సోవియట్ జైళ్లలో పుట్టిన దొంగల ‘రహస్య భాష’ను సైబర్ నేరగాళ్లు ఎలా వాడగలుగుతున్నారు?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, తమ్లిన్ మాగీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 10 నిమిషాలు
జోసెఫ్ స్టాలిన్ కాలం నాటి నిర్బంధ శిబిరాలలో గార్డులను తికమకపెట్టడానికి ఖైదీలు 'ఫెన్యా' అనే రహస్య భాషను ఉపయోగించారు. ఇప్పుడు అదే భాషను రష్యా సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు.
'రాస్‌బెర్రీలో దాక్కోవడం' అంటే ఏంటి? ‘నువ్వు సిక్సర్ అవ్వాలని ఎందుకు అనువకోడం లేదు’ 'అకాడెమియా'కి వెళ్లడం అంటే ఏమిటర్థం?
రష్యన్ భాషలో 'మాట్' అని పిలిచే ఒక ప్రత్యేకమైన, సంక్లిష్టమైన తిట్ల పద్ధతి ఉంది. కానీ తిట్లు బాగా తెలిసిన వ్యక్తికి కూడా పై మాటలు అర్థంపర్థం లేనివిగా అనిపించవచ్చు. ఎందుకంటే అవి ఫెన్యా అనే రహస్య జైలు భాషా పదాలు.
శతాబ్దాలుగా నేరస్థులు ఈ భాషను ఇతరులను గందరగోళానికి గురి చేయడానికి, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు లేదా చట్టంలోని లొసుగులను కనుగొనడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు. 20వ శతాబ్దంలో సోవియట్ జైళ్లలో ఈ భాష మరింత విస్తరించింది. ద్వంద్వార్థ పదాలు, అరువు తెచ్చుకున్న అన్యభాషా పదాలు విపరీతంగా పెరిగిపోయాయి.

అర్ధం వేరు, అంతరార్థం వేరు
జర్మన్, గ్రీక్, యిడిష్ భాషల ప్రభావం ఉన్న ఫెన్యా భాష, అనేక నిగూఢమైన, సంక్లిష్టమైన అర్థాలతో నిండి ఉంది. ఉదాహరణకు రష్యన్ భాషలో 'బాబ్కి' అంటే 'అమ్మమ్మ'. కానీ ఫెన్యాలో దాని అర్థం 'డబ్బు'.
వరెజ్కా' అంటే 'చేతితొడుగు', కానీ కొన్నిసార్లు దీనికి 'నోరు' అని కూడా అర్థం. 'పాలు' అనే హీబ్రూ పదం నుంచి వచ్చిన 'ఖల్యావా' అనే పదానికి 'ఉచితంగా దొరికిన వస్తువు' అని అర్ధం.
ఫెన్యా భాషలో ఒకే పదానికి అనేక నిగూఢ అర్థాలుంటాయి. లేదా సంకేతాలు దాగి ఉంటాయి. వాటిని ఆ భాష తెలిసిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు.
గతంలో జైలు గార్డులను మోసం చేయడానికి ఈ భాషను ఎలాగైతే ఉపయోగించారో, ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో సైబర్ నేరగాళ్లు తమ కార్యకలాపాలను రహస్యంగా ఉంచడానికి, అధికారులను గందరగోళానికి గురి చేయడానికి ఇదే భాషను ఉపయోగిస్తున్నారు.
ఉదాహరణకు రష్యన్ భాషలో ముసోర్ అంటే 'చెత్త' అని సాధారణ అర్థం. కానీ ఫెన్యా భాషలో ఇప్పుడు దానిని 'పోలీస్' గా అర్థం చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా డార్క్ వెబ్‌లోని ఫోరమ్‌లలోకి చొరబడి సైబర్‌దాడుల గురించిన సమాచారాన్ని సేకరించే పోలీసు అధికారి అని అర్థం.
రష్యాలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండడంతో నేరస్థుల కంటే ఒక అడుగు ముందుండాలంటే దర్యాప్తు అధికారులు ఈ రహస్య భాషను అర్థం చేసుకోవాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, నిరంతరం మారుతున్న ఫెన్యా భాషలోని సూక్ష్మ అర్థాలను తెలుసుకోవడం యంత్రాలకు కూడా కష్టమే.
