ఎయిరిండియా విమానం కూలుతున్న వీడియో తీసిన ఆర్యన్ ఆ తరువాత మళ్లీ ఏ విమానాన్నీ ఎందుకు వీడియో తీయలేదు?

ఫొటో సోర్స్, Pavan Jaishwal
- రచయిత, రాక్సీ గాగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఆర్యన్ ఇప్పుడు గుజరాత్‌లోని సాబర్కాంఠ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఉంటున్నారు. ఆయన వయస్సు 17 ఏళ్లు. ఆర్యన్ 2025 జూన్ 12న అహ్మదాబాద్‌కు వెళ్లారు. ఆయన అక్కడికి వెళ్లగానే, ఆకాశంలో ఎగురుతున్న ఒక విమానాన్ని చూశారు.
వెంటనే తన ఫోన్ తీసి ఎగురుతున్న ఆ విమానాన్ని వీడియో తీయడం మొదలుపెట్టారు. కానీ, కొద్ది సెకన్లలోనే ఆ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు సహా మొత్తం 260 మంది చనిపోయారు.
విమానం కూలిన ఘటనకు సంబంధించి ఆర్యన్ తన మొబైల్‌లో రికార్డ్ చేసిన ఆ వీడియోనే ఏకైక, అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది.
బీబీసీ గుజరాతీ బృందం 2025 జూన్ 13న ఆర్యన్‌ను కలిసి ఇంటర్వ్యూ చేసింది. ఇది జరిగి ఏడాది గడిచింది. ఇప్పుడు ఆర్యన్ తన సొంతూరిలో ఉంటున్నారు. విమానాలను ఇప్పుడు వీడియో తీయాలంటే భయపడుతున్నారు.

‘వీడియో భాయ్’గా గుర్తింపు
ఆర్యన్ తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి సాబర్కాంఠలోని ఖాన్‌పూర్ గ్రామంలో నివసిస్తున్నారు. ఆయన ఈ మధ్యే 12వ తరగతి పాసయ్యారు. ఇప్పుడు కాలేజీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు.
తాజాగా బీబీసీ గుజరాతీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, గత ఏడాది కాలంలో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆర్యన్ మాట్లాడారు.
ఇరుగుపొరుగు వాళ్లు తనకు పెట్టిన కొత్త పేరు గురించి కూడా చెప్పారు. ప్రస్తుతం తన స్నేహితులు, స్థానికులు తనను 'వీడియో భాయ్' అని పిలుస్తున్నారని బీబీసీకి చెప్పారు.
ఎక్కడికి వెళ్లినా తనను ముందుగా 'అసలు ఆ వీడియో ఎలా తీశావు?' అని అడుగుతుంటారని ఆర్యన్ తెలిపారు. ఆర్యన్ చాలా నెమ్మదస్తుడు, తక్కువగా మాట్లాడుతుంటాడు. ఆయనకు వీడియోలు తీయడం ఒక హాబీ. వీలు చిక్కినప్పుడల్లా చుట్టుపక్కల జరిగే ప్రతీ దాన్ని వీడియో తీస్తుంటారు. అలాగే ఒకరోజు వీడియో తీస్తూ, ఎయిరిండియా 171 దుర్ఘటనను కూడా రికార్డు చేశారు.

