మామను హత్య చేసినా కోడలిని అరెస్టు చేయని పోలీసులు, ఎందుకంటే..

నేరాలు, అత్యాచారం, రేప్, లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విజయానంద్ ఆరుముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

అసభ్యంగా ప్రవర్తించిన తన మామను హత్య చేసినట్లు చెబుతున్న మహిళపై చెన్నైలో పోలీసు కేసు నమోదైంది.

"హత్య కేసు నమోదు చేసినప్పటికీ, ఆత్మరక్షణ కోసం ఆమె ఈ చర్యకు పాల్పడడం వల్ల ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు" అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒకరు బీబీసీకి తెలిపారు.

"అయితే, అరెస్టు కాకపోయినప్పటికీ ఆమె కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది" అని న్యాయవాదులు అంటున్నారు.

ఈ ఘటన జూలై 1న చెన్నైలో జరిగింది. చేపల వ్యాపారం చేసే పెద్ద వయస్కుడైన మామ, తనతో పదేపదే అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించినట్లు 28 ఏళ్ల మహిళ పోలీసులకు తెలిపారు.

సదరు చేపల వ్యాపారి కుమారుడు 4 నెలల కిందట అనారోగ్యంతో మరణించారు. తన ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి ఆ మహిళ అదే ఇంట్లో ఉంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కేసు విచారణ జరుపుతున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం, గత కొద్ది నెలలుగా కోడలిని మామ లైంగికంగా వేధిస్తున్నారు.

"ఆయనో చేపల వ్యాపారి. 'నేనే నిన్ను పోషిస్తున్నాను, కాబట్టి నువ్వు నా కోరిక తీర్చాలి' అంటూ కోడలిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు" అని ఇన్‌స్పెక్టర్ బీబీసీతో చెప్పారు.

మామ చేష్టల గురించి కోడలు తన అత్తకు చెప్పారు. ఈ విషయమై అత్తమామల మధ్య వివాదం తలెత్తింది. "మామతో గొడవపడిన అత్త, తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది" అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

నేరాలు, అత్యాచారం, రేప్, లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య : పోలీస్ ఇన్‌స్పెక్టర్

పోలీసుల నివేదిక ప్రకారం, బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తన పిల్లలతో కలిసి నిద్రిస్తుండగా, మామ కోడలిపై లైంగిక దాడికి యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఆమె తనను తాను రక్షించుకునే క్రమంలో, చేతికందిన ఆయుధంతో ఆయనపై దాడి చేశారు" అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

ఆ వ్యక్తి సంఘటనా స్థలంలోనే చనిపోయారని, అనంతరం ఆమె ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పారని అన్నారు.వారు పోలీసులకు సమాచారం అందించారు, ఈ ఘటనపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

"నిందితురాలు ఆత్మరక్షణలో భాగంగా ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అందువల్ల, బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్‌ 34 కూడా చేర్చాలని సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని చార్జిషీట్‌లో ప్రస్తావిస్తాం" అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 34 ఆత్మరక్షణ హక్కు గురించి తెలియజేస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం, 'ఎవరైనా ఒక వ్యక్తి తనను లేదా తన ఆస్తులను ప్రమాదం నుంచి రక్షించుకునేందుకు చేసే చర్యను నేరంగా పరిగణించరు'

"ఇది ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య కాబట్టి, ఇప్పుడే కోర్టుకు నివేదించాల్సిన అవసరం ఉండదు. చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో నివేదిస్తాం" అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

ఈ కేసులో సదరు మహిళను అరెస్టు చేయలేదు. "మెట్టినింటి కుటుంబ సభ్యులతో సహా బంధువులంతా ఆమెకు మద్దతుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు చేయాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.

మామ ప్రవర్తన గురించి కుటుంబ సభ్యులందరికీ తెలుసని, అయితే ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదులూ నమోదు కాలేదని, వారు ఈ విషయాన్ని బయటపెట్టలేదని ఆయన చెప్పారు.