జార్ చక్రవర్తి కాలం నాటి రష్యా వీధుల్లో మాట్లాడే ఒక భాష ఫెన్యా . కానీ సోవియట్ న్యాయవ్యవస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల, ఆ భాష విస్తృతంగా వ్యాపించి ఆ తర్వాత ప్రధాన స్రవంతిలో కలిసింది. చివరికి ఆ భాష ఇంటర్‌నెట్‌కు కూడా చేరింది.

ఫొటో సోర్స్, Fuel Russian Criminal Tattoo Archive
రహస్య భాష ఎలా మొదలైందంటే...
ఫెన్యా ఒక నిగూఢ భాష. ఇతరులకు అర్ధం కాకుండా మాట్లాడడానికి, అలాగే సమాచారాన్ని రహస్యంగా ఉంచడానికి దీనిని ఉపయోగించేవారు.
కానీ ఇప్పుడు ఈ భాషలోని అనేక పదాలు రష్యన్ భాషతో ఎంతగా పెనవేసుకుపోయాయంటే అవి వాస్తవానికి నేర ప్రపంచం నుంచి వచ్చాయని చాలా మందికి తెలియకపోవచ్చు.
'ఫెన్యా' భాష ఎలా మొదలైందో ఇప్పటికీ స్పష్టత లేదు. 'ఒఫేని' అని పిలిచే సంచార వర్తకుల దగ్గర ఇది మొదలైందని బాగా ప్రచారంలో ఉన్న విషయం. అయితే దీనిపై వివాదముంది.
ఈ ప్రజలు కాలినడకన తిరుగుతూ రష్యా అంతటా మతానికి సంబంధించిన వస్తువులను అమ్మేవారు. 17వ శతాబ్దంలో జరిగిన ఒక మతపరమైన వివాదం తర్వాత వారి వస్తువుల్లో కొన్నింటిని మతవిరుద్ధమైనవిగా పరిగణించారని, ఫలితంగా ఈ సంచార వ్యాపారులు ఒకరితో ఒకరు మాట్లాడుకోడానికి ఒక ప్రత్యేకమైన, రహస్యమైన సంభాషణా పద్ధతిని అభివృద్ధి చేసుకున్నారని చెబుతారు.
ఫెన్యా భాష వాడకం ఎలా పెరిగిందనేదానిపై మాత్రం సమాచారం అందుబాటులో ఉంది.
ఆధునిక రష్యా నిపుణుడు, ఇంటెలిజెన్స్ కన్సల్టెంట్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ గౌరవ ప్రొఫెసర్ మార్క్ గాలియోట్టి తన 2018నాటి పుస్తకం 'ది వోరీ: రష్యాస్ సూపర్ మాఫియా'లో దీని గురించి ప్రస్తావించారు. 19వ శతాబ్దంలో ఆ భాషకు సంబంధించిన పదజాలం వేగంగా పెరగడం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఆ సమయంలో వీధిబాలలు, నేరస్థులు పదాల మధ్య 'ఫె', 'న్యె' వంటి శబ్దాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. దీనివల్ల వారి మాటలను ఇతరులు అర్థం చేసుకోవడం కష్టమైంది.
తర్వాత ఈ విధానం క్రమంగా కనుమరుగైంది. అంతకు ముందే జేబుదొంగలు, మోసగాళ్ల గుంపులు ఫెనియన్ భాష మాట్లాడడం మొదలుపెట్టారు.
వారి తెగలో చేరడానికి భాషపై కనీస పరిజ్ఞానం తప్పనిసరైంది. ఆ భాషలోని అనేక పదాలు, పదబంధాలు 1863లో ప్రచురితమైన 'డిక్షనరీ ఆఫ్ లివింగ్ రష్యన్'లో కూడా ఉన్నాయి.
ఫెన్యా భాషలో నేరస్థుల సమూహంలోని హోదాలను,శ్రేణులను సూచించడానికి పేకాట చిహ్నాలను ఉపయోగిస్తారు. కార్డులపై ఉండే కొన్ని చిహ్నాలను నిజమైన నేరస్థుల చిహ్నాలుగా పరిగణిస్తారు.
