విశాఖ: 'ఆరుగురిని చంపేసి 100కి ఫోన్ చేశాడు'.. జుత్తాడ హత్యలకు కారణాలేంటి?

- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
విశాఖలో రెండు సంఘటనలు నగరవాసుల్ని భయాందోళనలకు గురిచేశాయి.
ఒకటి, పెందుర్తిలో ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని గడ్డికోసే కత్తితో నరికి చంపడం.
రెండు, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఒక యువకుడితో పాటు నలుగురు అగ్నికి ఆహుతవడం.
మొదటి సంఘటనలో ఆరు నెలల పసిపాప, రెండేళ్ల బాలుడు కూడా చనిపోయారు.
రెండో సంఘటనలో ఐఏఎస్‌కు ప్రిపేరవుతున్న యువకుడే తన కుటుంబాన్ని హత్య చేశాడనే అనుమానాలు ఉన్నాయి.

ఆరు హత్యలు చేసి 100కి ఫోన్..
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో బత్తిన అప్పలరాజు, బమ్మిడి రమణ కుటుంబాలు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటున్నాయి.
గురువారం తెల్లవారుజూమున అప్పలరాజు.. రమణ కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి రమణతో సహా ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలను హత్య చేశారు.
హత్య చేసిన తర్వాత నిందితుడు అప్పలరాజు 100కి ఫోన్ చేసి తాను హత్యలు చేసినట్లు చెప్పి స్వయంగా పెందుర్తి పోలీన్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అప్పలరాజును అప్పగించండి
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ హత్యలకు కారణాలపై ఆరా తీశారు.
పాత కక్షలతోనే అప్పలరాజు ఆరుగురిని చంపినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.
బాధిత కుటుంబ సభ్యులను, బంధువులను ప్రశ్నిస్తున్నారు.
నిందితుడు అప్పలరాజును పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.
సంఘటన స్థలాన్ని సీపీ మనిష్ కుమార్ సిన్హా పరిశీలించారు.
అయితే, ఆ సందర్భంలో గ్రామస్థులంతా సీపీని అడ్డుకుని, నిందితుడిని తమకు అప్పగించాలని, లేదంటే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
"నిద్రపోతున్న సమయంలో ఈ హత్యలు జరిగనట్లు తెలుస్తోంది. బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి.. ఇద్దరు చిన్నారులు, ముగ్గురు ఆడవాళ్లు, ఒక వృద్ధుడిని హత్య చేశాడు. మృతులను రమణ (63), రమాదేవి (53), అరుణ (37), ఉషారాణి (35), ఉదయ్ (2), ఉర్విష (6 నెలలు)గా గుర్తించాం. అయితే హత్యలు ఎందుకు చేశాడనే కారణాలు తెలియలేదు. కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య తగదాలున్నాయని గ్రామస్థులు చెప్పారు. అయితే హత్యలు చేసేంత పెద్ద గొడవలు కావని కొందరు అంటున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నాం. నిందితుడే స్వయంగా వచ్చి లొంగిపోయాడంటే.. చాలా కాలంగా ఈ హత్యలకు ప్రణాళిక వేసుకున్నట్లు, కావాలనే చంపినట్లు అర్థమవుతోంది" అని ఏసీపీ శ్రీపాదరావు చెప్పారు.

ప్రేమ..పెళ్లి.. పగ..
ఈ హత్యలపై జుత్తాడ గ్రామస్థుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీబీసీ ఈ విషయంపై స్థానికులతో మాట్లాడింది.
"నిందితుడు అప్పలరాజు కుమార్తెను రమణ కుమారుడైన విజయ్ గతంలో ప్రేమించాడు. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ విషయంలోనే 2018లో పెందుర్తి స్టేషన్‌లో విజయ్ కుటుంబ సభ్యులు అప్పలరాజుపై కేసు పెట్టారు. అప్పటి నుంచి విజయ్ కుటుంబంపై అప్పలరాజు కక్ష పెంచుకున్నాడు. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు జరిగేవి. అయితే కొన్నాళ్లకి విజయ్ ఉపాధి కోసం విజయవాడ వెళ్లిపోయారు. అక్కడే ఉష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. విజయ్ తండ్రి రమణ మాత్రం జుత్తాడలోనే ఉంటున్నారు" అని జుత్తాడ నివాసి వి. సతీష్ కుమార్ చెప్పారు.
