రోజుకు 108 ఆర్థిక నేరాలు.. 'దేశంలోనే తెలంగాణ టాప్'

ఆర్థిక నేరాలు, ఎన్సీఆర్బీ, తెలంగాణ, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక నేరాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది తెలంగాణ.

రోజుకు సగటున 108 ఆర్థిక నేరాలు నమోదవుతున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2024 గణాంకాలు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న వాటిలో 18 శాతం తెలంగాణలోనే నమోదవుతున్నట్లు ఈ నివేదికలో తేలింది.

మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణలో అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్న కారణంగా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు ఎక్కువగా ఉండటం దీనికి ఓ కారణంగా చెప్పవచ్చని ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ రాచమళ్ల బీబీసీతో చెప్పారు.

ప్రజల్లో ఉన్న 'ఆశ'ను నేరగాళ్లు క్యాష్ చేసుకుంటూ.. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఎన్ని నేరాలు రిపోర్ట్ అయ్యాయంటే…

ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, దేశంలో 2024లో 2,14,379 ఆర్థిక నేరాలు జరిగాయి.

ఇందులో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో అత్యధికంగా 39,127 ఆర్థిక నేరాలు రికార్డ్ అయ్యాయి.

తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లలోనే ఎక్కువగా ఆర్థిక నేరాలు రిపోర్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు.

దీనిపై మల్కాజిగిరి కమిషనరేట్ ఆర్థిక నేరాల విభాగం డీసీపీ మనోహర్ బీబీసీతో మాట్లాడారు.

''మోసపోయిన మొత్తం రూ.2 కోట్లకు పైబడి ఉంటేనే ఆర్థిక నేరాల విభాగం వద్ద రిపోర్ట్ అవుతున్నాయి. సైబరాబాద్‌లో రూ.3 కోట్లకు పైబడిన కేసులు రిపోర్ట్ అవుతుంటాయి. అంతకన్నా తక్కువ మొత్తంలో ఉంటే, అలాంటి నేరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు రిఫర్ చేస్తున్నాం'' అని మనోహర్ చెప్పారు.

ప్రజల్లో పెట్టుబడుల నుంచి రాబడిపై అత్యాశ పెరిగిపోయి ఈ తరహా మోసాలకు అవకాశం ఏర్పడుతోందని ఆయన చెప్పారు.

హైదరాబాద్ పరిధిలో రూ.75 లక్షలకు మించిన మోసాల్లో ఆర్థిక నేరాల విభాగం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఆర్థిక నేరాలు, ఎన్సీఆర్బీ, తెలంగాణ, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేసులే ఎక్కువ

ఆర్థిక నేరాల్లో ఎక్కువగా ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేసులే రిపోర్ట్ అవుతున్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది.

''మా వద్దకు వస్తున్న చాలా కేసుల్లో.. ముందుగా బాధితులు కొంతమొత్తం పెట్టుబడి పెడుతున్నారు. దానిపై ఎంతో కొంత లాభం గడిస్తున్నారు. తర్వాత ఇంకొంత పెట్టుబడి పెడుతున్నారు. దానికీ లాభం వస్తోంది.

మోసగాళ్లు అలా వారిని నమ్మించిన తర్వాత ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టమని చెబుతున్నారు. పెట్టిన వెంటనే నిందితులు బోర్డు తిప్పేయడం లేదా డబ్బుతో ఉడాయించడం జరుగుతోంది. అప్పుడు మోసపోయామని బాధితులు గ్రహిస్తున్నారు.

పెట్టుబడికి తగ్గట్టుగా కాకుండా ఎక్కువగా లాభాలు ఇస్తున్నారంటేనే అనుమానించి, డబ్బులు పెట్టకపోతే మోసపోకుండా ఉండేందుకు వీలుంటుంది'' అని ఒక పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.

దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక నేరాల్లో 1,92,382 నేరాలు ఈ మూడు కేటగిరీల్లోనే ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే 38,312 నేరాలు ఈ కేటగిరీలోనే నమోదయ్యాయి.

ఇందులో రియల్ ఎస్టేట్ మోసాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ముందుగానే డబ్బులు కట్టించుకుని, తిరిగి సమయానికి ఫ్లాట్లు అప్పగించకపోవడంతో బాధితులు తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

''ఆర్థిక, సైబర్ నేరాల విషయంలో అవగాహన బాగా పెరిగింది. కేసుల నమోదుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటవుతున్నాయి. దానివల్ల ప్రజలు కూడా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు'' అని చెప్పారు అనిల్ రాచమళ్ల.

'ఛార్జి షీటు దాఖలయ్యేవి తక్కువే'

ఆర్థిక నేరాల్లో ఛార్జి షీట్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. 2024లో ఛార్జి షీటు రేటు 39.8 శాతంగా ఉంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఛార్జి షీటు రేటు 53.3 శాతంగా ఉంది.

''ఈ కేసుల విషయంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వందల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు పరిశీలించాల్సి ఉంటుంది. దర్యాప్తు విషయంలో ఆర్థికంగా అనేక విషయాలను జల్లెడ పట్టాలి. బాధితులు కూడా ఒక్కరు కాకుండా ఒకే కేసులో ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల ఛార్జి షీటు విషయంలో ఆలస్యమవుతోంది'' అని ఓ పోలీసు అధికారి బీబీసీతో అన్నారు.

తెలంగాణలో 2024లో ఆర్థిక నేరాలకు పాల్పడి అరెస్టు అయిన వారి వివరాలు

మొత్తం అరెస్టు అయిన వారు – 9542

మహిళలు – 934

పురుషులు – 8608

ఆర్థిక నేరాలు, ఎన్సీఆర్బీ, తెలంగాణ, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

మెట్రో నగరాల్లో హైదరాబాద్ రెండోస్థానం

రాష్ట్రాలవారీగానే కాకుండా దేశంలో మెట్రో నగరాల పరంగా చూసినా సరే, ఆర్థిక నేరాలు హైదరాబాద్‌లో ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి.

ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, మెట్రో నగరాల జాబితాలో ఆర్థిక నేరాలు ఎక్కువగా నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ముంబయిది మొదటి స్థానం.

హైదరాబాద్ నగరంలో రోజుకు సగటున 15 ఆర్థిక నేరాలు నమోదవుతున్నాయి. కొందరు పోంజీ, మల్టీలెవెల్ మార్కెటింగ్ వంటి మోసాల బారిన పడుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు.

''గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక నేరాలు చాలా తక్కువగా రికార్డు అవుతున్నాయి. ఎందుకంటే, అక్కడ ఆర్థిక కార్యకలాపాలు తక్కువ. ముఖ్యంగా స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం లేదు.

ఎవరైనా ఫోన్ చేసి లేదా పెట్టుబడి పెట్టాలని చెప్పినప్పుడు... అది ఎంతవరకు నిజమైన రాబడి అన్నది నిర్ధరించుకోవాలి'' అని పోలీసు అధికారి ఒకరు సూచించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)