జంతువుల పేర్లకు కూడా నిగూఢార్థాలు ఉంటాయి. ఉదాహరణకు కోతి అంటే అద్దం, నక్క అంటే మడత కత్తి. మొత్తంగా ఫెన్యా భాషలో 10,000 నుంచి 27,000 పదాలు ఉన్నాయని అంచనా.
జార్ చక్రవర్తుల చివరి సంవత్సరాలలో సమాజంలోని విద్యావంతులు, మేధావులు ఈ నేరస్థుల రహస్య ప్రపంచంపై చాలా కుతూహలాన్ని కనబర్చారు.
ఈ ఆసక్తి 'వాగబాండ్ మ్యూజిక్' అనే సంగీత ప్రక్రియ ప్రాచుర్యం పొందడానికి కారణమైంది. ఈ పాటలు ఫెన్యా భాషలో మురికివాడ లేదా సంచార జీవితాన్ని రొమాంటిక్‌గా చిత్రీకరించాయి. అయితే ఫెన్యా భాష నిజంగా వ్యాప్తి చెందింది యుద్ధాలు, విప్లవాల వల్ల కలిగిన ప్రధాన సామాజిక కల్లోలాల తర్వాతే. ఈ కాలంలోనే ఆ భాష సమాజంలో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది.

ఫొటో సోర్స్, Alamy

ఫొటో సోర్స్, Check Point Research
ఫెన్యా భాష విస్తృత వినియోగం
1922లో రష్యా అంతర్యుద్ధం ముగిసి సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) ఏర్పడిన తర్వాత బోల్షెవిక్‌లు నిర్బంధ శిబిరాలను విస్తరించడం ప్రారంభించారు.
తదనంతరం ఇవే ప్రసిద్ధి చెందిన గులాగ్ వ్యవస్థగా పరిణామం చెందాయి. ఈ శిబిరాల్లో చిన్న, పెద్ద నేరస్థులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉండేవారు. దీనివల్ల రైతుల నుంచి విద్యావంతులు, మేధావుల వరకు ఎంతోమందికి ఫెన్యా భాషను ప్రత్యక్షంగా విని, నేర్చుకునే అవకాశం లభించింది.
స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది ప్రజలను జైళ్లలో నిర్బంధించారు. ఫెన్యా భాషలోని నిగూఢ పదాలు ఖైదీల మధ్య మరింత విస్తృతంగా వ్యాపించాయి. ఇది నేరస్థుల మధ్య ఒక ప్రామాణిక రూపంగా మారింది.
కాలక్రమేణా ఈ భాష నేరస్థుల మధ్య ఒక నిర్దుష్ట రూపంలో వాడుకలోకి రావడం ప్రారంభమైంది. జైలు జీవితానికి సంబంధించిన అనేక కొత్త పదాలు కూడా దీనికి జతకలిశాయి.
"ఆ సమయంలో జైళ్లలోని క్లిష్ట పరిస్థితుల మధ్య మనుగడకు, సంభాషణకు భాష ఒక సాధనంగా మారింది" అని అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల, తులనాత్మక సాహిత్య ప్రొఫెసర్, 'ది లాంగ్వేజ్ ఆఫ్ థీవ్స్: ది స్టోరీ ఆఫ్ రోట్‌వైలర్స్ అండ్ వన్ ఫ్యామిలీస్ సీక్రెట్ హిస్టరీ' అనే పుస్తక రచయిత మార్టిన్ పుచ్నర్ అన్నారు.
జైలులో నేరస్థులు ఫెన్యా భాషను 'వొరోవ్‌స్కోయ్ జకోన్' లేదా 'దొంగల చట్టం' అని పిలిచే ఒక క్రమబద్ధమైన రూపంలోకి మార్చారు. ఇది ఒకరి హోదా, గుర్తింపును నిర్వచించే మాఫియా తరహా నియమాల సమాహారం.
ఎవరి స్థాయి ఏంటి? వారి గుర్తింపు ఏంటి అనే విషయాలను ఈ నియమాలు నిర్ణయించేవి.
ఈ నియమాలు తెలిసిన వారిని నేరస్థుల వర్గంలో భాగంగా పరిగణించేవారు. అయితే సాధారణ ప్రజలను లేదా 'ముజిక్' (రైతులు)లను మాత్రం మోసం చేయడానికి లేదా నేరాలకు ఉన్న లక్ష్యాలుగా చూసేవారు.
