మాయ అక్రమ రవాణా: పాకిస్తాన్‌లో 500 కిలోల ప్లాసెంటాను అక్రమంగా తరలిస్తుండగా సీజ్, చైనాలో ఈ అవయవానికి ఎందుకంత డిమాండ్?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అసద్ సోహెబ్, షాజాద్ మాలిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఒక పోలీస్ ఆపరేషన్‌లో 500 కేజీల మాయ (హ్యూమన్ ప్లాసెంటా)ను స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఏఐ) ప్రకటించింది.

ఈ తరహా మొట్టమొదటి ఆపరేషన్‌లో, మానవ అవయవాలను అక్రమంగా విక్రయించడంలో ప్రమేయం ఉన్న ముగ్గురు చైనా దేశస్తులతో సహా మొత్తం ఐదుగురిని ఎఫ్ఏఐ అరెస్ట్ చేసింది.

ప్లాసెంటా అనేది గర్భధారణ సమయంలో తల్లి గర్భాశయంలో ఏర్పడే ఒక అవయవం. ఇది బొడ్డు తాడు ద్వారా పిండానికి అనుసంధానమై ఉంటుంది. ప్లాసెంటా పిండానికి అవసరమైన ఆక్సిజన్‌ను, పోషకాలను అందిస్తుంది. పిండం రక్తంలో ఉండే వ్యర్థాలను బయటికి పంపుతుంది.

ఎఫ్ఏఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో.. నిందితులు మానవ ప్లాసెంటాలను 'గొర్రెల ప్లాసెంటా'గా చెబుతూ.. వాణిజ్య అవసరాల కోసం విదేశాలకు పంపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొంది.

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, స్వాధీనం చేసుకున్న శాంపిళ్లను తదుపరి చర్యల కోసం పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)కు పంపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పిమ్స్ ఈ శాంపిళ్లను సేకరించి, లాహోర్‌లోని పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీకి పంపిందని, వారి తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ అథారిటీ (హెచ్ఓటీఏ) పర్యవేక్షణ అధికారి హీనా కన్వాల్ బీబీసీ ఉర్దూతో చెప్పారు.

ఈ కేసును విచారించేందుకు ఎఫ్ఐఏ నియమించిన హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ అథారిటీ అధికారి హీనా కన్వాల్.

స్వాధీనం చేసుకున్న మానవ మాయలు (ప్లాసెంటాలు) నిందితులు డబ్బు చెల్లించి వివిధ ఆసుపత్రుల నుంచి సేకరించినవేనని చెప్పారు.

హెచ్ఓటీఏ సహకారంతో ఎఫ్ఏఐ ఈ ఆపరేషన్‌ను ఇస్లామాబాద్‌లోని రెండు సెక్టార్లలో నిర్వహించింది. హెచ్‌ఓటీఏ అధికారి ఫిర్యాదు మేరకు ముగ్గురు చైనా, ఇద్దరు పాకిస్తానీ దేశస్తులపై కేసు నమోదైంది.

''గతంలో అక్రమ అవయవ మార్పిడిలకు సంబంధించి ఎఫ్ఐఏ పలు చర్యలు తీసుకుంది. కానీ, హ్యూమన్ ప్లాసెంటాను విక్రయించడం, దానిలో ఒక అంతర్జాతీయ గ్రూప్ ప్రమేయం ఉన్న మొదటి కేసు ఇదే'' అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎఫ్ఐఏ అధికారి తెలిపారు.

హ్యూమన్ ప్లాసెంటా అంటే ఏంటి? అంతర్జాతీయ మార్కెట్‌లో దాని విలువ ఎంత? దేనికి దీన్ని వాడతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు, ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఏం పేర్కొన్నారో తెలుసుకుందాం..

ప్లాసెంటా అక్రమ రవాణా, పాకిస్తాన్, చైనా

ఇస్లామాబాద్‌లో రెండు ప్రాంతాల్లో దాడులు

ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. ఆ ఇంటిని హ్యూమన్ ప్లాసెంటాను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి కేంద్రంగా మార్చారని దాడుల సమయంలో గుర్తించారు.

