28 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్, వస్తువులు జొప్పించి దారుణం.. నిర్భయ కేసును గుర్తుచేసిన ఘటన

బిహార్ గ్యాంగ్ రేప్, దిల్లీ గ్యాంగ్ రేప్ కేసు, పోలీసు కేసు

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad

ఫొటో క్యాప్షన్, నలుగురు పిల్లల తల్లిపై ఐదుగురు దుండగులు ఆమె ఇంట్లోనే సామూహిక అత్యాచాారానికి పాల్పడ్డారు.
    • రచయిత, గీతా పాండే, సీటు తివారి
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలోని వివరాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

ప్రపంచవ్యాప్తంగా పతాకశీర్షికల్లో నిలిచిన నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన 13 ఏళ్ల తర్వాత, బిహార్‌లో అలాంటి క్రూరమైన గ్యాంగ్ రేప్ కేసు ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

భారత్‌లో, మరీముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో లైంగిక దాడుల బారినపడిన మహిళల పట్ల పోలీసులు, వైద్యాధికారుల నుంచి ఎదురయ్యే ఉదాసీనతకు ఈమె కథ కూడా ఒక ఉదాహరణ అని హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

చట్టప్రకారం, లైంగిక దాడికి గురైన బాధితుల పేర్లను వెల్లడించకూడదు. అందువల్ల గ్యాంగ్ రేప్‌కు గురై, ప్రాణాలతో బయటపడిన ఈ మహిళను సోమా(ఇది ఆమె అసలు పేరు కాదు) అని పిలుస్తున్నాం.

సోమాకు నలుగురు చిన్న పిల్లలు. ఆమె వయసు 28 ఏళ్లు. కొందరు తన ఇంట్లోనే తనపై దాడి చేసి, యోనిలోకి వస్తువులను జొప్పించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె బీబీసీకి చెప్పారు.

భారత్‌లో సామాజికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన బెగుసరాయ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో జూన్ 11 రాత్రి ఈ సంఘటన జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆమె జననాంగంలోకి వస్తువులను జొప్పించినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో ఈ కేసు తీవ్రత వెలుగులోకి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేసి ఆ వస్తువులను తొలగించారు.

తనపై అత్యాచారం చేసినప్పుడు ఉపయోగించిన వస్తువులలో ఇదొకటని చెబుతూ బుల్లెట్ కేసింగ్‌‌ను ఆమె చూపించారు.

బిహార్ గ్యాంగ్ రేప్, దిల్లీ గ్యాంగ్ రేప్ కేసు, పోలీసు కేసు

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad

ఫొటో క్యాప్షన్, బాధితురాలి ఇంటి బయట ఉన్న బాత్‌రూమ్‌‌కు కర్టెన్ మాత్రమే ఉంది.

'ఐదుగురు చొరబడ్డారు'

ఆ రోజు రాత్రి జరిగిన దారుణ ఘటనను సోమా వివరించారు.

తమది ఒకే గది ఉండే చిన్న ఇల్లని, ఇంటిబయట ఉన్న టాయిలెట్‌లో ఉన్న సమయంలో ఐదుగురు వ్యక్తులు లోపలికి చొరబడ్డారని ఆమె చెప్పారు.

ఆ టాయిలెట్‌కు తలుపు లేదు. కేవలం కర్టెన్ మాత్రమే అడ్డుగా ఉంటుంది.

"వాళ్లు నా బట్టలు విప్పేసి, నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేశారు. ఎదురుతిరగడానికి ప్రయత్నించా, అప్పుడు బ్లేడుతో నా ఛాతిపై కోసేశారు, రేప్ చేశారు" అని ఆమె చెప్పారు.

"మొదట నా మూలుగు శబ్దాలు వినిపించినా, ఏదో పిల్లి అరుస్తుందనుకుని నా భర్త పట్టించుకోలేదు. కానీ, కొద్దిసేపటి తర్వాత ఏదో జరుగుతోందని అనుమానం వచ్చి చూసేందుకు ప్రయత్నం చేశారు" ఆమె అన్నారు.

