ఇరాన్ - అమెరికా ఒప్పందం: పాకిస్తాన్ 'దౌత్య విజయం'పై అంతర్జాతీయ మీడియా ఏమంటోంది?

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

100 రోజుల యుద్ధం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలోని మిగిలిన నిబంధనలను ఎలా పూర్తి చేయాలనే అంశంపై రాబోయే 60 రోజుల్లో చర్చలు జరుగుతాయి.

ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడంలో పాకిస్తాన్ కీలక మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందానికి సంబంధించిన మొదటి చర్చలు ఇస్లామాబాద్‌లోనే జరిగాయి.

పాకిస్తాన్ పోషించిన ఈ పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

అంతర్జాతీయ మీడియా దీనిని ఆ దేశానికి గొప్ప దౌత్య విజయంగా అభివర్ణిస్తోంది.

''ఈ ఒప్పందం ఖరారైతే, ఒక దేశం దీన్ని తన అతిపెద్ద విజయంగా భావిస్తుంది, అదే పాకిస్తాన్. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా ప్రధాన పాత్రను ఆ దేశమే పోషించింది'' అని అమెరికా పత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్'‌లో కాలమిస్ట్ సదానంద్ ధుమే రాశారు.

పాకిస్తాన్‌‌కు ప్రయోజనమేంటి?

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, "ఈ గెలుపు ప్రభావం శాశ్వతంగా ఉండకపోవచ్చు. అయితే, ప్రపంచ వేదికపై దక్కిన ఈ కొత్త ప్రాధాన్యతను పాకిస్తాన్ తన ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి.

ఏడాది కిందట ఎవరైనా ఇలాంటిది ఊహించి ఉంటే, వారిని కలల ప్రపంచంలో బతుకుతున్నారని అనేవారు. కానీ, పాకిస్తాన్ సాధించిన ఈ దౌత్య విజయం, ఫిఫా ప్రపంచ కప్‌లో కేప్ వర్డే దేశం గెలిచినట్లుగా ఉంది.

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండో పదవీ కాలంలో అమెరికా, పాకిస్తాన్ సంబంధాలు చాలా మెరుగయ్యాయి. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికాకు పాకిస్తాన్ తోడుగా నిలిచింది. అంతేకాక 'రేర్ ఎర్త్ మినరల్స్' (అరుదైన ఖనిజాలు) లభ్యతకు సంబంధించి అమెరికాకు వాగ్దానం చేసింది.

గత ఏడాది భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణ తర్వాత పాకిస్తాన్ బహిరంగంగానే ట్రంప్ పాత్రను ప్రశంసించింది. అయితే, భారత్ ఈ వాదనను తిరస్కరించింది.

వైట్‌హౌస్‌తో మెరుగైన సంబంధాలను ఎలా ఏర్పరుచుకోవాలో అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా పాకిస్తాన్ పద్ధతులను అధ్యయనం చేయవచ్చు.

పాకిస్తాన్‌కు గతంలో కూడా చాలాసార్లు దౌత్య విజయాలు దక్కాయి. కానీ, వాటి వల్ల అక్కడి సామాన్య పౌరులకు కలిగిన ప్రయోజనం చాలా తక్కువ.

గత సంవత్సరం ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, దక్షిణ ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థికంగా వెనుకబడిపోయింది. దాని తలసరి జీడీపీలో దశాబ్ద కాలంగా ఆశించిన వృద్ధి లేదు. అది 2015లో 1,380 డాలర్లు ఉండగా, 2024 నాటికి కేవలం 1,478 డాలర్లకు మాత్రమే చేరింది.

పాకిస్తాన్ నాయకత్వం గనుక దూరదృష్టితో ఆలోచిస్తే, అంతర్జాతీయ వేదికపై లభించిన ఈ కొత్త గుర్తింపును ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, విస్తృతంగా ఉన్న పేదరికాన్ని, కష్టాలను తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు."

ఇది అవకాశంతో పాటు రిస్క్ కూడానా?

అంతర్జాతీయ వ్యవహారాల పత్రిక 'ది డిప్లొమాట్' కథనం ప్రకారం, పశ్చిమాసియా దేశాలపై ఈ పరిణామాల ప్రభావం ఉంటుంది. అయితే, పాకిస్తాన్‌పై దీని ప్రభావం కొంత ప్రత్యేకం. ఎందుకంటే ఆ దేశం మధ్యవర్తి పాత్ర పోషించింది.

