షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సమావేశంలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది.
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతుండగా, ఆయన చెవికి పెట్టుకున్న హెడ్ ఫోన్ పదే పదే కింద జారిపడింది. ఈ దృశ్యాన్ని చూస్తూ పుతిన్ నవ్వుతూ ఉండిపోయారు.
ఈ వీడియోను రష్యా అధికారిక మీడియా సంస్థ ఆర్ఐఏ షేర్ చేసింది.
ఇదే వీడియోను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) కూడా షేర్ చేసింది.
హెడ్‌ఫోన్ పదే పదే జారి పడిపోతుండగా, సాయం చేయాలంటూ షాబాజ్ అక్కడున్న సిబ్బందిని కోరారు. ఆ వ్యక్తి వచ్చి సరిచేసినా హెడ్ ఫోన్ మళ్లీ పడిపోయింది.
‘‘ఇది ఒక ఇబ్బందికరమైన సన్నివేశం’’ అని పీటీఐ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ సదస్సులో పాల్గొంటున్న పాకిస్తాన్ బృందాన్ని విమర్శిస్తూ నేషనల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, పీటీఐ నేత ఖాసింఖాన్ సూరి ఒక ఫొటో విడుదల చేశారు.
అందులో పాకిస్తాన్ బృందంలోని విదేశాంగ శాఖమంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సహా మిగిలిన సభ్యులంతా బిచ్చగాళ్లలాగా కూర్చున్నారని ఖాసింఖాన్ విమర్శించారు.
అంతకు ముందు, సమర్‌ఖండ్‌లో వివిధ దేశాల నేతలతో సమావేశాలు ఫలవంతంగా జరిగాయని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై స్పందిస్తూ, ‘‘కానీ, ఫొటోల్లో అవతలి దేశానికి చెందిన సభ్యులు శ్రద్ధగా విషయాలు నోట్ చేసుకుంటుండగా, మిగిలిన వాళ్లు బిచ్చగాళ్లలా ఖాళీగా కూర్చున్నారు’’ అంటూ ఖాసింఖాన్ ట్వీట్ లో విమర్శించారు.