అదే సమయంలో స్టాలిన్ ఫెన్యా భాషతో సహా నేరాన్ని, దానితో ముడిపడి ఉన్న ప్రతిదాన్నీ నిర్మూలించడానికి ప్రయత్నించారు. 1930వ దశకం నుంచి అధికారిక సోవియట్ పత్రికలు 'దొంగల పాటలను' ప్రమాదకరమైనవిగా, కార్మిక వర్గ సంస్కృతిని అవమానించేవిగా ఖండించడం ప్రారంభించాయి.
ప్రముఖ కళాకారులు ప్రభుత్వానికి అనుగుణంగా తమ శైలిని మార్చుకున్నారు. ప్రఖ్యాత సోవియట్ పాప్ గాయకుడు లియోనిడ్ ఉటెసోవ్ కూడా తన పంథాను మార్చుకున్నారు.
ఆయన 'ఫ్రమ్ ది ఒడెస్సా గేల్' వంటి దొంగల జీవితం ఆధారంగా పాటలు పాడేవారు. ప్రజలకు ఈ పాటలు బాగా నచ్చాయి. కానీ ఆ తర్వాత వారు సైన్యం కోసం ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించి, తమ గాన శైలిని చాలా సరళంగా, సోవియట్ భావజాలానికి అనుగుణంగా మార్చుకున్నారు.

ఫొటో సోర్స్, HULTON ARCHIVE/GETTY IMAGES
స్టాలిన్ మరణించిన తర్వాత ఏం జరిగింది?
1953లో స్టాలిన్ మరణించిన తర్వాత ఫెన్యా భాష కథ మరో కొత్త మలుపు తీసుకుంది.
సామూహిక క్షమాభిక్ష ప్రకటించిన తర్వాత పది లక్షలకు పైగా ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మాజీ ఖైదీలు గులాగ్ నుంచి పెద్ద సంఖ్యలో తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. వారు తమతో పాటు ఫెన్యా భాషను తీసుకువచ్చారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, సమావేశ స్థలాల్లో 'బ్లాత్నయా పెస్న్యా' అంటే దొంగల పాటలు వినపడడం మొదలైంది.
ఆ సమయంలో నేర సంస్కృతిని ఒక రకమైన ప్రజాసంస్కృతి రూపంగా చాలా మంది భావించేవారు. కానీ దానిని అధికార పార్టీ అణచివేసింది.
"ఆ కాలంలో మేధావులలో కూడా ఈ నేర ప్రపంచంపై ఒక రకమైన ఆకర్షణ ఉండేది" అని లండన్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ , 'గ్యాంగ్స్ ఆఫ్ రష్యా: ఫ్రమ్ ది స్ట్రీట్స్ టు ది కారిడార్స్ ఆఫ్ పవర్' అనే పుస్తక రచయిత్రి అయిన స్వెత్లానా స్టీఫెన్సన్ అన్నారు.
పైరసీ పాటలను అణచివేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి మరింత ప్రాచుర్యం పొందాయి. సోవియట్ యూనియన్ సెన్సార్‌షిప్‌ను పెంచిన తర్వాత కొంతమంది తెలివైన వ్యక్తులు రహస్యంగా సంగీతాన్ని కాపీ చేయడం ప్రారంభించారు.
వారు పాత ఎక్స్‌రే ఫిల్మ్‌లను కత్తిరించి గ్రామోఫోన్ రికార్డుల ఆకారంలో తయారుచేసేవారు. ఇంట్లోనే వాటిపై శబ్దాలను రికార్డ్ చేసేవారు. దీనిని 'జాజ్ ఆన్ ది బోన్స్' అని పిలిచేవారు.
ఆ తర్వాత పెరిగిన బ్లాక్ మార్కెట్ నిషేధిత సంగీతాన్ని వినడానికి, వారి సొంత పాటలను రికార్డ్ చేసుకోవడానికి కూడా ప్రజలకు అవకాశం కల్పించింది.
పాటలను ఇళ్లలో రికార్డ్ చేసి విస్తృతంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత క్యాసెట్ టేపుల రాకతో ఈ పాటలు మరింత సులభంగా వినిపించాయి.
