అక్షరాస్యతలో బిహార్‌ కన్నా అధ్వాన్నంగా ఆంధ్రప్రదేశ్‌ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

అక్షరాస్యత విషయంలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రాష్ట్రాలకన్నా వెనకబడి ఉందని, ఆఖరికి బిహార్‌ కూడా ఏపీకన్నా మెరుగైన గణాంకాలు చూపించిందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక కథనం ఇచ్చింది.

దేశంలో 96.2శాతం అక్షరాస్యతతో కేరళ మొదటి స్థానంలో నిలవగా, 66.4శాతంతో ఆంధ్రప్రదేశ్‌ ఆఖరిస్థానంలో ఉందని ఈ కథనం పేర్కొంది.

70.9శాతం నమోదైన బిహార్‌ కంటే తెలంగాణ రాష్ట్రం కాస్త మెరుగ్గా 72.8శాతంతో ముందుందని ఈ కథనం వెల్లడించింది.

అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ రెండోస్థానం దక్కించుకుంది.

దేశంలో అక్షరాస్యత జాతీయ సగటు 77.7శాతంకాగా తెలంగాణ రాష్ట్రం దాన్నికన్నా తక్కువ రేటును నమోదు చేసింది.

85.5శాతం అక్షరాస్యతతో అసోం కూడా జాతీయ సగటును దాటేసిందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

పెద్దవి, అభివృద్ధి చెందిన రాష్ట్రాలకన్నా వెనకబడిన చిన్న రాష్ట్రాలు అక్షరాస్యత విషయంలో మెరుగైన గణాంకాలను నమోదు చేశాయని ఈ కథనం తెలిపింది.

2017-18 సంవత్సరంలో ఏడేళ్లు ఆ పైబడిన వారిలో అక్షరాస్యతపై జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

నలుగురు కొడుకులు.. కరోనావైరస్ సోకిందని కన్న తల్లిని పొలంలో వదిలేశారు

కరోనా సోకిందని కన్నతల్లిని కొడుకులు ఊరి బయట వదిలేయడంతో ఓ వృద్ధురాలు రాత్రంతా నరకయాతన అనుభవించిన ఘటనపై నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. లచ్చమ్మ అనే ఆ వృద్ధురాలికి నలుగురు కొడుకులు కాగా, వారు వంతులు వేసుకుని ఆమెను పోషిస్తున్నారు. ఇటీవల లచ్చమ్మకు కరోనా సోకగా, ఓ కొడుకు తల్లిని తన ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. ఊరు బయట తన పొలంలో నాలుగు కర్రలు పాతి, గుడ్డలు కప్పి అందులో తల్లిని ఉంచాడు. లచ్చమ్మ రాత్రంతా దోమలు, చలిలోనే చీకట్లో గడిపింది. విషయం పోలీసులకు తెలిసి అదే రాత్రి కొడుకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదని ఈ కథనం పేర్కొంది. చివరకు పోలీసులు నలుగురు కొడుకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి లచ్చమ్మను ఇంటికి చేర్చారని ఈ కథనం వెల్లడించింది.

జాతీయ స్థాయిలో కేసీఆర్‌ కొత్త పార్టీ ప్రయత్నాలు

జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రముఖంగా రాసింది.

‘నయా భారత్‌’ అనే పేరును కూడా ఖరారు చేశారని, పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఢిల్లీలో పనులు నడుస్తున్నాయని ఈ కథనం పేర్కొంది. ఇటీవలి కాలంలో కేటీఆర్‌ ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారని, ఆయన పర్యటన కూడా పార్టీ ఏర్పాటులో భాగమేనని తెలిపింది. రాబోయే కాలంలో అధ్యక్ష ఎన్నికల తరహాలో జమిలి ఎన్నికలకు కేంద్రం ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారని వెల్లడించింది.

కాంగ్రెస్‌, బీజేపీ ముక్త భారత్‌ కావాలని గతంలో వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌, ఆ దిశగా అడుగులు వేస్తున్నారని, ఇందుకోసం మమతా బెనర్జీ, హేమంత్‌ సోరెన్‌లాంటి నాయకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఈ కథనం పేర్కొంది. అధ్యక్ష తరహా పాలన అమల్లోకి వస్తే పార్లమెంటుకు కేవలం జాతీయ పార్టీలే పోటీ చేసే అవకాశం ఉన్నందున ఒక ప్రత్యామ్నాయ శక్తిని తయారు చేయాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొన్నా: రియా చక్రవర్తి

సుశాంత్‌ సింగ్‌ కోసం తన సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, మరో నిందితుడి ద్వారా తాను మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసేదానినని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణలో రియా అంగీకరించినట్టు సాక్షి పత్రిక రాసింది.

డ్రగ్స్‌ కొన్నానని, అయితే తానెప్పుడూ వాటిని వాడలేదని ఆమె చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ ఏడాది మార్చి 17న జైద్‌ నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసేందుకు మేనేజర్‌ మిరాండా వెళ్ళిన విషయం కూడా తనకు తెలుసునని ఎన్‌సీబీ ఎదుట రియా ఒప్పుకున్నట్లు సాక్షి వెల్లడించింది. రియా చక్రవర్తి విచారణ పూర్తి అయిన తరువాత, షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ హౌస్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, వ్యక్తిగత సహాయకుడు దీపేశ్‌ సావంత్‌లను రియాతో కూర్చోబెట్టి విడివిడిగా ఒక్కొక్కరి పాత్రపై వివరాలు సేకరిస్తామని ఎన్‌సీబీ తెలిపినట్లు ఈ కథనం పేర్కొంది. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై సీబీఐ, అతని అకౌంట్ల నుంచి కోట్ల రూపాయల డబ్బును బదలాయించారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణను కూడా రియా ఎదుర్కొంటున్నట్లు సాక్షి కథనం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)