‘ఇరాన్‌తో ఒప్పందం ఫైనలేమీ కాదు, తేడా వస్తే మళ్లీ బాంబులు వేస్తాం’ ట్రంప్ హెచ్చరిక

అమెరికా- ఇరాన్ డీల్, డోనల్డ్ ట్రంప్, అణ్వాయుధాలు, జీ 7 సదస్సు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఇరాన్‌తో కుదిరింది ఫైనల్ డీల్ కాదనీ, అవగాహనా ఒప్పందమేనని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

"వారు(ఇరాన్) కనుక సరిగ్గా ప్రవర్తించకపోతే మేము ఈసారి వాళ్ల నెత్తి మీద బాంబులు వేస్తాం" అని జి-7 శిఖరాగ్ర సమావేశంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి పక్కన నిలబడి ట్రంప్ అన్నారు.

అమెరికా ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఇరాన్ తుది పరిష్కారానికి అంగీకరిస్తే ఆ దేశం కోసం పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ ప్రకటన వెలువడింది.

తుది ఒప్పందం ప్రకారం "ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు" అని అమెరికా అధ్యక్షుడు మంగళవారం అన్నారు.

ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు శుక్రవారం స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్‌లు సమావేశం కానున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే ఈ ఒప్పంద వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీనిని 'అవగాహన ఒప్పందం' అని పిలుస్తున్నారు.

అమెరికా- ఇరాన్ డీల్, డోనల్డ్ ట్రంప్, అణ్వాయుధాలు, జీ 7 సదస్సు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌తో అమెరికా ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అతివాద జాతీయ భద్రత మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ వ్యతిరేకిస్తున్నారు.

‘ఈ ఒప్పందం ఫైనల్ కాదు’

సోమవారం అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఈ ఒప్పందంపై "సంతకాలు జరిగాయని, అందులో అంశాలు త్వరలోనే బయటకు వస్తాయని" చెప్పారు.

ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగిస్తారు. ఈ సమయంలో ఇరు పక్షాలు తుది ఒప్పందంపై చర్చలు జరుపుతాయి.

ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిని ఎటువంటి రుసుములు లేకుండా తిరిగి తెరుస్తారని, ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం ముగుస్తుందని ట్రంప్ చెప్పారు.

ఇరాన్ అణు కార్యక్రమంపై సాంకేతిక చర్చలు ఈ వారం ప్రారంభం కానున్నాయని అమెరికా అధికారులు తెలిపారు.

అయితే ఇది శాంతి ఒప్పందం కాదని "ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపు వంటి అత్యంత సంక్లిష్టమైన అంశాలపై చర్చలను వాయిదా వేస్తోంది" అని బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్ జెరెమీ బోవెన్ అన్నారు.

లెబనాన్‌లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇరాన్ ఒత్తిడి తెస్తోంది. దీని గురించి ఒప్పందంలో ఎలాంటి ప్రతిపాదన ఉందనే ప్రశ్న మిగిలే ఉంది.

అమెరికా, ఇరాన్‌ స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో శుక్రవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి.

అమెరికా- ఇరాన్ డీల్, డోనల్డ్ ట్రంప్, అణ్వాయుధాలు, జీ 7 సదస్సు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జి-7 సదస్సులో ఈజిప్టు అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

జి-7 దేశాల డిమాండ్ ఏంటి?

ఇరాన్ ఒప్పందం తర్వాత మరింత పటిష్ఠమైన ఒప్పందం కోసం జి-7 నాయకులు పిలుపిచ్చారు.

ఇరాన్‌తో ఒప్పందం "ఫైనల్ కాదు" అని ట్రంప్ ప్రకటించడానికి ముందు, భవిష్యత్‌లో బలమైన ఒప్పందం కుదుర్చుకోవాలని జి-7 దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో పిలుపిచ్చాయి.

జి-7 దేశాలైన అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు మధ్యప్రాచ్యంలో సాధించిన "గణనీయ పురోగతిని" తాము గుర్తించామని, ఒప్పందాన్ని అమలు చేయడానికి "మద్దతివ్వడానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని" తెలిపాయి.

జి-7 సదస్సులో భౌగోళిక రాజకీయ సమస్యలపై ప్రకటనలో భాగంగా యుక్రెయిన్ యుద్ధం, ఉత్తర కొరియా అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో ఉద్రిక్తతలు, తైవాన్ జలసంధి గురించి ప్రస్తావించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)