మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మాట కూడా వినని ఈ నేత ఎవరు?

ఫొటో సోర్స్, mbkharrazi.ir
- రచయిత, రెజా సాబితీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
ఇరాన్‌లో అధికార కేంద్రం చుట్టూ ఎప్పుడూ కొందరు వ్యక్తుల ఉనికి కనిపిస్తూ ఉంటుంది. అలాంటివారిని 'అంతర్గత వర్గాలకు ఇబ్బందులు సృష్టించే శక్తులు' అని పిలవొచ్చు.
ఈ వ్యక్తులు ఎలాంటి ప్రభుత్వ పదవిలో ఉండరు. ఎలాంటి అధికారిక హోదా కూడా ఉండదు. కానీ, అధికార కేంద్రానికి వారు ఎంత దగ్గరగా ఉంటారంటే.. వారి మాటలను పక్కనపెట్టడం కష్టం.
కుటుంబ సంబంధాలు, మతపరమైన హోదా లేదా ఏదైనా చిన్న సంస్థతో ఉన్న అనుబంధం లాంటివి .. తెరవెనుక జరిగే నిర్ణయాల సమాచారాన్ని బయటకు తీసుకురావడానికి ఇలాంటి వారికి అవకాశం ఇస్తాయి.
వీరు ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు చేస్తుంటారు లేదా వారిని బెదిరిస్తుంటారు.
అధికారిక ఉన్నత వర్గాలలో ప్రతిస్పందన, ఖండనలకు దారితీసే ప్రకటనలను కూడా వీరు జారీ చేయగలరు. అయినప్పటికీ, ఇలాంటి వ్యక్తులు అధికార రక్షణలో సురక్షితంగా కొనసాగుతారు. కొంతకాలం తర్వాత, ఏదైనా కొత్త వాదనతో వారు మళ్లీ తెరపైకి వస్తారు.
మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీలో పైన పేర్కొన్న అనేక లక్షణాలు ఉన్నాయి.
ఆయన ఒక మతపరమైన వ్యక్తి, ఆయనకు ఎలాంటి ప్రభుత్వ పదవీ లేదు. ఆయన 'హిజ్బుల్లా ఇరాన్' అనే సంస్థకు ప్రధాన కార్యదర్శి.
అయితే, ఇరాన్ రాజకీయాల్లో ఈ సంస్థకు ప్రాముఖ్యత, హోదా స్పష్టంగా లేవు. దీనికి తోడు, మతపరమైన మదర్సాలు, దౌత్య వర్గాలు, ఖమేనీ కుటుంబంతో సంబంధాలున్న కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన.

వివాదాస్పద ప్రకటనలు
మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ తన నేపథ్యం, హోదా ఆధారంగా ఇలాంటి 'రహస్యాలను' బయటపెడుతుంటారు. వీటి గురించి మాట్లాడితే ఇరాన్ లాంటి దేశంలో మరెవరికైనా తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ 27 లేదా 28 సార్లు రాజీనామా చేశారని లేదా అలా చేస్తానని బెదిరించారని బాఘర్ ఖర్రాజీ ఇటీవల వ్యాఖ్యానించారు. బాఘర్ ఖర్రాజీ వాదన ప్రకారం, మసూద్ పెజెష్కియాన్ తీరుపై సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పెజెష్కియాన్ మరోసారి రాజీనామా చేస్తే దాన్ని అంగీకరిస్తానని ఖమేనీ చెప్పారు. అంటే ఇరాన్ అధ్యక్షుడి రాజీనామాను ఆమోదిస్తారన్నమాట.
సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి పదవి నుంచి మొహమ్మద్ బాఘర్ జుల్ఖద్ర్‌ను తొలగిస్తున్నారని, ఆయన స్థానంలో మొహసిన్ రెజాయ్‌ను నియమిస్తారని కూడా మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ చెప్పారు. ఆయన చేసిన ఈ వాదన నిజమైంది. మొహసిన్ రెజాయ్ నియామకానికి మొజ్తబా ఖమేనీ ఇటీవల ఆమోదం తెలిపారు.
ఇకపై చర్చల్లో జోక్యం చేసుకునేందుకు అనుమతి ఉండదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చికి చెప్పినట్లు కూడా బాఘర్ ఖర్రాజీ తెలిపారు.