"కానీ, ఇంటికి బయటి నుంచి గడియ వేశారు. దీంతో ఆయన ఇరుగుపొరుగు వారిని పిలిచారు. వాళ్లొచ్చి గడియ తీశారు, ఆ తర్వాత నన్ను చూసి అందరూ ఏడవడం మొదలుపెట్టారు" అని ఆమె చెప్పారు.

"సోమా మీద లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది" అని బెగుసరాయ్ ఎస్పీ మనీష్ బీబీసీతో అన్నారు.

"ఈ కేసులో ఐదుగురి పాత్ర ఉంది. వారిలో ముగ్గురిని గుర్తించాం. మరో ఇద్దరి గురించి తెలియాల్సి ఉంది. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశాం. కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్‌ను ఏర్పాటు చేశాం. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నాం. దర్యాప్తు జరుగుతోంది" అని ఆయన అన్నారు.

నిందితుల్లో కొందరికి నేరచరిత్ర ఉందని, వారిపై గ్యాంగ్ రేప్‌‌కు సంబంధించిన సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

బిహార్ గ్యాంగ్ రేప్, దిల్లీ గ్యాంగ్ రేప్ కేసు, పోలీసు కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అత్యాచార బాధితుల పట్ల పోలీసులు, వైద్యాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

'మీపై అత్యాచారం జరిగిందా?'

తనపై సామూహిక అత్యాచారం జరిగిన రోజు రాత్రి తనకు పోలీసుల నుంచి కానీ, వైద్యాధికారుల నుంచి కానీ సరైన సాయం అందలేదని సోమా అన్నారు.

ఆమె భర్త ఈ- రిక్షా డ్రైవర్. స్పృహ కోల్పోయిన తన భార్యను ఆయన 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మొదట పోలీసులు ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారని, ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని సలహా ఇచ్చి పంపించేశారని ఆయన చెప్పారు.

'విధుల్లో నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి, పట్టించుకోకపోవడం' వంటి కారణాలతో పోలీస్ స్టేషన్ హెడ్ రాజీవ్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు బెగుసరాయ్ పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జూన్ 13న, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు.

లైంగిక దాడి తర్వాత సరైన వైద్య సాయం కూడా అందలేదని సోమా, ఆమె భర్త చెప్పారు.

గ్యాంగ్ రేప్ తర్వాత ఆమెను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ డ్యూటీ డాక్టర్ లేరని, అత్యవసర కేసులు చూడరని చెప్పారు. తర్వాత ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సోమాకు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత, జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

ప్రాథమిక చికిత్స కూడా అంతంతమాత్రమేనని సోమా బీబీసీతో చెప్పారు.

జూన్ 12న స్పృహలోకి వచ్చిన తర్వాత, తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆమె తన భర్తకు, డాక్టర్‌కు చెప్పారు.

"ఇంజెక్షన్ చేస్తూ డాక్టర్, 'మీపై అత్యాచారం జరిగిందా?' అని అడిగారు. 'అవును మేడమ్' అని చెబుతూనే ఉన్నాను" అని బాధితురాలు తెలిపారు.

ఆమెకు కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి తీసుకొచ్చారని బెగుసరాయ్ ఆస్పత్రి సివిల్ సర్జన్ అశోక్ కుమార్ బీబీసీతో చెప్పారు. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు జూన్ 13న తమకు తెలిసిందని, ఆ తర్వాత వెంటనే ఆమెకు వైద్యులు పరీక్షలు చేశారని ఆయన వివరించారు.

బిహార్ గ్యాంగ్ రేప్, దిల్లీ గ్యాంగ్ రేప్ కేసు, పోలీసు కేసు

ఫొటో సోర్స్, Shahnawaz Ahmad

ఫొటో క్యాప్షన్, బాధితురాలు, ఆమె కుటుంబం ఒకే గది ఉన్న ఈ ఇంట్లోనే నివసించేవారు.

