‘వాన పడుతోందని బోగి తలుపు మూసిన యువకుడిని కదులుతున్న రైలులో హత్య చేశారు’

ముంబై, లోకల్ రైలు, హత్య, నేరాలు, యువత
ఫొటో క్యాప్షన్, మయంక్ లోహార్(ఫైల్ ఫోటో)
    • రచయిత, అల్పేష్ కర్కరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ముంబై లోకల్‌ట్రైన్‌లో 22 ఏళ్ల మయాంక్ లోహర్ అనే యువకుడిని హత్య చేశారు.

అంధేరీ, బోరీవలీ రైల్వే స్టేషన్ల మధ్య నడిచే లోకల్ రైలులో ఈ నెల 23వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకు ఈ ఘటన జరిగింది.

భారీ వర్షం కారణంగా రైలు బోగి తలుపు మూయడంపై తలెత్తిన వివాదం ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రోషన్ సువర్ణ అనే 30 ఏళ్ల యువకుడిని నిందితుడిగా గుర్తించారు.

హత్య అనంతరం బోరీవలీ స్టేషన్‌లోని 6వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు పూర్తిగా ఆగకముందే రోషన్ రైల్లోంచి దూకి పరారయ్యారు. కానీ మరుసటి రోజు అంటే ఈనెల 24వ తేదీన కుర్లా రైల్వే స్టేషన్‌లో ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్‌పీ) రోషన్ సువర్ణను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు పారిపోవడానికి నిందితుడు ప్రయత్నిస్తుండగా రైల్వే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, బోరీవలీ జీఆర్‌పీకి సమాచారమందించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ముంబై, లోకల్ రైలు, హత్య, నేరాలు, యువత

ఫొటో సోర్స్, @ANI

ఫొటో క్యాప్షన్, నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు.

అసలు వివాదమేంటి?

చర్చ్‌గేట్-నలసోపారా ఫాస్ట్ లోకల్ రైలులో ఈ నెల 23న హత్య జరిగింది.

మయంక్ లోహార్, రోషన్ సువర్ణ ఇద్దరూ అంధేరి స్టేషన్‌లో లోకల్ రైలు ఫస్ట్-క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నారు.

ఆ సమయంలో బయట భారీ వర్షం కురుస్తోంది. వాన బోగి లోపలికి పడుతుండడంతో ట్రైన్ తలుపులు మూసే విషయంలో వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఇది ఘర్షణకు దారితీసింది. వాగ్వాదం సాగుతుండగానే మయంక్ లోహార్‌పై రోషన్ సువర్ణ కత్తితో దాడి చేశారు. ఆ రైలు రాత్రి 11గంటల నాలుగు నిమిషాలకు బోరీవలీ స్టేషన్‌కు చేరుకుందని పోలీసులు చెప్పారు.

11గంటల12 నిమిషాలకు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది సంబంధిత కంపార్ట్‌మెంట్‌కు చేరుకుని, గాయాలతో ఉన్న మయంక్ లోహార్‌ను తక్షణమే చికిత్స కోసం తీసుకువెళ్లారు.

కానీ ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ (ఈఎంఆర్‌)లోని వైద్యులు మయంక్ లోహార్‌ను పరీక్షించి, ఆయన మరణించారని తెలిపారు.

ఈ హత్యపై ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ముఖ్యమైన ఆధారాలను వెంటనే స్వాధీనం చేసుకుని దర్యాప్తు అధికారులకు అప్పగించారు.

ముంబై, లోకల్ రైలు, హత్య, నేరాలు, యువత
ఫొటో క్యాప్షన్, మయంక్ కుటుంబ సభ్యులు

మయంక్ కుటుంబం ఏమంటోంది?

"బోగిలోకి వర్షం పడుతోంది... కాబట్టి తలుపు మూసేయండి అని రైలులో ఉన్నవారందరూ చెబుతున్నారు. మయంక్ తలుపు మూశాడు. అప్పుడాయన (నిందితుడు) 'ఎందుకు తలుపు మూస్తున్నావు?' అని మయంక్‌ను అడిగాడు. తర్వాత మయంక్‌ను తిట్టడం మొదలుపెట్టి కాసేపటికే దాడిచేసి చంపాడు " అని మయంక్ అత్త తులసీ సోనార్ మీడియాతో చెప్పారు.

"ఈ ఘటన కాందివలీ, బోరీవలీ స్టేషన్ల మధ్య జరిగింది. రాత్రి 12 గంటల నుంచి 12గంటల15 నిమిషాలకు మధ్య మాకు పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది" అని మయంక్ సోదరి చెప్పారు.

