విశాఖలో కుటుంబం అనుమానాస్పద మృతి, పెద్ద కొడుకు ప్రమేయంపై పోలీసుల అనుమానం :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, UGC
విశాఖపట్నం మదురవాడలో తల్లిదండ్రులను, తమ్ముడిని చంపిన యువకుడు చివరికి మంటల్లో చనిపోయాడని పోలీసులు భావిస్తున్నట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.
విశాఖపట్నంలో గురువారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఇందులో పెద్ద కుమారుడికి తప్ప మిగిలిన వారి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని నగర పోలీసు కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ప్రకటించారు.
ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి..
విశాఖపట్నం శివారు మధురవాడ మిథిలాపురి కాలనీ ఆదిత్య ఫార్చూన్ టవర్స్ సి-బ్లాక్ ఫ్లాట్ నెంబరు 505లో సుంకరి బంగారునాయుడు(50) తన కుటుంబంతో ఉంటున్నారు.
20 ఏళ్లపాటు బహ్రెయిన్‌లో ఉండి.. మూడేళ్ల క్రితమే విశాఖ వచ్చారు. ఆయన భార్య నిర్మల (45) హోమియో వైద్యురాలు.
పెద్దకుమారుడు దీపక్ (25) వరంగల్ నిట్‌లో ఇంజినీరింగ్ చదివి, దిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకుని, కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నాడు. చిన్నకుమారుడు కశ్యప్(19) ఇంటర్ చదువుతున్నాడు.
గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల తర్వాత బంగారునాయుడి ఫ్లాట్ నుంచి అరుపులు వినిపిస్తున్నాయని ఓ మహిళ వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, ugc
దీంతో భద్రతాసిబ్బంది వెళ్లి చూసి.. అప్పటికి ఏమీ లేకపోవడంతో కిందికి వచ్చేశారు. నాలుగు గంటలకు ఫ్లాట్ నుంచి పొగలు వస్తున్నాయని గుర్తించి మళ్లీ ఆమే గ్రూపులో పెట్టారు.
మరికొందరు కూడా లేచి.. 505 ఫ్లాట్ దగ్గరకు వెళ్లి చూశారు. అగ్నిప్రమాదమని భావించి అందరూ కిందికి వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. తలుపులు కొట్టినా ఎవరూ తీయకపోవడంతో వాటిని బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు.
ఫ్లాట్ లోపలికి వెళ్లిన అగ్నిమాపక అధికారులు నివ్వెరపోయారు. ప్రధానద్వారం పక్కనే బంగారునాయుడి మృతదేహం పడి ఉంది.
హాల్లోనే మరోచోట డాక్టర్ నిర్మల మృతదేహం బోర్లా పడి ఉంది. లోపల గదిలో కశ్యప్ మృతదేహం వెల్లకిలా నగ్నంగా పడి ఉంది.
అతని శరీరంపై పలు గాయాలున్నాయి. నిర్మల మృతదేహంపైనా గాయాలు కనిపించాయి. బంగారునాయుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి.
ఆయన పారిపోవడానికి ప్రయత్నించినట్లు అక్కడి దృశ్యాలను బట్టి అర్థమవుతోందని పోలీసులు అంటున్నారని ఈనాడు రాసింది.
బంగారునాయుడు, నిర్మల, కశ్యప్ మృతదేహాలపై గాయాలుండగా... దీపక్ మాత్రం సూట్, టై ధరించి ముస్తాబైనట్లు పోలీసులు గుర్తించారు.
అతని శరీరంపై గాయాలేమీ లేవు. ఈ విషయం ఆధారంగానే మిగిలిన ముగ్గురినీ దీపక్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారని పత్రిక చెప్పింది.
ముగ్గురినీ హతమార్చి.. తగలబెడదామన్న ఆలోచనతో ఇంట్లో నిప్పంటించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పొగ తీవ్రంగా రావడంతో అతను ఉక్కిరిబిక్కిరై మృతిచెంది ఉంటాడని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, ugc
తనను తాను కాపాడుకోవడానికి పంపు తిప్పాడని, అనంతరం అక్కడే మృతి చెందాడన్నారు.
ఫ్లాట్లో దట్టంగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది నీళ్లు కొట్టారు.
దీంతో హత్యలకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు చెల్లాచెదురైనట్లు తెలుస్తోంది. కానీ మృతదేహాలపై ఉన్న గాయాల ఆధారంగా అవి హత్యలేనని పోలీసులు తేల్చారని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ నుంచి తరలివెళ్తున్న వలసకూలీలు
కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ భయంతో హైదరాబాద్‌లో ఉన్న వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
మాయదారి కరోనా మళ్లీ వలస కూలీల్లో గుబులు పుట్టిస్తోంది. లాక్‌డౌన్ విధిస్తారేమోనన్న భయంతో ఎంతో మంది సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.
ఫలితంగా వలసకూలీలతో నాడు కళకళలాడిన అడ్డాలు, నిర్మాణ స్థలాలు, పరిశ్రమలు మళ్లీ బోసిపోతున్నాయి.
నిరుడు మార్చి 2న నగరంలో తొలికేసు నమోదుకాగా, ఆ తర్వాత కేసులు పెరుగుతూ వచ్చాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 16 నుంచి రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఈ క్రమంలో కొంతమంది మంది కాలినడకన స్వగ్రామాలకు వెళ్లగా, మరికొందరు శ్రామిక్ రైళ్లలో తరలివెళ్లారు.
అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా 2020 ఆగస్టు నుంచి నగరంలో అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాక మళ్లీ ఉపాధికోసం చాలా మంది నగరానికి వచ్చారు.