జననాంగంలో ఖాళీ తూటా

ఆ తర్వాత రోజు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే, ఇంటికి వెళ్లిన తర్వాత రోజు ఆమె స్పృహ కోల్పోవడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ఆమె భర్త చెప్పారు. ఆ తర్వాత కూడా, ఒకరోజు ఉంచి మళ్లీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

"పదే పదే స్పృహ కోల్పోతుండడం, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఆమెను పరీక్షించిన గ్రామ ఏఎన్ఎం, ఆమె శరీరంలో ఏదో ఉన్నట్లుందని హెచ్చరించారు. జూన్ 18 ఉదయం తన యోనిలోంచి కిందపడిన ఒక తూటా ఖాళీ కేసింగ్‌ను సోమా మాకు చూపించింది" అని ఆమె భర్త చెప్పారు.

ఆ తర్వాత, మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లానని ఆయన అన్నారు.

"అది ఒక ఖాళీ తూటా లేదా షెల్ కేసింగ్" అని సివిల్ సర్జన్ కుమార్ చెప్పారు.

"ఆ తర్వాత మళ్లీ పరీక్షలు చేసి, ఆమె జననాంగం నుంచి ఇతర వస్తువులను వైద్యులు తొలగించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది" అని ఆయన అన్నారు.

బిహార్ గ్యాంగ్ రేప్, దిల్లీ గ్యాంగ్ రేప్ కేసు, పోలీసు కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2012లో దిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత అత్యాచార నేరాలపై పరిశీలన మరింత పెరిగింది.

'మనం ఏ గుణపాఠం నేర్చుకోలేదు'

ఇది 2012లో, దిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం, జననాంగంలో వస్తువులతో దాడి కారణంగా మరణించిన 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని(నిర్భయ) ఘటనను తలపించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.

నిర్భయ కేసు ప్రపంచవ్యాప్తంగా పతాకశీర్షికల్లో నిలవడమే కాకుండా, దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. ఈ ఘటన తర్వాత తీవ్రమైన కేసులలో మరణశిక్ష సహా కఠినమైన అత్యాచార నిరోధక చట్టాలు వచ్చాయి.

నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికి మరణ శిక్ష అమలు చేశారు. ఒకరు జైలులో చనిపోయారు.

జువైనెల్ హోమ్‌లో శిక్ష అనంతరం మైనర్ దోషి విడుదలయ్యారు.

అప్పటి నుంచి లైంగిక నేరాలను నిశితంగా పరిశీలించడం పెరిగినప్పటికీ, భారత్‌లో ఏటా 30 వేలకుపైగా రేప్ కేసులు నమోదవుతున్నాయి.

"మనం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు" అని యాంటీ రేప్ సామాజిక కార్యకర్త యోగితా భయానా అన్నారు. సమాజంలో మానవత్వం రోజురోజుకీ మసకబారిపోతుండడంతో ఇలాంటి క్రూరమైన కేసులు బయటకు రావడం లేదని ఆమె అన్నారు.

"అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష పడుతుందన్న భయం దేశ నలుమూలలకూ చేరకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. సమాజంలో నేటికీ భయమనేదే లేదు" అని ఆమె బీబీసీతో చెప్పారు.

"సోమా మర్మాంగాల్లోకి బుల్లెట్ జొప్పించారని తెలిసిన తర్వాతే మీడియాలో ఇంత చర్చ జరిగింది. కనీసం, ఆమె ప్రాణాలతోనైనా బయటపడింది, అది పాజిటివ్ విషయం" అని భయానా అన్నారు.

సోమా ఇంకా బెగుసరాయ్ ఆసుపత్రిలోనే ఉన్నారు. పాత్రికేయులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు వస్తుండడంతో ఆమె కాస్త ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికీ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ త్వరగా కోలుకుని తన పిల్లల వద్దకు వెళ్లాలని అనుకుంటున్నారు.

"నా పిల్లల గురించే నా ఆందోళన. చాలా చిన్నవాళ్లు. మా బంధువులు వాళ్లను చూసుకుంటున్నారు. నేను త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నా."

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)