మసూద్ పెజెష్కియాన్ రాజీనామా విషయమై బాఘర్ ఖర్రాజీ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధ్యక్ష కార్యాలయం 'పూర్తిగా అబద్ధం, అర్థంలేని మాటలు'గా అభివర్ణించింది. మరోవైపు, మొజ్తబా ఖమేనీకి సంబంధించి ఖర్రాజీ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం కూడా తిరస్కరించింది.
ఖర్రాజీ వ్యాఖ్యలు, ఆ తర్వాత వచ్చిన ఖండనలతో వెలుగుచూసిన ఈ వివాదం కొత్తదేమీ కాదు. చాలాకాలంగా కొనసాగుతున్న పరంపరలో ఇదో భాగం మాత్రమే.
ఈ సుదీర్ఘ పరంపరలో ఇరాన్ నుంచి విడిపోయిన ప్రాంతాలను వెనక్కి తీసుకుంటామనే హామీలు, ఒక డాలర్ విలువ వెయ్యి తోమన్లకు సమానమనే వాదనలు, ప్రభుత్వాన్ని 'నాశనం' చేస్తామనే బెదిరింపులు, అణుబాంబులు తయారు చేయాలనే సూచనలు, అమెరికా తీరంలో సునామీ సృష్టించేందుకు అణ్వాయుధాలను ఉపయోగించాలనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.
ఇంతకీ మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ ఎవరు?.
ఇన్ని వివాదాస్పద, అసాధారణ వ్యాఖ్యలు చేసినప్పటికీ, ప్రభుత్వ వర్గాల గురించి ఆయన ఇంకా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అన్నదే అసలు ప్రశ్న.

ఫొటో సోర్స్, mbkharrazi.ir
మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ ఎవరు?
మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ 1961 జూలై 21న ఇరాన్‌లోని ఒక మతపరమైన కుటుంబంలో జన్మించారు.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'ఇర్నా' ప్రకారం ఆయన తెహ్రాన్‌లో జన్మించారు. అయితే, ఆయన పెంపకం మాత్రం ఖుమ్ నగరంలో జరిగింది. ఆయన తండ్రి మొహసిన్ ఖర్రాజీ ఖుమ్‌లోని హౌజా-ఎ-ఇల్మియాలో సీనియర్ ఉపాధ్యాయులలో ఒకరిగా ఉండేవారు. మజ్లిస్-ఎ-ఖోబ్రెగాన్-ఎ-రహబరీ రెండవ దఫా నుంచి నాలుగో దఫా వరకు ఆయన తెహ్రాన్ ప్రతినిధిగా కూడా పనిచేశారు.
మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ యవ్వనం, విద్య, ఇతర కార్యకలాపాల గురించి చాలావరకు సమాచారం ఒకదానికొకటి సంబంధం ఉన్న రెండు మూలాల ద్వారా లభిస్తుంది.
మొదటిది, ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో ఆయన శిష్యులలో ఒకరు రాసిన జీవిత చరిత్ర. రెండోది, 2023 మార్చిలో ఇర్నా ప్రచురించిన ప్రొఫైల్. మజ్లిస్-ఎ-ఖోబ్రెగాన్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం సమయంలో ఈ ప్రొఫైల్ ప్రచురితమైంది.
ఆయన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించిన జీవిత చరిత్ర ప్రకారం, మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ చిన్న వయసు నుంచే ఇరాన్ షాకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాల్లో పాల్గొనేవారు.
2023లో మజ్లిస్-ఎ-ఖోబ్రెగాన్ ఎన్నికలలో ఆయన అభ్యర్థిత్వం సమయంలో ఇర్నా ఇలా రాసింది: ఇస్లామిక్ విప్లవానికి ముందు జరిగిన నిరసనలలో ఆయన తన సోదరుడు మొహమ్మద్ సాదిఖ్ ఖర్రాజీతో కలిసి పాల్గొన్నారు. ఇదే క్రమంలో చిన్న వయసులోనే ఆయన్ను అరెస్టు కూడా అయ్యారు.
