మెస్సీ హ్యాట్రిక్ : 'వయసును జయిస్తున్న ఆటగాడు సృష్టించిన మరో ప్రభంజనం ఇది'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎలిజబెత్ కాన్వే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద తారలంతా ఒకచోట చేరిన రోజు, అంతమంది ఫేమస్ ప్లేయర్ల మధ్యలో కూడా మెస్సీనే ప్రత్యేకంగా నిలిచాడు.
ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే, నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలండ్ చెరో రెండు గోల్స్‌తో అప్పటికే వరల్డ్ కప్‌ను ఘనంగా ప్రారంభించి ఉన్నారు.
కానీ, రాబోయేది ఏదో ఆటకు హంగులు దిద్దే ప్రదర్శన కాదు, అదే మెయిన్ షో, మెస్సీ షో.
ప్రపంచకప్‌లో తన తొలి హ్యాట్రిక్, ప్రపంచకప్‌లో రికార్డును సమం చేసిన గోల్, ఇలా వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గని తన సత్తాను మెస్సీ గుర్తు చేసిన ప్రదర్శన.
అర్జెంటీనా 3-0తో అల్జీరియాపై విజయం సాధించగా, ఆ విజయానికి కేంద్రబిందువుగా నిలిచింది మెస్సీనే.

కాన్సస్ నగర అద్దాలమేడల వెనుక సూర్యుడు మెల్లగా అస్తమిస్తూ ఉండగా, ఆరు వరల్డ్ కప్‌లలో మెరిసిన మొదటి ప్లేయర్‌గా 38 ఏళ్ళ మెస్సీ చరిత్ర సృష్టించాడు.
చిరకాల ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డోను ఒక్క రోజు తేడాతో రికార్డు దక్కించుకున్నాడు.
2006 ప్రపంచకప్‌లో 18 ఏళ్ల వయసులో ఫుట్‌బాలర్‌గా అరంగేట్రం చేసిన రోజుకు ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ సూపర్‌స్టార్లలో ఒకడైన మెస్సీ తన దేశం తరఫున 200వ మ్యాచ్‌లో మరో అద్భుతమైన ప్రదర్శనతో మళ్లీ మెరిశాడు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ ప్రారంభంలో తన ఓపెనర్ సమయంలో ఐస్సా మండీ కాలుకు మెస్సీ షూస్ తగలడం వల్ల కొంత ఆందోళనకరమైన పరిస్థితి నెలకొన్నా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ అవకాశాన్ని అర్జెంటీనా స్టార్ పూర్తిగా వినియోగించుకున్నాడు.
'నా కుటుంబంతో, నా టీమ్‌మేట్స్‌తో ఎప్పుడూ నా వెంట ఉండే వారితో ఈ క్షణాన్ని ఆస్వాదించడం చాలా అధ్భుతమైన అనుభూతి' అని అన్నాడు మెస్సీ.
"మా టీమంతా, చాలా కలిసికట్టుగా ఉంటాం, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత కఠినమైన మ్యాచ్ గెలవడం, చాలా లక్కీ అనే చెప్పాలి. మొదటి గేమ్‌ని విజయంతో ప్రారంభించడం చాలా ముఖ్యం"
"అభిమానులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరోసారి అర్జెంటీనాకు ఈ ఆటపై ఎంత పిచ్చి ప్రేమ ఉందో నిరూపించారు. మళ్లీ స్టేడియాన్ని పూర్తిగా నింపేశారు"
"ఇప్పుడు నేను అనుభవిస్తున్న ప్రతి విషయం అదనపు వరంలాంటిదే. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ నేను కలలు కన్న ప్రతి లక్ష్యాన్ని, అంతకంటే ఎక్కువే సాధించే అదృష్టం నాకు దక్కింది"
అర్జెంటీనా హెడ్ కోచ్ లయోనెల్ స్కాలోనీ మాట్లాడుతూ, "మెస్సీ గురించి చెప్పాలంటే మాటలు చాలవు, ఇరవై ఏళ్లుగా ఇలాంటి అద్భుతాలను చూపిస్తూ వస్తున్నాడు. అతను అందరకీ స్పూర్తిదాయకం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఇది తన తొలి ప్రపంచకప్ గోల్ అన్నట్టు మెస్సీ సంబరాలు చేసుకున్నాడు'
తర్వాత ఏం జరగబోతోందో మ్యాచ్ ప్రారంభంలోనే ఒక చిన్న సంకేతం కనిపించింది.