''ఒకరిని ఇలా దాడిచేసి చంపుతుంటే రైలులోని మిగతాప్రయాణికులంతా ఏం చేస్తున్నారు? వాళ్ళకి కూడా కొడుకులు లేదా సోదరులు ఉండుంటారు కదా. ఇవాళ ఇది నా సోదరుడికి జరిగింది. రేపు ఇంకెవరికైనా జరగవచ్చు'' అని ఆమె హెచ్చరించారు.

తన సోదరుడికి న్యాయం చేయాలని, నిందితునికి కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

ముంబై, లోకల్ రైలు, హత్య, నేరాలు, యువత

ఫొటో సోర్స్, @ANI

ఫొటో క్యాప్షన్, రాత్రి దాదాపు 10గంటల సమయంలో హత్య జరిగిందని బొరీవలీ రైల్వే పోలీసులు చెప్పారు.

నిందితుని దగ్గర కత్తి ఎందుకుంది?

"ఈ హత్య జూన్ 23 మంగళవారం రాత్రి సుమారు 10 గంటలకు ముంబై లోకల్ రైలులో జరిగింది. కత్తి దాడిలో ఒక వ్యక్తి మరణించారు. మృతుణ్ని మయంక్ లోహర్‌గా గుర్తించారు. కాందివలీ, బోరీవలీ స్టేషన్ల మధ్య భారీ వర్షం కురుస్తుండటంతో లోకల్ ట్రైన్ తలుపు మూయడంపై ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది'' అని బోరీవలీ రైల్వే సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దత్తా ఖుప్రేకర్ చెప్పారు.

"బోరీవలీ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 103 కింద కేసు నమోదు చేశారు. రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ తలుపు మూసే విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. మయంక్‌ను కత్తితో పొడిచి చంపారు" అని నిందితుడి అరెస్టు అనంతరం, దత్తా ఖుప్రేకర్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

ఇది రైలులో జరిగిన ఒక తీవ్రమైన ఘటన. పది మంది అధికారులు, 70 మందికి పైగా సిబ్బంది కలిసి ఏడు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

"నిందితుడైన రోషన్ మీరా భయందర్‌లో నివసిస్తున్నారు. మృతుడు, నిందితుడు ఇద్దరూ అంధేరీలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఇంతకుముందు ఒకరితోఒకరికి పరిచయం లేదు. రోషన్‌ను మరింత విచారిస్తున్నాం. ఆయన రైలులో కత్తి ఎందుకు తీసుకువెళ్లాడో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని దత్తా ఖుప్రేకర్ చెప్పారు.

ముంబై, లోకల్ రైలు, హత్య, నేరాలు, యువత
ఫొటో క్యాప్షన్, సీసీటీవీ ఫుటేజ్‌లో అనుమానితుని దృశ్యాలు

‘తనను కొట్టారన్న కోపంతోనేనా?’

"వాగ్వాదం అనంతరం, కొంతమంది ప్రయాణికులు నిందితుడిని కొట్టారు. ఆ దెబ్బలకు నిందితునికి కోపం వచ్చింది. తన బ్యాగ్ నుంచి కత్తి తీసి మయంక్ లోహర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో మయంక్ అక్కడికక్కడే మరణించారు. తర్వాత నిందితుడు లోకల్ ట్రైన్ నుంచి పారిపోయారు" అని పశ్చిమ రైల్వే పోలీసులు చెప్పారు.

మయంక్ రక్తపు మడుగులో పడిపోవడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడ్డ మయంక్‌కు సహాయం చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై బోరీవలీ జీఆర్‌పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పశ్చిమ రైల్వే తెలిపింది.

ముంబై, లోకల్ రైలు, హత్య, నేరాలు, యువత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముంబై లోకల్ రైళ్లలో రోజూ లక్షలమంది ప్రయాణిస్తారు(ఫైల్ ఫోటో)

రైల్వే ప్రజా సంబంధాల అధికారి ఏం చెప్పారు?

"ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. మాకు దీని గురించి సమాచారం అందిన వెంటనే గాయపడిన వ్యక్తికి సహాయం చేసేందుకు తక్షణ చర్యలు తీసుకున్నాం" అని పశ్చిమ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ చెప్పారు.

''రైలు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న మూడు నిమిషాల్లోపే, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది బోగీ వద్దకు చేరుకున్నారు. వైద్య బృందం, స్ట్రెచర్, పోర్టర్ కూడా అక్కడకు వెళ్లి గాయపడిన ప్రయాణికుణికి సహాయం చేశారు.

మా రైల్వే వ్యవస్థ పూర్తిగా సురక్షితమైనదని ప్రయాణికులకు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేందు, ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు మేం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు మా వంతు కృషి చేస్తున్నాం" అని వినీత్ అభిషేక్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.