మిషిగన్: ‘హోంవర్క్ చెయ్యని’ 15 ఏళ్ల స్టూడెంట్‌ను నిర్బంధించిన పోలీసులు.. బెయిల్ నిరాకరించిన కోర్టు

గ్రేస్‌ను విడుదల చేయాలంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న అమెరికన్ మహిళలు

ఫొటో సోర్స్, Reuters

ప్రచురణ

అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో హొంవర్క్ చెయ్యకపోవడమే కాకుండా తల్లితో గొడవపడిన 15 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు.

15 ఏళ్ల "గ్రేస్" మే నుంచీ జువైనల్‌ నిర్బంధంలో ఉన్నారు.

"నేను మా అమ్మను చాలా మిస్ అవుతున్నాను. నేను బుద్ధిగా ఉంటాను. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను" అంటూ బెయిల్ ఇప్పించమని గ్రేస్ సోమవారంనాడు కోర్టులో అభ్యర్థించారు.

జువైనల్ నిర్బంధంలో ఉండడం ఆమె భవిష్యత్తు కోసమేనని చెప్తూ జడ్జి మేరీ ఎలెన్ బ్రెనన్ బెయిల్ నిరాకరించారు.

మిషిగన్ రేడియో రిపోర్టు ప్రకారం "ఇప్పుడు నిన్ను విడుదల చేస్తే నేను తప్పు చేసినట్టు అవుతుంది. నీకు మేలు జరగదు. ఇది నీ మంచికోసమే చేస్తున్నానన్న విషయంలో నాకెటువంటి సందేహం లేదు" అని గ్రేస్‌తో జడ్జి అన్నారు.

గ్రేస్‌కు బెయిల్ నిరాకరించడం నిరసనలకు దారి తీసింది. ఈ తీర్పు జాత్యహంకారాన్ని సూచిస్తుందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

ఆ అమ్మాయి జువైనల్ నివాస కేంద్రంలో తగిన శిక్షణ పొందుతోందని, అది తన మంచి కోసమేనని జడ్జి అన్నారు.

గ్రేస్‌కు, ఆమె తల్లికి అనేకసార్లు గొడవలు జరిగాయని, పలుమార్లు ఫిర్యాదులు వచ్చిన తరువాతే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని జడ్జి తెలిపారు.

"హోంవర్క్ చెయ్యని కారణంగా ఆమెను నిర్బంధించలేదు, ఆమె వల్ల తల్లికి ప్రమాదం ఉందని భావించి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో నా తీర్పుపై విమర్శలొచ్చినా భయపడను" అని జడ్జి బ్రెనన్ వివరించారు.

గ్రేస్‌ను విడుదల చేయాలంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న అమెరికన్ మహిళ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గ్రేస్‌ను విడుదల చేయాలంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న అమెరికన్ మహిళ

మొటమొదటిసారిగా యూఎస్ న్యూస్ వెబ్‌సైట్ ప్రోపబ్లికా ఈ కేసు గురించి ప్రస్తావించింది. ఆ అమ్మాయికి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ (ఏడీహెచ్‌డీ) ఉందని, ఆమె ప్రవర్తనతో సమస్యలున్నాయని గ్రేస్ తల్లి పలు ఇంటర్వ్యూల్లో చెప్పినట్టు ప్రోపబ్లికా ప్రచురించింది.

ప్రోపబ్లికా ప్రచురించిన కథనం ప్రకారం గత యేడాది గ్రేస్‌పై వచ్చిన ఫిర్యాదులననుసరించి ఆమెను పరిశీలనలో ఉంచాలని జువైనల్ కోర్టు ఈ ఏప్రిల్లో తెలిపింది. అందులో భాగంగా గ్రేస్ ఎప్పటికప్పుడు తన స్కూల్ హోంవర్క్ పూర్తి చేస్తూ ఉండాలని నియమం విధించారు. కానీ టీచర్ సహాయం లేకుండా హోంవర్క్ చెయ్యడం ఆమెకు సాధ్యపడలేదు.

గ్రేస్ హోంవర్క్ చెయ్యట్లేదని, స్కూలుకు తయారు కావట్లేదని మే నెలలో ఓక్లాండ్ ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణలో తేలింది. ఇంతకుముందు వచ్చిన ఫిర్యాదులననుసరించి గ్రేస్ వల్ల తన చుట్టూ ఉన్న సమాజానికి ముప్పు ఉందని జడ్జి బ్రెనన్ తెలిపారు.

గతవారం గ్రేస్ స్కూలు ముందు వందలకొద్దీ విద్యార్థులు గుమికూడి ధర్నా చేసారు. "బ్లాక్ లైవ్స్ మేటర్" అనే నినాదంతో పాటూ "ఫ్రీ గ్రేస్" నినాదాన్ని కూడా చాటారు.

"గ్రేస్ ఒక 15 యేళ్ల తెల్లజాతి అమ్మాయి అయితే ఇలా జువైనల్ నిర్బంధంలో శిక్ష అనుభవిస్తూ ఉండదు" అని ఒక తల్లి షెరీ క్రాలే డబ్ల్యూడీఐవి అనే లోకల్ టీవీకి చెప్పారు.

గ్రేస్‌ను విడుదల చెయ్యాలంటూ వేలమంది ఆన్‌లైన్ పిటిషన్ మీద సంతకం చేసారు.

ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్లో ఉంటుందని లోకల్ మీడియా పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)