You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సండే బ్యాంకింగ్: ఇక్కడ ఆదివారం కూడా బ్యాంకు తెరిచే ఉంటుంది- ప్రెస్ రివ్యూ
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) సేవలను వివిధ కోణాల్లో విస్తరించేందుకు పాలకవర్గం కసరత్తులు చేస్తోంది. గతంలో రైతుల వ్యవసాయ రుణాలకే పరిమితమైన కార్యకలాపాలను ఉద్యోగ, మధ్య తరగతి, ఇతర వర్గాలకు చేరువ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సెలవు రోజైన ఆదివారం సైతం బ్యాంకు కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.
ప్రయోగాత్మకంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ శాఖలో ఇవాళ ప్రారంభించనున్నారు. సత్ఫలితాలిస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు మొత్తం 30 శాఖలు ఉన్నాయి. ఇందులో వికారాబాద్ జిల్లాలో 6, రంగారెడ్డిలో 19, మేడ్చల్‌లో 4 శాఖలు పనిచేస్తున్నాయి. సుమారు 90 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రూ.460 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ సంఖ్యను మరింత పెంచుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
వికారాబాద్‌లో ఆదివారం మార్కెట్ ఉంటుంది. వ్యాపారులు, రైతులకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం డీసీసీబీ చూపుతుందని అందుకనే ఆదివారం పనిచేసేందుకు ముందుకు వచ్చామని సిబ్బంది తెలిపారు. అంతేకాదు ఆదివారం రోజు అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు కావడంతో ఆ రోజున వారివారి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. ఆదివారం ఎవరికి బ్యాంకు సేవలు అవసరమైనా డీసీసీబీ అందుబాటులో ఉంటుందనే నినాదాన్ని తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఈ కథనంలో తెలిపారు.
కోవాక్జిన్‌కూ ఓకే చెప్పిన నిపుణుల కమిటీ
ఫార్మా హబ్‌గా ఓ వెలుగు వెలుగుతున్న హైదరాబాద్ పేరు మరోమారు యావత్ ప్రపంచంలో మార్మోగనుంది. కొత్త సంవత్సరం మొదటి రోజున ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ (కోవిషీల్డ్)కు అనుమతులు మంజూరవగా.. రెండో రోజున హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన కోవాగ్జిన్‌కు కూడా లైన్ క్లియర్ అయిందని ఆంధ్రజ్యోతి తన కథనంలో తెలిపింది.
అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్‌కు షరతులతో కూడిన అనుమతులను ఇవ్వొచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సిఫారసు చేసింది. దీనిపై సమీక్షించేందుకు డీసీజీఐ ఆదివారం(జనవరి 3న) సమావేశం కానుంది. ఈ భేటీలోనే టీకాకు అనుమతులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)ల సంయుక్త సహకారంతో కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది.
ప్రయోగ పరీక్షలు, వ్యాక్సిన్ భద్రత, ప్రభావశీలతలకు సంబంధించి భారత్ బయోటెక్ అందించిన అదనపు వివరాలను శుక్రవారం నుంచే పరిశీలిస్తున్న నిపుణుల కమిటీ.. తాజాగా శనివారం మధ్యాహ్నం జరిగిన భేటీలో మరోసారి వాటిపై సమీక్షించింది. ఈసందర్భంగా కమిటీ సభ్యులు భారత్ బయోటెక్ నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మొత్తం 25,800 మంది వలంటీర్లతో మూడోదశ ప్రయోగ పరీక్షలను నిర్వహించాలని భావించగా, ఇప్పటివరకు 23వేల మంది భర్తీ పూర్తయింది.
ఎంపిక చేసిన వలంటీర్లలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ట్రయల్స్ ఫలితాలను బట్టి వ్యాక్సిన్ భద్రమైందనే విషయం తేలింది. అయితే దాని ప్రభావశీలత ఎంత ఉందనేది ఇంకా తేలాల్సి ఉంది’’ అని వారు పేర్కొన్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్లతో ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజాప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా.. అత్యవసర పరిస్థితుల్లో పరిమితులతో కూడిన వినియోగం కోసం కోవాగ్జిన్‌కు అనుమతులు ఇవ్వొచ్చని నిపుణుల కమిటీ సూచించిందని ఈ వార్తలో రాశారు.
వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.10,300 కోట్లు
వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.10,300 కోట్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారంటీ సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా ఆహార పంటల సాగులో పురుగు మందుల వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలోనూ మూడేసి బయో ఫెర్టిలైజర్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు ఇది చాలా ముఖ్యమని ఆయన భావిస్తున్నారన్నారు.
ప్రతి నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేటెడ్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి డివిజన్‌కు ఒకటి చొప్పున వెటర్నరీ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయనున్నారన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారన్నారు. ప్రతి వ్యవసాయ మార్కెట్ యార్డును, రైతు భరోసా కేంద్రాలను బలోపేతం చేస్తామన్నారు. అంతర పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఇందులో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మేలు కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారని ఈ కథనంలో తెలిపారు.
తెలంగాణలో డ్రై రన్ విజయవంతం
మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ ఈనెలలో అందుబాటులోకి రానుండడంతో కోవిడ్ సన్నాహక వ్యాక్సినేషన్ ట్రయల్న్(డ్రై రన్) తెలంగాణలో విజయవంతమైందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.
నిజమైన టీకాను ఎలా ఇస్తారో..అదే పద్ధతిన నిర్వహించిన డమ్మీ టీకా ప్రయోగం సాఫీగా సాగింది. మూడెంచెల్లో టీకా ఇవ్వడం, ఆ తర్వాత అర గంటపాటు అబ్జర్వ్ చేయడం, టీకా నిల్వ, రవాణా సామర్థ్యం, ఈ ప్రక్రియలో కలిగే అవరోధాలను వైద్యశాఖాధికారులు నిశితంగా పరిశీలించారు. గాంధీ దవాఖాన, నాంపల్లి ఏరియా హాస్పిటల్, తిలక్‌నగర్ యూపీహెచ్‌సీ, సోమాజిగూడ యశోద దవాఖానలో డ్రైరన్ జరగగా, మొత్తం 100 మంది ఆరోగ్యసిబ్బందికి నమూనా టీకాలు ఇచ్చారు. తిలక్‌నగర్ యూపీహెచ్‌సీలో డ్రైరన్‌ను గవర్నర్ తమిళి సై దంపతులు స్వయంగా పరిశీలించారు.
కోవిడ్ టీకా వేసేందుకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన డ్రై రన్ విజయవంతమైంది. నగరంలోని తిలక్‌నగర్ యూపీహెచ్‌సీ, నాంపల్లి ఏరియా దవాఖాన, గాంధీ, యశోద వైద్యశాలల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. అన్ని వ్యవస్థల పనితీరును అధికారులు పరిశీలించారు. తిలక్‌నగర్ యూపీహెచ్‌సీలో టీకా మాక్ డ్రిల్‌ను స్వయంగా పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రేటర్ వ్యాప్తంగా 1,08,925 మంది ఆరోగ్య కార్యకర్తలను గుర్తించగా, అందులో 100 మందితో నాలుగు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించారు. ప్రతి కేంద్రంలో వంద మందికి వ్యాక్సినేషన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. రోజులో వంద మందికి టీకా వేసేందుకు సుమారు 8గంటల సమయం పడుతుందని వైద్యాధికారులు ప్రాక్టికల్‌గా నిర్ధారించారని ఈ వార్తలో రాసారు.
ఇవి కూడా చదవండి:
- రామతీర్థంలో రాజకీయ వేడి: శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలేం జరిగింది?
- విశాఖపట్నం లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- ‘ఇక్కడ తయారయ్యే మందులు వాడి ప్రజలు బతుకుతున్నారు.. మేం మాత్రం చస్తున్నాం’
- ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ యంత్రాంగం పని చేయడం లేదనే వివాదంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)