శాంతి ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే నెలల్లో ఎన్నో సవాళ్లు ఎదురుకావచ్చు. అయినప్పటికీ పాకిస్తాన్‌లో పెట్టుబడులు, వాణిజ్యం, విదేశీ మారక ద్రవ్య ప్రవాహంపై పెద్దయెత్తున ఆశలు ఉన్నాయి.

చాలాకాలంగా నిలిచిపోయిన ఇరాన్ - పాకిస్తాన్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తవుతుందని పాకిస్తానీయులు ఆశిస్తున్నారు. దీనివల్ల దేశ ఇంధన సంక్షోభం నుంచి చాలా ఉపశమనం లభించవచ్చు.

ప్రాంతీయ స్థిరత్వంలో తాను పోషించిన పెద్ద పాత్రకు ప్రతిఫలంగా పాకిస్తాన్‌కు గల్ఫ్ దేశాల నుంచి రాయితీ ధరలపై చమురు లభించవచ్చని కూడా భావిస్తున్నారు. అలాగే, పాకిస్తాన్ తన పెరిగిన అంతర్జాతీయ ప్రతిష్టను ఉపయోగించుకుని పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా విజయం సాధించవచ్చు.

యుద్ధం నుంచి గౌరవప్రదమైన రీతిలో బయటపడటానికి అమెరికాకు సహాయం చేసినందుకు గాను పాకిస్తాన్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయని కూడా పాకిస్తానీయులు ఆశిస్తున్నారు.

అమెరికా, పాకిస్తాన్ సంబంధాల చరిత్రను పరిశీలిస్తే.. సైనిక సహకారం, ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురికావడం వంటి దశలతో నిండి ఉంది. ఉదాహరణకు, 1980ల కాలంలో అఫ్గాన్ ముజాహిదీన్లకు ఆయుధాలు, ఇతర లాజిస్టిక్ మద్దతు అందించడానికి పాకిస్తాన్‌ను అమెరికా ఉపయోగించుకుంది. కానీ, అఫ్గానిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ బయటకు రాగానే, వాషింగ్టన్‌కు పాకిస్తాన్ అవసరం తగ్గిపోయింది. ఆ దేశంపై ఆంక్షలు కూడా విధించింది.

అయితే, సాయం పొందిన తర్వాత మర్చిపోయే తన పాత విధానాన్ని అమెరికా ఇప్పుడు పునరావృత్తం చేయబోదని ప్రజలు ఆశిస్తున్నారు.

ఇరాన్ చమురు, గ్యాస్ రంగాలలో తమ కంపెనీలు పనిచేయడానికి అమెరికా అనుమతిస్తుందని, దీనివల్ల సామాన్య ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని పాకిస్తానీయులు ఆశిస్తున్నారు.

అయితే, పాకిస్తాన్‌కు ఇలాంటి విషయాల్లో పాత అనుభవాలూ ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి ఒప్పందాల వల్ల పాకిస్తాన్ ఎన్నో నష్టాలను అనుభవించాల్సి వచ్చింది, కానీ అమెరికా మాత్రం తన పని ముగియగానే తప్పుకుంది.

ఈసారి అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్తాన్ తీసుకున్న రిస్క్‌కు తగిన ప్రతిఫలం లభిస్తుందా అనేదే ప్రశ్న.

యుద్ధం తర్వాత పాకిస్తాన్ నిస్సందేహంగా పశ్చిమ ఆసియాలో ఒక ముఖ్యమైన శక్తిగా ఎదిగింది. పాకిస్తాన్‌కు కేవలం దక్షిణాసియా దేశంగానే కాకుండా.. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్లో కూడా ఒక కొత్త గుర్తింపు, కీలకమైన పాత్ర లభించాయని చెప్పవచ్చు.

భారత్, అఫ్గానిస్తాన్‌లతో ఉన్న భద్రతా సమస్యల వల్ల పాకిస్తాన్‌కు దక్షిణాసియాతో సంబంధాలు తప్పనప్పటికీ.. పశ్చిమాసియాలో పెరిగిన దాని పాత్ర వల్ల ఇప్పుడు పెద్ద ఎత్తున భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు దక్కాయి. ఇది ఆ దేశ అంతర్జాతీయ ప్రతిష్టను దౌత్య ప్రభావాన్ని బలోపేతం చేసింది.

