సీటు బెల్టు పెట్టుకోనని చిన్నారి మారాం చేయడంతో రద్దయిన విమానం, అసలేమైందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాక్స్ మాట్జా
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఒక చిన్నారి సీటు బెల్టు పెట్టుకోనని మారాం చేయడంతో విమాన ప్రయాణాన్ని రద్దు చేసిన ఘటన కెనడాలో ఇటీవల వెలుగుచూసింది. ఈ ఘటన విమాన ప్రయాణ సమయంలో పాటించాల్సిన కనీస మర్యాద, భద్రతా విధానాలపై చర్చకు దారితీసింది.
ఆగస్ట్ 6న, విక్టోరియా నుంచి టొరంటోకు వెళ్లేందుకు సిద్ధమైన పోర్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం, "ఒక చిన్నారి సీటులో నిల్చుని, సీటు బెల్టు పెట్టుకోవడానికి నిరాకరించడంతో" తిరిగి టెర్మినల్‌కు వెళ్లాల్సి వచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది.
అర్ధరాత్రి రన్‌వే మూసివేసేలోపు విమానం మళ్లీ బయలుదేరడం సాధ్యం కాకపోవడంతో ప్రయాణికులను మరుసటి రోజు విమానంలో పంపించాల్సి వచ్చింది.
ఈ ఘటనతో, ఇలాంటి సందర్భాల్లో పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి? విమానయాన సంస్థలు ఎలా స్పందించాలనే అంశాలపై భిన్నాభిప్రాయాలకు దారితీసింది.
"చిన్నారికి సర్దిచెప్పేందుకు తోడుగా ఉన్న తల్లిదండ్రులు, విమాన సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది" అని పోర్టర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

"అందువల్ల, భద్రతా కారణాల రీత్యా విమానం టేకాఫ్ కాలేదు. సిబ్బంది విమానాన్ని మళ్లీ టెర్మినల్‌కు తీసుకెళ్లి, ఆ ఇద్దరు ప్రయాణికులను కిందకు దించేయాలని నిర్ణయించారు" అని తెలిపింది.
విమాన ప్రయాణాల్లో చిన్నారుల భద్రతా నిపుణురాలు లియా టుసో బీబీసీతో మాట్లాడుతూ, విమానంలోని ప్రయాణికుల భద్రతతో పాటు చిన్నారి భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని పోర్టర్ సిబ్బంది విమానాన్ని నిలిపేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు.
"సీటు బెల్టు పెట్టుకోకపోతే, ప్రమాద సమయంలో పిల్లలు గాల్లోకి ఎగిరి ఇతరులపై పడొచ్చు" అని టుసో అన్నారు. మరీముఖ్యంగా, విమానం టేకాఫ్, లేదా ల్యాండింగ్ సమయాల్లో విమానం కుదుపులకు లాక్ చేయని లగేజీ మాదిరిగా సీటు బెల్టు పెట్టుకోకుండా ఉన్న చిన్నారులు విమానంలోని ప్రయాణికులకు ప్రమాదకరం కావొచ్చని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఘటన విమాన ప్రయాణంలో, విమానయాన సంస్థలు ఎంతవరకూ సహనంతో వ్యవహరించాలి? అలాగే చిన్నారులు విమానయాన సంస్థల నిబంధనలు పాటించేలా తల్లిదండ్రులు ఏం చేయాలి? అనే చర్చకు దారితీసింది.
తల్లిదండ్రులు పిల్లలతో మరీ ఉదారంగా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని కొందరు అభిప్రాయపడ్డారు. ఫాక్స్ న్యూస్ ఉదయం డిబేట్‌లోనూ ఈ విషయంపై చర్చ జరిగింది. తాను క్రమశిక్షణకు మద్దతు ఇస్తానని కార్యక్రమ సహ వ్యాఖ్యాత చార్లెస్ హర్ట్ అభిప్రాయపడ్డారు.
"తల్లిదండ్రులుగా మనందరికీ ఇలాంటి సందర్భాలు అనుభవమే. కానీ, ఇది మరీ హద్దులు దాటింది" అని ఆయన అన్నారు.
అయితే, కొన్నికొన్ని సందర్భాల్లో చిన్నారులు విమాన ప్రయాణానికి భయపడుతుంటారని, వారు ఉద్దేశపూర్వకంగా అలా చేయరని మరికొందరు అభిప్రాయపడ్డారు.
అదే విమాన ప్రయాణికుడు అరియెహ్ కోజుచ్ సీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ, ఆ చిన్నారి ఎలాంటి అల్లరి చేయలేదని, భయపడుతున్నట్లు అనిపించిందని చెప్పారు.
"ఆ చిన్నారి సీటు కింద దాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా సీటులో కూర్చోబెట్టి బెల్టు పెట్టించినా, సీటు కిందకు జారి బయటకు వస్తున్నారు" అని ఆయన తెలిపారు.
గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?
ఒక చిన్నారి కారణంగా మొత్తం విమాన ప్రయాణం ఎందుకు రద్దు చేయాలని చాలామంది ప్రశ్నించారు. వారిని దించేసి ఉండాల్సిందని కూడా అభిప్రాయపడ్డారు.
2018లో కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. షికాగో నుంచి అట్లాంటా వెళ్తున్న 'సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్' విమానం నుంచి ఒక వ్యక్తిని, ఆయన కూతురిని కిందకు దించేస్తున్న వీడియో బయటకు వచ్చింది.
'పాప అల్లరి చేయడం ఆపేసి, వరుసగా ఐదు నిమిషాలకు పైగా తన సీట్లో ప్రశాంతంగానే కూర్చుంది. అయినా సరే, ఎయిర్‌లైన్ సిబ్బంది వచ్చి ఆ తండ్రితో మాట్లాడి వారిద్దరినీ విమానం నుంచి కిందకు దించేశారు' అని సదరు వీడియో తీసిన వ్యక్తి అప్పట్లో చెప్పారు.
ఆ వ్యక్తికి విమాన సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిందని 'ప్రాథమిక నివేదికల ద్వారా తెలిసిందని' సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
అంతకుముందు 2012లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం నుంచి దింపేసిన ఆ కుటుంబం 'ఎన్‌బీసీ'కి చెందిన 'టుడే షో'లో పాల్గొని, ఎయిర్‌లైన్ తన పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించిందని ఆరోపించింది.
ఈ వ్యవహారంపై సదరు ఎయిర్‌లైన్ 'జెట్‌బ్లూ' మాత్రం భిన్నంగా స్పందించింది. ఆ ప్రయాణికులు చాలాసేపటి వరకు విమాన సిబ్బంది సూచనలను అస్సలు పట్టించుకోలేదని తెలిపింది.
"విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకునే ఆ ప్రయాణికులను విమానం నుంచి దించేయాలని కెప్టెన్ నిర్ణయించారు" అని జెట్‌బ్లూ స్పష్టం చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