మ్యాచ్ నాలుగో నిమిషంలో మెస్సీ డిఫెన్స్‌ను ఛేదించి ముందుకు దూసుకెళ్లి అల్జీరియా గోల్‌కీపర్ లూకా జిదాన్‌ను దాటించి బంతిని గోల్‌లోకి పంపాడు. అయితే ఆఫ్‌సైడ్ జెండా ఎగరడంతో అక్కడ కాస్త బ్రేక్ పడింది. అభిమానులు మాత్రం ప్రపంచకప్ గెలిచినట్టే సంబరాలు చేసుకున్నారు. జర్నలిస్టులు ఒకరినొకరు చూసుకుంటూ వేచి చూస్తున్న క్షణం రాబోతోంది అన్న భావంతో నవ్వుకున్నారు .
18వ నిమిషంలో మెస్సీ క్షణం రానే వచ్చింది. గోల్‌కు 25 గజాల దూరంలో బంతిని తన ఎడమ కాలికి మార్చుకుని కుడి వైపు అద్భుతంగా కర్ల్ చేశాడు.
ఫ్రాన్స్ దిగ్గజం జినెదిన్ జిదాన్ కుమారుడైన గోల్‌కీపర్ లూకా జిదాన్, రెండు చేతులతో బంతిని తాకినా, ఆ షాట్‌లోని వేగాన్ని అడ్డుకోలేకపోయాడు. వరల్డ్ కప్‌లో మెస్సీ తన 14వ గోల్ కొట్టడంతో కాన్సస్ స్టేడియం, అరుపులతో కేరింతలతో దద్దరిల్లింది.
"ఇది తన మొదటి ప్రపంచకప్ గోల్ అన్నట్టే మెస్సీ సంబరాలు చేసుకున్నాడు. అతనిలో ఉన్న ప్రతిభను చూస్తే వయసు అతడిని ఏమాత్రం ప్రభావితం చేయలేదనిపిస్తుంది. ఊహించినట్టుగానే అద్భుతంగా ముగించాడు" అని ఎవర్టన్ మాజీ మిడ్‌ఫీల్డర్ లియోన్ ఓస్మాన్ అన్నాడు.
ఈ వేదికపై తన తొలి ప్రదర్శనకు రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పుడు ప్రపంచకప్‌లో రికార్డు స్థాయి 27వ మ్యాచ్ ఆడుతున్నా, మెస్సీ ఇప్పటికీ వయసును సవాలు చేస్తూనే ఉన్నాడు. మ్యాచ్ మొత్తం అతడు నిరంతరం చాన్సుల కోసం వెతికాడు. అర్జెంటీనా తదుపరి కదలికను ముందుగానే అంచనా వేస్తూ కనిపించాడు. ఫిట్‌గా, వేగంగా, ప్రత్యర్థిని చాలెంజ్ చేస్తూ కనిపించాడు.
60వ నిమిషంలో మెస్సీ మరో గోల్ చేశాడు. గోల్‌కీపర్ జిదాన్ చేసిన ఒక పెద్ద తప్పిదం కారణంగా బంతి మెస్సీ ముందుకు వెళ్ళింది. ఎప్పటిలాగే చాలా కామ్‌గా బంతిని గోల్‌లోకి నెట్టాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి కేవలం ఒక గోల్ దూరంలో నిలిచాడు.
35 ఏళ్లు దాటిన తర్వాత ప్రపంచకప్‌లలో అతడు 10 గోల్స్ చేశాడు. హ్యారీ కేన్, డియాగో మారడోనా, క్రిస్టియానో రొనాల్డో, థియెరీ ఆన్‌రీలు తమ మొత్తం ప్రపంచకప్ కెరీర్‌లలో చేసిన గోల్స్ కంటే ఇది ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
చరిత్ర సృష్టించిన క్షణం
76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు నికో గోంజాలెజ్ అందించిన పాస్‌ను గోల్‌గా మలచి మెస్సీ తన హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు.