అయినప్పటికీ, పాకిస్తాన్ ముందున్న అతిపెద్ద సవాలు తన అంతర్గత పరిస్థితులను చక్కదిద్దుకోవడం.

పరిపాలన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోకుండా, అది తన పెరుగుతున్న అంతర్జాతీయ ప్రతిష్ట పూర్తి ప్రయోజనాన్ని పొందలేదు.

'ది డిప్లొమాట్' పత్రిక, రాజకీయ విశ్లేషకులు ఖుర్రమ్ హుస్సేన్ 'డాన్' పత్రికలో రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావించింది.

ఖుర్రమ్ హుస్సేన్ 'డాన్' పత్రికలో ''ఇరాన్ మనల్ని ఎలా గుర్తుంచుకుంటుంది, అమెరికా మనకు ఎంత బహుమతి ఇస్తుందనేది మన నియంత్రణలో లేదు. ఇవి ఇతర పాలకుల నిర్ణయాలు. వారు ఆయా దేశాల రాజధానులలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. మన నియంత్రణలో ఉన్నదే మనకు ముఖ్యం. కానీ, మనం నిరంతరం దాన్ని వాయిదా వేస్తూ వచ్చాం'' అని రాసినట్లు పేర్కొంది.

దేశీయ సంస్కరణల ఆవశ్యకతను ఖుర్రమ్ హుస్సేన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

'నమ్మకం సంపాదించడమే కీలకం'

పాకిస్తాన్ కొత్త పాత్రను 'ఫ్రాన్స్ 24' పత్రిక ప్రస్తావిస్తూ, ఇరాన్‌లో పాకిస్తాన్ మాజీ రాయబారి ఆసిఫ్ దుర్రానీ మాటలను ఉటంకించింది.

ఫ్రాన్స్ 24 కథనం ప్రకారం, ''అన్నిటికంటే ముఖ్యమైన విషయం మధ్యవర్తి విశ్వసనీయత. పాకిస్తాన్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఎందుకంటే దానిపై ఇరాన్, అమెరికాలకు నమ్మకం ఉంది" అని ఆసిఫ్ దుర్రానీ చెప్పారు.

ఇరాన్, పాకిస్తాన్ సంబంధాలు చాలా లోతైనవి. ఇరుదేశాల మధ్య 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. సాంస్కృతిక సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. సున్నీ జనాభా ఎక్కువగా ఉన్న పాకిస్తాన్‌లో.. ఇరాన్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో షియా ముస్లింలు నివసిస్తున్నారు.

అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు కూడా ముఖ్యమైనవే. అయినప్పటికీ అవి సంక్లిష్టంగా ఉండేవి. అఫ్గానిస్తాన్ యుద్ధ సమయంలో నాటో దళాలకు పాకిస్తాన్ సరఫరా మార్గాలను అందించింది. దానికి బదులుగా బిలియన్ల కొద్దీ డాలర్ల అమెరికా సహాయాన్ని పొందింది.

కానీ, 2011లో అమెరికా 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్తాన్‌లోనే హతం చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల సంబంధాలలో ఉద్రిక్తత నెలకొంది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ వ్యక్తిగత సంబంధాలు ఇస్లామాబాద్ ప్రభావాన్ని పెంచడంలో సహాయపడ్డాయి. ఒక ప్రభావవంతమైన సైనిక నాయకుడిగా మునీర్‌కు ఇరాన్ 'రివల్యూషనరీ గార్డ్స్' కమాండర్లతో పరిచయం ఉంది.

ఆయనకు డోనల్డ్ ట్రంప్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతారు. భారత్-పాకిస్తాన్ ఘర్షణలో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన తర్వాత, మునీర్‌ తన 'అభిమాన ఫీల్డ్ మార్షల్' అని అమెరికా అధ్యక్షుడు అన్నారు.

ఆసిఫ్ దుర్రానీ మాట్లాడుతూ, "ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలలో భాషను సమర్థవంతంగా ఉపయోగించడంలో పాకిస్తాన్‌కు ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంది. ఈ నైపుణ్యం ఇక్కడ చాలా ఉపయోగపడింది" అన్నారు.