"అయితే విజయవాడలో వచ్చే నెలలో ఒక పెళ్లి ఉంది. ఆ విషయమై విశాఖలో షాపింగ్, పెళ్లికార్డులు పంచడం కోసం రెండు రోజుల క్రితమే విజయ్ భార్య, ఇద్దరు పిల్లలు.. రెండేళ్ల ఉదయ్, ఆరు నెలల ఉర్విష, తల్లి, మేనత్తతో కలిసి జుత్తాడ వచ్చారు. ఇవాళ ఉదయాన్నే షాపింగ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. వేకువజామున ఇంటి ముందు రమణ భార్య ముగ్గులు వేస్తున్నారు. ఈ విషయాన్ని ఎదురుగా గేదెలను కడుతున్న అప్పలరాజు చూశారు. వెంటనే అక్కడే ఉన్న గడ్డి కోసే కత్తి తీసుకుని రమణ భార్యను నరికేశాడు. తర్వాత ఇంట్లో రమణ కోడలు, ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని అప్పలరాజే ఊరిలో కత్తి పట్టుకుని తిరుగుతూ అరుస్తూ చెప్పాడు" అని జుత్తాడ గ్రామస్థులు వివరించారు.
జుత్తాడ గ్రామం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.
పెందుర్తి పోలీసులతో ఈ హత్యలు, రెండు కుటుంబాల మధ్య తగాదాలపై బీబీసీ మాట్లాడింది.
"నిందితుడు అప్పలరాజు కుమార్తెను విజయ్ ప్రేమించి మోసం చేశాడని, అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్లో అప్పలరాజు కుటుంబీకులు గతంలో ఫిర్యాదు చేశారు. అలాగే, అప్పలరాజు కుటుంబంతో తమకు ప్రాణభయం ఉందంటూ విజయ్ కుటుంబం కూడా ఫిర్యాదు చేసింది. ఈ రెండు ఫిర్యాదులపై పెందుర్తి స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వాటిపై విచారణ జరుగుతోంది. తన కుమార్తె జీవితం నాశనం అవ్వడానికి కారణమైన విజయ్ కుటుంబంపై అప్పలరాజు పగ పెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూశాడు. గురువారం ఆరుగురిని హత్య చేశాడు. ఆ కుటుంబం వల్లే తన కుమార్తె జీవితం నాశనమైందనే కోపంతో ఇదంతా చేసినట్లు తెలుస్తోంది" అని తన పేరు రాయడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు.
గ్రామస్థుల ఆందోళన
హత్యకు గురైన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వ అధికారులు, వైద్యులు గ్రామంలోకి వచ్చారు. అయితే గ్రామస్థులుంతా నిందితుడ్ని తమకి అప్పగిస్తే తప్ప మృతదేహాలను ఇచ్చేది లేదంటూ గ్రామంలోకి ఎవరినీ రానివ్వలేదు.
పోలీసులకు స్థానిక ఎమ్మేల్యేకు కూడా ఇదే చెప్పారు.
అదే సమయంలో విజయవాడ నుంచి విజయ్ కూడా జుత్తాడ వచ్చారు. రావడంతోనే తన బంధువులతో కలిసి అప్పలరాజు ఇంటిపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే, పోలీసులు అడ్డుకున్నారు.
అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఎంపీ విజయసాయిరెడ్డి, హోంమంత్రి సుచరిత, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి రావాలన్నారు. లేని పక్షంలో మృతదేహాలను తరలించేది లేదని ఆందోళన చేశారు.

ఎన్ఆర్ఐ కుటుంబం సజీవ దహనం
విశాఖలో N.R.I కుటుంబం అగ్నిప్రమాదంలో మరణించడం అనుమానాలను రేకెత్తిస్తోంది.
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్‌లో బంగారునాయుడు నివాసముంటున్న ప్లాట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకునే సరికే నలుగురు మంటల్లో సజీవ దహనమయ్యారు.
ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
వీరంతా విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన వారు.
బహ్రెయిన్‌లో స్టిరపడిన బంగారునాయుడు నాలుగేళ్ల క్రితం కుటుంబంతో విశాఖ వచ్చారు.