"నేరానికి పాల్పడిన మహిళకు మానసికంగా ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చారా?" అని అడిగినప్పుడు ఇన్‌స్పెక్టర్ స్పందిస్తూ "ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమెకు ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం లేదు" అని అన్నారు.

నేరాలు, అత్యాచారం, రేప్, లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, FB/Shanthakumari

ఫొటో క్యాప్షన్, న్యాయవాది శాంతా కుమారి.

'హత్యగా పరిగణించలేం'

"ఆత్మరక్షణ కోసం దాడి చేయడం ఒక వ్యక్తి హక్కు అని బీఎన్ఎస్ చట్టం 34 చెబుతోంది. అందువల్ల, ఆ మహిళను పోలీసులు అరెస్టు చేయకపోవడం సరైన చర్యే" అని తమిళనాడు మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు శాంతాకుమారి అన్నారు.

"ఆ వ్యక్తి పదేపదే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఆమె నిరంతరం నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందువల్ల, దీనిని హత్యగా పరిగణించలేం" అని ఆమె తెలిపారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ, "ఆత్మరక్షణ కోసం జరిగిన ఘర్షణలో ఆమె మామ చనిపోయారు. అయితే, ఆమె ఈ విషయాన్ని కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది" అన్నారు.

దర్శన్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసు

ఈ సందర్భంగా 2010 నాటి దర్శన్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసును శాంతా కుమారి ఉదహరించారు.

1991లో పంజాబ్‌లోని లూధియానాలో భూ వివాదానికి సంబంధించి జరిగిన ఘర్షణలో, ఆత్మరక్షణ కోసం దర్శన్ సింగ్ ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఇది చట్టప్రకారం నేరం కాదని సుప్రీం కోర్టు అప్పట్లో తీర్పు ఇచ్చింది.

"తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం జరిగే పోరాటంలో ఒక వ్యక్తి ప్రత్యర్థిని చంపినా లేదా తీవ్రంగా గాయపరిచినా నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తీర్పు చెబుతోంది" అని శాంతాకుమారి అన్నారు.

"ఈ ప్రత్యేకమైన కేసులో, ఆ మహిళ తనను తాను రక్షించుకోవడం కోసమే ఇలా చేసినట్లు పరిగణిస్తారు" అన్నారు శాంతా కుమారి.

నేరాలు, అత్యాచారం, రేప్, లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

మదురై సంఘటన

2012లో, మదురైలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

భార్య భర్తను చంపిన ఈ కేసులో.. తనను తాను రక్షించుకునేందుకు, తన కూతురిని కాపాడుకునేందుకు జరిగిన 'ఆత్మరక్షణ' చర్యగా పేర్కొంటూ పోలీస్ సూపరింటెండెంట్ ఆ మహిళను విడుదల చేశారు.

మదురైలో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో, తమ 19 ఏళ్ల కుమార్తెపై భర్త అత్యాచారానికి యత్నించడంతో భార్య ఆయనపై కర్రతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో భర్త చనిపోయారు.

"ఆత్మరక్షణ కోసం, కూతురిని కాపాడుకునే క్రమంలో జరిగిన పోరాటంలో ఈ హత్య జరిగినట్లు విచారణలో తేలింది. అందుకే ఆమెను విడుదల చేశాం" అని అప్పటి మదురై ఎస్పీ ఆస్రా గార్గ్ ఒక ఇంగ్లిష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ దంపతులు 2007లో విడాకులు తీసుకున్నారు. అయినా, 2011లో మళ్లీ కలిసే ఉంటున్నారు. వారి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.

తమ పెద్ద కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించడంతో, 2012 మే నెలలో భర్తను భార్య హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేసే హక్కును ఐపీసీ సెక్షన్ 100 వివరిస్తుంది. ఈ సెక్షన్ కింద ఆమె విడుదలయ్యారు. ఐపీసీ 100 సెక్షన్‌ను ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 34గా మార్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.