అంతర్జాతీయ వివాదాలలో చాలాకాలంగా మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న ఖతార్ కూడా ఇటీవలి వారాల్లో మరింత చురుగ్గా మారింది. ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నంలో ఖతార్‌ను పాకిస్తాన్ ప్రధాని 'బ్రదర్' అని అన్నారు.

పాకిస్తాన్ తన పొరుగు దేశాలైన అఫ్గానిస్తాన్, భారత్‌లతో నడుస్తున్న వివాదాలలో అంతర్జాతీయ మద్దతును కూడా కోరుకుంటోంది. కీలకమైన జలవనరుల సరఫరాను నిలిపివేస్తామని భారత్ ఇప్పటికే హెచ్చరించింది.

ఫ్రాన్స్ 24 పత్రిక తన కథనంలో అట్లాంటిక్ కౌన్సిల్ దక్షిణాసియా నిపుణులు మైఖేల్ కుగెల్‌మన్ మాటలనూ ఉటంకించింది.

ఆ కథనం ప్రకారం, "పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలనే భారత్ ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆ దేశం స్పష్టంగా నిరూపించింది. శాంతిదూతగా, మధ్యవర్తిగా తనను తాను ప్రపంచం ముందు నిలబెట్టుకోవడం ద్వారా పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలోని చాలా దేశాల ఆలోచనా విధానాన్ని మార్చగలిగింది. అంతకుముందు ఆ దేశాన్ని కేవలం సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న, పరిమిత అంతర్జాతీయ ప్రభావం ఉన్న దేశంగా చూసేవారు" అని కుగెల్‌మన్ తెలిపారు.

ఉగ్రవాదం, తీవ్రవాదానికి సంబంధించిన సవాళ్లు పాకిస్తాన్ అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఇప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని పాకిస్తాన్ ఆశిస్తోంది. అలాగే అమెరికా ఆంక్షల కారణంగా ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ఇరాన్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించవచ్చు'' అన్నారాయన.

''అయినప్పటికీ ఈ ప్రక్రియ ఇంకా ముగియలేదు. ప్రాథమిక ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన వివాదాస్పద అంశాలను చేర్చలేదు. కాబట్టి, ముందు ముందు మరింత దౌత్యం అవసరమవుతుంది. ఇది పాకిస్తాన్‌కు కొత్త సవాళ్లను కూడా తీసుకురావచ్చు'' అని కుగెల్‌మన్ అన్నారు.

"పాకిస్తాన్ బహిరంగంగానే మధ్యవర్తి పాత్రను అంగీకరించింది. దీనివల్ల ఆ దేశం కొంత రిస్క్ కూడా కొని తెచ్చుకుంది. ఒకవేళ పరిస్థితి విషమించి ఉంటే, ఆ నింద పాకిస్తాన్‌పైనే పడేది. దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఆ దేశం సిద్ధపడింది" అన్నారు.

'పాకిస్తాన్‌కు భారీ దౌత్య విజయం'

ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాన్ని పాకిస్తాన్ సాధించిన పెద్ద దౌత్య విజయంగా బ్రిటిష్ పత్రిక 'గార్డియన్' అభివర్ణించింది.

ఆ పత్రిక కథనం ప్రకారం, పాకిస్తాన్ అధికారుల శ్రమ వల్ల ప్రస్తుతానికైనా ఒక పెద్ద సంక్షోభం తప్పిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి రెండు వారాలకు పైగా పరుగులు, ఫోన్ కాల్స్, దౌత్య సమావేశాలు జరిగాయి. పైగా పరిస్థితులు మెరుగయ్యేలా కనిపించకపోగా.. పాకిస్తాన్‌కు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా అనిపించింది.

దేశంలో సర్వాధికారాలు చెలాయించే పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి ఈ యుద్ధాన్ని ఆపడం అనేది కేవలం ప్రతిష్టకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ, భద్రత, జాతీయ ప్రయోజనాలు, మతపరమైన శాంతి సామరస్యాలు.. అన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయి.

సౌదీ అరేబియాతో ఇటీవల కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం, ఒకవేళ సౌదీ అరేబియా గనుక యుద్ధంలోకి దిగి ఉంటే, పాకిస్తాన్ కూడా ఏదో ఒక విధంగా ఆ యుద్ధంలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడేది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)