దాదాపు నాలుగు నెలలపాటు ప్రశాంతంగా పనులు చేసుకున్నారు. ఇంతలో నెలరోజుల నుంచి ఒక్కసారిగా పెరిగిపోతున్న కొవిడ్ సెకండ్ వేవ్ కేసులతో కూలీలకు పనులు కరువయ్యాయి. గతంలో నెలరోజులపాటు పని ఉండగా.. మార్చి 20 నుంచి ఎవరూ పనికి పిలవడం లేదని బోయిన్‌పల్లిలో రేషన్ సరుకులు అన్ లోడింగ్ చేసే ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన సుభాష్ తెలిపారు.
గత నాలు గు రోజులుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక వైపు వెళ్తున్న రైళ్లలో ప్రతిరోజు 200 మంది, లారీలు, డీసీఎంలలో 300 నుంచి 500 మంది స్వస్థలాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా భయంతో కాంట్రాక్టర్లు పనులు లేవని వెళ్లగొడుతున్నందుకే ఇంటిబాట పడుతున్నామని కూలీలు వాపోతున్నారు.
గ్రేటర్ పరిధిలోని రోజువారీ కూలీలు 30 లక్షలకు పైగా ఉన్నారు. ఇందులో 7 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తుండగా, 3 లక్షల మంది హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పనిచేస్తున్నారు.
కెమికల్, బీర్ల తయారీ, ఫ్లైవుడ్, ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో 20 లక్షల మంది పనిచేస్తున్నారు. మొత్తం 30 లక్షల మంది కార్మికుల్లో దాదాపు 18 లక్షల మంది వలస కూలీలు ఉన్నట్లు వారు చెప్పారు.

ఫొటో సోర్స్, FB/Andhra Pradesh CM
ఫోన్ చేసిన 3 గంటల్లో పడక ఏర్పాటు చేయాలి
కరోనా రోగులకు 104 కాల్ సెంటర్ ద్వారా వేగంగా సేవలు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సాక్షి దినపత్రి కథనం ప్రచురించింది.
బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6.21 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్‌సీల సిబ్బంది అందరూ సమష్టిగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
కోవిడ్ నివారణ, కరోనా వాక్సిన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.
సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఇవాళ్టి నుంచి 104 కాల్ సెంటర్‌పై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. ఎవరికైనా చికిత్స, బెడ్ కావాలంటే ఆ కాల్ సెంటర్ ద్వారా సేవలందించాలి.
హోం ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్ లేదా ఆస్పత్రిలో చేర్చడానికి వైద్యుల సూచనల మేరకు సేవలందించాలి.
అంబులెన్సు సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలి.
హోం ఐసొలేషన్‌లో కూడా వారిని ఫాలో అప్ చేయాలి. రోగి ఫోన్ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్ సమకూర్చాలి.
104 నెంబరు కోవిడ్ సేవల కోసం, 1902 నెంబరు గ్రీవెన్సుల కోసం కేటాయించండి. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయండి.
కోవిడ్‌కు సంబంధించిన ఏ సందేహం ఉన్నా 104కు ఫోన్ చేయాలని బాగా ప్రచారం చేయండి. దీన్ని కూడా ఇవాళ్టి నుంచి ప్రచారంలో చేర్చండి.
ఒకవేళ రోగి ప్రైవేటు ఆస్పత్రిలో చేరాలనుకుంటే, ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా, వాటిని కూడా స్పష్టంగా నిర్దేశించండి.
అలాగే బోర్డులపై ప్రదర్శించిన దాని కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ప్రజలకు (రోగులకు) తెలిసేలా అన్ని వివరాలు ప్రదర్శించాలి.
ఎక్కడా రోగి దోపిడికి గురి కాకుండా ఉండేలా.. అవసరమైన ఔషథాలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల రేట్లు కూడా స్పష్టంగా ప్రదర్శించాలి. ఎక్కడైనా అధిక ఫీజులు, ఛార్జీలు వసూలు చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించినట్లు సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ దశాబ్దపు క్రికెటర్ కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దశాబ్దపు క్రికెటర్‌గా నిలిచినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
వన్డే క్రికెట్‌లో రారాజుగా వెలుగొందుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన ఘనత దక్కింది.
2010 దశాబ్దానికి గాను అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ప్రతిష్ఠాత్మక క్రికెట్ మ్యాగజీన్ విజ్డెన్ అల్మనాక్‌లో కోహ్లీ నిలిచాడు.
2008లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ ఇప్పటి వరకు 254 మ్యాచ్‌ల్లో 60 సగటు, 42 శతకాలతో 12,169 పరుగులు చేశాడు.
అలాగే 'విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్'్డగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ వరుసగా రెండోసారి ఘనత దక్కించుకున్నాడు.
కాగా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1990 దశాబ్దానికి అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ఎంపికయ్యాడు.
అలాగే భారత ప్రపంచకప్ హీరో కపిల్‌దేవ్ 1980 దశాబ్దానికి అత్యుత్తమ ఆటగాడిగా అవార్డు దక్కించుకున్నాడు.
మరోవైపు ఏడాది అత్యుత్తమ క్రికెటర్లుగా సిబ్లే, క్రాలీ, హోల్డర్, రిజ్వాన్, స్టీవెన్స్ 2021 విజ్డెన్ ఎడిషన్‌లో చోటు దక్కించుకున్నారని పత్రిక వివరించింది.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ... అందులో ఏముందంటే..
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: జవాన్లపై దాడిని హైదరాబాద్ పోలీసులు ముందే ఊహించారా
- ‘ఆయన నా గదిలోకి వచ్చి నాపై అత్యాచారం చేశారు... నేను మూడు రోజుల వరకు గదిలోనే ఉండిపోయాను’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. దాడిలో గాయపడిన CRPF జవాన్ చెప్పిన వివరాలు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