ఈ వ్యాపారంలో ప్రమేయం ఉన్న ఆరోపణలపై ముగ్గురు చైనా, ఇద్దరు పాకిస్తానీ దేశస్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

సెక్టార్ ఈ-11లో మరో ప్రాంతంలో ఇలాంటి కార్యకలాపాలే సాగుతున్నాయని అరెస్ట్ చేసిన చైనా దేశస్థులను విచారించినప్పుడు వెల్లడైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో చెప్పారు.

ఆ తర్వాత వెంటనే అక్కడ కూడా దాడులు చేయగా.. పలు కంటైనర్లలో, ఫ్రిజ్‌లలో దాచి ఉంచిన మాయలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఆ ఇంటి నుంచి ఇద్దరు పాకిస్తాన్ దేశస్థులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో వారి ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోంది.

పైన పేర్కొన్న వారందరితో పాటు, మరో చైనా దేశస్థుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్‌‌లో పేర్కొన్నారు.

పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 109తో పాటు, మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం, 2010లోని సెక్షన్లు 11, 12 (వాణిజ్య ప్రయోజనాల కోసం మానవ అవయవాల వాడకం) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా పడొచ్చు.

ప్లాసెంటా అక్రమ రవాణా, పాకిస్తాన్, చైనా

ఫొటో సోర్స్, FIA

విచారణలో ఏం తెలిసింది?

ఎఫ్ఐఏ ప్రకారం.. ఈ విషయంపై విచారణ చేసేందుకు వారు ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు.

''అక్రమ మానవ అవయవాల రవాణాపై ఎఫ్‌ఏఐ గతంలో కూడా పలు చర్యలు తీసుకుంది. కానీ, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న హ్యూమన్ ప్లాసెంటా ట్రేడింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించి పట్టుకున్న తొలి కేసు ఇదే. ఈ దాడిలో 500 కేజీలకు పైగా ప్లాసెంటాను స్వాధీన చేసుకున్నారు. విచారణ జరుగుతుండటంతో మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి'' అని విచారణలో పాల్గొన్న ఒక అధికారి బీబీసీకి తెలిపారు.

''నిందితుల నుంచి వీటి ప్రాసెసింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను, తయారైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం'' అని ఎఫ్ఐఏ జారీ చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.

మరోవైపు.. ఇస్లామాబాద్, రావల్పిండిలోని ఆసుపత్రుల నుంచి నిందితులు ఒక్కో ప్లాసెంటాను రూ. 800 ధరకు కొనుగోలు చేస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని హెచ్ఓటీఏ మానిటరింగ్ ఆఫీసర్ హీనా కన్వాల్ బీబీసీకి తెలిపారు.

అంతేకాకుండా, స్వాధీనం చేసుకున్న ప్లాసెంటాను విదేశాలకు అక్రమంగా తరలించాలనేది వారి ఉద్దేశమని చెప్పారు.

అధికారులు పట్టుకున్న ప్లాసెంటా లక్షల రూపాయల విలువైనదని ఎఫ్ఐఏ చెబుతున్నట్లు హీనా కన్వాల్ తెలిపారు.

''ఇది హ్యూమన్ ప్లాసెంటా కాదని తొలుత నిందితుడు చెప్పాడు. అది గొర్రె ప్లాసెంటా అని, దాన్ని వాణిజ్య అవసరాల కోసం విదేశాలకు పంపాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే, విచారణలో అది హ్యూమన్ ప్లాసెంటాగా నిందితుడు ఒప్పుకున్నాడు. కానీ, పాకిస్తానీ చట్టం ప్రకారం.. విచారణలో ఒప్పుకున్న ఏదీ కూడా కోర్టు ముందు చెప్పకపోతే దానికి విలువ ఉండదు'' అని హీనా కన్వాల్ తెలిపారు.

ప్లాసెంటా అక్రమ రవాణా, పాకిస్తాన్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్వాధీనం చేసుకున్న బొడ్డు తాడు శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల కోసం పాకిస్తాన్‌లోని పిమ్స్‌ ఆస్పత్రికి (పీఐఎంఎస్‌కు) పంపారు.

ప్లాసెంటా అంటే ఏమిటి?

అమెరికాలోని మాయో క్లినిక్ ప్రకారం..

