'అవును... ఇరాన్ దాడి అనుమానంతోనే విమానం మారా’ ఒప్పుకున్న ట్రంప్

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సరీన్ హబేషియాన్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

గత నెల తుర్కియేలో జరిగిన నేటో సదస్సు ముగిశాక, భద్రతా కారణాల రీత్యా తాను రహస్యంగా ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు.

'నేను సీక్రెట్ సర్వీస్, మిలిటరీ సూచనల మేరకే నడుచుకుంటాను. వారు నన్ను వేరే విమానంలో వెళ్లాలని కోరారు. వారు చెప్పినట్లే నేను చేయాల్సి వచ్చింది' అని మంగళవారం విలేఖరులతో ట్రంప్ చెప్పారు.

ట్రంప్ జులై 8న టీవీ కెమెరాల ముందే 'ఎయిర్‌ఫోర్స్ వన్' విమానం ఎక్కారు. ఆ తర్వాత క్యాటరింగ్ ట్రక్ సహాయంతో ఆయన రహస్యంగా ఒక సైనిక విమానంలోకి మారినట్లు రిపోర్ట్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చివరి నిమిషంలో చేసిన మార్పు వల్ల, డెకాయ్ (ప్రజల దృష్టి మళ్లించేందుకు వాడిన) విమానంలో ఉన్నవారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయా? అనే సందేహాలు తలెత్తాయి. అయితే, తాను ఎక్కిన సైనిక విమానానికే 'ఎక్కువ ప్రమాదం' పొంచి ఉందని మంగళవారం ట్రంప్ స్పష్టం చేశారు.

అధ్యక్షుడి విమానంపై ఇరాన్ క్షిపణి దాడి చేసే అవకాశం ఉన్నట్లు అమెరికా గుర్తించిందని బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్‌కు అధికారులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్
ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్

‘నేనే నెంబర్ వన్ టార్గెట్’

ఇరాన్ ముప్పు నుంచి అధ్యక్షుడిని తప్పించేందుకు పన్నిన ఈ వ్యూహంలో భాగంగా రహస్యంగా ఆయనను వేరే విమానంలోకి తరలించిన విషయం.. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఉన్న జర్నలిస్టులకు, కొందరు వైట్ హౌస్ సిబ్బందికి తెలియదు.

అంకారా సదస్సు సమయంలోనూ ఇరాన్‌కు 'నెంబర్ వన్ టార్గెట్' తానేనని గతంలో కూడా ట్రంప్ చెప్పారు.

'ఏదో ముప్పు ఉండి ఉండొచ్చని భావించాను. అందుకే అధికారులను పెద్దగా ఏమీ అడగలేదు. నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి. మీకు తెలియని ఎన్నో ముప్పులను నేను ఎదుర్కొంటున్నాను' అని విలేఖరులతో మంగళవారం ట్రంప్ అన్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు జరిగిన చర్చలు విఫలమవడంతో తెహ్రాన్‌పై అమెరికా మళ్లీ దాడులకు దిగిన మరుసటి రోజే అధ్యక్షుడు ఇలా రహస్యంగా విమానం మారారు.

ట్రంప్, ఖతర్ బహుమతిగా ఇచ్చిన కొత్త బోయింగ్ 747-8 విమానంలో తుర్కియే చేరుకున్నారు. కానీ తిరుగు ప్రయాణంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో వెళ్తానని ఆయన ప్రకటించారు.

జులై 8న అంకారా విమానాశ్రయంలో ఆయన ప్రెసిడెన్షియల్ జెట్ ఎక్కుతున్న దృశ్యాలు కనిపించాయి.

ట్రంప్ ఎక్కిన వైపు కాకుండా విమానానికి అవతలి వైపుగా విమానం ఎత్తు వరకు లేపిన ఒక క్యాటరింగ్ ట్రక్ ద్వారా ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి రహస్యంగా బయటకు వచ్చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

ట్రంప్
ఫొటో క్యాప్షన్, ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి క్యాటరింగ్ ట్రక్‌లో ట్రంప్ తరలింపు

‘కిటికీలు మూయాలనడం వింతగా అనిపించింది’

అక్కడి నుంచి ఆయనను రహస్యంగా C-32A అనే చిన్న సైనిక విమానంలోకి తీసుకెళ్లారు.

