సర్: రెండు చోట్ల ఓటు ఉంటే జైలు శిక్షేనా, ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలి..

మీ ఓటు ఉంటుందా? పోతుందా? ఇప్పుడు చాలామంది చర్చ దీనిపైనే. 'సర్'లో భాగంగా లక్షలాది ఓట్లు గల్లంతు కానున్నాయనే ప్రచారం సాగుతోంది.
పశ్చిమ బెంగాల్‌లో భారీగా ఓట్లు తొలగించారనే ఆరోపణల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఈ 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్)' చుట్టూ విస్తృత చర్చ జరుగుతోంది.
తెలంగాణలో జూన్ 25 నుంచి జులై 24 వరకు 'సర్' ప్రక్రియ చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 6న మొదలైన ఈ ప్రక్రియ, జులై 14తో ముగియనుంది. తెలంగాణలో 89 లక్షల ఓట్లలో 'అసాధారణ' వ్యత్యాసాలు గుర్తించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ దశలో 'సర్' చుట్టూ వస్తున్న అభ్యంతరాలేమిటి? ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలి?రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే ఏం జరుగుతుంది?
ఇలా అనేక అంశాలపై తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి 'బీబీసీ' ఇంటర్వ్యూలో మాట్లాడారు.


ఫొటో సోర్స్, Getty Images
1) జాబితా నుంచి 89 లక్షల మంది ఓటర్లను తొలగిస్తున్నారా?
2002లో జరిగిన 'సర్' తర్వాత విడుదలైన ఓటరు జాబితాతో తాజా ఓటరు జాబితాను మ్యాపింగ్ చేసినప్పుడు 89 లక్షల ఓట్లలో వ్యత్యాసాలు గుర్తించాం. అంటే, ఈ ఓట్లన్నీ తీసివేస్తారని కాదు.
ఓటర్ల పరంగా సుమారు 11 అంశాలలో 'వ్యత్యాసాలు' కనిపించాయి. మ్యాపింగ్ చేసినప్పుడు అప్పటికీ, ఇప్పటికీ పేర్ల అక్షరాల్లో తేడాలు ఉండటం, తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయసు తేడాలు.. లాంటివన్నమాట.
వీటిపై ఓటర్ల నుంచి అభిప్రాయాలు తీసుకుని, ప్రతి ఒక్క ఓటరు నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వోలు) వివరణ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ ఓటరు అక్కడ లేరని నిర్ధరణ అయితేనే జాబితా నుంచి తొలగిస్తారు.

ఫొటో సోర్స్, Diptendu Dutta/NurPhoto via Getty Images
2) ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలి?
ఎన్యుమరేషన్ ఫారంలోని పై భాగంలో 2026 ఎలక్టోరల్ రోల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం పేరు, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం వివరాలు ఫోటోతో సహా ముద్రించి ఉంటాయి. బీఎల్వో పేరు, ఫోన్ నంబరు కూడా ఉంటాయి.
2002లో పేరు ఉన్న ఓటర్లు తర్వాత భాగంలో ఎడమ చేతివైపు తమ వివరాలు నింపుతారు. పేరు, ఓటరు కార్డు వివరాలు, తల్లి లేదా తండ్రి పేరు, వివరాలు రాయాలి.
2002లో పేరు లేకపోతే, కుడిచేతివైపు భాగంలో తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుని పేరు, ఓటర్ కార్డు వివరాలు రాయాల్సి ఉంటుంది.
తర్వాత భాగం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఎన్యుమరేషన్ ఫారం ఎవరి పేరుతో ఉంటుందో వారి వివరాలు.. అంటే సంబంధిత ఓటరు వివరాలు రాయాలి.
ఆ తర్వాత సంతకం చేసి బీఎల్వోకు ఇస్తే, బీఎల్వో సంతకం చేసి ఇస్తారు. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలన్నీ ఈఆర్వోలకు అందజేయాల్సిన బాధ్యత బీఎల్వోలపైనే ఉంది. ఎన్యుమరేషన్ ఫామ్ మీకు అందకపోతే 1950 నంబరుకు ఫోన్ చేసి చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3) ఎన్యుమరేషన్ ఫారంతో ఏవైనా రుజువులు సమర్పించాలా?
2002లో పేరు ఉన్న వారు గానీ, 2002లో తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుని ఓటు వివరాలు ఉంటే.. అలాంటి వారెవరూ రుజువులు సమర్పించనక్కర్లేదు.
చాలామందికి 2002లో పేరు లేకపోయినా, తల్లిదండ్రుల వివరాలు అప్పట్లో లేకపోయినా ఎన్యుమరేషన్ ఫారంలోని మూడో భాగం నింపి ఎన్నికల కేంద్రం సూచించిన డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సమర్పించాలి.
ఆగస్టు, సెప్టెంబరులో నోటీసులు వచ్చిన వారు తమ పౌరసత్వానికి సంబంధించిన రుజువులు సమర్పించాలి.
ఇందులో రెగ్యులర్ ఉద్యోగుల పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా ఐడెంటిటీ కార్డు, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కంపెనీల పెన్షనర్ల కార్డులు, 1987 జులై 1 కంటే ముందు భారత ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు లేదా బ్యాంకులు లేదా పోస్టాఫీసులు లేదా ఎల్ఐసీ లేదా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కంపెనీలు జారీ చేసిన డాక్యుమెంట్లు లేదా సర్టిఫికెట్లు లేదా ఐడెంటిటీ కార్డు, అధీకృత సంస్థలు జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా పాస్‌పోర్టు, యూనివర్సిటీ లేదా గుర్తింపు పొందిన బోర్డులు ఇచ్చిన మెట్రిక్యులేషన్ లేదా విద్యార్హత పత్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే శాశ్వత నివాస ధ్రువపత్రాలు లేదా అటవీ హక్కు సర్టిఫికెట్, అధీకృత సంస్థలు జారీ చేసే ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఏదైనా కుల ధ్రువీకరణ పత్రాలు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్, ఫ్యామిలీ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం.. వీటిలో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు.

