగ్గురు వ్యక్తులు హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆ యువతిని అలా వదిలేశారా లేక అలాంటి ఉద్దేశం లేకపోయినా ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని స్థానిక వార్తా వెబ్‌సైట్ ‘గ్లోబో’ వెల్లడించింది.
సావో పాలో రాష్ట్రంలోని లిమెయిరా, కోర్డెయిరోపోలిస్ పట్టణాల సరిహద్దులో ఉన్న పొంటే దొ ఎస్కెలెటో దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

ఫొటో సోర్స్, Google
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో తెల్లటి హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు యువతి చేతులను పట్టుకుని ఉండగా, మరో వ్యక్తి ఆమె కాళ్లను పట్టుకుని కనిపిస్తున్నారు
యువతిని వంతెనపై నుంచి నెట్టేసిన వెంటనే అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు తాడును అమర్చాలని సిబ్బందిను హెచ్చరిస్తూ అరుస్తున్నట్లు వీడియోలో ఉంది.
అరెస్ట్ అయిన ముగ్గురు వ్యక్తులు తాడుకు అనుసంధానించిన హార్నెస్‌లు ధరించి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే యువతికి అలాంటి రక్షణ పరికరాలు అమర్చలేదని ప్రాథమికంగా తెలుస్తోంది.
మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రెయిటాస్ అంత్యక్రియలు మరుసటి రోజే నిర్వహించారు.
రోప్ జంపింగ్ అనేది బంజీ జంపింగ్‌కు భిన్నమైన సాహస క్రీడ. ఇందులో తక్కువ సాగుదల కలిగిన తాళ్లను ఉపయోగిస్తారు. కిందకు పడే వేగాన్ని అవి అడ్డంగా పెండ్యులమ్ వంటి కదలిక మాదిరిగా మారుస్తాయి. బంజీ జంపింగ్‌లో మాత్రం సాగే గుణం ఉండే రబ్బరు తాడును ఉపయోగించడం వల్ల పైకి, కిందికి ఊగే కదలిక ఏర్పడుతుంది.
'స్కెలెటన్ బ్రిడ్జ్'గా పిలిచే ఈ వంతెన ఎన్నో ఏళ్లుగా వాడుకలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. దర్యాప్తులో అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రెజిల్ ఫెడరల్ ఆస్సెట్స్ కార్యదర్శి తెలిపారు.
వంతెన నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని లిమెయిరా నగర పాలక సంస్థ వ్యాఖ్యానించింది.
ఈ ప్రాంతానికి బాధ్యత వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోవాలని తాము ఇప్పటికే పలుమార్లు కోరినట్లు నగర పాలక సంస్థ వెల్లడించింది.
రోప్ జంపింగ్ కార్యకలాపాలను నిర్వహించిన వారు ఓ ప్రైవేటు సంస్థకు చెందిన శిక్షకులని స్థానిక అధికారులు తెలిపారు. అయితే కొన్ని స్థానిక మీడియా కథనాలు మాత్రం వారు అధికారిక సంస్థకు చెందినవారు కాదని అనధికారికంగా ఈ క్రీడను నిర్వహించే బృందాలకు చెందినవారై ఉండొచ్చని పేర్కొన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