అదే కాలంలో ఖుమ్ నగరంలోని జమ్‌కరాన్ కొండ ప్రాంతాలలో 'హిజ్బుల్లా తొలి ప్రతిఘటన విభాగాన్ని' ఆయన ఏర్పాటు చేశారని కూడా రాశారు. హిజ్బుల్లాకు సంబంధించిన వ్యక్తులకు బాఘర్ ఖర్రాజీ శిక్షణ కూడా ఇచ్చేవారని తెలిపారు.
ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత బాఘర్ ఖర్రాజీ తన పాఠశాల విద్యను పూర్తి చేసి, ఖుమ్‌లోని హౌజా-ఎ-ఇల్మియాలో చేరారని తెలిపారు. బాఘర్ ఖర్రాజీ జీవిత చరిత్ర ప్రకారం, ఆయన ఫికహ్, ఉసూల్ విద్యను తన తండ్రి, హౌజాలోని ఇతర ఉపాధ్యాయుల వద్ద అభ్యసించారు.
మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీకి 1990వ దశకం ప్రారంభం నుంచే 'హిజ్బుల్లా ఇరాన్' సంస్థతో అనుబంధం ఉంది. అదే పేరుతో ఓ వార్తాపత్రిక కూడా నడుస్తోంది. ఈ సంస్థను ప్రసిద్ధ 'అన్సార్ హిజ్బుల్లా' సమూహంతో కలిపి చూడకూడదు. బాఘర్ ఖర్రాజీ 'హిజ్బుల్లా ఇరాన్' ప్రధాన కార్యదర్శిగా, ఆ సంస్థకు చెందిన వార్తాపత్రిక సంపాదకుడిగా ఉన్నారు.
ఈ సంస్థ చట్టపరమైన హోదా పూర్తిగా స్పష్టంగా లేదు. అయితే, గత మూడు దశాబ్దాలకు పైగా 'హిజ్బుల్లా ఇరాన్' ప్రధాన కార్యదర్శి పదవి మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీకి స్థిరమైన రాజకీయ గుర్తింపును, తన వాదనను వినిపించే వేదికను ఇస్తున్నట్లు తెలుస్తోంది.
2023లో కెర్మన్ ప్రావిన్స్ నుంచి మజ్లిస్-ఎ-ఖోబ్రెగాన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ అభ్యర్థిత్వానికి ఇరాన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే, ఆ ప్రావిన్స్‌లోని మూడు స్థానాల్లో ఆయన ఒక్కటీ గెలవలేకపోయారు.
దీనికి పదేళ్ల కిందట, 2013 అధ్యక్ష ఎన్నికల్లో 'దౌలత్-ఎ-సాలేహీన్' అంటే 'మంచి వ్యక్తుల ప్రభుత్వం' అనే నినాదంతో ఆయన అభ్యర్థిగా నమోదు చేసుకున్నారు. కానీ, కౌన్సిల్ ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Hadi Zand - ISNA
ఖొమేనీ, ఖమేనీ కుటుంబాలతో సంబంధాలు
మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ ఇరాన్ ప్రభుత్వంలో ఎప్పుడూ ఎలాంటి ఉన్నత పదవిలో లేరు.
అయితే, ఆయన కుటుంబ సభ్యులు హౌజా-ఎ-ఇల్మియా, దౌత్య రంగం, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అగ్ర నాయకత్వ వర్గాలతో సహా పలు కీలక రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యమే బాఘర్ ఖర్రాజీ వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. ఆయన తన వాదనలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు చూపకపోయినా, ఒక సాధారణ మత లేదా రాజకీయ కార్యకర్తతో పోలిస్తే ఆయన మాటలపై అందరి దృష్టి ఎక్కువగా పడుతుంది.
ఆయన సోదరుడు మొహమ్మద్ సాదిఖ్ ఖర్రాజీ ఇరాన్ విదేశాంగ శాఖలో ఏళ్ల తరబడి పనిచేశారు. ఫ్రాన్స్‌లో ఇరాన్ రాయబారిగా కూడా వ్యవహరించిన ఆయన, ఆ తర్వాత సంస్కరణవాద పార్టీ 'నిదాయి ఇరానియన్' స్థాపకుడిగా మారారు.
