కోవిడ్ టీకా తీసుకోవడం తప్పనిసరా? పాజిటివ్‌ ఉన్న వ్యక్తికి టీకా ఇస్తారా? పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు కావాలి?.. మీ సందేహాలకు సమాధానాలు: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కరోనా టీకాపై ప్రజల సందేహాలు నివృత్తి చేసేందుకు సమాచారం విడుదల చేసిన కేంద్రం టీకా స్వచ్ఛందమేనని చెప్పిందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

కరోనా వైరస్‌ కట్టడికి అతిత్వరలోనే టీకా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దాని పంపిణీ చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆసక్తిగల వారందరూ తమ పేర్లను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని సూచించింది.

టీకా తీసుకోవాలన్న బలవంతం ఏమీ ఉండదని తెలిపింది. పేరు నమోదైన వారికే టీకా అందిస్తారని పేర్కొంది. వ్యాక్సిన్‌ ఎక్కడ, ఎప్పుడు ఇచ్చేదీ ఫోన్‌కు సమాచారం వస్తుందని, ఆ సమయంలో ఏదో ఒక ఫొటో గుర్తింపుకార్డు చూపటం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

టీకాకు సంబంధించి ప్రజలు తరచూ అడిగే ప్రశ్నలకు(ఎఫ్‌ఏక్యూ) సమాధానాలను శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిందని ఈనాడు రాసింది.

అందరికీ ఒకేసారి టీకా వేస్తారా?

వ్యాక్సిన్‌ లభ్యతను బట్టి ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో ఎక్కువ ముప్పు ఉన్నవారికి ముందుగా ఇస్తుంది. తొలుత వైద్య ఆరోగ్య సిబ్బంది, ముందువరుసలో ఉండి సేవలు అందిస్తున్న వారికి... ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడినవారు, 50ఏళ్లలోపు వయస్సుండి అనారోగ్య సమస్యలున్న వారికి ఇస్తారు.

టీకా తీసుకోవడం తప్పనిసరా?

పూర్తిగా స్వచ్ఛందం. అయితే కరోనా వైరస్‌ నుంచి రక్షణకు టీకా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు, సహచరులకు వైరస్‌ వ్యాపించకుండా నివారించవచ్చు.

పేరు నమోదు చేయించుకోకపోతే?

వ్యాక్సిన్‌ కావాలంటే పేరు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం తప్పనిసరి. పేరు ఇస్తేనే టీకా ఎప్పుడు, ఎక్కడ వేసేది చెబుతారు.

పాజిటివ్‌ ఉన్న వ్యక్తికి టీకా ఇస్తారా?

వైరస్‌ లక్షణాలు తగ్గిపోయిన 14 రోజుల తర్వాత టీకా ఇస్తారు.

తగ్గినవారూ తీసుకోవాలా?

వైరస్‌ సోకిందా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.

ఎన్ని డోసులు.. వ్యవధి ఎంత?

28 రోజుల తేడాతో ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలి. రెండో డోస్‌ తీసుకున్న 2 వారాలకు రోగ నిరోధశక్తి ఏర్పడుతుంది.

ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి కొవిడ్‌ ముప్పు ఎక్కువ. కాబట్టి అలాంటి వారు కచ్చితంగా టీకా తీసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు కావాలి?

డ్రైవింగ్‌ లైసెన్స్‌, కార్మికశాఖ జారీచేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌కార్డ్‌, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డ్‌, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్యేలు జారీచేసిన అధికారిక ఫొటో గుర్తింపుకార్డు, పాన్‌కార్డు, బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌ బుక్కులు, పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగసంస్థలు జారీచేసిన ఉద్యోగ గుర్తింపుకార్డులు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒకటి. ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డు సమర్పించాలి. వ్యాక్సిన్‌ వేసే సమయంలో దాన్ని తనిఖీచేస్తారని ఈనాడు వివరించింది.

రోడ్డుపై మజ్లిస్ నేత కాల్పులు

ఆదిలాబాద్‌లో మజ్లిస్ నేత నడిరోడ్డుపై కాల్పులు జరిపారంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక వార్త ప్రచురించింది.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయం త్రం ఓ మజ్లిస్‌ నేత రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఓఎస్డీ రాజేశ్‌చంద్ర కథనం ప్రకారం.. పట్టణంలోని తాటిగూడ ప్రాంతంలో పిల్లలు క్రికెట్‌ ఆడుతుండగా గొడవ జరిగింది. ఆ సమయంలో పిల్లల తల్లిదండ్రులు బయటకు వచ్చారు.

వారి మధ్య మాటామాటా పెరగడంతో కోపొద్రిక్తుడైన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ తన ఇంట్లోకి వెళ్లి.. లైసెన్స్‌ రివాల్వర్‌ తోపాటు కత్తిని తీసుకువచ్చారు.

సయ్యద్‌ మన్నాన్‌, సయ్యద్‌ జమీర్‌, సయ్యద్‌ మోతెశాంలపై దాడికి పాల్పడ్డారు.

సయ్యద్‌ మోతెశాం నడుముకింది భాగంలో ఒక బుల్లెట్‌, సయ్యద్‌ జమీర్‌కు కడుపు, వీపులో రెండు బుల్లెట్లు తగిలాయి. సయ్యద్‌ మన్నాన్‌ తలపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు.