ప్రణాళిక ప్రకారమే అంతా సాధారణంగా జరుగుతుందని నమ్మించడానికి.. డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ బయటి మెట్ల ద్వారానే C-32A విమానం ఎక్కారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కిన జర్నలిస్టులు, వైట్‌హౌస్ సిబ్బందికి విమానం కిటికి షీల్డ్‌లు మూసేయాల్సిందిగా సూచించారు. అప్పటికీ విమానంలో అధ్యక్షుడు ట్రంప్ లేరనే విషయం వారెవరికీ తెలియదు.

విండోలు మూసేయాలని కోరడం తనకు కాస్త వింతగా అనిపించిందని ఆ సమయంలో విమానంలో ఉన్న మీడియా పూల్ ప్రొడ్యూసర్ ఒకరు చెప్పారు. ఒక ఫోటోగ్రాఫర్ విండోను కాస్త పైకి ఎత్తుతుండగా వెంటనే దాన్ని మూసేయాలని ఆయనకు సూచించినట్లు తెలిపారు.

ఈ మేరకు వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో పలు వివరాలను పేర్కొన్నారు. ప్రెస్ ప్రతినిధులు అక్కడికి చేరుకునే సమయానికే విమానం ముందు, వెనుక భాగాలలో రెండు క్యాటరింగ్ ట్రక్కులు ఆపి ఉంచారని ఆ ప్రొడ్యూసర్ గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా, ప్రెసిడెంట్ విమానం ఎక్కుతున్నప్పుడు ఫోటోలు తీయడానికి వీలు లేకుండా మీడియా వ్యాన్‌ను కాన్వాయ్‌లో చాలా వెనుకగా నిలిపివేశారని తెలిపారు.

అమెరికా, డోనల్డ్ ట్రంప్

బ్రిటన్ మీదుగా అమెరికాకు..

సాంకేతికంగా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమానానికైనా 'ఎయిర్ ఫోర్స్ వన్' అనే కాల్ సైన్ ఉంటుంది. కానీ, ఈ రహస్య ప్రయాణంలో అధ్యక్షుడు ఉన్న C-32A విమానానికి 'రీచ్ 18' అనే కాల్ సైన్ వాడారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, జర్నలిస్టులు ఉన్న విమానానికి 'AF1' అనే కాల్ సైన్‌నే కొనసాగించారు.

ఆ తర్వాత ట్రంప్ బ్రిటన్ మీదుగా అమెరికాకు బయలుదేరారు. ఆర్‌ఏఎఫ్ మిల్డెన్‌హాల్ వద్ద ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ల్యాండ్ అయిన తర్వాత ట్రంప్ అందులో నుంచే కిందకు దిగుతూ కనిపించారు. అయితే ఆయన C-32A నుంచి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోకి ఎలా మారారు? ఎప్పుడు మారానేది స్పష్టంగా తెలియదు.

అక్కడి నుంచి వాషింగ్టన్‌కు వెళ్లడానికి ట్రంప్, ఖతర్ బహుమతిగా ఇచ్చిన కొత్త విమానంలోకి మారారు.

వాషింగ్టన్ ప్రయాణంలో ట్రంప్ విమానంలోని విలేఖరులతో మాట్లాడారు. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పుల గురించి ప్రస్తావించినప్పటికీ, అంతకుముందు జరిగిన విమానం మార్పు గురించి ఆయన ఏమీ చెప్పలేదు.

తుర్కియే నుంచి బయలుదేరిన విమానంలో జర్నలిస్టులను కిటికీల షీల్డ్‌లు దించమని ఎందుకు చెప్పారని అడిగినప్పుడు, 'మనం ఎదుర్కొంటున్న దుర్మార్గుల వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే అలా చెప్పి ఉంటారు' అని ట్రంప్ సమాధానమిచ్చారు.

తన ప్రాణాలకు 'ఎప్పుడూ ముప్పు' ఉంటుందని, ఇరాన్ 'లిస్ట్'లో తాను 'నెంబర్ వన్' స్థానంలో ఉన్నానని ఆయన అన్నారు.

అధ్యక్షుడి వార్తలను కవర్ చేసే జర్నలిస్టులను అనవసరంగా ప్రమాదంలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రంప్ ప్రభుత్వంపైనే ఉందని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ డైరెక్టర్ జోస్ జమోరా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)