ఆయన బాబాయ్ కమాల్ ఖర్రాజీ కూడా మొహమ్మద్ ఖాతామీ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2006లో విదేశీ సంబంధాల వ్యూహాత్మక మండలి అధిపతిగా ఆయన్ను నియమించారు. అలీ ఖమేనీ ఆదేశాల మేరకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఫర్వర్దీన్‌లో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
సాదిఖ్, కమాల్ ఖర్రాజీల రాజకీయ శైలి, భాష.. మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ అవలంబించే కఠినమైన, సంప్రదాయేతర వైఖరికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
ఖర్రాజీ కుటుంబానికి ఖమేనీ కుటుంబంతో ఉన్న సంబంధం మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ సోదరి సోసన్ ఖర్రాజీ ద్వారా ఏర్పడింది. సోసన్ ఖర్రాజీకి మసూద్ ఖమేనీతో వివాహం జరిగింది. ఆయన అలీ ఖమేనీ మూడవ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి తమ్ముడు.
ఈ విధంగా మసూద్ ఖమేనీ.. మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీకి బావ అవుతారు. మసూద్ ఖమేనీ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. వివిధ రిపోర్టుల ప్రకారం, ఆయన తన తండ్రికి సంబంధించిన పత్రాలు, వారసత్వాన్ని భద్రపరచడం, ప్రచురించడం వంటి బాధ్యతలు చూసే కార్యాలయంలో పనిచేశారు.
ఈ కుటుంబ సంబంధాల పరిధి కేవలం ఖమేనీ కుటుంబానికే పరిమితం కాలేదు.
సాదిఖ్ ఖర్రాజీ కుమారుడికి మొహమ్మద్ రెజా ఖాతామీ, జహ్రా అష్రాఖీల కుమార్తెతో వివాహం జరిగింది. ఈ బంధం ద్వారా ఖర్రాజీ కుటుంబం ఒకవైపు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖాతామీ కుటుంబంతో పాటు మరోవైపు రుహుల్లా ఖొమేనీ కుటుంబంతో కూడా బంధాన్ని ఏర్పరుచుకుంది.
ఇరాన్ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలపై మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ చేసే వాదనలపై ఇంత అసాధారణమైన ఆసక్తి ఎందుకు ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ కుటుంబ సంబంధాలు కొంతవరకు సహాయపడతాయి.

ఫొటో సోర్స్, Hadi Zand - ISNA
దాదాపు 40 ఏళ్లుగా తాను మొజ్తబా ఖమేనీకి స్నేహితుడినని, ఎన్నో వ్యక్తిగత సమావేశాల్లో పాల్గొన్నానని బాఘర్ ఖర్రాజీ ఇటీవల చెప్పారు.
అంటే, మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ కేవలం ఒక మతపరమైన వ్యక్తి లేదా రాజకీయ కార్యకర్త మాత్రమే కాదు.
అధికార వ్యవస్థలో ఎలాంటి పాత్ర లేని వ్యక్తిగా కనిపిస్తారు కానీ, కుటుంబ, వ్యక్తిగత సంబంధాల ద్వారా ఇరాన్‌లోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ, మతపరమైన వర్గాల వరకు ఆయనకు ప్రవేశం ఉంది.
అందుకే, ఆయన చేసే వ్యాఖ్యలను ఆ తర్వాత ఖండించినప్పటికీ, ఇరాన్ రాజకీయ ముఖచిత్రంపై వాటి గురించి చర్చ జరుగుతుంటుంది.
హామీలు, వాదనలు, బెదిరింపులు
2013 అధ్యక్ష ఎన్నికల కోసం నమోదు చేసుకోవడాన్ని, ఇరాన్ అధికార వ్యవస్థలో చేరేందుకు మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ చేసిన అత్యంత కీలకమైన ప్రయత్నంగా భావిస్తారు.
ఆయన తన రాజకీయ ప్రచార లక్ష్యాన్ని 'దౌలత్-ఇ-సాలేహీన్' అంటే 'మంచి వ్యక్తుల ప్రభుత్వం' స్థాపనగా పేర్కొన్నారు. 'ఫారిస్-ఇ-ఇస్లామీ' అనే నినాదాన్ని స్వీకరించారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం, ఈ నినాదంలోని 'ఫారిస్' అనే పదం వాస్తవానికి నాలుగు పదాల మొదటి అక్షరాలతో ఏర్పడింది. ఆ పదాలే 'ప్రగతి, శాంతి, శ్రేయస్సు, భద్రత'.
