వైఎస్ షర్మిల: 'సమస్యలు లేవని చూపిస్తే ముక్కు నేలకు రాసి పాదయాత్ర ముగించి ఇంటికిపోతా' - ప్రెస్‌రివ్యూ

పాదయాత్రలో వైఎస్ షర్మిల

ఫొటో సోర్స్, facebook/YSSharmilaReddy

ప్రచురణ

‘రాష్ట్ర ప్రజల సమస్యలను పరిశీలించేందుకు నేను పాదయాత్ర చేస్తుంటే, ఏ గ్రామంలోనూ సమస్యల్లేవని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేస్తున్నారు. మీ మాటలు నిజమైతే, మీకు ధమ్మూ ధైర్మం ఉంటే నాతోపాటు పాదయాత్రలో పాల్గొని సమస్యలు లేవని చూపించండి. అప్పుడు నేను ముక్కు నేలకు రాసి పాదయాత్ర ముగించి ఇంటికిపోతా. అదే నేను అంటున్నట్లు సమస్యలు ఉంటే మీరు పదవులకు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా?’ అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సవాల్‌ చేశారని సాక్షి ఓ కథనంలో తెలిపింది.

షర్మిల ప్రజాప్రస్థానయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా చండూరు, మునుగోడు మండలాల్లో సాగింది. చండూరు మండలం తాస్కానిగూడెంలో రైతు రామచందర్‌కు చెందిన పొలంలో వరి పంటను కోసి సాధకబాధకాలు తెలుసుకున్నారు.

అనంతరం, మునుగోడు మండలానికి పాదయాత్ర సాగింది. మునుగోడు అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన సభలో టీఆర్‌ఎస్‌ పాలనాతీరుపై నిప్పులు చెరిగారు.

కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపొయిందని, టీఆర్‌ఎస్‌ నాయకుడే పదేళ్ల బాలికపై లైంగికదాడి చేశారని విచారం వ్యక్తం చేశారు.

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా కేవలం తన కుటుంబంలో ఉన్న ముగ్గురికి ఉద్యోగాలిచ్చి రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారని ఆరోపించారు.

డిండి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకుండానే చెర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్ల పను లు మొదలుపెట్టి 600 మంది రైతుల భూములను లాక్కున్నారని షర్మిల ఆరోపించారు.

మార్కెట్‌లో ఎకరానికి రూ.40 లక్షలుంటే రూ.4 లక్షల పరిహారం ఇస్తారా.. అని ప్రశ్నించారు.

చేనేత కార్మికులు నేసిన దుస్తులకు మద్దతుధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు. మునుగోడులోని ఓ కార్మికుడి ఇంటికి వెళ్లి మగ్గంనేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

దివంగత సీఎం వైఎస్‌ హయాంలో చేనేతలకు పావలా వడ్డీ రుణాలతోపాటు సబ్సిడీకి నూలు, రంగులు అందించారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే పద్ధతిలో ముడి సరుకులు అందించాలని షర్మిల అన్నారు.

కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, నేతలు మేకల ప్రదీప్‌రెడ్డి, జిల్లపల్లి వెంకటేశ్‌రావు, ఏపూరి సోమన్న, ఝాన్సీ రెడ్డి, బి.సుజాత, రహీమ్‌ షరీఫ్, పాల్గొన్నారు.

పాపికొండల యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

పాపికొండల్లో విహారయాత్రలు తిరిగి ప్రారంభం

పాపికొండల్లో రెండేళ్ల తరువాత విహారయాత్రలు ప్రారంభించారని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.

పాపికొండలు విహార ప్రాంతాన్ని రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి వద్ద ఆదివారం పర్యాటక బోట్లను రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మితో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. బోట్లలోకి వెళ్లి యాత్రికులతో ముచ్చటించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పర్యాటకుల భద్రతే లక్ష్యంగా పాపికొండల విహారయాత్రను ప్రారంభించినట్లు చెప్పారు.

‘పర్యాటక బోటుకు ముందు ఓ ఎస్కార్టు బోటు బయలుదేరుతుంది. ఈ బోటు తిరిగొచ్చే వరకూ శాటిలైట్‌ ఫోన్లు, జీపీఎస్‌ ద్వారా నిరంతరం పోశమ్మగండిలోని కంట్రోల్‌ రూమ్‌కు పర్యాటకుల సమాచారం చేరుతుంది. ఈ యాత్రకు ఆన్‌లైన్‌లో టికెట్ల ధర ఒకేరకంగా నిర్ణయించాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక పాపికొండలు ప్రాంతం రాష్ట్రంలోనే అద్భుతంగా అభివృద్ధి చెందుతుంద’న్నారు.

ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, ఐదు శాఖల అధికారుల పర్యవేక్షణ తర్వాతే ఈ విహారయాత్ర ప్రారంభించామని, అన్ని భద్రత చర్యలు తీసుకున్నామని తెలిపారు.