‘‘గర్భధారణ సమయంలో తల్లి గర్భాయశంలో ఏర్పడే ఒక అవయవమే ప్లాసెంటా. బొడ్డు తాడు అని పిలిచే ఒక గొట్టం ద్వారా ఇది బిడ్డకు అనుసంధానమై ఉంటుంది.

''ఇదే బొడ్డు తాడు గుండా.. బిడ్డకు అవసరమైన పోషకాలను, ఆక్సీజన్‌ను ప్లాసెంటా సరఫరా చేస్తుంది. శిశువు రక్తంలో వ్యర్థాలను కూడా తొలగిస్తుంది''

సహజ ప్రసవం సమయంలో, కొంత సమయం తర్వాత బిడ్డ బయటికి వచ్చిన మార్గంలో ప్లాసెంటా కూడా బయటికి వచ్చేస్తుంది. దీన్నే పురిటినొప్పుల్లో మూడో దశ అంటారు. ఒకవేళ నవజాత శిశువు సర్జకల్‌గా లేదా సీ-సెక్షన్ (సిజెరియన్) ద్వారా పుడితే.. అదే ప్రక్రియ ద్వారా తల్లి గర్భాశయం నుంచి ప్లాసెంటాను డాక్టర్లు తీసేస్తారు.

ప్లాసెంటా అనేది జన్యుపరంగా పిండంలోని ఒక భాగమని గైనకాలజిస్ట్ డాక్టర్ సదా తారిఖ్ చెప్పారు.

‘‘మనిషి శరీరంలో ఇదొక తాత్కాలిక అవయవం. తల్లి, గర్భాశయం మధ్య ఒక అనుసంధానత కోసం ఇది సహజంగా ఏర్పడుతుంది. శిశువు పుట్టిన తర్వాత... ఇది బయటికి వచ్చేస్తుంది''అని పేర్కొన్నారు.

ప్లాసెంటా అక్రమ రవాణా, పాకిస్తాన్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

శరీరం నుంచి బొడ్డు తాడు తీసేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది?

"బిడ్డ పుట్టిన తర్వాత, ప్లాసెంటా ఒక పాథలాజికల్ వేస్ట్‌గా మారుతుంది, దానిని పారేస్తారని పంజాబ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ రూల్స్, నేషనల్ బయోసేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌లో తెలిసింది. ప్లాసెంటా అనేది అంటువ్యాధి కలిగించే మెడికల్ వేస్ట్. ఎందుకంటే ఇది తల్లి, పిండం మధ్య అన్ని అంటువ్యాధులకు అడ్డుగా ఉంటుంది. అందువల్ల, ఈ వ్యర్థాన్ని నిబంధనల ప్రకారం పారేయాల్సి ఉంటుంది" అని డాక్టర్ సదా తారిఖ్ చెప్పారు.

లేబర్ రూమ్ లేదా ఆపరేషన్ థియేటర్‌లో శిశువు జన్మించిన వెంటనే, ప్లాసెంటాను వేరు చేసి పసుపు రంగు బయోహజార్డ్ వేస్ట్ బ్యాగ్‌లో ఉంచుతారని ఆయన చెప్పారు.

ఇది లీక్ ప్రూఫ్ కంటైనర్, ఈ రకమైన వ్యర్థాలను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఈ కంటైనర్‌ను ఇతర వైద్య వ్యర్థాల కంటైనర్ల నుంచి వేరుగా ఉంచుతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బ్యాగ్‌ను గట్టిగా మూసివేసి, దానిలో ప్లాసెంటా ఉందని సూచించడానికి ఏదైనా ఒక గుర్తు పెడతారు.

''లేబర్ రూమ్ లేదా ఆపరేషన్ థియేటర్ నుంచి దీన్ని తీసి హాస్పిటల్ సెంట్రల్ కూలింగ్ స్టోరేజీ రూమ్‌లో పెడతారు. కుళ్లిపోకుండా, దుర్వాసన రాకుండా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం'' అని సదా తారిఖ్ చెప్పారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. దీన్ని తొలగించిన తర్వాత 24 గంటలకు పైగా ప్లాసెంటాను నిల్వ చేయడానికి వీలు లేదని ఆయన వివరించారు. ఆ తర్వాత, ప్లాసెంటా వంటి రోగ సంబంధిత వ్యర్థాలన్నింటినీ కాల్చివేసే వైద్య ప్రక్రియ ద్వారా పడేస్తారు. అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా, ప్రైవేట్ ఆసుపత్రి అయినా, ప్లాసెంటాను ఒకే విధంగా నాశనం చేస్తారు.

