You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా వ్యాక్సీన్ మొదట వేసేది డాక్టర్లు, వైద్య సిబ్బందికే? ప్రక్రియ ప్రారంభం - ప్రెస్ రివ్యూ
కరోనా వ్యాక్సీన్ ఎవరెవరికి ఇవ్వాలో పేర్లతో జాబితా తయారు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించిందని సాక్షి పత్రిక ఒక కథనంలో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లతో పాటు మొత్తం సిబ్బంది పేర్లతో ఆ జాబితా తయారు చేయాలని జిల్లా వైద్యాధికారుల (డీఎంహెచ్‌వో)ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కరుణ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అత్యవసర ఉత్తర్వులు జారీచేశారు.
ఈ నెల 31 నాటికి జాబితా తయారు చేసి కేంద్ర అధికారిక పోర్టల్‌లో పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులకు వ్యాక్సీన్ వేస్తారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా వేస్తారు.
కరోనా వ్యాక్సీన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. అందుకే మొదటి విడత వ్యాక్సీన్ తీసుకునే వైద్య సిబ్బంది జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. దేశంలో 20 కోట్ల నుంచి 25 కోట్ల మందికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే ప్రస్తుత అంచనాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 18 శాతం మందికి టీకా ఇచ్చే అవకాశముంది. ప్రాధాన్యం ప్రకారం ముందుగా వైద్య సిబ్బందికి టీకా ఇస్తారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ఎక్కువగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్సల్లో ప్రైవేట్ ఆస్పత్రుల భాగస్వామ్యమే అధికం. కాబట్టి వారికే ఎక్కువ వ్యాక్సీన్లు వేసే అవకాశం ఉందని సాక్షి పత్రిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైందని సాక్షి పత్రిక మరొక కథనంలో వెల్లడించింది.
కోవిడ్-19కు చికిత్స, మందు ఏంటి? ప్లాస్మా థెరపీ, రెమ్‌డెసివిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌లపై కేంద్రం పునరాలోచన
ప్లాస్మా థెరపీని కరోనా చికిత్సకు సంబంధించిన జాతీయ ప్రొటోకాల్ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఈ విషయాన్ని సాక్షాత్తూ భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మంగళవారం వెల్లడించారని వివరించింది. ఈ అంశంపై కొవిడ్-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌తో ఇప్పటికే చర్చించామని.. ప్రస్తుతం సంయుక్త పర్యవేక్షక బృందంలోని నిపుణులతో తమ (ఐసీఎంఆర్) చర్చలు కొనసాగుతున్నట్లు భార్గవ వెల్లడించారు.
యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్, మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లు కరోనా రోగులపై పనిచేయట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన నేపథ్యంలో.. వాటిపైనా జాతీయ టాస్క్‌ఫోర్స్ పునస్సమీక్షిస్తోందన్నారు.
వీటిని ప్రభుత్వ నిర్దేశిత కరోనా ఔషధ జాబితా నుంచి తొలగించాలా? కొనసాగించాలా? అనే దానిపైనా చర్చోపచర్చలు జరుగుతున్నట్లు బలరాం భార్గవ వివరించారు.
కాగా, సెప్టెంబరులో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 464 మంది కరోనా రోగులపై నిర్వహించిన ప్లాస్మాథెరపీ ప్రయోగ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కరోనా కట్టడికి ఆ చికిత్సా పద్ధతి సహకరించట్లేదని తేలింది.
ఏపీలో నవంబర్ 2 నుంచి రోజు విడిచి రోజు విద్యార్థులకు తరగతులు
ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని, అయితే 8వ తరగతి వరకు విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
1, 3, 5, 7 తరగతుల వారికి ఒకరోజు, 2, 4, 6, 8 తరగతుల వారికి మరుసటి రోజు తరగతులు ఉంటాయని, అవి కూడా మధ్యాహ్నం వరకేనని జగన్ తెలిపారు. మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను పంపించేయాలని తెలిపారు.
9, 10 తరగతుల వారికి మాత్రం రోజూ తరగతులు ఉంటాయి.
విద్యార్థుల సంఖ్య 750 దాటితే మూడు రోజులకు ఒకసారి తరగతులు జరుగుతాయి.
నవంబర్ నెలంతా ఈ విధానం అమలవుతుందని, పరిస్థితిని బట్టి డిసెంబర్‌లో నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే వారికి ఆన్‌లైన్ క్లాసులు జరపాలని సూచించారు.
దేశ సరిహద్దులో లద్దాఖ్ వద్ద ఈ నెల 17న కొండచరియలు విరిగిపడి మృతి చెందిన ఆర్మీ జవాన్ షాకీర్ హుస్సే న్(38) అంత్యక్రియలు మంగళవారం సైనిక లాంఛనాలతో పూర్తిచేశారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన షాకీర్ హుస్సేన్ లద్దాఖ్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న విధులు ముగించుకొని మరికొందరు జవాన్లతో కలిసి బేస్ క్యాంపునకు వెళ్తుండగా కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ప్రమాదంలో షాకీర్ హుస్సేన్ మృతిచెందారు. కాగా, 18న ఉదయం ఆర్మీ అధికారులు షాకీర్‌హుస్సేన్ తండ్రి షేక్ హుస్సేన్‌కు ఫోన్ చేసి.. షాకీర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేశామనీ, అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు రావాల్సిందిగా సూచించారు. దీంతో ఈ నెల 19న షాకీర్ తల్లిదండ్రులు షేక్ హుస్సేన్, జమ్షిత్ సుల్తానా, భార్య నిఖత్ సుల్తానాతోపాటు కుటుంబ సభ్యులు శ్రీనగర్‌కు బయలుదేరి వెళ్లి, షాకీర్ అంతర్యక్రియలకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేవరకూ నిర్లక్ష్యం వద్దు: ప్రజలకు ప్రధాని మోదీ సూచన
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- గూగుల్ ‘గుత్తాధిపత్యం’ మీద కేసు నమోదు చేసిన అమెరికా ప్రభుత్వం
- అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్‌ను మళ్లీ గెలిపించగల ఐదు అంశాలు ఇవీ...
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- స్మార్ట్ ఫోన్లు మన మాటలు, సంభాషణలను రహస్యంగా వింటున్నాయా?
- 'మా నాన్నను చంపిన వ్యక్తిని నేను నా గుండెలకు హత్తుకున్నాను'
- ‘కలకత్తా’లో వేశ్యలకు బలవంతంగా జననేంద్రియ పరీక్షలు
- ‘వందల సిజేరియన్లు చేసిన నేనే ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను.. గర్భాశయం పగిలిపోవడంతో అనుమానం వచ్చింది’
- ఫేస్‌బుక్‌తో పోటీకి సిద్ధమైన స్వదేశీ యాప్ ఎలిమెంట్స్ కథేంటి
- లాక్డౌన్ సమయంలో టెక్ ఇండస్ట్రీ విజేతలు ఎవరు? పరాజితులు ఎవరు?
- హైస్పీడ్ ఇంటర్నెట్ కనిపెట్టిన ఆస్ట్రేలియా... ఒక్క సెకనులో వేయి సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)