ఆ సమయంలో ఖర్రాజీ ఎన్నికల హామీలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అధ్యక్షుడైన తొలి కొన్ని నెలల్లోనే ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను తొలగిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అలాగే, దేశ కరెన్సీ రియాల్, తోమన్‌లను మారుస్తామని చెప్పారు.
విదేశాంగ విధానం విషయంలో కూడా ఆయన అసాధారణ వాదనలు చేశారు. గత రెండు శతాబ్దాల కాలంలో ఇరాన్ నుంచి విడిపోయిన అన్ని ప్రాంతాలను 'ఒక్క చుక్క రక్తం చిందించకుండా' తిరిగి ఇరాన్‌లో భాగం చేస్తామని అన్నారు. ఈ ప్రాంతాలలో తజికిస్థాన్, అర్మేనియా, అజర్‌బైజాన్‌లను కూడా ఆయన ప్రస్తావించారు.
ఖర్రాజీ అధికారిక ఎన్నికల అభ్యర్థిత్వ నమోదుకు పలు నెలల ముందే ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై తజికిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యాఖ్యలను తజికిస్థాన్ సార్వభౌమాధికారం, స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించేవిగా, ఒక స్వతంత్ర దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా విదేశీ వ్యవహారాల శాఖ అభివర్ణించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది.
అయితే, అధ్యక్ష ఎన్నికల సమయంలో గార్డియన్ కౌన్సిల్ మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించలేదు. తుది అభ్యర్థుల జాబితాలో ఆయన పేరును చేర్చలేదు.

ఫొటో సోర్స్, mbkharrazi.ir
మరోసారి చర్చల్లోకి
మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ తాజా వ్యాఖ్యలు ఆయన్ను మరోసారి వార్తల్లో నిలిపాయి. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ,ఈ ప్రభుత్వంలో ఆయన 'తన పదవీకాలాన్ని పూర్తి చేయలేర'ని అన్నారు.
ప్రతి నగరంలో 530 మందిని సంఘటితం చేయాలని బాఘర్ ఖర్రాజీ తన సంస్థ సభ్యులకు చెప్పారు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే మొత్తం 2 లక్షల 50 వేల మందితో ఒక శక్తిని తయారు చేయడమే వారి లక్ష్యం. ఖర్రాజీ ప్రకారం, ఈ వ్యక్తులు తెహ్రాన్ చేరుకుని 'పని ముగించడానికి' కేవలం ఒక్క సమాచారం ఇస్తే సరిపోతుంది.
అయితే, మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ చేసిన వాదనల్లో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది మాత్రం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పదేపదే రాజీనామాకు ప్రతిపాదించడం, దానిపై మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారన్న విషయమే.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం ఖర్రాజీ పేరు ప్రస్తావించకుండానే, అధ్యక్షుడి లేఖపై సుప్రీం లీడర్ స్పందనకు సంబంధించిన వాదనను 'అబద్ధం, వాస్తవాలకు విరుద్ధం' అని పేర్కొంది.
ఇలాంటి సమాచారాన్ని ప్రచురించడం సమాజంలో 'భేదాభిప్రాయాలు, చీలికలు' సృష్టిస్తుందని సుప్రీం లీడర్ కార్యాలయం తెలిపింది. ఇది 'ఇరాన్ దేశానికి వ్యతిరేకులు, శత్రువుల లక్ష్యాలను ప్రోత్సహించడానికి' కూడా కారణమవుతుందని పేర్కొంది.
మరోవైపు, ఈ విషయంపై మసూద్ పెజెష్కియాన్ కూడా స్పందించారు. తాను ఎప్పుడైనా పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటే, ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు.
'నేను రాజీనామా చేయను, పదవిలోనే కొనసాగుతాను' అని పెజెష్కియాన్ స్పష్టంచేశారు.
మొజ్తబా ఖమేనీ కార్యాలయం స్పష్టంగా ఖండించినప్పటికీ, మొహమ్మద్ బాఘర్ ఖర్రాజీ తన వాదన నుంచి పూర్తిగా వెనక్కి తగ్గలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