ఆ గోల్‌తో ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజేతో సమాన స్థాయికి చేరుకున్నాడు.
చేతులను పైకెత్తి, ఆకాశం వైపు చూస్తూ, తన పేరును స్మరిస్తున్న వేలాది అర్జెంటీనా అభిమానులతో కలిసి ఆ క్షణాన్ని ఆస్వాదించాడు. మెస్సీకి కూడా ఇది ప్రత్యేకంగానే అనిపించింది. స్టేడియం మొత్తం మార్మోగిపోతుండగా తనను చూస్తున్న వేలాదిమంది అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఆ తర్వాత ఆయన్ని మైదానం నుంచి వెనక్కి పిలిచినప్పుడు ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో ఘనంగా అభినందించారు. కాన్సాస్ సిటీ అంతటా మెస్సీ పేరు మార్మోగింది.
చివరి విజిల్ మోగిన చాలాసేపటి తర్వాత కూడా వేలాదిమంది అర్జెంటీనా అభిమానులు స్టేడియంలోనే ఉండి సంబరాలు కొనసాగించారు.
నీలం, తెలుపు రంగులతో స్టేడియం నిండిపోయింది. డప్పుల మోత ఆగలేదు. అభిమానుల గొంతుకలు నిరంతరం వినిపించాయి.
చాలామంది తమ జెర్సీల వెనుక మెస్సీ పేరు ముద్రించుకున్నారు. మరికొందరు అతని టాటూలను గర్వంగా ప్రదర్శించారు. ప్రతి సంభాషణలోనూ మెస్సీ పేరే వినిపించింది.
వారి దృష్టిలో అతడు కేవలం ఆటగాడు కాదు. నాలుగేళ్ల క్రితం అర్జెంటీనాను ప్రపంచకప్ విజేతగా నిలిపిన ప్రేరణ అతడే.
సాధారణంగా ఈ స్టేడియంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే కాన్సాస్ సిటీ చీఫ్స్ క్వార్టర్‌బ్యాక్ పాట్రిక్ మహోమ్స్ కూడా అందరిలాగే మెస్సీ మాయాజాలాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్‌ను చూసాడు.
సూపర్‌స్టార్లతో స్టేడియం నిండిన రోజున, వయసును జయించిన అర్జెంటీనా దిగ్గజం వారందరికంటే ఎత్తులో నిలిచాడు.
అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో ఉన్న తొలి హాఫ్‌లో జరిగిన ఒక అప్పీల్‌కు మెస్సీకి రెడ్ కార్డు చూపించి ఉంటే కథ పూర్తిగా వేరేలా ఉండేది.
మండీ కాలి వెనుక భాగంపై మెస్సీ స్టడ్స్ తగిలినట్లు కనిపించింది. అయితే రిఫరీగానీ, వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) గానీ అతనిపై చర్య తీసుకోవాలని భావించలేదు.
మాంచెస్టర్ సిటీ మాజీ డిఫెండర్ నెడుమ్ ఒనూహా ఈఎస్పీఎన్‌తో మాట్లాడుతూ "అది రెడ్ కార్డే అయ్యుండాలి. ఆ క్షణాన్ని అధికారులు మిస్ అయ్యారు. ఆటగాడు నేలపై పడిపోయినప్పుడు మెస్సీ ముఖంలో ఆందోళన కనిపించింది. ఏదో తప్పు చేసాననే భావన అతడిలో కనిపించింది" అని అన్నాడు.
ఆర్సెనల్ మాజీ స్ట్రైకర్, ఫ్రాన్స్ మాజీ ఆటగాడు థియెరీ ఆన్‌రీ ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ "ఇలాంటి పరిస్థితులను సరిగా విశ్లేషించేటప్పుడు ఉద్దేశం చాలా ముఖ్యమైనది. దాన్ని మళ్లీ చూస్తే మెస్సీ పూర్తిగా బంతిపైనే దృష్టి పెట్టాడని స్పష్టంగా తెలుస్తుంది. ఎవరినీ గాయపరచాలనే ఉద్దేశం కనిపించదు’’ అన్నాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