ప్రభుత్వ ఆమోదం పొందిన వ్యర్థాల నిర్వహణ సంస్థలు ఈ పని చేస్తాయని, ఏదైనా ఆసుపత్రి వారికి దీన్ని ఇచ్చినప్పుడు, క్రమం తప్పకుండా రికార్డులు నిర్వహిస్తారని, ఈ రికార్డులను సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని డాక్టర్ సదా తారిఖ్ చెప్పారు.

ప్లాసెంటాను ఎక్కడ వాడతారు?

తల్లి శరీరంలో ఒక భాగంగా ప్లాసెంటా ఉన్నపపుడు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి మహిళా హార్మోన్లు దీనిలో ఎక్కువగా ఉంటాయని డాక్టర్ సదాఫ్ తారిఖ్ వివరించారు.ప్లాసెంటాను చాలా మందుల తయారీలో వాడతారని చెప్పారు.

ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లికి కలిగే డిప్రెషన్‌కు చికిత్స చేసే మందులలో వాడతారని తెలిపారు. ఐరన్ స్థాయిలు పెంచే మందులలో, ప్రసవానంతరం కలిగే రక్తహీనతకు చికిత్స చేసేందుకు ఇది ఉపయోగపడుతుండొచ్చని ఒక పరిశోధన తెలిపింది.

''ప్లాసెంటా లోపల ఉండే పొర ముఖ్యంగా కణజాల వృద్ధిని పెంపొందించే గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని మానని గాయాలు, తీవ్రమైన కాలిన గాయాలు, అల్సర్లు, కంటి గాయాలతో కూడిన శస్త్రచికిత్సలలో కూడా ఉపయోగిస్తారు" అని ఆయన చెప్పారు.

ఫార్మా ఇండస్ట్రీలో ప్లాసెంటాను వాడతారని, అలాగే చైనా ప్రజలు దీన్ని ఒక ఆహారంగా వాడుతున్నట్లు హీనా కన్వాల్ తెలిపారు.

కాస్మెటిక్ సర్జరీలో కూడా దీనికి అత్యధిక డిమాండ్ ఉందన్నారు. పాకిస్తాన్‌లో దీని అమ్మకం, కొనుగోళ్లను నిషేధించారు. ఆస్పత్రి ప్రమేయం లేకుండా ఒక ప్రైవేట్ రెసిడెన్సీకి (ఇంటికి) ప్లాసెంటాను డెలివరీ చేయడం సాధ్యం కాదని తెలిపారు.

చైనాలో హ్యూమన్ ప్లాసెంటాకు చెందిన వాణిజ్యపరమైన అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ.. అండర్‌గ్రౌండ్ మార్కెట్లలో తాజా హ్యూమన్ ప్లాసెంటా అమ్మకాలు సాగుతున్నాయని చైనా ప్రభుత్వ నియంత్రిత వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కేవలం, అది మాత్రమే కాక వివిధ పేర్లపై చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు దీన్ని విక్రయిస్తున్నాయని చెప్పింది.

గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో దీన్ని అమ్మే వ్యక్తి.. ప్లాసెంటా ధర చైనా కరెన్సీ ప్రకారం 360 యువాన్లు (రూ.5 వేలకు పైగా) ఉంటుందని తెలిపారు. ఈ హ్యూమన్ ప్లాసెంటాను ఒక్కో కేజీ 2 వేల యువాన్లకు (సుమారు రూ.28 వేలకు) తాను కొన్నట్లు ఆ వ్యక్తి చెప్పారు.

చైనాలో తల్లులు తమ ప్లాసెంటాను తమ వద్దే ఉంచుకోవాలా లేదా పారవేయాలా అని సాధారణంగా అడుగుతారని షాంఘై పీపుల్స్ హాస్పిటల్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ హువాంగ్ చెంగ్‌షెంగ్ చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

చాలామంది తల్లులు తమ ప్లాసెంటాను ఇంటికి తీసుకెళ్లి, దానిని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారని డాక్టర్ చెంగ్‌షెంగ్ గ్లోబల్ టైమ్స్‌తో చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)