8 నెలల క్రితమే మధురవాడ ఆదిత్య ఫార్చూన్ టవర్స్‌లో అద్దెకు దిగారు.
"ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఈ కేసులో అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ప్రమాదం కాదని, ముగ్గుర్ని హత్య చేసి, పెద్ద కుమారుడు దీపక్ తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. దీపక్ కాకుండా మిగతా ముగ్గురి శరీరాలపై గాయాలైన విధానాన్ని బట్టి వీరిని హత్య చేసి, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీపక్ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చివరిగా ప్లాట్‌లోకి బుధవారం రాత్రి 9 గంటలకు బంగారునాయుడు వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా స్ఫష్టమవుతోంది. బయట వ్యక్తులు ఎవరు ప్రవేశించలేదని అర్థమవుతోంది. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం కూడా దీనిపై పని చేస్తోంది. దీపక్ ఎన్‌ఐటీలో డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది. చిన్న కుమారుడు కశ్యవ్ ఇంటర్ చదువుతున్నారు. రాత్రి ఇంట్లో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగిందని స్థానికులు చెప్పారు" అని సీపీ మనిష్ కుమార్ సిన్హా మీడియాకు వివరించారు.
మనం ఏం చేస్తున్నమన్నది తెలియదు
విశాఖలో జరిగిన ఈ రెండు సంఘటనలు సంచలనం సృష్టించాయి.
ముఖ్యంగా ఆరు నెలలు, రెండేళ్ల చిన్నారులను కూడా కత్తితో నరికి చంపడమనే విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
సమాజంలో హోదా, ఆస్తులు ఉన్నా కూడా ఏ కారణాలతో ఇలా హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందోనంటూ మధురవాడ సంఘటనపై మాట్లాడుకుంటున్నారు.
దీనిపై ఏయూ సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఏంవీఆర్ రాజు బీబీసీతో మాట్లాడారు.
"మనకు అన్యాయం జరిగినా, జరిగిందనే భావన వచ్చినా అది మన మానసిక స్థితిని దిగజారుస్తుంది. దాని నుంచి త్వరగా బయటపడాలి. అలా జరగనప్పుడు అది పెద్ద సమస్యగా మారిపోతుంది. జుత్తాడ హత్యలు, మధురవాడ అనుమానస్పద మృతుల సంఘటనల్లో ఈ నేరాలకు పాల్పడ్డారని భావిస్తున్న ఇద్దరూ కూడా ఆ సమయంలో స్పృహలో ఉండి ఉండరు. ఐఏఎస్ చదువుతున్న అబ్బాయే చంపిన మాట నిజమైతే.. అతడు సాధించలేని దాన్ని అతనిస్నేహితులు సాధించడం, లేదా యువకుడు కాబట్టి ప్రేమ వ్యవహారం, అలాగే ఫైనాన్స్ విషయాలు అటువంటి వారిపై తీవ్రంగా ప్రభావం చూపి ఉంటాయి.
ఆరుగురిని హత్య చేసిన అప్పలరాజు అనే వ్యక్తి దీనికోసం ఎంతోకాలంగా ప్లానింగ్ చేసినట్లు అర్థమవుతోంది. అయితే తాను మోసపోయానని, తన కుటుంబాన్ని సమాజం చిన్నచూపు చూస్తోందనే భావనను పెంచుకున్నాడు. అది పెరగడంతో ఏమోషనల్ బ్యాలన్స్ కోల్పోయాడని అర్థమవుతోంది. నేరం చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. కేవలం ఉన్మాదమే వారిని నడిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వారు ఆ సమయంలో సృహాలేని వ్యక్తులతో సమానం. మానసికంగా ఏ చిన్న సమస్య వచ్చినా.. వయసుతో సంబంధం లేకుండా కౌన్సిలింగ్ ఇప్పించాలి. లేకపోతే చివరకు ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తాయి" అని ఏయూ సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఏంవీఆర్ రాజు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వేస్టేజీ ఎక్కువగా ఉందా... ప్రధాని మోదీ ఆ మాట ఎందుకు అన్నారు?
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- రైతుల నిరసనలు: ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు.. రైతులకు సూచించిన రాహుల్ గాంధీ
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