4) ఓ వర్గం ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలపై..
'సర్' చేపట్టడం వెనక భారత ఎన్నికల సంఘం ఉద్దేశం ఓట్లు తీసేయాలని కాదు.. ఓటరు జాబితాను శుద్ధి చేయడమే.
ఒక వర్గానికి చెందిన ఓటర్లను తీసేయాలని ఎన్నికల సంఘానికి లేదు. ఉర్దూలో కూడా ఎన్యుమరేషన్ ఫారాలు ముద్రించి ఇవ్వాలనే డిమాండ్ ఉంది.
దీనిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో చర్చిస్తున్నాం. త్వరలోనే ఉర్దూ భాషలో ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తాం. ఇప్పటికే ఉర్దూలో డమ్మీ కాపీ తీసుకెళ్లి అవగాహన కల్పించాలని బీఎల్వోలకు చెప్పాం.
5) బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం లేదన్న విమర్శలు..
తెలంగాణలో ప్రతి బీఎల్వోకు 800-900 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చాం. వాటన్నింటిని ఇంటింటికీ వెళ్లి ఓటరుకు అందించాలి.
తెలంగాణలో మొదటి ఏడు రోజుల్లో 74 శాతం పంపిణీ పూర్తైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 90శాతంగా ఉండగా, జీహెచ్ఎంసీతోపాటు చుట్టుపక్కల అర్బన్ ప్రాంతాల్లో 40-45 శాతం పూర్తైంది.
వారం, పది రోజుల్లో పూర్తి చేయాలని చెప్పాం. అర్బన్ ప్రాంతాల్లో చిరునామాలు గుర్తించడం ఇబ్బందిగా మారింది.
నగర, పట్టణ ప్రాంతాల్లో ఒకచోట నుంచి మరో చోటకు వలసలు ఎక్కువ. ఓటు మార్చుకోకపోతే పాత అడ్రస్‌తో ఎన్యుమరేషన్ ఫారాలు వస్తాయి. దానివల్ల పంపిణీలో ఇబ్బందిగా మారింది.
ఎన్యుమరేషన్ ఫారం అందజేయకపోతే కారణాలు కూడా బీఎల్వో రాసి ఇవ్వాలని గట్టిగా చెప్పాం. కారణాలపై రీ వెరిఫై చేయడానికి సూపర్ వైజర్లు ఉంటారు.
6) కొందరు గ్రామాల నుంచి నగరానికి వచ్చి అక్కడ, ఇక్కడ ఓటు హక్కు పొంది ఉంటారు. అలాంటి వారు ఓటు ఎక్కడ కొనసాగించాలి?
ఓటు హక్కు ఎక్కడ ఉంచుకోవాలనేది ఎన్నికల సంఘం చెప్పదు. అది ఓటరు నిర్ణయించుకోవాలి. కానీ, ఏదైనా ఒక్కచోట మాత్రమే ఓటు ఉంచుకోవాలి.
రెండు, మూడు చోట్ల ఓటు హక్కు ఉంటే, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లోని 31వ విభాగం కింద శిక్షకు అర్హులవుతారు.
ఈ నేరం కింద ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.

7) 'సర్' ప్రక్రియలో కొత్తగా ఓటు హక్కు పొందవచ్చా?
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఆగస్టు 1 నుంచి మొదలవుతుంది. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
'సర్' ప్రక్రియలో భాగంగా కొత్త ఓటరు దరఖాస్తులు స్వీకరించడం లేదు. కేవలం ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి ఇప్పటికే ఉన్న ఓటరు వివరాలు ధ్రువీకరించుకుంటాం.
8) 2002లో వేరే రాష్ట్రంలో తల్లిదండ్రుల ఓటు హక్కు ఉంటే, ఆ వివరాలు చెప్పాలా?
తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు లేదా కుటుంబ సభ్యుల ఓటు వివరాలు 2002లో ఏ రాష్ట్రంలో ఉన్నాయో, అక్కడి వివరాలే ఎన్యుమరేషన్ ఫారంలో రాయాలి. కేవలం తెలంగాణలో ఉంటేనే రాయాలి లేదా ఏపీలో ఉంటేనే రాయాలి అని కాదు.
అప్పట్లో ఏ రాష్ట్రంలో ఓటరుగా నమోదై ఉంటే ఆ వివరాలు రాయాలి.
9) కుటుంబంలో ఉన్న ఓటర్లందరూ ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాలా లేదా అందరికీ కలిపి ఒక్క ఫారం సరిపోతుందా?
కుటుంబంలో ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఈ ఫారాలు ఇవ్వాలి.
బీఎల్వోలు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారు. అందులో ఒకటి బీఎల్వో సంతకం చేసి స్టాంపు వేసి ఓటరుకు ఇస్తారు. మరొకటి బీఎల్వో తీసుకుని ఈఆర్వోకు ఇస్తారు.
10) ఇతర దేశాల్లో లేదా రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించడం ఎలా?
అలాంటి వారు voters.eci.gov.in లో లాగిన్ అయ్యాక ఫోన్ నంబరు ఎంట్రీ చేసి వివరాలు పూరించవచ్చు.
లేని పక్షంలో వాళ్ల కుటుంబీకులు వాళ్ల తరఫున ఎన్యుమరేషన్ ఫారాలు నింపి, సంతకం చేసి ఇవ్వొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























