కరోనావైరస్ వ్యాక్సీన్: దేశమంతటా 2.24 లక్షల మందికి టీకాలు, 447 మందికి స్వల్ప అస్వస్థత : Newsreel

కరోనా వ్యాక్సినేషన్ రెండో రోజున కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమీక్షా సమావేశం నిర్వహించింది. "సమస్యాత్మక ప్రాంతాలను" గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
దేశవ్యాప్తంగా 2,24,301 మందికి టీకాలు వేసినట్లు ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, టీకా వేయించుకోవడం వల్ల 447 మంది అస్వస్థతకు గురైనట్లు వెల్లడించింది. వారిలో ముగ్గురు మాత్రమే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని తెలిపింది.
"జనవరి 16, 17 తేదీలలో 447 ఏఈఎఫ్ఐ (అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధిక శాతం స్వల్ప స్థాయి దుష్ప్రభావాలే. సూది గుచ్చిన చోట వాపు రావడం, స్వల్పంగా జ్వరం, మగత, వికారం, ఒళ్లు నొప్పులు, దురద వంటి సమస్యలే" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అగ్నాని తెలిపారు.
"తొలి రోజున మొత్తంగా 2,07,229 మందికి టీకాలు వేశాం. ప్రపంచంలోనే ఇది అత్యధికం. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలలో మొదటి రోజున వ్యాక్సీన్ అందుకున్న వారి కన్నా ఇది ఎక్కువ" అని అగ్నాని అన్నారు.
రాష్ట్రాలన్నీ కూడా సాధారణ ఆరోగ్య సేవలకు ఇబ్బందులు కలుగకుండా వారంలో నాలుగు రోజులు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలని, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టీకాలు ఇచ్చే రోజులేమిటో ప్రకటించాయని ఆరోగ్య శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, Chinki Sinha/BBC
రైతుల ఆందోళన: రిపబ్లిక్ డే పరేడ్ మీద ఎలాంటి ప్రభావం ఉండదన్న యోగేంద్ర యాదవ్
రైతుల నిరసనల అంశంపై మాట్లాడిన స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్, జనవరి 26న తాము రైతుల ట్రాక్టర్ ర్యాలీ చేసి తీరుతామని అన్నారు. దానివల్ల రిపబ్లిక్ డే పెరేడ్ మీద ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"రైతుల ట్రాక్టర్ ర్యాలీ అవుటర్ రింగ్ రోడ్ మీద త్రివర్ణ పతాకాలతో జరుగుతుంది. రిపబ్లిక్ డే అధికారిక పెరేడ్‌కు దానివల్ల ఎలాంటి అంతరాయం ఉండదు" అని యోగేంద్ర యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2024 మే నెల వరకూ ప్రదర్శనలు చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికైట్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
'నన్ను, నా భార్యను చంపేస్తారేమో...' - ఉగాండా అధ్యక్ష ఎన్నికల ప్రత్యర్థి బాబీ వైన్
ఉగాండా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బాబీ వైన్ తన ప్రాణాలకు ప్రమాదం ఉందని అన్నారు. గురువాం నాడు జరిగిన ఎన్నికల్లో యొవేరి ముసవేని ఆరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గాయకుడిగా ఉంటూ రాజకీయవేత్తగా మారిన బాబీ వైన్, ఈ ఎన్నికల ఫలితాలను తాను తిరస్కరిస్తున్నానని బీబీసీతో చెప్పారు.
ఈ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో చాలా హింస చోటు చేసుకుంది. డజన్ల కొద్దీ ప్రజలు చనిపోయారు. ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్ నిషేధించింది. ఎన్నికల పర్యవేక్షకులు ఆ చర్యను ఖండించారు.
రోజంతా ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఓట్ల లెక్కింపు మీద అనుమానాలు తలెత్తాయి. ఇంటర్నెట్ సేవలు 'త్వరలోనే' పునరుద్ధరిస్తామని ఒక మంత్రి బీబీసీతో చెప్పారు.
బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో బాబీ వైన్ (ఇది 38 ఏళ్ల రాబర్ట్ క్యాగులాన్యి స్టేజి పేరు), "నాకు, నా భార్యకు ప్రాణహాని ఉంది" అని అన్నారు. ఆయన ఇంటి చుట్టూ భద్రతా సిబ్బంది మోహరించారు. తమను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని కూడా బాబీ వైన్ చెప్పారు.
"స్థానిక జర్నలిస్టులు, విదేశీ జర్నలిస్టులు ఎవరినీ నన్ను కలవకుండా నిరోధిస్తున్నారు" అని అన్నారు. నేషనల్ యూనిటీ ప్లాట్‌ఫామ్ నేత అయిన వైన్, ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ అయిన వెంటనే ఎన్నికల అక్రమాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తానని అన్నారు.
ఇదిలా ఉంటే, అధ్యక్షునిగా ఎన్నికైన ముసవేనికి మరో అయిదేళ్లు అధికారంలో కొనసాగే అవకాశ లభించింది. 76 ఏళ్ల ఈ నాయకుడు 1986 నుంచి ఉగాండా అధ్యక్షునిగా ఉన్నారు.
ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటన వెలువడగానే ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. "దేశ చరిత్రలో ఎలాంటి అక్రమాల లేకుండా జరిగిన ఎన్నికలు ఇవే" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, EPA
అఫ్గానిస్తాన్: ఇద్దరు మహిళా న్యాయమూర్తుల కాల్చివేత
కాబుల్‌లో ఇద్దరు సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారని అధికారులు వెల్లడించారు. వాళ్లిద్దరూ వాహనంలో తమ ఆఫీసుకు వెళ్తుండగా తుపాకులతో దాడి చేసిన దుండగులు కాల్చి చంపారని కోర్టు అధికార ప్రతినిధి ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో తెలిపారు.
గత కొన్ని నెలలుగా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు వరసగా హత్యకు గురవుతున్నారు. అఫ్గానిస్తాన్‌లోని అమెరికా దళాలను ఆ దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెనక్కి రప్పించడం కొనసాగిస్తుండడంతో ఇక్కడ హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా సేనల సంఖ్య 2,500లకు పడిపోయింది.
ఇప్పటికే అస్థిరంగా ఉన్న తమ దేశంలో అమెరికా సేనల ఉపసంహరణ వల్ల హింస మరింత పెరుగుతుందని అఫ్గాన్ ఉపాధ్యక్షుడు ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆదివారం నాడు ఏం జరిగింది?
ఇద్దరు మహిళా న్యాయమూర్తులను దుండగులు దారి కాచి కాల్చి చంపారు. వాళ్ల డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన కాబుల్ లోని ఖలా-ఏ-ఫతుల్లాలో జరిగింది. ఇప్పటికి వరకూ ఆ పని చేసింది తామేనని ఎవరూ ప్రకటించలేదు.
ఇటీవలి కాలంలో తాలిబాన్లు వరస హత్యలకు పాల్పడుతుండడంతో ఈ హత్యలు కూడా వారి పనే అని అనుమానిస్తున్నారు. కానీ, తాలిబాన్ మిలిటెంట్లు కూడా అది తామే చేశామని ఇంతవరకూ చెప్పలేదు.
ఒకవైపు దోహాలో అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబాన్ ప్రతినిధులకు మధ్య జరుగుతుండగా ఈ హత్యలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్: భారత్‌లో మొదటి రోజు 1.91 లక్షల మందికి కోవిడ్ టీకాలు
- అమెరికా: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎలా జరుగుతుంది?
- 'నో' అని చెబుతూనే నొప్పించకుండా మెప్పించడం ఎలా?
- కోవిన్ (Co-Win) యాప్: దీన్ని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు? వ్యాక్సీన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ట్రంప్ అభిశంసన: బైడెన్ మీద, అమెరికా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- రాయల్ ఎన్ఫీల్డ్ బాటలో భారత్‌లోకి ‘బుల్లెట్’లా దూసుకొస్తున్న బ్రిటిష్ బైక్‌లు
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