ఫలితంగా ఆర్కాడీ సెవెర్నీ, వలస గాయని దీనా వియెర్నీ వంటి అండర్‌గ్రౌండ్ కళాకారుల పాటలు సోవియట్ యూనియన్ అంతటా వినిపించడం ప్రారంభించాయి. ఈ పాటల్లో లైంగికత, దోపిడీ, హింస, గులాగ్‌జైళ్లలోని కఠినమైన జీవితం వంటి కథలు ఉండేవి.
1991లో సోవియట్ యూనియన్ పతనం అయ్యేనాటికి ప్రజల కథల్లో, సంస్కృతిలో ఫెన్యా భాష ఒక భాగంగా మారిపోయింది. ప్రభుత్వం దానిని అణచివేయడానికి శాయశక్తులా ప్రయత్నించింది. అయినప్పటికీ నాగరిక సమాజంలో ఫెన్యా మాట్లాడటాన్ని సముచితంగా భావించేవారు కాదు.
అయితే కొత్త సహస్రాబ్ది ప్రారంభంలో (2,000 సంవత్సరంలో) ఫెన్యాకు అకస్మాత్తుగా ఆమోదం లభించడం మొదలయింది. పుతిన్ సహా రష్యన్ రాజకీయ నాయకులు అధికారిక ప్రకటనలు, ప్రసంగాల్లో ఫెన్యా పదాలను ఉపయోగించడం ప్రారంభించారని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో రష్యన్ భాష, సామాజిక భాషాశాస్త్ర ప్రొఫెసర్ లారిసా రియాజనోవా-క్లార్క్ తెలిపారు.
ఆ సమయంలో భాషా నియమాలు బాగా మారుతుండటంతో పాటు సమాజంలో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందువల్ల భాషలో ఒకరకమైన గందరగోళం నెలకొంది. ఒక పెద్ద పెను మార్పు స్పష్టంగా కనిపించింది.
ప్రజల్లో తమ ప్రతిష్టను పెంచుకోవడానికి, సాధారణ ప్రజలకు దగ్గరగా ఉన్నామని అనిపించుకోడానికి అధికారులుఈ భాషను ఉపయోగించి ఉండవచ్చని స్టీఫెన్సన్ అంటున్నారు. ఈ ధోరణికి ఆమె 'క్రెమ్లిన్ ఫెన్యా' అని పేరు పెట్టారు.
ఈ భాష రష్యన్ సమాజంలో హింసా సంస్కృతి ఎంత లోతుగా వ్యాపించిందో ప్రతిబింబిస్తుందన్నది ఆమె అభిప్రాయం. విచిత్రమేమిటంటే జైళ్లలో ఫెన్యా మాట్లాడటాన్ని నిషేధించారు గానీ ప్రభుత్వ అధికారులు మాత్రం దాన్ని మాట్లాడటం కొనసాగించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజల రోజువారీ జీవితంలో భాగం
21వ శతాబ్దం ప్రారంభంలో ఫెన్యా రోజువారీ భాషలో కలిసిపోవడం ప్రారంభమైంది. అదే సమయంలో డిజిటల్ విప్లవం దానికి కొత్త దారి చూపింది.
1999లో రష్యా తొలి ఇంటర్నెట్ (రూనెట్)లో ఫిడోనెట్ అనే బులెటిన్ బోర్డుపై ఒక వినియోగదారుడు 'యాంటీ-లిటరసీ మ్యానిఫెస్టో అనే ప్రకటన'ను ప్రచురించారు.
''మన సజీవ భాషను యంత్రాలు నాశనం చేయకుండా చూడండి'' అంటూ రష్యన్ మాట్లాడేవారందరికీ పిలుపునిచ్చారు.
"ఇంటర్‌నెట్‌లో అక్షరక్రమ నియమాలు అని పిలిచే వాటిపై" ఆ వ్యాసం ఒక దాడి అని లారిసా మోర్కోబోరోడోవా తెలిపారు.
వారు ఉద్దేశపూర్వకమైన తప్పుగా రాసిన పదాలు, పద నిర్మాణాల వల్ల 'పడోంకి' అనే కొత్త యాస పుట్టింది. దీనిని వ్యంగ్యంగా 'ఓల్బేనియన్' అని కూడా పిలిచేవారు.