తొలిరోజు ఏపీ టూరిజానికి చెందిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బోటులో 36 మంది, గోదావరి గ్రాండ్‌-1లో 79 మంది యాత్రికులు తరలివెళ్లారు. మంత్రి ఆలస్యంగా రావడంతో బోట్లు రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరాయి. రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ కట్టా సింహాచలం, ఏఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌, ఏపీటీడీసీ ఈడీ మల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారని ఈ వార్తలో రాశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

ఫొటో సోర్స్, TELANGANACMO/FB

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

దళితబంధు పథకాన్ని ఆపేదే లేదని స్పష్టం చేసిన కేసీఆర్

దళితబంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారని నమస్తే తెలంగాణ పత్రిక వెల్లడించింది.

ఆదివారం మీడియా సమావేశంలో దళితబంధుపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘మేము కమిట్మెంట్‌ ఉన్నోళ్లం. కేసీఆర్‌ బతికి ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో దళితబంధు పథకం వందకు వందశాతం అమలుచేస్తం. నేను చెప్పిన పద్ధతిలోనే అమలుచేస్తం. ఒక్క హుజూరాబాద్‌లోనే కాదు.. అంతట అమలుచేస్తం. మాకు చిత్తశుద్ధి ఉన్నది. ఇది మా ఎజెండా అని స్పష్టంగా చెప్పినం. ఉపఎన్నిక రాగానే మీరు దొంగ మాటలు మాట్లాడుతరు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నరు. నోటికొచ్చినట్టు కారుకూతలు కూసిన్రు. ఇన్నిరోజులు మీ ఆటలు చెల్లినయి బిడ్డా.. ఇకమీదట చెల్లవు.’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

'దళితులు, గిరిజనుల కోసం పెట్టిన అట్రాసిటీ చట్టాన్ని ఒక వెధవ లొట్టపీసు చట్టం అంటడా? మీకు చట్టాలంటే గౌరవం లేదు, దళిత, గిరిజన ప్రజలంటే భయం లేదు. తమాషా చేస్తున్నరా?' అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఎన్నో రకాల ఒత్తిళ్లు పెడుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రతి బాయికాడ కరెంటు మీటర్‌ పెట్టాలని అంటు న్నదని ఆయన పేర్కొన్నారు.

‘మీటర్లు వద్దని నేను రెండేండ్ల నుంచి పోరాడుతున్న. మా రైతాంగానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నం, బిల్లులు మేమే కట్టుకుంటం అని చెప్తే, రాష్ర్టానికి వచ్చే రుణాలను బంద్‌ చేస్తమని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నరు. ఇన్నిరోజుల నుంచి మర్యాదగా, పద్ధతిగా, కొత్త రాష్ట్రం కాబట్టి సెటిల్‌ చేసుకుందాం అనే ధోరణిలో చూసినం. అయినా ప్రతి విషయానికి ఉల్టా పల్టా మాట్లాడుతున్నరు. అబద్ధాలు చెప్తున్నరు. ఇప్పుడు తగులుకుంటం కదా.. మీ చరిత్ర ఏందో, మా చరిత్ర ఏందో మాట్లాడుతం. ప్రజలకు మీరేం చేసిన్రో, మేమేం చేసినమో చెప్తం. ఇప్పటిదాకా ఓపికపట్టినం. ఇకపై కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎంబడి పడుతం. ఇక్కడున్న బీజేపీ ఎంబడి పడుతం.’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

గంజాయి

మిద్దె మీదే గంజాయి పెంపకం..

హైదరాబాదులో జవహర్నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మిద్దె మీదే కుండీల్లో గంజాయి సాగు చేస్తూ పోలీసులకు దొరికిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది.

స్థానికంగా బేకరీ నడిపే పిల్లుట్ల వెంకట నర్సింహశాస్త్రి కొన్నాళ్ల క్రితం కుటుంబంతో పాటు నేరేడ్‌మెట్‌ డివిజన్‌ యాప్రాల్‌ గోదావరి గార్డెన్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఇతడికి గంజాయి అలవాటుంది.

అయితే, ఇటీవల పోలీసు నిఘా పెరగడంతో ‘సరుకు’ లభించడం కష్టంగా మారింది. వ్యసనం వీడలేని నర్సింహ శాస్త్రి ఇంటిపైనే మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు. ఇందుకు కొత్తగా కుండీలు కొని ఏడు మొక్కలు వేశాడు.

ఇంటి యజమాని విదేశాల్లో ఉండడంతో పట్టించుకునేవారు లేరు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న జవహర్‌నగర్‌ సీఐ భిక్షపతిరావు సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.

కుండీల్లో 4 అడుగుల మేర పెరిగిన గంజాయి మొక్కలను గుర్తించారు. అల్వాల్‌ రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నర్సింహ శాస్త్రిని అరెస్టు చేశారు.

కాగా, హైదరాబాద్‌లో ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల మణికొండలోని ఓ ఫ్లాట్‌లో యువకుడు ఇలానే చేస్తూ పట్టుబడ్డాడు.

కొద్ది రోజుల వ్యవధిలోనే వందల కిలోల గంజాయితోపాటు పదుల సంఖ్యలో విక్రేతలను, సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో.. మత్తుకు అలవాటు పడ్డవారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇళ్లలోనే గంజాయి మొక్కలు పెంచడం ప్రారంభిస్తున్నారని పత్రిక తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)