కూలుతున్న విమానం వీడియో ఎలా తీశారు?
ఎయిరిండియా 171 విమానం కూలుతుండగా తాను వీడియో తీసినప్పుడు ఏం జరిగిందో తాజాగా బీబీసీ గుజరాతీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యన్ వివరించారు. ఆ సమయంలో తాను మేఘానీనగర్‌లోని తన ఇంటి టెర్రస్‌పై ఉన్నట్లు చెప్పారు.
''నేను, మా అక్క ఇద్దరం అప్పుడే ఊరి నుంచి బస్సులో వచ్చాం. ఊరి నుంచి పొద్దున బయల్దేరితే అహ్మదాబాద్ వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. నేను డాబాపై తిరుగుతున్నా. మా అక్క అక్కడే ఉన్న ఒక గదిలో ఉంది. అప్పటికే మా నాన్న పనికి వెళ్లాడు. నేను ఫోన్ పట్టుకొని చుట్టుపక్కల ఉన్న ఇళ్ల ఫోటోలు తీస్తున్నా'' అని ఆర్యన్ వివరించారు.
ఆర్యన్ వాళ్ల ఇల్లు విమానాశ్రయం రన్‌వేకి చాలా దగ్గరగా ఉంటుంది. వారి ఇంటి వెనుక వైపు ఎయిర్‌పోర్ట్ రన్‌వే ఉంటే, మరోవైపు ఎయిరిండియా విమానం 171 కూలిపోయిన ఐజీ కాంప్లెక్స్ ఉంది.
''రన్‌వే నుంచి ఒక విమానం టేకాఫ్ అవ్వడం చూశాను. ఏదో సరదాగా, కుతూహలంతో దాన్ని వీడియో తీయడం మొదలుపెట్టాను. ఆ విమానం కొంచెం పైకి లేచి మళ్లీ కిందికి వచ్చింది. ఆపై మరోసారి పైకి లేచి, ముందుకు దూసుకెళ్లి కింద పడిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, క్షణాల్లో పొగ కమ్మేసింది. అది చూసి నేను చాలా భయపడ్డాను'' అని ఆర్యన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Pavan Jaishwal
‘బయటకు వచ్చి చూస్తే అంతా పొగ మాత్రమే కనిపించింది’
వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన అక్క నీలమ్ అసారికి విమానం కూలిపోయిందని చెప్పానని ఆర్యన్ అన్నారు.
'నేను బయటకు వచ్చి చూసేసరికి అక్కడ అంతా దట్టమైన పొగ మాత్రమే కనిపించింది. వెంటనే నాన్నకు ఫోన్ చేశాను. ఆయన కొద్దిసేపట్లోనే ఇంటికి వచ్చారు. భయపడొద్దని, ఏం కాదంటూ మాకు చెప్పారు' అని నీలమ్ గుర్తు చేసుకున్నారు.
అప్పటినుంచి అందరూ ఆర్యన్‌ను 'వీడియో బాయ్' అని పిలవడం మొదలుపెట్టారు.
ఆ వీడియో బయటకు వచ్చాక, అందరికంటే ముందుగా ఆర్యన్‌ను బీబీసీ గుజరాతీ సంప్రదించింది. ''వీడియో వైరల్ అయ్యాక మొదట ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కొందరు వచ్చారు. వారు నా నుంచి వీడియోకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత బీబీసీ గుజరాతీ టీమ్ నన్ను కాంటాక్ట్ చేసింది'' అని ఆర్యన్ చెప్పారు.
ఆ తర్వాత ఆ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో ఆర్యన్ రాత్రికి రాత్రే మీడియా దృష్టిలో పడ్డారు.
ఆ తర్వాత పరిణామాల గురించి ఆర్యన్ తండ్రి మగన్‌భాయి అసారి, బీబీసీకి వివరించారు.
''అతనిపై మీడియా దృష్టి ఎంత ఎక్కువగా పడిందంటే, మేం అతన్ని అహ్మదాబాద్ నుంచి సాబర్కాంఠలోని మా సొంతూరికి పంపించాల్సి వచ్చింది. మీడియా వాళ్లతో మాట్లాడి మాట్లాడి ఆర్యన్ బాగా విసిగిపోయాడు. ఎవరితోనూ మాట్లాడటం ఆర్యన్‌కు నచ్చలేదు. అందుకే అతన్ని మేం ఊరికి తీసుకొచ్చేశాం" అని మగన్‌భాయి చెప్పారు.
"ఊళ్లో వాళ్లంతా అతన్ని 'వీడియో తీసిన అబ్బాయి' అంటూ పిలుస్తున్నారు'' అని నీలమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్యన్ ఇప్పుడు విమానాల వీడియోలు ఎందుకు తీయడం లేదు?
''నువ్వు చాలా ఫేమస్ అయిపోయావని అందరూ నాతో అంటున్నారు. ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో మీడియాకు, అధికారులకు సహాయం చేసి చాలా మంచి పని చేశావని మా టీచర్స్ నన్ను మెచ్చుకున్నారు. అది వినడానికి బాగుంది. కానీ, ఆ ఘటన నా మనసును చాలా బాధించింది'' అని ఆర్యన్ చెప్పారు.
ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి తాను మళ్లీ ఏ విమానాన్ని వీడియో తీయలేదని ఆర్యన్ తెలిపారు.
''నేను మళ్లీ ఏదైనా విమానాన్ని వీడియో తీస్తే, అది కూడా ఎక్కడ కూలిపోతుందో, మళ్లీ జనాలు చనిపోతారేమోననే భయం నా మనసులో నాటుకుపోయింది. అందుకే నేను ఇక విమానాల వీడియోలు తీయడం మానేశాను" అని ఆర్యన్ తన భయాన్ని పంచుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