ప్రతి నెలా లక్షలాది మంది ఆన్‌లైన్‌లో ఈ భాషను ఉపయోగిస్తున్నారు. ఇది క్రమంగా సమాజంలోకి వ్యాపించిందని మోర్కోబోరోడోవా అంటారు. చాలా మంది రష్యన్‌లకు ఈ భాష అర్థమవుతుంది. కానీ వారందరూ నేరస్థులు కాదు. అయినప్పటికీ ఈ భాషలోని సంక్లిష్టమైన, విభిన్నమైన అర్థాలు సైబర్ నేరాల దర్యాప్తు దారులకు ఒక పెద్ద సవాలుగా మారవచ్చు.
ఈ భాష ఉద్దేశపూర్వకంగా రష్యన్ భాష నియమాలను ఉల్లంఘిస్తుంది. ఇది పదాలలో ద్విత్వాక్షరాలను ఉపయోగిస్తుంది. పదాలను అవి పలికే విధంగానే రాస్తుంది. ఇది ఆంగ్లం నుంచి అరువు తెచ్చుకున్న పదాలను కూడా ఉపయోగిస్తుంది. కానీ వాటి అసలు అర్థాలను మార్చి వేరే భావంలో వాడుతుంది.
ఉదాహరణకు రష్యన్లు 'ఈ మెయిల్' అనే పదాన్ని 'మాయ్లో' అని రాస్తారు. దీని అసలు అర్థం 'సబ్బుపెట్టె .
రష్యాలో డిజిటల్ యుగం ప్రారంభంలో 'ఈమెయిల్'కు సరైన పదం లేదు. అందుకే దాని ఉచ్ఛారణను పోలిన పదాన్ని ఉపయోగించారని సైబర్-సెక్యూరిటీ నిపుణులు రోమన్ సానికోవ్ అంటున్నారు.
"మెషిన్ ట్రాన్స్‌లేషన్ ఉపయోగించినప్పుడు, కొన్నిసార్లు 'ఈమెయిల్'కు బదులుగా 'సోప్' అని పొరపాటుగా చదివే అవకాశం ఉంది" అని ఆయన భావిస్తున్నారు.
ఆ సమయంలో సిరిలిక్ (రష్యన్) కీబోర్డులు అంత సులభంగా అందుబాటులో ఉండేవి కావు. కాబట్టి కొంతమంది ఇంటర్‌నెట్ వినియోగదారులు కొన్ని అక్షరాల స్థానంలో అంకెలను ఉపయోగించడం మొదలుపెట్టారు. 'చ' శబ్దాన్ని రాయడానికి '4'ను ఉపయోగించేవారు. ఎందుకంటే రష్యన్ భాషలో '4' (నాలుగు) అనే పదాన్ని 'చెతిరే' (నాలుగు) అని ఉచ్ఛరిస్తారు.
"అనేక కంప్యూటర్ పదాలు ఇంగ్లీష్ నుంచి వచ్చాయి. ఎందుకంటే వాటికి సరైన రష్యా పదాలు లేవు. ఉదాహరణకు, 'హార్డ్ డ్రైవ్'ను చాలామంది 'వించ్' అని పిలిచేవారు. ఆ కాలంలోని అనేక హార్డ్ డ్రైవ్‌లకు 'వించెస్టర్' అనే బ్రాండ్ పేరు ఉండేది. అందుకే అలా పిలిచేవారు" అని రోమన్ సానికోవ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'సైబర్-ఫెన్యా'
"సైబర్ స్లాంగ్ (ఇంటర్నెట్‌లోని ఒక నిర్దుష్ట మాండలికం) సృష్టించిన వారిలో ఎక్కువ మంది పిల్లలు లేదా యువకులే" అని సన్నీకోవ్ చెప్పారు. "వీరు పాతకాలంలో ఫెన్యా మాట్లాడిన 'వోరి' (దొంగల) వర్గానికి చాలా భిన్నమైనవారు" అని అన్నారు.
కాబట్టి సైబర్‌స్పేస్‌లో ఫెన్యా భాషకు చెందిన పదాలు కనిపించినప్పుడల్లా, వాటి వెనుక ఒక విభిన్నమైన ప్రభావం ఉండవచ్చని ట్రెండ్ మైక్రో అనే సైబర్‌సెక్యూరిటీ సంస్థ పరిశోధకుడు ఫ్యోదోర్ యారోచ్కిన్ అంటున్నారు.