దాడి సమాచారాన్ని తెలుసుకున్న టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను రిమ్స్‌ దవాఖానకు తరలించారు.

ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకొని కత్తి, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై ఐపీసీ 307, భారత ఆయుధాల చట్టం 27/30 కేసు నమోదు చేసి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్టు ఓఎస్డీ రాజేశ్‌ చంద్ర తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది.

రుణాలు ఇచ్చి వేధించే యాప్‌లు చైనావే - తెలంగాణ డీజీపీ

అప్పులు ఇచ్చి జనాలను పీడిస్తున్న రుణ యాప్‌లు చైనావేనని, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

రుణాలు ఇచ్చి తర్వాత అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చే యాప్‌ల ఆటకట్టించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు.

ఈ మేరకు డీజీపీ కార్యాలయ అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్‌లైన్‌ యాప్‌లకు ఆర్‌బీఐ అనుమతి లేదని.. అందులో చాలా మటుకు చైనీస్‌ యాప్‌లే ఉన్నట్లు కనుగొన్నారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

ఆయా యాప్‌లకు రిజిస్టర్‌ అయిన చిరునామాలు సరిగా లేవని పోలీసులు గుర్తించారు. కేసులన్నింటినీ పరిశీలించి బాధ్యులైన యాప్‌ నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబర్‌ క్రైం నిపుణులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.

ఇప్పటికే ఆయా కేసుల్లో మృతుల సెల్‌ఫోన్ల నుంచి, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వారంతా కూడా ఇన్‌స్టెంట్‌ యాప్‌ల వేధింపుల వల్లే మృతిచెందినట్లు తెలుసుకొని కేసులు నమోదు చేశారు.

కాగా తీసుకున్న అప్పును తిరిగి రాబట్టే క్రమంలో అప్పు తీసుకున్న వారికి.. వారి కాంటాక్టు లిస్ట్‌లో ఉన్నవారికి ఫోన్లు చేయడం, వాట్సాప్‌ సందేశాలు పంపడం వంటి పనుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్లను నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు.

ఈ మేరకు యాప్‌ నిర్వహకులతోపాటు కాల్‌ సెంటర్‌ నిర్వహకులపై చట్టపరమైన తీసుకునేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారని పత్రిక రాసింది.

రాజేంద్రనగర్‌, సిద్దిపేటలో నమోదైన కేసుల్లో బాధితులు రుణం తీసుకున్న యాప్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సైబర్‌ క్రైం పోలీసులు సేకరించారు.

రుణ యాప్‌లలో చాలామటుకు ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధగా ఉన్నాయని, ఆర్బీఐ వద్ద రిజిస్టర్‌ అవ్వని యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవొద్దని ప్రజలకు డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

ఇన్‌స్టెంట్‌ లోన్‌ల పేరుతో బురిడీ కొట్టించి యాప్‌లను నమ్మి మోసపోవద్దని, ఆ యాప్‌ల నుంచి ఇప్పటికే రుణాలు పొందినవారు వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎదుటి వారికి ఇవ్వరాదని చెప్పారు. ఫోన్‌ కాంటాక్ట్స్‌, ఫోటోలు తీసుకుని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని హెచ్చరించారని ఆంధ్రజ్యోతి వివరించింది..

కొలిక్కి వస్తున్న విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం

ఏపీ, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం ముగింపు దశకు వచ్చిందని సాక్షి పత్రిక కథనం ప్రచురించింది.

ఏపీ, తెలంగాణ మధ్య ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదం ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది.

తెలంగాణ నుంచి ఏపీకి 655 మంది ఉద్యోగులు వెళ్తుండగా ఏపీ నుంచి తెలంగాణకు సైతం సమాన సంఖ్యలో ఉద్యోగులు రావాలని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ డి.ఎం. ధర్మాధికారి ఏకసభ్య కమిటీ గతేడాది నవంబర్‌లో తుది నివేదిక ఇచ్చింది.

ఈ నివేదికను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తీర్పునివ్వడంతో ఆ మేరకు ఏపీ, తెలంగాణ జెన్‌కోలు, ట్రాన్స్‌కోల మధ్య ఉద్యోగుల పరస్పర కేటాయింపులపై తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారని పత్రిక చెప్పింది.

తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు 252 మంది ఉద్యోగులను రిలీవ్‌ చేయడంతోపాటు ఏపీ జెన్‌కో నుంచి 252 మంది ఉద్యోగులను చేర్చుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వాస్తవానికి తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు 300 మందిని కేటాయించాలని, అంతే సంఖ్యలో ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ జెన్‌కోకు తీసుకోవాలని ధర్మాధికారి కమిటీ నివేదికలో పేర్కొంది.

అయితే వారిలో రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న వారిని తుది కేటాయింపుల నుంచి మినహాయించాలని కోరింది. దీంతో తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు వెళ్లే వారిలో 48 మంది రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉండటంతో వారిని మినహాయించి మిగిలిన 252 మందిని ఏపీ జెన్‌కోకు కేటాయించినట్లు సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)