నాడు 2జీ స్పెక్ట్రమ్‌లో కుంభకోణం అని గొడవ చేశారు.. ఇప్పుడు 5జీ స్పెక్ట్రమ్ స్కామ్ కాదా?
‘‘ఎన్‌డీఏలో ఎన్‌పీఏ దందా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ బాగా పనిచేస్తే ఎన్‌పీఏలు తగ్గాలి కదా? కానీ 10 రెట్లు ఎందుకు పెరిగింది? దేశంలో 2 లక్షల కోట్ల ఎన్‌పీఏ 20 లక్షల కోట్లకు పెరిగిందంటే.. ఇది దేనికి సంకేతం? మీ పనితనమా? దోపిడీయా? బ్యాంకుల రుణాల ఎగవేతలు లక్షల కోట్లకు పెరుగుతాయి? ఇది ప్రగతికి సంకేతమా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
‘‘దేశంలో ఎక్కడ ప్రొడక్టివిటీ పెరిగింది? మేక్ ఇన్ ఇండియా అన్నారు. మరి పతంగుల మాంజా, దీపావళి టపాసులు, షేవింగ్ చేసుకునే బ్లేడ్లు కూడా చైనా నుంచి ఎందుకు వస్తున్నాయి? మొబైల్ ఫోన్లు, పీపీయే కిట్లు, నేషనల్ ఫ్లాగ్స్ కూడా చైనా నుంచి వస్తే.. ఇది మేక్ ఇన్ ఇండియానా? దిగుమతులు తగ్గాలా? పెరగాలా?
భారతదేశపు భూమిలో 50 శాతం భూమి సాగుయోగ్యమైన భూమి. ప్రపంచంలో మరే దేశానికీ ఇలాంటి అవకాశం లేదు. ప్రతి ఎకరానికీ నీళ్లు ఇవ్వగలిగే సదుపాయం ఉంది. ఇవ్వాళ కూడా కందిపప్పు, పామాయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఇదా నీతి ఆయోగ్ మేధో సంపత్తి? కేంద్ర ప్రభుత్వ ప్రజ్ఞ. మీ కార్పొరేట్ అనుకూల వైఖరి వల్ల నూనెగింజలు పండించాల్సిన రైతులు దిల్లీ సరిహద్దు దగ్గర నిరసనలు చేస్తున్నారు.
అంతా ప్రైవేటైజేషన్. ఎయిర్‌పోర్టు, రైల్వేలు, కరెంటు అన్నీ. ఇదేం దౌర్భాగ్యం. బ్యాంకుల రుణాల ఎగవేత. బ్యాంకుల లూటీలు ఏమిటి? బ్యాంకులు లూటీ చేసి బయటి దేశాలకు పారిపోతున్నారు. మొదటి దశలో మేధో సంపత్తి వలస పోయింది. ఇవ్వాళ పెట్టుబడులు వలస పోతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్నాయి. శ్రీలంక లాంటి పరిస్థితులు వస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కానీ..రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సబ్సిడీ పథకాలు ఇస్తుంటే..అవి ఉచిత పథకాలు, వాటిని నిలిపివేయాలని చెప్తారా? పేద ప్రజల నోళ్లు కొట్టి కాకులకు గద్దలకు వేయాలా? ఇదెక్కడి నీతి?
అప్పుడు 2జీ స్పెక్ట్రమ్ వేలంలో అన్యాయం జరిగినట్లు పెడబొబ్బలు పెట్టారు? మరి ఈ రోజు 5జీ వేలం సంగతేమిటి? 5 లక్షలకు ఎస్టిమేట్ వేస్తే.. లక్షా యాభై వేల కోట్లే వస్తాయా? ఇది కుంభకోణం కాదా?
ఒకవైపు గాలి తప్ప అన్నిటి మీదా జీఎస్‌టీ పన్నులు వేస్తున్నారు. పాల మీద, స్మశానాల మీద, అల్పాదాయ వర్గాల మీద జీఎస్‌టీ పన్ను వేస్తారు.
రాష్ట్రాల అభివృద్ధిని కుంటు పరచకండి. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన భారతదేశంగా ఉంటుంది. అదే నిజమైన సమాఖ్య స్ఫూర్తి. దానిని పాటించండి.
ఇప్పుడు మాటలుగా అడుగుతున్నాం. అవసరమైతే కలిసివచ్చే వారిని కలుపుకుని బలీయమైన ఉద్యమాలను కూడా నిర్మిస్తాం. మోదీ నాకు మిత్రుడు. వ్యక్తిగత విభేదాల్లేవు. కానీ సంఘర్షణ తప్పదు.’’ అని కేసీఆర్ మీడియా సమావేశంలో అన్నారు.