సైబర్ నేరగాళ్లు కొందరు సంప్రదాయ నేరాల నుంచి వైట్ కాలర్ సైబర్ నేరాలకు మారినవారు కావొచ్చు. నేరుగా దాడులకు సంబంధించిన విషయాలు మాట్లాడుతుండొచ్చు.
కొంతమంది ఇలాంటి పదాలను గ్యాంగ్‌స్టర్ సినిమాల నుంచి నేర్చుకుని ఉండొచ్చు. వారు తమ స్నేహితులను ఆకట్టుకోవడానికి, తమను తాము 'కఠినమైన వ్యక్తులుగా' చూపించుకోవడానికి ఇలాంటి పదాలను ఉపయోగిస్తారని చెబుతారు. ఒకరి హోదా లేదా గుర్తింపును చూపించడానికి ఫెన్యా భాషను ఉపయోగిస్తారు.
రష్యా సైబర్ నేరస్థుల బృందం కాంటీకి చెందిన చాట్ లాగ్‌లు 2022లో లీకయ్యాయి. పనికి సంబంధించిన వివరాలు, తిట్లు, అసభ్య పదాలు, సాధారణ మాటలతో పాటు ఫెన్యా భాష నుంచి వచ్చిన కొన్ని పదాలు కూడా వాటిలో కనిపించాయి.
కొన్ని చాట్‌లాగ్‌లను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని ప్రపంచ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ పరిశోధకులు చెప్పారు. మెషిన్ ట్రాన్స్‌లేషన్ కూడా వాటి అర్థాన్ని సరిగ్గా గుర్తించలేకపోయింది.
ఉదాహరణకు నేరస్థులు ఒకరికొకరు "నా సబ్బు ఉతకడం లేదు, నేను వాటిని నెలల తరబడి వేడి చేస్తున్నాను" వంటి వింత వాక్యాలు రాసుకునేవారు. కానీ వాస్తవానికి వారి ఉద్దేశం వేరే. వారు ఈమెయిల్ బ్లాక్‌లిస్ట్‌ల నుంచి ఎలా తప్పించుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు.
"ఫెన్యా భాష, సైబర్ నేరగాళ్ల మాండలికాలు వేర్వేరు సమయాల్లో ఏర్పడినప్పటికీ వాటి అభివృద్ధి దాదాపు ఏకకాలంలో జరిగింది. అందువల్ల అవి రెండూ కలిసి ఒక సంక్లిష్టమైన, అర్థం చేసుకోవడానికి కష్టమైన భాషా వ్యవస్థను తయారుచేశాయి'' అని సానికోవ్ తెలిపారు. ఈ ఆన్‌లైన్ నేర భాషను 'సైబర్-ఫెన్యా' అని కూడా ఆయన పిలుస్తారు.
నేరస్థుల ఈ ప్రత్యేక భాష నిరంతరం మారుతూ, మరిన్ని పదాలు చేరుతూ, కొన్నిసార్లు ప్రధాన స్రవంతి రష్యన్ భాషలో కూడా కలిసిపోతోందనడానికి ఇంటర్నెట్‌లో దీని వాడకం కేవలం ఒక కొత్త ఉదాహరణ మాత్రమే.
స్టాలిన్ యుగం, గులాగ్ వ్యవస్థే ఫెన్యా వ్యాప్తికి అంతిమంగా కారణమయ్యాయి. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా మాట్లాడే రహస్య భాషలలో ఒకటిగా అది మారింది.
ఆ జైళ్లలో ఉన్న చాలా మంది ఖైదీలకు ఆ భాష బాగా తెలుసు. వారి ప్రకారం 'రాస్‌బెర్రీ' అంటేరహస్యంగా దాక్కునే ప్రదేశం లేదా నేరగాళ్ల అడ్డా. 'సిక్సర్' అంటే నేరస్థుల శ్రేణిలో అత్యంత తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి. 'అకాడెమియా' అంటే జైలు - ఎవరూ వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశం. కానీ ఒక్కసారి అక్కడికి వెళ్తే ఫెన్యా భాషను మాత్రం బాగా నేర్చుకునే అవకాశం లభిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























